అధైర్య పడవద్దు..అండగా ఉంటా

తలసేమియాతో బాధపడుతున్న బాలిక వైద్యానికి సీఎం వైయస్‌ జగన్‌ సహాయం

ప్రభుత్వం తరఫున వైద్యం చేయించాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ

ప్రకాశం: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలిక శాన్విక(8) వైద్య చికిత్సకు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ను ఆదేశించారు. ప్రకాశం జిల్లా దర్శిలో మంగళవారం జరిగిన స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి కుమారుని వివాహ రిసేప్షన్‌ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా దర్శిలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన నిషితకు ఏకైక సంతానమైన బసవనాట శాన్విక అనారోగ్య పరిస్థితిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తలసేమియాతో బాధపడుతోందని, నెలకు రెండుసార్లు రక్తమార్పిడి చేయించాల్సినవస్తుందని చెప్పారు. దీనికి రూ.12 వేలకు పైగా ఖర్చువుతున్నట్లు చెప్పారు. ఓ నెగిటివ్‌ గ్రూప్‌ రక్తం దొరకటం కూడా కష్టమవుతోందని అన్నారు. పాపకు మ్యారో(ఎముక మజ్జ) చికిత్స చేయించడానికి దాదాపు రూ.30 ల క్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పినట్లు ఆమె వివరించారు. గ్రామ సచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా తాను పని చేస్తున్నానని, సుమారు ఆరేళ్ల క్రితమే తన భర్త తమను పట్టించుకోకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారని ఆమె చెప్పారు. తన ఉద్యోగంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నానని, లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థోమత లేదని, ప్రభుత్వం తరఫున ఆదుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు. ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్ద ఉంటున్నానని, వారి పోషణ బాధ్యత కూడా తానే చూసుకుంటున్నానని నిషిత కుమారి చెప్పారు. ఆ చిన్నారితో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఈ సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడారు. అధైర్యపడవద్దని, ప్రభుత్వం తరఫున సహాయం చేస్తానని బాధితురాలి కుటుంబానికి సీఎం వైయస్‌ జగన్‌ ధైర్యం చెప్పారు. అవసరమైన ప్రక్రియను ప్రారంభించాలని జిల్లా కలెక్టర్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. దీంతో నిషితకుమారి సీఎం వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 
 

తాజా వీడియోలు

Back to Top