తాడేపల్లి: ఒడిశాలో రైలు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఘటనా స్థలానికి మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ముగ్గురు ఐఏఎస్‌ల బృందాన్ని పంపించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఎంకైర్వీ విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఘటనా స్థలానికి పంపించడానికి అంబులెన్స్‌లు సన్నద్ధం కావాలని సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం విశాఖ సహా ఒడిశా సరిహద్దు జిల్లాల్లో ఆసుపత్రులు అలర్ట్‌గా ఉండాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. కోరమాండల్ రైల్లో ప్రయాణించిన రాష్ట్రానికి చెందిన ప్రయాణికుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులనుంచి ఫొటోలు సేకరిస్తున్నారు. ఈ డేటా ఆధారంగా ప్రమాదంలో ఎవరైనా రాష్ట్రానికి చెందిన ప్రయాణికులు ఉన్నారా..? అన్నదానిపై ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. అంబులెన్స్‌లు సిద్ధంచేయడంతోపాటు, క్షతగాత్రులకు వైద్యసేలు అందించే అంశంపై అధికారులు అన్నిరకాల ఏర్పాట్లు చేశారు.