గొప్ప డాక్టర్లుగా ఎదిగి.. ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలి

మెడికల్‌ కాలేజీల ప్రారంభోత్సవంలో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నేడు ఐదు మెడికల్‌ కాలేజీలను ప్రారంభించడం సంతోషంగా ఉంది

డాక్టర్‌ విద్య చదువుతున్న పిల్లలంతా అత్యున్నత స్థాయికి చేరాలని ఆకాంక్షిస్తున్నా..

విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో కాలేజీలు ప్రారంభించుకున్నాం..

వేలాది మంది విద్యార్థులను డాక్టర్లుగా తీర్చిదిద్దే గొప్ప ఇనిస్టిట్యూషన్స్‌ను క్రియేట్‌ చేస్తున్నాం 

స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో 11 మెడికల్‌ కాలేజీలే.. మన ప్రభుత్వం వచ్చాక అదనంగా 17 కాలేజీలకు శ్రీకారం చుట్టాం

17 మెడికల్‌ కాలేజీల కోసం రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నాం

ఈ ఏడాది 5 కాలేజీల ద్వారా 705 సీట్లు అందుబాటుకి వచ్చాయి

వచ్చే ఏడాది 5 కాలేజీలు, ఆ తర్వాతి ఏడాది మరో 7 మెడికల్‌ కాలేజీలు ప్రారంభిస్తాం

ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు ఉంటే.. 17 కాలేజీలు రావడంతో సీట్ల సంఖ్య 4,735కు పెరుగుతుంది

ఈ ఒక్క ఏడాదే 609 పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చాయి

రానున్న రోజుల్లో అందుబాటులోకి మరో 2,737 పీజీ సీట్లు

గిరిజన ప్రాంతాల్లోనూ మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం..

ప్రస్తుతం ఉన్న 11 కాలేజీల అప్ర్‌గ్రేడ్‌ కోసం రూ.3,820 కోట్లు ఖర్చు చేస్తున్నాం

18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం.. అందుబాటులోకి మరో 1,200 నర్సింగ్‌ సీట్లు

విజయనగరం: ‘‘స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి మన రాష్ట్రంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. అటువంటిది కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో, దేవుడి దయతో మరో 17 మెడికల్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం. ఈరోజు 5 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించుకున్నాం. రాబోయే ఏడాది మరో 5 మెడికల్‌ కాలేజీలు, ఆ తరువాతి ఏడాది మరో 7 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. విజయనగరంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీని ప్రారంభించిన అనంతరం వర్చువల్‌ విధానంలో రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలలో నిర్మించిన మెడికల్‌ కాలేజీలను సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. వైద్య విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగం..
‘ఈరోజు దేవుడి దయతో మంచి కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్‌ కాలేజీలను నిర్మించే కార్యక్రమం మొదలుపెట్టాం. అందులో 5 మెడికల్‌ కాలేజీలను ప్రారంభించుకున్నాం. ఈ కాలేజీల్లో విద్యార్థులు అడ్మీషన్లు తీసుకొని డాక్టర్‌ విద్యను అభ్యసించబోతున్నారు. మెడికల్‌ కాలేజీల నుంచి నేర్చుకునే చదువు, శిక్షణతో రాబోయే రోజుల్లో చేసే సేవ ద్వారా మీరంతా ఇంకా మంచిపేరు తెచ్చుకొని గొప్ప డాక్టర్లు, గొప్ప మనుషులు ఎదుగుతారని మనసారా ఆకాంక్షిస్తున్నాను. 

17 మెడికల్‌ కాలేజీలకు సంబంధించిన నిర్మాణం మొదలుపెట్టాం. ఇందులో 5 మెడికల్‌ కాలేజీలు విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల చోట్ల మనం మొదలుపెట్టిన కార్యక్రమాలు వేగాన్ని అందుకొని మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకునే పరిస్థితికి అడుగులు వేగంగా వేశాం. ఈ 5 మెడికల్‌ కాలేజీలతో పాటు వచ్చే ఏడాది మరో 5 కాలేజీలను ప్రారంభిస్తాం. మరుసటి ఏడాది మరో 7 కాలేజీలను అడ్మిషన్లు స్వీకరించే స్థాయికి తీసుకువస్తాం. మొత్తంగా 17 మెడికల్‌ కాలేజీలను అందుబాటులోకి తీసుకురాగలుగుతున్నాం. 

ప్రతి పార్లమెంట్‌ను ఒక జిల్లాగా చేయడమే కాకుండా.. ప్రతి పార్లమెంట్‌ పరిధిలో ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. దీని వల్ల టెరిషరీ కేర్‌ ప్రతి పార్లమెంట్‌ స్థాయికి తీసుకెళ్తున్నాం. ఒక మంచి మెడికల్‌ కాలేజీ అందుబాటులో ఉంటే.. అక్కడ పనిచేసే ప్రొఫెసర్లు, పీజీ స్టూడెంట్స్‌ అందుబాటులో ఉండటం వల్ల టెరిషరీ కేర్‌లో గొప్ప మార్పు జరుగుతుంది. టెరిషరీ కేర్‌ పెరగడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందన్నది ఒక ఎత్తు అయితే.. అదే రకంగా వేల మంది పిల్లలను మంచి డాక్టర్లుగా తయారు చేసే గొప్ప ఇనిస్టిట్యూషన్‌ను మన రాష్ట్రంలో క్రియేట్‌ చేయగలుగుతున్నాం. 

స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీలు 11 మాత్రమే ఉన్నాయి. అటువంటిది కేవలం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో, దేవుడి దయతో ఈరోజు 13 జిల్లాలను 26 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. అంతే కాకుండా 11 మెడికల్‌ కాలేజీలకు మరో 17 మెడికల్‌ కాలేజీలను అదనంగా జోడించి 28 మెడికల్‌ కాలేజీల దిశగా అడుగులు వేగంగా వేస్తున్నాం. ఈ 17 మెడికల్‌కాలేజీలను నిర్మించడానికి దాదాపుగా రూ.8,480 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఈ కాలేజీల వల్ల కొత్తగా మరో 2250 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి రాబోతున్నాయి. 

ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,185 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులో ఉంటే.. ఈ 17 మెడికల్‌ కాలేజీలు రావడంతో ఎంబీబీఎస్‌ సీట్లు ఏకంగా 4,735 సీట్లకు పెరుగుతాయి. ఇవే కాకుండా ఇప్పుడున్న మెడికల్‌ కాలేజీల్లో సదుపాయాలన్నీ పూర్తిగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కల్పన మాత్రమే కాకుండా జీరో వేకెన్సీ పాలసీ తీసుకురావడం వల్ల దాదాగా ఈ ఒక్క సంవత్సరంలోనే 609 కొత్త పీజీ సీట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 17 మెడికల్‌ కాలేజీలు అందుబాటులోకి వస్తే భవిష్యత్తులో మరో 2,737 పీజీ సీట్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇవన్నీ ఎందుకింతగా చెబుతున్నామంటే.. మీరంతా మంచి డాక్టర్లు కావాలి.. మీరంతా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు ఇంకా మరింతగా ఉపయోగపడే పరిస్థితి రావాలని ఆకాంక్షిస్తున్నాను. అందుకే ఇవన్నీ వివరిస్తున్నాం. 

ఈరోజు ప్రారంభం అవుతున్న విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్‌ కాలేజీల్లో దాదాపుగా 750 సీట్లతో పిల్లలు డాక్టర్లు కాబోతున్నారు.  పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆధోని వంటి వెనుకబడిన ప్రాంతాల్లోనూ మెడికల్‌ కాలేజీలను నిర్మిస్తున్నాం. వీటిని వచ్చే ఏడాది ప్రారంభిస్తాం. 2024–25లో మరో 750 మెడికల్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. వెనుకబడిన గిరిజన ప్రాంతాలు పార్వతీపురం, నర్సీపట్నం కూడా మెడికల్‌ కాలేజీలు రాబోతున్నాయి. 2025–26లో 7 మెడికల్‌ కాలేజీల ద్వారా 1,050 ఎంబీబీఎస్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. 

ఎంబీబీఎస్, పీజీ మెడికల్‌ కాలేజీల్లో సీట్లు మాత్రమే కాకుండా గవర్నమెంట్‌ నర్సింగ్‌ కాలేజీలను కూడా తీసుకువస్తున్నాం. 2019 వరకు చూస్తే దాదాపు 1,090 నర్సింగ్‌ సీట్లు ఉంటే.. మరో 18 నర్సింగ్‌ కాలేజీలను తీసుకువస్తున్నాం. వీటి ద్వారా మరో 1,200 నర్సింగ్‌ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తంగా 2,290 సీట్లు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఉన్న 11 మెడికల్‌ కాలేజీల్లో ఎన్‌ఏబీహెచ్, ఎన్‌ఎంసీ మార్గదర్శకాలను అనుగుణంగా నాడు–నేడుతో అప్‌గ్రేడ్‌ చేస్తున్నాం. అన్ని టీచింగ్‌ పోస్టులను భర్తీ చేస్తున్నాం. 11 మెడికల్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌ కోసం దాదాపు రూ.3820 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 

మన నాలుగేళ్ల పరిపాలనలో గమనించినట్లయితే.. ఒక ప్రణాళికాబద్ధంగా గ్రామ స్థాయి నుంచి మార్పులు తీసుకొస్తున్నాం.  ఒకపక్క క్యూరేటివ్‌ ట్రీట్‌మెంట్‌  ఎంత అవసరమో, ప్రివెంటివ్‌ కేర్‌ కూడా అంతే అవసరం.  ప్రివెంటివ్‌ కేర్‌లో కూడా దేశానికే మార్గదర్శకంగా నిలబడే విధంగా అడుగులు పడటం జరిగింది. ఇందులో ఏ రకమైన మార్పులు తెచ్చామో చూస్తే... ఇవాళ ప్రివెంటివ్‌ కేర్‌లో ఎప్పుడూ చూడని అడుగులుపడ్డాయి. దాదాపు 10,032 విలేజ్‌ క్లినిక్స్‌ ఏర్పాటయ్యాయి. ఆ విలేజ్‌ క్లినిక్స్‌లో సీహెచ్‌వో, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్‌ ఉంటారు. గ్రామస్థాయిలో 105 రకాల మందులు అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 14 రకాల డయోగ్నస్టిక్‌ టెస్టులు చేస్తారు. 

పట్టణ ప్రాంతాలకు సంబంధించి మరో 542 అర్బన్‌ క్లినిక్స్‌ తీసుకొచ్చాం. ఈ విలేజ్‌ క్లినిక్స్‌ను ప్రివెంటివ్‌ కేర్‌ దిశగా అడుగులు వేయిస్తున్నాం. ప్రతి మండలానికీ కనీసం 2 పీహెచ్‌సీలు ఉండేటట్టుగా చేశాం. ఒక్కో పీహెచ్‌సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేట్లు చేస్తున్నాం. ప్రతి మండలంలోనూ నలుగురు డాక్టర్లు, ప్రతి పీహెచ్‌సీలోనూ ఒక 104 వాహనం ఉండేట్లు చేస్తున్నాం. ఈ నలుగు డాక్టర్లు ప్రతి నెలా గ్రామానికి 2 సార్లు వెళ్లేటట్లు చేస్తున్నాం. ఒక డాక్టరు పీహెచ్‌సీలో ఉంటే మరో డాక్టరు గ్రామాలకు వెళ్తారు.  దీని వల్ల 6 నెలల్లో ఎవరికి ఏ రోగముంది, ఎవరికి బీపీ, షుగర్, ఏ రకమైన ప్రాబ్లమ్స్‌ ఉన్నాయని పూర్తిగా చెప్పే ఒక ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తెచ్చాం. ఇది ప్రివెంటివ్‌ కేర్‌లో తీసుకున్న చాలా పెద్ద మార్పు.

గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో మందులు తీసుకుంటే నయం కాదు అని చాలా మంది అనుకుంటారు.  కానీ ఈరోజు అన్ని గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ మందులు మాత్రమే ఆంధ్రరాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.

మన ప్రభుత్వం రాకమునుపు ఆరోగ్యశ్రీ సేవలు నామమాత్రంగా ఉండేవి. గతంలో 1050 ప్రొసీజర్లు మాత్రమే ఉంటే, ఈరోజు 3,255 ప్రొసీజర్లకు విస్తరించాయి. అన్ని రకాల క్యాన్సర్‌ దగ్గర నుంచి మొదలు కాక్లియర్‌ ఇంప్లాంట్‌దాకా ఆరోగ్యశ్రీలో కవర్‌ అవుతున్నాయి.  వైద్యం ఖర్చు రూ.1000 దాటితే అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి, తేవాలన్న తపన, తాపత్రయంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరిస్తున్నాం. 

గతంలో ఆరోగ్యశ్రీ ఎంపానెల్‌ 900 హాస్పిటల్స్‌ ఉంటే, ఈరోజు 2285కు విస్తరించాయి. గతంలో ఆరోగ్యశ్రీ బడ్జెట్‌ రూ.1100 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంటే, ఈరోజు రూ.3,600 కోట్లకు అందుతోంది. గతంలో ఎన్నడూ చూడని విధంగా...  ప్రతి మండలానికి ఒక 108, రెండు 104 వాహనాలు ఉండేట్లుగా దాదాపు 1,514 కొత్త వాహనాలు కొనుగోలు చేశాం.  తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్‌తో కూడా కలుపుకుంటే 2,204 అంబులెన్స్‌ వాహనాలు రాష్ట్రంలో తిరుగుతున్నాయి. ఇలా ఏ రాష్ట్రంలోనూ తిరగడం లేదు. 

మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే... రాష్ట్రంలో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో మనం రిక్రూట్‌ చేసిన హెల్త్‌ డిపార్ట్‌ మెంట్‌ స్టాఫ్‌ 53,126 మంది. స్పెషలిస్టు డాక్టర్లుకు సంబంధించి అవైలబులిటీ తీసుకుంటే, నేషనల్‌ యావరేజ్‌ 61 శాతం వేకెంట్‌ ఉంటే..స్టేట్‌యావరేజ్‌ వేకెంట్‌ కేవలం 3.96 శాతం మాత్రమే. నో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చి.. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఏర్పాటు చేసి.. స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహించాం. ఖాళీలు ఉంటే వెంటనే భర్తీ చేయాలని వెంటపడి మరి భర్తీ చేస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రభుత్వాస్పత్రుల్లో నర్సుల పోస్టుల్లో వేకెన్సీ 27 శాతం ఉంటే.. అదే మన రాష్ట్రంలో మాత్రం జీరో. జాతీయ స్థాయిలో గవర్నమెంటు ఆసుపత్రుల్లో ల్యాబ్‌ టెక్నీషియన్ల వేకెన్సీలు 33 శాతం ఉంటే.. మన రాష్ట్రంలో మాత్రం జీరో వేకెన్సీ. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. మనం ఏ స్ధాయిలో ఆరోగ్యరంగం మీద ధ్యాస పెట్టామో తెలుసుకోవాలి. ఇక్కడ నుంచి మంచి డాక్టర్లు రావాలి. మంచి పీజీ స్టూడెంట్లు రావాలి. మంచి మనసు రావాలి, మీరు కూడా పేదవాళ్లకు ఉపయోగపడే పరిస్థితి రావాలన్న ఉద్దేశ్యంతో ఇవన్నీ చేస్తున్నాం. 

ఇప్పటి వరకు బటన్‌ నొక్కితే నేరుగా డీబీటీ పద్ధతిలో రూ. 2.35 లక్షల కోట్లు పేద ప్రజల ఖాతాల్లోకి నేరుగా వేయగలిగాం. ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా  చేయగలిగాం. ఇంటి తలుపు తట్టి పెన్షన్‌ను ప్రతి గడపకూ తీసుకొని పోగలిగాం. ఇంటి తలుపుతట్టి రేషన్‌ కార్డు, రేషన్‌ బియ్యం, ప్రతి గడప ముంగిటకు చేర్చగలిగాం. 

ప్రతి ఇంటినీ జల్లెడ పట్టి ఇంటి స్థలం లేని వారు ఉన్నారా ? అని వెతికి, అప్లికేషన్‌పెట్టించి 30 లక్షల ఇంటి స్థలాలను పేదవాళ్లకు ఇవ్వగలిగాం. అందులో వేగంగా 22 లక్షల ఇళ్లు నిర్మాణం కూడా జరుగుతోంది. ఎవరికి ఏ సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటింటికీ వెళ్లి జల్లెడ పట్టి అడిగి మరీ  వాళ్ల ప్రతీ అవసరాలు తీరుస్తున్నాం. మొన్నటి జగనన్న సురక్షలో 98 లక్షల సర్టిఫికెట్లు అందజేశాం. 

ఈరోజు ఈ కార్యక్రమంతో పాటు ఇదే దిశగా అడుగులు వేస్తూ.. ఇంకో మంచి కార్యక్రమం చేస్తున్నాం. జగనన్న ఆరోగ్య సురక్ష అని ఈరోజు ప్రారంభించాం. ప్రతి ఇంటì కీ వెళ్లి జల్లెడ పట్టి ఎవరికి ఏ రకమైనా సమస్య ఉన్నా 7 రకాలు పరీక్షలు చేస్తూ.. ప్రతి ఇంటికి వెళ్తున్నాం. ఐదు దశలలో జరిగే ఈ కార్యక్రమంలో నాలుగో దశలో హెల్త్‌ క్యాంపు పెడుతున్నాం. సెప్టెంబరు 30న తొలి హెల్త్‌ క్యాంపు నిర్వహించబోతున్నాం. ఆ తర్వాత 45 రోజుల పాటు  45 రోజులు రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ హెల్త్‌క్యాంపులు విస్తరించి పూర్తి చేస్తాం.  గ్రామం మొత్తం మ్యాపింగ్‌ అవుతుంది. ప్రతి ఇంట్లో ఏ రకమైన సమస్య ఉన్నా వాళ్లకు ఫ్రీగా టెస్టులు చేస్తాం. మందులు ఇవ్వబోతున్నాం. ఆ తర్వాత హ్యాండ్‌ హోల్డింగ్‌ చేయబోతున్నాం. ఇది చాలా పెద్ద మార్పు. విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా అడుగులు వేయబోతున్నాం.  మీ అందరి సహాయ సహకారాలు రావాలి, కావాలి అని మనస్పూర్తిగా అడుగుతున్నాను.

కొన్ని మాటలు ఎప్పుడూ కూడా నా మనసుకు తడుతుంటాయి. నాట్‌ ఆల్‌ ఏంజిల్స్‌ హావ్‌ వింగ్స్, సమ్‌ హ్యావ్‌ స్టెతస్కోప్స్‌. కీప్‌ దిస్‌ ఇన్‌మైండ్‌. ఇది ఇక్కడే రాసి సంతకం కూడా పెట్టాను.

మీరందరూ యువత. రానున్న ఐదేళ్లలో మీరు వైద్యులు కాబోతున్నారు. దేవుడి దయతో మంచి పోస్ట్‌ గ్రాడ్యేయేట్‌ విద్యార్ధులై.. ఇంకా మంచి డాక్టర్లు అవుతారు. ప్రజలకు మీరు చేయబోయే కార్యక్రమాలకు సంబంధించి మీ మీద చాలా ఆశలు ఉన్నాయి. ఈ మాటలను మీ మైండ్‌లో గుర్తుపెట్టుకొండి.  దేశంలోనే మీరు మంచి వైద్యులుగా తయారవుతాని నేను నమ్ముతున్నాను. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టూ యూ అని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ ప్రసంగం ముగించారు.

Back to Top