పేద‌వాళ్ల సొంతిళ్లు క‌ల నిజం చేస్తున్నాం

వైయ‌స్ఆర్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

జ‌నాభాలో ప్ర‌తి న‌లుగురిలో ఒక‌రికి ప‌క్కా ఇల్లు లేదా భూమిని అంద‌జేస్తున్నాం

17 వేల వైయ‌స్ఆర్ జ‌గ‌న‌న్న కాల‌నీల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం

తొలి విడ‌త‌లో రూ.28,084 కోట్ల‌తో 15.60 ల‌క్ష‌ల ప‌క్కా గృహాల నిర్మాణం

రెండు ద‌శ‌లు క‌లిపి రూ.50,940 కోట్ల‌తో 28.30 ల‌క్ష‌ల ఇళ్ల నిర్మాణాలు

వ‌చ్చే ఏడాది జూన్ 22 క‌ల్లా తొలి ద‌శ గృహ నిర్మాణాల ప‌నులు పూర్తి

17005 వైయ‌స్ఆర్ కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల కోసం రూ.32.909 కోట్లు

ఒక్కొక్క మ‌హిళ ఆస్తి విలువ రూ.5 ల‌క్ష‌ల నుంచి రూ.15 ల‌క్ష‌ల వ‌ర‌కు పెరుగుతుంది

అన్ని జిల్లాల్లో హౌసింగ్‌కు జాయింట్ క‌లెక్ట‌ర్ ఉండేలా ఉత్త‌ర్వులు జారీ

గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి

అర్హ‌త ఉండి ల‌బ్ధిదారుల జాబితాలో పేర్లు లేని వారు మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు

ద‌ర‌ఖాస్తు చేసిన 90 రోజుల్లోనే అన్ని అర్హ‌త‌లు ప‌రిశీలించి మంజూరు చేస్తాం

తాడేప‌ల్లి: పేద‌వాళ్ల సొంతిళ్లు క‌ల నిజం చేస్తున్నామ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇళ్లు లేని పేద‌వాడు ఎక్క‌డా ఉండ‌కూద‌ని స్ప‌ష్టం చేశారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని చరిత్రాత్మక ఘట్టానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. గురువారం తన క్యాంప్‌ ఆఫీసు నుంచి వర్చువల్‌ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ పనులను సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రారంభించారు. చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో రాష్ట్రంలో ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేసి రికార్డు సృష్టించిన ప్రభుత్వం.. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు పూనుకుంది. ఇందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ఈ రోజు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ల‌బ్ధిదారులు, అధికారుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా విధానంలో మాట్లాడారు.

 ►రాష్ట్రంలో ఇళ్లు లేని పేదవారు ఎక్కడా ఉండకూడదన్నారు. పేదవారి సొంతిళ్లు కల నిజం చేస్తున్నామన్నారు. పండగ వాతావరణంలో ఇళ్ల నిర్మాణానికి పునాదులు వేస్తున్నాం. 175 నియోజకవర్గాల్లో మొదటి దశలో గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. తొలి విడతలో రూ.28,084 కోట్లతో 15.60 లక్షల పక్కాగృహాల నిర్మాణం చేపడుతున్నాం. వచ్చే ఏడాది జూన్‌ 22 కల్లా  తొలి దశ గృహ నిర్మాణాల పనులు పూర్తి చేస్తాం. రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. రెండు దశలు కలిపి రూ.50,940 కోట్లతో 28.30 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాం. పీఎంఏవై తో అనుసంధానం చేసుకుని గృహ నిర్మాణాలు చేపడుతున్నాం. 17 వేల వైయ‌స్‌ఆర్‌ జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మిస్తున్నాం.
స్థలాన్ని బట్టి విలువ ఉంటుంది. ప్రతి ఒక్క  అక్క చెల్లెమ్మల చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆస్తి విలువ వస్తుందని ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం చేపట్టాం.

►ఈ రోజు నుంచి జూన్‌ 10వ వరకు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇళ్ల నిర్మాణానికి ఒక పండుగ వాతావరణంలో  మీ అందరి చేతుల మీదుగా పునాదులు వేస్తున్నాం. బ‌హుశ‌ ఈ కార్యక్రమం అన్నింటి కంటే గొప్పది. ఒకేసారి 30.76 లక్షల మంది అక్కచెల్లెమ్మల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం. ఇప్పుడు కేవలం రెండు విడతల్లోనే వీరందరికీ పక్కా ఇళ్లు నిర్మించేందుకు శ్రీ‌కారం చుట్టాం. ఇందులో భాగంగా నేడు మొదటి దశలో రూ.28,084 కోట్ల వ్యయంతో 15,60,227 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నాం.  
►రెండో దశలో రూ.22,860 కోట్లతో 12.70 లక్షల ఇళ్లను నిర్మిస్తాం. మొదటి దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌ 2022 నాటికి, రెండో దశ ఇళ్ల నిర్మాణాన్ని జూన్‌ 2023 నాటికి పూర్తి చేస్తాం.  
మొదటి దశలో 8,905 లేఅవుట్లలో 11.26 లక్షల ఇళ్లను వైయ‌స్సార్‌ జగనన్న కాలనీలుగా నిర్మిస్తున్నాం. అలాగే 2,92,984 ఇళ్లను సొంత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు, 1,40,465 ఇళ్లను నివేసిత స్థలాలు కలిగిన లబ్ధిదారులకు మంజూరు చేశారు. ఇప్పుడు వైయ‌స్సార్‌ జగనన్న కాలనీల్లోని ఇళ్లతోపాటూ ఈ గృహాల నిర్మాణాన్ని కూడా ప్రారంభిస్తున్నారు.  రెండు దశల్లో పేదల కోసం రూ.50,944 కోట్లతో మొత్తం 28,30,227 పక్కా ఇళ్లను నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాం. 

28.30 లక్షల ఇళ్లు కాదు.. 17,005 ఊళ్లు..  
 ►రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం సిద్ధం చేసిన లేఅవుట్లు కొత్తగా 17,005 ఊళ్లను సృష్టిస్తాయి. అవి ఇళ్లు కాదు.. ఊళ్లు.. అనే దృష్టితో అక్కడ అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. వైయ‌స్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణంతోపాటు భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తాం. ప్రస్తుతం తొలి దశలో 8905 వైయ‌స్సార్‌ జగనన్న కాలనీలు నిర్మిస్తుండగా.. రెండో దశలో 8,100 కాలనీలను నిర్మించనున్నాం. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. రూ.4,128 కోట్లతో తాగునీరు, రూ.22,587 కోట్లతో సిమెంట్‌ రోడ్లు, కాలనీ సైజును బట్టి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌.. రూ.4,986 కోట్లతో అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ సౌకర్యం, రూ.627 కోట్లతో ఇంటర్నెట్, ఇతర సౌకర్యాల కోసం రూ.567 కోట్లు వ్యయం చేస్తోంది.   

►2011 జనాభా ప్రకారం 4.90 కోట్లు ఉంటే..మన ప్రభుత్వం ఇప్పుడు 30 లక్షల మంది అక్క చెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేయించి ఇళ్లు నిర్మిస్తున్నాం. దాదాపుగా కోటి 24 లక్షల మందికి ఈ రోజు ఇళ్లకు శ్రీకారం చుడుతున్నాం. రాష్ట్ర జనాభాలో నలుగురిలో  ఒకరికి ఇళ్లు ఇస్తున్నాం. మన రాష్ట్రంలో ఉన్న పెద్ద జిల్లాలు కలిపితే ఎంత జనాభా ఉంటుందో అంత జనాభాకు ఈ రోజు ఇళ్లు నిర్మిస్తున్నాం.  పేదవారు ఎవరైతే ఉన్నారో, అగ్ర కులాల్లో ఉన్న పేదవారందరికీ కూడా ఈ కాలనీల్లో ఒక్కొక్కరికి రూ.5 లక్షల నుంచి రూ.11 లక్షల ఆస్తిని పెట్టబోతున్నాం. 

లబ్ధిదారుడికి మూడు ఆప్షన్లు  
► గృహ నిర్మాణంలో లబ్ధిదారుడి నిర్ణయానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. మంజూరు చేసిన ఇళ్లను నిర్దిష్ట నమూనాలో నిర్మించుకునే విషయంలో లబ్ధిదారుడు సొంతగా నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు మూడు ఆప్షన్లను లబ్ధిదారుల ముందు ఉంచింది.  
►ఆప్షన్‌ 1 : ప్రభుత్వం ఇచ్చిన నమూనా ప్రకారం ఇళ్లు నిర్మించుకోవటానికి అవసరమైన నాణ్యమైన నిర్మాణ సామగ్రిని ప్రభుత్వమే సరఫరా చేసి, లేబర్‌ చార్జీలకు కూడా డబ్బు ఇస్తుంది. లబ్ధిదారులే ఇల్లు నిర్మించుకోవచ్చు. 
►ఆప్షన్‌ 2 : ఇంటి నిర్మాణానికి అవసరమైన నిర్మాణ సామగ్రిని లబ్ధిదారులు తామే తెచ్చుకోవచ్చు. తమకు నచ్చిన చోట కొనుక్కొని ఇల్లు నిర్మించుకోవచ్చు. దశల వారీగా పని పురోగతిని బట్టి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో బిల్లుల చెల్లింపులను జమ చేస్తుంది. 
►ఆప్షన్‌  3 : తాము కట్టుకోలేమని చెప్పిన వారికి, ఆ బాధ్యత అంతా ప్రభుత్వమే తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. నిర్దేశించిన నమూన ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సామగ్రిని సరఫరా చేయడంతోపాటు పూర్తి సహయ సహకారాలు అందించి ప్రభుత్వమే కట్టిస్తుంది

►ఇళ్లు మంజూరైన అక్క చెల్లెమ్మలకు ఈ మూడు ఆప్షన్లు ఇచ్చాం. వారికి ఏ ఆప్షన్‌ కావాలో ఆ ఆప్షన్‌లో ఇళ్లు కట్టుకోవచ్చు. 
స్థలాన్ని బట్టి విలువ ఉంటుంది. ప్రతి ఒక్క  అక్క చెల్లెమ్మల చేతిలో రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఆస్తి విలువ వస్తుందని ఒక పెద్ద బృహత్తర కార్యక్రమం చేపట్టాం.

►పొరపాటున లబ్ధిదారుల జాబితాలో పేరు లేకపోయినా ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. గ్రామ సచివాలయంలో పేరు నమోదు చేయించుకుంటే..పరిశీలించి 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు అందజేస్తాం. జగనన్న తమ్ముడు, అన్న తోడుగా ఉన్నారని అక్కచెల్లెమ్మలకు భరోసా కల్పిస్తున్నాం.  

రాష్ట్ర ఆర్థిక ప్రగతికి ఊతం  
► కోవిడ్‌–19 రెండో దశ కారణంగా రాష్ట్రంలో అర్థిక పరిస్థితి కుదేలైన సమయంలో.. పనులు లేక నిస్తేజంతో ఉన్న వివిధ రంగాలకు చెందిన కార్మికులకు, కూలీలకు గృహ నిర్మాణం ఊతం ఇవ్వబోతోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొదటి దశ ఇళ్ల నిర్మాణం ద్వారా ఉపాధి కూలీలకు 21.70 కోట్ల పని దినాలు లభించబోతున్నాయి.  
► పెద్ద ఎత్తున ప్రారంభమవుతున్న ఇళ్ల నిర్మాణ పనులతో తాపీ మేస్ట్రీలు, రాడ్‌ వెండర్లు, కార్పెంటర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇటుకల తయారీదారులు, సిమెంట్‌ విక్రేతలకు ఉపాధి లభించనుంది.   
 
సరసమైన ధరలకే నాణ్యమైన నిర్మాణ సామగ్రి  
► ఇళ్ల నిర్మాణానికి వినియోగించే వస్తువుల (మెటిరీయల్‌) ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో పేదల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం.. పేదలపై భారం పడకుండా చర్యలు చేపట్టింది. నాణ్యమైన వస్తువులను మార్కెట్‌ ధరకన్నా తక్కువకే సరఫరా చేసేందుకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించింది. 
► లబ్ధిదారుల కోసం సిమెంట్, ఇతర వస్తువులను నిల్వ చేసుకునేందుకు గ్రామ, మండల స్థాయిలో గోదాములను ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటి నిర్మాణానికి 20 మెట్రిక్‌ టన్నుల ఇసుకను దగ్గరలోని ఇసుక రీచ్‌ల నుంచి ఉచితంగా అందించనుంది. 
 

►ఇంత పెద్ద స్థాయిలో ఇంటి నిర్మాణాలు ఎప్పుడు జరగలేదు. దేశంలోనే ఇలాంటి కార్యక్రమం జరగలేదు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు, లబ్ధిదారులకు అధికారులు తోడుగా ఉండేందుకు వీలుగా ప్రతి జిల్లాలో అదనంగా జాయింట్‌ కలెక్టర్‌ను నియమిస్తున్నాం. ఇప్పటి వరకు ప్రతి జిల్లాలో ముగ్గురు జేసీలు మాత్రమే ఉన్నారు. ఇప్పటి నుంచి నలుగురు జేసీలు ఉంటారు. వీరంతా కూడా ఐఏఎస్‌ అధికారులు. నాలుగో జేసీకి కేవలం ఇంటి నిర్మాణ బాధ్యతలే ఉంటాయి. రేపటి నుంచి జేసీలు అందుబాటులో ఉంటారు. లబ్ధిదారులకు న్యాయం చేసే దిశగా జేసీలు పని చేస్తారు. ఈగొప్ప కార్యక్రమం వల్ల రాష్ట్రంలోని ప్రతి అక్కా చెల్లెమ్మ సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. 

 ► కొంత మందికి మాత్రం ఈ రోజు న్యాయం చేయలేకపోతున్నాం. కొంత మంది దుర్భుద్ధితో కోర్టులో కేసులు వేశారు. ప్రస్తుతం కోర్టులు సెలవులు. కోర్టులు తెరిచిన వెంటనే 3 లక్షలు పెండింగ్‌లో ఉన్న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటాం. అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తూ..ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ర్చువ‌ల్ విధానంలో ఇళ్ల నిర్మాణ ప‌నులు ప్రారంభించారు. 

 

Back to Top