మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన

శ్రీకాకుళం: ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేశారు. మూలపేట గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ముందుగా మూలపేట తీరం వద్ద గంగమ్మ తల్లికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రూ.4,362 కోట్ల వ్యయంతో నిర్మించనున్న పోర్టు పనులకు శంకుస్థాపన చేశారు. 23.5 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో 4 బెర్తుల నిర్మాణం జరగనుంది. 30 నెలల్లో పోర్టు నిర్మాణ పనులు పూర్తికానున్నాయి. దీని వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 25 వేల మందికి ఉపాధి లభించనుంది. విష్ణుచక్రం, మూలపేటకు చెందిన 594 మంది నిర్వాసిత కుటుంబాలకు పునరావాసానికి రూ.109 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. నౌపడలో 55 ఎకరాల్లో ఆధునిక వసతులతో ఆర్‌ అండ్‌ ఆర్‌ కాలనీలను నిర్మిస్తోంది. 

మరికాసేపట్లో బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి, రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు, రూ.852 కోట్లతో మహేంద్ర తనయ ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టు పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వెంట శ్రీకాకుళం జిల్లా మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, ఇరిగేషన్‌ శాఖ మంత్రి అంబటి రాంబాబు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నా«ద్, స్పీకర్‌ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, వైయస్‌ఆర్‌ సీపీ నేతలు పాల్గొన్నారు. 
 

Back to Top