పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశా..

రెండో విడత జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌ 

  చిరు వ్యాపారుల ఖాతాల్లో నేరుగా రూ.10 వేల వరకు వడ్డీ లేని రుణాలు జమ

మొదటి విడతలో 5.35 లక్షల మందికి రుణ సౌకర్యం

రెండో విడతలో 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.370 కోట్ల సాయం 

అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికి వడ్డీ   లేని రుణాలు అందిస్తాం

 తాడేపల్లి: తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూశానని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. వారి కష్టాలు తీర్చేందుకు అధికారంలోకి వచ్చాక  చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. గ్రామాలు, పట్టణాల్లో చిరు వ్యాపారాలు చేసుకునే వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేల వరకు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని చెప్పారు.  జగనన్న తోడు పథకం ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. గతేడాది 5.35 లక్షల మందికి ఈ పథకం ద్వారా రుణ సౌకర్యం కల్పించగా, ఈ ఏడాది అదనంగా 3.7 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.370 కోట్ల రుణాలను సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి బటన్‌ నొక్కి  లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. అర్హత ఉన్నవారందరికీ సాయం చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చిరు వ్యాపారులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏమన్నారంటే..

ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.  చిరు వ్యాపారులు రోజువారీ పెట్టుబడి ఖర్చుల కోసం వ్యాపారుల చుట్టూ తిరుగకూడదని, వారి ఆగడాలకు గురికాకూడదన్న సమున్నత లక్ష్యంతో కరోనా కష్టకాలంలో సైతం అర్హులైన ప్రతి ఒక్కరికి వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. 

రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వారికి బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అష్టకష్టాలు పడుతున్న వారికి మంచి చేసే రెండో దశకు ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం.

వ్యవస్థ అన్నది పేద వాడికి ఉపయోగపడే పరిస్థితిలోకి తీసుకురాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్‌ అయినట్లుగా భావించాలి. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరు వ్యాపారుల ఎన్నో వ్యథలు చూశాను. చిరు వ్యాపారుల పరిస్థితిని దగ్గరుండి చూశాను. ఇలాంటి వారికి తక్కువ వడ్డీకి రుణాలు అందని పరిస్థితిని చూశాను. బ్యాంకులు ఎలాంటి వారికి రుణాలు అందక..గత్యంతరం లేక ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద వడ్డీలకు తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పాదయాత్రలో చూశాను. 

చిరు వ్యాపారుల తలరాతలు మార్చుతానని పాదయాత్రలో చెప్పాను. ఈ రోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టిన విషయాన్ని సంతృప్తిస్థాయిలో నెరవేర్చుతున్నాను. 
గత ఏడాది కూడా ఈ పథకం ద్వారా సాయం చేశాను. ఈ రోజు రెండో విడత సహాయం చేస్తున్నాం. గతంలో 5.30 లక్షల మందికి మాత్రమే రుణాలు మంజూరు అయ్యాయి. మిగిలిన 3.70 లక్షల మందికి కూడా రుణాలు అందేలా ఈ రోజు బ్యాంకులతో మాట్లాడి రుణాలు అందేలా చర్యలు తీసుకున్నాం. దరఖాస్తు చేసుకున్న అందరికి రుణాలు అందించే ఏర్పాట్లు చేశాం. 

ఈ రుణాలకు ఎవరూ అర్హులని గమనిస్తే..గ్రామాలు, పట్టణాల్లో సుమారు 10 అడుగులు పొడవు, 10 అడుగుల వెడల్పు స్థలంలో, అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేక తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారు. పుట్‌పాత్‌ల మీద, వీధుల్లో తోపుడు బండల మీద వస్తువులు, కూరగాయలు, పండ్లు, ఆహార పదార్థాలు అమ్ముకుని జీవించే వారు. రోడ్ల పక్కన టిఫిన్‌ సెంటర్లు,  గంపలు, బుట్టలలో వస్తువులు అమ్మేవారు, సైకిల్,  మోటార్‌ సైకిళ్లు, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకునే వారు. చేనేత, సంప్రదాయ చేతివృత్తుల కళాకారులయిన ఇత్తడి పని చేసే వారు, బొబ్బలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలు బొమ్మలు, ఇతర సామాగ్రి తయారీదారులు, లేస్‌ వర్క్స్, కుమ్మరి తదితర వృత్తులలపై ఆధారపడి జీవిస్తున్న వ్యక్తులు వడ్డీ లేని రుణాలకు అర్హులు. 

ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన రుణాలు సకాలంలో చెల్లిస్తే కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోకే ప్రభుత్వం జమ చేస్తుంది. దీని వల్ల రుణాలు తీసుకునే వారికి బాధ్యత పెరుగుతుంది. బ్యాంకులు ఎంతైతే రుణాలు చెల్లిస్తారో..అంతే రుణాలు మళ్లీ అందిస్తాయి. రివాల్వింగ్‌ సొమ్ము వ్యాపారులకు అందుబాటులో ఉంటుంది. వారి జీవితాలు మార్చేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. మళ్లీ వడ్డీ లేని రుణాలు ఇస్తాయి.

ఈ రోజు మనం రూ.370 కోట్లు చిరువ్యాపారులకు రుణాలు ఇస్తున్నాం. ఈ కార్యక్రమమే కాకుండా గతంలో తొలి విడతలో ఇచ్చిన వారికి వడ్డీ సొమ్ము కూడా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. 9.5 లక్షల మందికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ఎవరికైనా కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా..సహాయ సహకారాల కోసం 1902 కు ఫోన్‌ చేస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది. ఏ ఒక్కరికైనా అర్హత ఉండి రుణాలు అందకపోతే..ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. దగ్గర్లో ఉన్న సచివాలయం వద్ద దరఖాస్తు చేసుకుంటే..వాలంటీర్లు మీకు తోడుగా ఉంటారు. వెరిఫికేషన్‌ అయిపోయిన వెంటనే 3 నెలలకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని అమలు చేసి, ఆరు నెలలకోసారి తిరిగి రుణాలు ఇప్పిస్తాం. ఇది నిరంతరం ప్రక్రియగా కొనసాగుతుంది. ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. చిరు వ్యాపారుల జీవితాలు మారాలని మనసారా కోరుకుంటూ..ఈ పథకం ద్వారా మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
 

10 reads

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top