నూజివీడు: రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మరోసారి తన మానవతను చాటుకున్నారు. నూజివీడులో బహిరంగ సభలో పాల్గొన్న అనంతరం తిరిగి హెలిపాడ్ కు వెళ్లబోతుండగా, అక్యూట్ మైలోడ్ లుకేమియా, మానసిక వికలాంగత్వం పరాప్లేగియా వ్యాధి, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, తదితర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న పలువురు ముఖ్యమంత్రిని కలిసి తమ దీన పరిస్థితిని తెలియజేసి, తమను ఆదుకోవాలని కోరారు. వారి అనారోగ్య పరిస్థితుల నుండి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నుండి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి వివరంగా అడిగి తెలుసుకున్నారు. రోగుల దీన పరిస్థితిని చూసి చలించిన ముఖ్యమంత్రి వారికి తాను అండగా ఉంటానని చెప్పి, వెంటనే వారికి అవసరమైన ఆర్ధిక సహాయం అందించాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో, వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగంతో తక్షణమే స్పందించి ఆపన్నులకు ఆర్ధిక సహాయాన్ని అందించారు. లింగపాలెం మండలం బోగొలుకు చెందిన తాడేపల్లి అనితాపాల్ కు, నూజివీడు పట్టణం కొత్తపేట కు చెందిన శీలం నాగమురళీకృష్ణ కు, పెదవేగి మండలం రాయన్నపాలెం కు చెందిన పల్లగాని శ్రీనివాసరావు కు, పెదవేగి మండలం లక్ష్మీపురం కు చెందిన గుడ్ల రంగారావుకు, అగిరిపల్లికి చెందిన సాదం గోపీనాధ్, తూర్పు గోదావరి జిల్లా సమనస గ్రామానికి చెందిన మండా హేమ కు, నూజివీడు మండలం అన్నవరం గ్రామానికి చెందిన మండపాటి రమేష్ కు, పశ్చిమ గోదావరి జిల్లా కొప్పర్రు కు చెందిన బద్ద రత్నకుమారి కి కృష్ణా జిల్లా మర్లపాలెం గ్రామానికి చెందిన పెదగామల్ల కృపారాణి కి లక్ష రూపాయలు చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంజూరు చేశారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు, వారి సమక్షంలో వ్యాధిగ్రస్తులకు ఆర్ధిక సహాయం చెక్కులను జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి , నూజివీడు సబ్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అందజేశారు. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ముగించుకుని, తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకునే సమయంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను జిల్లా యంత్రాంగం లబ్దిదారులకు అందించడం విశేషం. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. శర్మిష్ట, తహసీల్దార్ యల్లారావు, ప్రభృతులు పాల్గొన్నారు.