ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం

‘ జ‌గ‌న‌న్న పచ్చ తోరణం’ ప్రారంభించిన సీఎం వైయ‌స్ జగన్

  కృష్ణాజిల్లా: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపునిచ్చారు.  71వ వన మహోత్సవం సంద‌ర్భంగా జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణం కార్య‌క్ర‌మాన్ని బుధవారం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ ప్రారంభించారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపాడు ‘వనం మనం’  ప్రాంగణానికి చేరుకొన్న ఆయన.. పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి నీరు పోశారు.

20 కోట్ల మొక్క‌లు నాటేందుకు ల‌క్ష్యం
  వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ తెలిపారు. రాష్ట్రంలో 13 వేల పంచాయితీలు ఉంటే, 17 వేల లే అవుట్లు సిద్ధం చేశామని.. ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. మొక్కల్ని నాటాలని కోరుతూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజలు, అధికారులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఙ చేయించారు.

ఆగ‌స్టు 15న 30 ల‌క్ష‌ల మందికి ఇళ్ల ప‌ట్టాలు
 ఆగస్టు 15న 30 లక్షల మందికి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని సీఎం వైయ‌స్ జ‌గన్‌ పునరుద్ఘాటించారు. ‘‘పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడుతున్నారు. కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. కేసులు వేస్తున్నారు. వారి వల్ల సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత స్వాతంత్య్ర  దినోత్సవం రోజున పేదలకు ఇళ్ల స్థలాలు అందించే కార్యక్రమం చేస్తాం’’ అని పేర్కొన్నారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాస్ రెడ్డి , కొడాలి నాని , పేర్ని నాని , వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ , సీఎం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం , మహిళాకమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ తదితరులు  పాల్గొన్నారు.

 

Back to Top