వైయస్‌ఆర్ జిల్లా: కడప నగరంలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. వైయస్‌ఆర్ జిల్లాలో మూడో రోజు పర్యటనలో భాగంగా కడపలో రూ.871.77 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపనలు చేశారు. అనంతరం రూ.1.37 కోట్లతో నిర్మించిన రాజీవ్ పార్కును ప్రారంభించారు. అదే విధంగా రూ.5.61 కోట్లతో నిర్మాణం పూర్తయిన రాజీవ్‌మార్గ్‌ను ప్రారంభించారు. అభివృద్ధి చేసిన రాజీవ్ పార్కు, రాజీవ్ మార్గ్ ఫొటో గ్యాలరీని సీఎం వైయస్ జగన్ వీక్షించారు. అంతకుముందు కడప జిల్లా నాయకులను కలిసి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన ప్రజలను సైతం సీఎం వైయస్ జగన్ కలిసి.. వారి నుంచి వినతులను స్వీకరించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సీఎం వైయస్ జగన్ వెంట మంత్రులు అంజాద్ బాషా, ఆదిమూలపు సురేష్, ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్ సురేష్‌బాబు, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి ఉన్నారు.