అవినీతికి తావులేదు.. వివక్షకు చోటు లేదు

నిర్దిష్ట గడువులో అర్హుల గుమ్మం ముందుకే సంక్షేమ పథకాలు

దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లో రేషన్, పింఛన్‌ కార్డులు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తాం

కార్డుల జారీలో జాప్యం జరిగిన కఠిన చర్యలు తీసుకుంటాం

జేసీలు, కలెక్టర్లు ఈ విప్లవాత్మక కార్యక్రమంపై శ్రద్ధ పెట్టాలి

‘స్పందన’లో కలెక్టర్లకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఆదేశం

తాడేపల్లి: అవినీతికి తావులేని, వివక్షకు చోటు లేని పాల‌న తీసుకువ‌చ్చాం.. ఇలాంటి పాలనలో నిర్దిష్ట గడువులో అర్హులకు సంక్షేమ పథకాలు అందించగలమనే నమ్మకంతో ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దరఖాస్తు చేసుకున్న పది రోజుల్లోనే బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు, 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు అర్హుల గుమ్మం ముందుకే తీసుకొచ్చి అందించనున్నామని సీఎం అన్నారు. సరైన కారణం ఉంటే తప్ప కార్డుల జారీలో జాప్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని, గ్రామ, వార్డు సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించే జేసీకి ఈ బాధ్యతలను అప్పగిస్తున్నామన్నారు. కలెక్టర్లు కూడా ఈ కార్యక్రమంపై శ్రద్ధ చూపాలని, ఒక వేళ  నిర్దిష్ట గడువులోపు సంక్షేమ పథకం అందించలేకపోతే పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. 

సంక్షేమ పథకాల అమలులో సరికొత్త ఒరవడిని సృష్టిస్తూ.. నిర్దిష్ట గడువులో అర్హులకు సంక్షేమ పథకాలు అందించే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలు, జాయింట్‌ కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు..

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

‘ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు కొంతమంది.. చేయగలుగుతామో లేదో.. ఎందుకంత కమిట్‌మెంట్‌ ఇవ్వాలని నాతో అన్నారు. అవినీతి లేని వ్యవస్థను తీసుకువచ్చి ఎటువంటి వివక్ష లేని పాలన తీసుకొచ్చినప్పుడు మనం ఇవ్వలేని పరిస్థితి ఉండదని నేను చెప్పాను.

2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు కూడా రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్లు మాత్రమే ఉండేవి. అటువంటి పరిస్థితి నుంచి ఈ రోజు 58 లక్షల పైచిలుకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఎన్నికలకు రెండు నెలల వరకు రూ.1000 పెన్షన్‌ ఉండేది. ఈ రోజు రూ.2,250 ఇస్తున్నాం. సంతృప్తి అనే మాటకు అర్థం తెలియజేస్తూ.. ఎక్కడ, ఎవరికి అర్హత ఉన్నా కచ్చితంగా ఇచ్చేందుకు అడుగులు ముందుకు వేశాం.

బియ్యం కార్డుల విషయంలో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నాం. ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో కూడా అంతే. 1.42 కోట్ల ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ చేపట్టాం. రాష్ట్రంలో ఇళ్లు ఎన్ని ఉన్నాయని చూస్తే.. దాదాపు 1.6 కోట్లు కనిపిస్తాయి. అలాంటిది 30 లక్షల పైచిలుకు ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. శాచ్యురేషన్‌ పద్ధతిలో ఇచ్చాం కాబట్టే ప్రజలకు ప్రభుత్వంపై సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కలిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయిన వారు ఉంటే బాధపడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం కమిట్‌మెంట్‌తో తీసుకొని అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చాం. 

ఇంతకుముందు రోజుల్లో ప్రభుత్వ పథకాలు వస్తాయో.. రావో.. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి ఉండేది. పథకం పొందేందుకు లంచాలు, రెకమండేషన్లు, సిఫారస్సులు ఉండేవి. ఆ పరిస్థితి నుంచి పూర్తిగా శాచ్యురేషన్‌ పద్ధతిలో అర్హత ఉంటే చాలు ఏ పథకం అయినా వర్తింపజేసే స్థితికి వ్యవస్థను తీసుకువచ్చాం. గ్రామ సచివాలయాల్లో మొత్తం లబ్ధిదారుల జాబితా పెట్టడమే కాకుండా.. ఆ పథకానికి సంబంధించిన అర్హతలను కూడా ప్రదర్శిస్తున్నాం. జాబితాలో పేరు లేకపోతే అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మార్గదర్శకాలు పొందుపరిచాం. వివక్షకు, అవినీతికి తావులేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని పరితపిస్తున్నాం. చివరకు మన ఓటు వేయని వారైనా సరే.. అర్హత ఉన్నవారందరికీ పథకాలు అందించాలనే ప్రయత్నం చేస్తున్నాం. 

ఇందులో భాగంగానే.. పది రోజుల్లో బియ్యం కార్డు, పెన్షన్‌ కార్డు ఇస్తామనే కమిట్‌మెంట్‌కు సంతకం పెడుతున్నా. 20 రోజుల్లోనే ఆరోగ్యశ్రీ కార్డు అందిస్తామని  కమిట్‌మెంట్‌కు సంతకం పెడుతున్నా.. 90 రోజుల్లోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని కమిట్‌మెంట్‌ ఇస్తూ సంతకం పెడుతున్నా.. 

ఇచ్చిన గడువులో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేసి అర్హులని తేలితే.. కచ్చితంగా ఆరోగ్యశ్రీ, రేషన్, పెన్షన్, ఇళ్ల పట్టాలు ఇవ్వాల్సిందే. ఇందుకోసం గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థను పర్యవేక్షించే జాయింట్‌ కలెక్టర్‌కు ఈ బాధ్యతను అప్పగిస్తున్నాం. దీనిపై కలెక్టర్ల పర్యవేక్షణ కూడా ఉండాలి. గ్రామ సచివాలయంలో ఏం జరుగుతుంది.. దరఖాస్తుల పరిశీలన తీరు ఏ విధంగా ఉందనేది కలెక్టర్లు కూడా సమీక్ష చేయాలి. జాయింట్‌ కలెక్టర్లు పూర్తి బాధ్యత వహించాలి. 

దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లోపు ఎలాంటి జాప్యం లేకుండా కార్డులు జారీ చేయాలి. సరైన కారణం లేకుండా కార్డు జారీలో జాప్యం జరిగితే కచ్చితంగా చాలా కఠిన చర్యలు తీసుకుంటాం. జేసీలు, కలెక్టర్లు చాలా శ్రద్ధ చూపించాలి. చెప్పిన మాట ప్రకారం 10 రోజుల్లో దరఖాస్తు చేసుకున్న వారికి కార్డులు జారీ చేయాలి. సరైన కారణం లేకుండా కార్డులు ఇవ్వలేకపోతే కచ్చితంగా లబ్ధిదారుడికి పరిహారం కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే కమిట్‌మెంట్‌ ఇది. దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని కచ్చితంగా ప్రజలకు మంచి చేసే దిశగా దృష్టిసారించాలి’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కలెక్టర్లు, జేసీలను ఆదేశించారు. 
 

Back to Top