‘చిరువ్యాపారం’ కాదు.. గొప్ప సేవ

నా పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలను దగ్గరగా చూశా

వారికి తోడుగా నిలవడమే ‘జగనన్న తోడు’ లక్ష్యం

5,10,462 మందికి రూ.510.46 కోట్ల వడ్డీలేని రుణాలు, వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి రూ.526.62 కోట్ల లబ్ధి

వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున జమ

మూడు విడతల్లో 14.16 లక్షల మందికి రూ.1,416 కోట్లతో మంచిచేయగలిగాం

అర్హులెవరైనా పొరపాటున మిగిలిపోతే గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి

జగనన్న తోడు పర్యవేక్షణకు ప్ర‌త్యేక పోర్టల్‌

సందేహాలు ఉంటే 08912890525 కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు

రెండున్నరేళ్లలో డీబీటీ పద్ధతిలో దాదాపు రూ.1.29 లక్షల కోట్లు పేదలకు అందించాం

వివక్షకు, లంచాలకు తావివ్వకుండా ప్రతీ సంక్షేమం అమలు చేస్తున్నాం

సంక్షేమ పథకాల అమలుతో పేదలను మన ప్రభుత్వం అక్కున చేర్చుకుంది

‘జగనన్న తోడు’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘తనకు తాను ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలు అందించే గొప్ప వర్గం. చిరువ్యాపారులు చేసేది వ్యాపారం అనడకంటే వారు మనకు అందిస్తోంది గొప్ప సేవ అని చెప్పుకోవడం మంచిది. అలాంటి వారికి అండగా నిలబడేందుకే ‘జగనన్న తోడు’ పథకాన్ని అమలు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. 3648 కిలోమీటర్ల ప్రజా సంకల్ప యాత్రలో చిరువ్యాపారుల జీవితాలను చాలా దగ్గర నుంచి చూశానని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. చిరువ్యాపారులకు తోడుగా, వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వమే పూచికత్తుగా, వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని బ్యాంకులను ఒప్పించి రుణాలు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. మూడవ విడత 5,10,462 మంది చిరువ్యాపారులకు మంచిచేస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.510.46 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు ఆరునెలలకు ఒకసారి చెల్లించే వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ రూ.16.16 కోట్లతో కలిపి రూ.526.62 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. జగనన్న తోడు పథకం ద్వారా మూడు విడతల్లో కలిపి 14.16 లక్షల మందికి రూ.1,416 కోట్లు అందించి మంచిచేయగలిగామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. 

చిరు వ్యాపారుల ఉపాధికి ఊతమిచ్చే ‘జగనన్న తోడు’ పథకం మూడవ విడత కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. 5,10,462 మంది చిరు వ్యాపారులకు రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణాలతో పాటు రూ.16.16 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కలిపి మొత్తం రూ.526.62 కోట్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిని ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దాదాపు 5,10,462 మంది చిరువ్యాపారులకు మంచిచేస్తూ రూ.10 వేల వడ్డీ లేని రుణాలు అందిస్తున్నాం. వడ్డీ భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తూ రుణాలిచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటి వరకు 14,16,091 మందికి మంచి చేయగలిగామని మీ అన్నగా, తమ్ముడిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆనందాన్ని మీతో  పాలుపంచుకుంటున్నాను. 

గొప్ప సేవ..
పెద్ద ఆదాయాలు వచ్చే అవకాశాలు ఉన్న పరిస్థితులు కూడా కాదు ఈ వ్యాపారం. అయినా కూడా తనకు తాను ఉపాధిని కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలు అందించే గొప్ప వర్గం చిరువ్యాపారులు. చిరువ్యాపారులు చేసేది వ్యాపారం అనేదిదానికంటే వారు మనకు అందిస్తుంది గొప్ప సేవ అని చెప్పుకోవడం మంచింది. 

మిగతా రంగాల్లోని వారికి కూడా ఉపాధి..
వస్తువులు, దుస్తులు, టీ,కాఫీ, టిఫిన్లు, కూరగాయలు, పండ్లు ఇటువంటి వాటిని ఫుట్‌పాత్‌ల మీద, తోపుడు బండ్ల మీద, రోడ్ల పక్కన, మోటర్‌ సైకిళ్ల మీద ఇంటి ముందుకు, ఇంటి సమీపంలో అమ్ముకుంటూ, అక్కచెల్లెమ్మలు ఆకుకూరలను నెత్తిమీద గంపల్లో పెట్టుకొని అమ్ముతూ ఇలా లక్షలమంది చిరువ్యాపారులు తమకు తాము స్వయం ఉపాధిని పొందుతున్నారు. మనం చేస్తున్న సాయం చిరువ్యాపారులు వారి కాళ్ల మీద వారు నిలబడేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. చిరువ్యాపారుల ద్వారా అనేక మందికి మేలు జరుగుతుంది. రవాణా చేస్తున్న ఆటోల వారికి, కూలీలకు, మిగతా రంగాల్లోని వారికి కూడా ఉపాధి లభించే గొప్ప వ్యవస్థ ఇది. 

చిరువ్యాపారుల కష్టాలను నా కళ్లారా చూశా..
నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో చిరువ్యాపారుల జీవితాలను చాలా దగ్గర నుంచి చూశాను. వీరంతా ఆర్గనైజ్డ్‌ సెక్టార్‌లో లేకపోవడం వల్ల ఏ ఒక్కరికీ రుణాలు కూడా పుట్టని పరిస్థితి, కష్టాలు, అవసరాలను నా పాదయాత్రలో చూశాను. ఇటువంటి పరిస్థితుల్లో చిరువ్యాపారులకు తోడుగా నిలబడాలి.. మంచి జరగాలంటే ఏం చేయాలనే ఆలోచనలోంచి జగనన్న తోడు అనే పథకాన్ని తీసుకువచ్చాం. వీరికి బ్యాంకుల రుణాలు ఇప్పించడమే కాకుండా ప్రభుత్వమే పూచికత్తుగా ఉండి చిరువ్యాపారులకు రుణాలు ఇవ్వండి.. వారు కట్టాల్సిన రుణాలు క్రమబద్ధంగా కట్టేలా అవగాహన కల్పిస్తాం.. ఆ వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ తోడుగా నిలబడుతుందని బ్యాంకులను ఒప్పించి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మూడో విడత కింద 5.10 లక్షల మందికి ఈరోజు రుణాలు అందుతున్నాయి. మూడు విడతల్లో కలిపి 14 లక్షల మందికి మంచి చేయగలిగాం.

అధ్వాన్నమైన పరిస్థితుల్లో చిరువ్యాపారులు ఉండేవారు..
చిరువ్యాపారులు హోల్‌సేల్‌గా వస్తువులు కొనుగోలు చేసి రోజువారీగా రీటైల్‌గా అమ్మేందుకు కావాల్సిన పెట్టుబడి బ్యాంకుల నుంచి తక్కువ వడ్డీకి రుణాలు తీసుకునే సదుపాయం గతంలో లేదు. చిరువ్యాపారులంతా వడ్డీ వ్యాపారుల దగ్గర రూ.100 తీసుకుంటే సాయంత్రానికి రూ.100కు రూ.10 తిరిగి వడ్డీ చెల్లించే అధ్వాన్నమైన పరిస్థితుల్లో ఉండేవారు. ఇటువంటి వారికి మంచి జరగాలనే గొప్ప ఆలోచనతో జగనన్న తోడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 

ఆరు నెలలకు ఒకసారి వీరందరికీ వడ్డీలు తిరిగిచ్చే కార్యక్రమం..
పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున 5,10,462 మంది చిరువ్యాపారులకు ఈరోజు రూ.510.46 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా ఆరు నెలలకు ఒకసారి వీరందరికీ వడ్డీలు తిరిగిచ్చే కార్యక్రమంలో భాగంగా రూ.16.16 కోట్లు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఈరోజు రూ.526 కోట్ల లబ్ధి చిరువ్యాపారులకు జరగబోతుంది. 

ఇప్పటివరకు..
14,16,091 మంది చిరువ్యాపారులకు రూ.1,416 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. క్రమం తప్పకుండా రుణాలు చెల్లించిన వారికి దాదాపుగా రూ.32.51 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ కూడా చెల్లించడం జరిగింది. 

గొప్ప సౌకర్యం చిరువ్యాపారుల చేతుల్లో..
చిరువ్యాపారులకు నాదొకటే విన్నపం.. ఒక గొప్ప వ్యవస్థను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఈ వ్యవస్థను నీరుగారనివ్వకండి. మనం తీసుకున్న రుణాలు తిరిగి బ్యాంకులకు కట్టకపోతే వ్యవస్థ కుప్పకూలిపోతుంది. రుణాలు కట్టిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు కచ్చితంగా రుణాలు ఇస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం ఆమేరకు చిరువ్యాపారుల తరఫున బ్యాంకులకు గ్యారంటీ ఇస్తుంది. చేసుకున్న ఒప్పందం మేరకు రీవాల్వింగ్‌ ఫండ్‌ మాదిరిగా ఉపయోగపడుతుంది. డబ్బులు తీసుకొని క్రమం తప్పకుండా రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ మొత్తం లబ్ధిదారులకు వెనక్కు ఇచ్చేస్తుంది. వడ్డీ లేకుండా రుణం పొందే గొప్ప సౌకర్యం చిరువ్యాపారుల చేతుల్లో ఉంటుంది. క్రమం తప్పకుండా కట్టకపోతే బ్యాంకులు వెనకడుగు వేస్తాయి.. లబ్ధిదారులకు మంచి జరిగే అవకాశాన్ని తీసేసినట్టు అవుతుందని గుర్తుపెట్టుకోవాలని సవినయంగా కోరుతున్నాను. 

ఒక్కొక్కరికీ మూడు నాలుగు పథకాల ద్వారా లబ్ధి.. నా ప్రగాఢ నమ్మకం
జగనన్న తోడు పథకం ద్వారా 14.16 లక్షల మందికి మంచి జరుగుతుంది. వీరందరికీ కచ్చితంగా జగనన్న అమ్మఒడి, వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, ఇళ్ల పట్టాలు, వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుక ఇటువంటి పథకాల ద్వారా కూడా కచ్చితంగా ఒక్కొక్కరికీ మూడు నాలుగు పథకాల ద్వారా లబ్ధి జరిగి ఉంటుందనేది నా ప్రగాఢ నమ్మకం. 

నిరుపేదల జీవితాలు మారాలి..
ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మార్పు కోసం. నిరుపేదల జీవితాలు మారాలి. ఇంకా మెరుగైన పరిస్థితులు రావాలనే తపన, తాపత్రయంతో జరుగుతుంది. నిరుపేదలైన చిరువ్యాపారులకు మాత్రమే కాకుండా సాంప్రదాయ చేతి వృత్తుల కళాకారులు (ఇత్తడి పనులు చేసేవారు, బొబ్బిలి వీణ, ఏటికొప్పాక, కొండపల్లి బొమ్మలు, కలంకారీ, తోలుబొమ్మల కళాకారులు, లేస్‌ వర్క్, కుమ్మరులు) అందరినీ జగనన్న తోడు పథకంలోకి తీసుకురావడం జరిగింది. వారికి కూడా వడ్డీలేని రూ.10 వేల రుణాల సౌకర్యం ఉపయోగపడేలా చేశాం. వారందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను. 

మీ వలంటీర్, సచివాలయ సిబ్బందిని సంప్రదించండి..
ఎవరికైనా పొరపాటున జగనన్న తోడు పథకం అందకపోయి ఉంటే దయచేసి ఎవరూ కంగారుపడొద్దు. మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికీ మంచి ఎలా చేయాలి.. ఏ ఒక్కరూ మిస్‌ కాకూడదు అని ఆలోచన చేసే ప్రభుత్వమని ఇంతకు ముందే చెప్పాను. ఏ ఒక్కరికీ పొరపాటున రాకపోయి ఉంటే కంగారుపడొద్దు. మీ గ్రామ, వార్డు వలంటీర్లను సంప్రదించండి. సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోండి. ఇటువంటి చిరువ్యాపారుల కోసం, చిన్నకళాకారుల కోసం అమలు చేస్తున్న జగనన్న తోడు పథకం సెర్ప్, మెప్మాల ద్వారా అమలు చేస్తున్నాం. 

నిరంతర పర్యవేక్షణ..
ఈ పథకాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు వీలుగా www.gramawardsachivalayam.ap.gov.in పోర్టల్‌ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్యాంకర్లతో సమన్వయం కోసం చిరువ్యాపారులందరికీ స్మార్ట్‌కార్డులు ఇవ్వడం జరిగింది. బ్యాంకు ఖాతాలు తెరిపించడం నుంచి రుణాలు ఇప్పించడం వరకు పూర్తిగా గ్రామ, వార్డు వలంటీర్లు అన్ని రకాల సహకారాలు అందిస్తారు. సచివాలయ వ్యవస్థ, సెర్ప్, మెప్మా వీరంతా ఏ ఒక్క లబ్ధిదారులకు అవసరం ఉన్నా.. తోడుగా నిలుస్తారు. 

సందేహాలుంటే..
లబ్ధిదారులకు ఎవరికైనా సందేహాలుంటే నివృత్తి చేసుకోవడానికి టెలిఫోన్‌ నంబర్‌ను కూడా కేటాయించాం. ఈరోజు పేపర్‌లో కూడా ప్రకటన ఇచ్చాం. ఎవరికైనా సందేహాలు ఉంటే 08912890525 కాల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు. అధికారులు అన్ని రకాలుగా తోడుగా ఉంటూ మీ సమస్యలను పరిష్కరిస్తారు. 

పేదలను మన ప్రభుత్వం అక్కున చేర్చుకుంది..
దేశంలో చిరువ్యాపారుల్లో దాదాపు 82 శాతం కోవిడ్‌ కారణంగా ఆదాయం కోల్పోయి.. ఆహారం లేక అనేక అవస్థలు పడ్డారని ఈ మధ్యకాలంలో అనేక నివేదికల్లో చూస్తున్నాం. డన్‌ అండ్‌ బ్రాడ్‌ స్ట్రీట్‌ సంస్థ ఈ మధ్యకాలంలో సర్వేచేసిన వివరాలను చూశాం. అటువంటి అవస్థల నుంచి మన రాష్ట్రంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబాన్ని కాపాడేందుకు రెండున్నరేళ్ల పాలనలో మనందరి ప్రభుత్వం అమలు చేసిన ప్రతి ఒక్క సంక్షేమ పథకం డీబీటీ పద్ధతిలో ఎటువంటి వివక్షకు, లంచాలకు తావుఇవ్వకుండా నేరుగా దాదాపు రూ.1.29 లక్షల కోట్లు పేదలకు ఎలాంటి అవినీతి, వివక్షకు అవకాశం లేకుండా అందించాం. కాబట్టే దేశంలోని మిగతా రాష్ట్రాలకంటే పేదలను మన ప్రభుత్వం అక్కున చేర్చుకుందని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. ఇంకా దేవుడు మంచి చేసే అవకాశాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మూడో విడత జగనన్న తోడు పథకాన్ని ప్రారంభిస్తున్నాను’’ అని సీఎం వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.
 

తాజా ఫోటోలు

Back to Top