బాబుతోనే కాదు.. చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం

పులివెందుల సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మీ బిడ్డకు మీరిచ్చిన భరోసా.. రాష్ట్రంవైపు చూసేలా చేసింది

2019లో 151, వచ్చే ఎన్నికల్లో ‘వై నాట్‌ 175’ పిలుపునిచ్చే పరిస్థితికి వచ్చాం

పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నా..

పులివెందులలో ఒక ప్రతీ మూడు నెలలకు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు

అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. ముఖ్యమంత్రి మార్పుతో పేదల తలరాతలు మారాయి  

టీడీపీ పాలనలో తెచ్చిన అప్పులకంటే ఇప్పుడు చాలా తక్కువ

గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది..?

పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి

మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

రూ.1.71 లక్షల కోట్లను బటన్‌ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం

ఈరోజు వ్యవస్థలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు

వైయస్‌ఆర్‌ జిల్లా: ‘‘పులివెందులను మంచి సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతున్నా. పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా చేయడంలో భాగంగా మనం అధికారంలోకి వచ్చిన తరువాత దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో అభివృద్ధి బాటలోకి ఈ మూడున్నర సంవత్సర కాలంలో అడుగులుపడ్డాయి. గతంలో మనం చేసిన శంకుస్థాపనలు అన్నీ ఒక్కొక్కటిగా ఈరోజు ప్రారంభించడానికి సిద్ధం అవుతున్నాయి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పులివెందులలో అత్యాధునిక వసతులతో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ బస్‌ టర్మినల్‌ను ఈరోజు ప్రారంభించుకున్నామన్నారు. ఈ బస్‌ టర్మినల్‌ చాలా చక్కగా, మిగిలిన బస్‌ స్టాండ్స్‌కు రోల్‌ మోడల్‌గా ఉండేలా నిర్మించామన్నారు. పులివెందులలో డాక్టర్‌ వైయస్‌ఆర్‌ బస్‌ టర్మినల్‌ ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు. 

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
‘‘బస్‌ టర్మినల్‌కు సంబంధించి రకరకాల మాటలు విన్నాం. కొద్ది రోజుల క్రితం సోషల్‌ మీడియాలో ఒక మాట విన్న.. గతంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి.. పులివెందులలో బస్‌ టర్మినల్‌ కూడా కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని మాట్లాడాడు. ఇంత వేగంగా జరుగుతున్న పనులు కనిపిస్తున్నా కూడా చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు, వారికి తోడు నెగెటివ్‌ మీడియా అసత్య ప్రచారం చేసింది. 

ఇవాళ మనం యుద్ధం చేస్తుంది.. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబుతోనే కాదు.. చెడిపోయివున్న వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. ఆ చెడిపోయిన వ్యవస్థ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5.. వీరికి తోడు ఒక దత్తపుత్రుడు. వీరంతా ఎలా తయారయ్యారంటే.. ఒక గ్లాస్‌లో నీరు మూడోవంతు వరకు నిండి ఉన్నా.. నీరు నిండని పావు భాగం చూపించి.. గ్లాస్‌లో నీరే లేవనే చూపించే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఈరోజు వ్యవస్థ దిగజారిపోయింది. ఇటువంటి చెడిపోయిన వ్యవస్థతో మీ బిడ్డ యుద్ధం చేస్తున్నాడు. 

గత ఎన్నికల్లో మనకు 151 వచ్చాయి.. రేపు జరగబోయే ఎన్నికల్లో వై నాట్‌ 175 అని మీ బిడ్డ పిలుపునిచ్చే పరిస్థితుల్లో ఉన్నాడంటే.. దానికి కారణం మీ బిడ్డకు మీరు తోడుగా ఉన్నారన్న నమ్మకమే. రాష్ట్రం నువ్వు చూసుకో.. ఈ ప్రాంతం మేము చూసుకుంటామని మీరిచ్చిన భరోసాతోనే మీ బిడ్డ రాష్ట్రం వైపు చూడగలుగుతున్నాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

ఈ మూడున్నరేళ్ల పాలనలో ఎంత సొమ్ము ప్రతి ఇంటికి మనం చేర్చగలిగాం.. నేరుగా బటన్‌ నొక్కి.. లంచాలు, వివక్షకు తావులేకుండా ప్రతి ఇంటికి ఇవ్వగలిగాం అనేది కమలాపురం సభలో వివరిస్తూ చెప్పాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు అందరూ ఆలోచన చేయాలి.. గతంలో రాష్ట్ర బడ్జెట్, ఇప్పుడు అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. అప్పుల పెరుగుదల అప్పటి కంటే ఇప్పుడు తక్కువ. మరి అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌.. అప్పుల పెరుగుదల గతంలో మనకంటే ఎక్కువ. గత పాలకులు మీ బిడ్డ చేస్తున్నట్టుగా ఎన్ని స్కీమ్‌లు ఎందుకు ఇవ్వలేకపోయారు.. ప్రతి ఇంట్లోని అక్కచెల్లెమ్మలకు మంచి ఎందుకు చేయలేకపోయారు. ప్రతి ఒక్కరూ కూడా పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు అందరూ ఆలోచన చేయాలి. మరి అప్పుడూ అదే బడ్జెట్, అదే రాష్ట్రం, ఇప్పుడూ అదే బడ్జెట్, అదే రాష్ట్రం.. కేవలం ముఖ్యమంత్రి మార్పుతో పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి. అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, చదువుకుంటున్న పిల్లల తలరాతలు మారుతున్నాయి. కారణం ఏంటనేది ప్రతి ఒక్కరూ లోతుగా ఆలోచన చేయాలి. 

ఈరోజు వ్యవస్థలో ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. చివరకు మనకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వాళ్లకు కూడా మంచి చేసే పరిస్థితి ఈ ప్రభుత్వంలో, మీ బిడ్డ ప్రభుత్వంలో కనిపిస్తోందని సగర్వంగా తెలియజేస్తున్నాను. అక్షరాల రూ.3లక్షల కోట్ల పైచిలుకు డీబీటీ, నాన్‌ డీబీటీ పద్థతుల్లో ప్రతి ఇంటికీ చేరుస్తున్నాం. రూ.1.71 లక్షల కోట్లు కేవలం బటన్‌ నొక్కి నేరుగా నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో జమ చేశాం. ప్రతి కుటుంబానికి జరుగుతున్న మంచి గురించి ఆలోచన చేయాలని పులివెందుల నుంచి ఇచ్ఛాపురం వరకు ప్రతి ఒక్కరినీ కోరుకుంటున్నాను. 

పులివెందులలో దాదాపు రూ.125 కోట్లకు సంబంధించిన పనులకు ప్రారంభోత్సవాలు చేసుకుంటూ వస్తున్నాను. ఈరోజు ఇక్కడే పులివెందుల రింగ్‌ రోడ్డులోని 5 జంక్షన్ల సుందరీకరణ కార్యక్రమానికి ఇప్పుడే ప్రారంభోత్సవం చేశాం. విజయ హోమ్స్‌ జంక్షన్‌లో ఆరోగ్యపథకం అనే పేరుతో ప్రారంభోత్సవం, పులివెందుల, కదిరి రింగ్‌రోడ్డు జంక్షన్‌లో ప్రజాపథం ప్రారంభోత్సవం, బొబ్బిడిపల్లి సర్కిల్‌లో పల్లెపథం ప్రారంభోత్సవం.. ఈ మాదిరిగా 5 జంక్షన్‌లలో ప్రతి జంక్షన్‌ కూడా పులివెందులకు వచ్చి పులివెందులలో నాలుగు కూడళ్ల జంక్షన్‌ ఈ మాదిరిగా ఉందని రాష్ట్రం, దేశమంతా చూసేలా ఆ జంక్షన్‌లను తీర్చిదిద్దాం. అన్ని హంగులతో విస్తరించిన 100 అడుగుల కదిరి రోడ్డును ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోడ్డును చూసినప్పుడు చాలా సంతోషమేసింది. పులివెందులలో ఉన్నామా.. పెద్ద సిటీలో ఉన్నామా అనిపించేలా ఆ రోడ్డు నిర్మించాం. ఆ రోడ్డును ఆదర్శంగా తీసుకొని పులివెందులలోని అన్ని పెద్ద రోడ్లు అదే మాదిరిగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ను ఆదేశించా.

– పట్టణ ప్రజలకు అధునాతన కూరగాయాల మార్కెట్‌ కూడా ప్రారంభించాం. 
– ప్రజలు మానసిక ఉల్లాసం పొందేందుకు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ పార్కును ప్రారంభించాం. 
– ప్రజల చిరకాల కోరిక అయిన రాయలపురం బ్రిడ్జిని కూడా అధునాతన హంగులతో ప్రారంభించడం జరిగింది. 
– నాడు–నేడులో పులివెందుల టౌన్‌ అహోబిలపురంలో ఉన్న స్కూల్‌ను ప్రారంభించేందుకు వెళ్తున్నాను. ఆ స్కూల్‌ ఫొటోలు చూస్తే ఈ మాదిరిగా స్కూళ్లు అన్ని ఉండాలని అనిపించేలా ఉంది. నాడు–నేడుతో ఎంత మార్పు తెచ్చామో స్కూళ్లు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. 
– చెత్త రహిత పట్టణంగా తీర్చిదిద్దడం కోసం గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌ను ప్రారంభించనున్నాం. 
– యూజీడీ పనుల్లో భాగంగా 10 ఎంఎల్‌డీఎస్టీపీని కూడా ప్రారంభించడం జరుగుతుంది. 

ఈరోజు జరుగుతున్న ఈ ప్రారంభోత్సవాలే కాకుండా.. 2019, 2020, 2021 ఈ మూడు సంవత్సరాలుగా మనం చేస్తున్న శంకుస్థాపనలన్నీ కూడా శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన పనుల పురోగతికి సంబంధించి వివరాలు..
– 500 కోట్ల రూపాయలతో వైయస్‌ఆర్‌ మెడికల్‌ కాలేజీ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. మెడికల్‌ కాలేజీలో టీచింగ్‌ హాస్పిటల్‌ మరో ఆరు నెలలు జూలై–2023 నాటికి ఆ హాస్పిటల్‌ను ప్రారంభిస్తాం. అదే విధంగా డిసెంబర్‌ – 2023 నాటికి మెడికల్‌ కాలేజీని కూడా ప్రారంభించడం జరుగుతుంది. 
– అదే విధంగా జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కాల్వ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వకు నీటి ఎత్తిపోతల పథకం డిసెంబర్‌ –2023 నాటికి కాలేటి వాగు రిజర్వాయర్‌లో నీటిని నింపి చక్రాయపేట మండలంలోని 43 చెరువులకు నీటిని ఇవ్వడం జరుగుతుంది. 
– ఆ తరువాత రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు నియోజకవర్గాల్లో తాగునీరుకు, ఆయకట్టుకు నీరు అందించే కార్యక్రమానికి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 
– చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నుంచి ఎ్రరబల్లి చెరువుకు, అక్కడి నుంచి యూసీఐఎల్‌ పరిధిలోని గ్రామాలకు నీటి ఎత్తిపోతల పథకం, దీనికి సంబంధించి జూన్‌–2023 నాటికి ఎ్రరబల్లి చెరువుకు, మార్చి 2024 నాటికి గిడ్డంగివారి పల్లె ట్యాంక్‌కు, యూసీఐఎల్‌ పరిధిలోని గ్రామాలకు నీటి సరఫరా చేసే కార్యక్రమం కచ్చితంగా జరుగుతుంది. 
– అల్వల్‌పాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి నవంబర్‌ –2023 నాటికి పనులు పూర్తిచేసి వేముల, వేంపల్లె మండలాల్లోని పీబీసీ కెనాల్‌ టేలెండ్‌కు సంబంధించిన గ్రామాలకు పూర్తిగా ఆయకట్టు మొత్తం స్థిరీకరించడం జరుగుతుంది. 
– పులివెందుల నియోజకవర్గంలో సమగ్ర నీటి సరఫరా కోసం వాటర్‌ గ్రిడ్‌. దాదాపు రూ.480 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. అక్టోబర్‌ 2023 నాటికి నియోజకవర్గ ప్రజలకు పూర్తిగా వాటర్‌ గ్రిడ్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. 
– పులివెందుల – వేంపల్లె అండర్‌ గ్రౌండ్‌ యూజీడీ నిర్మాణాలు కూడా రూ.192 కోట్లతో పరుగెడుతున్నాయి. పులివెందుల యూజీడీ పనులు మార్చి –2023 నాటికి, వేంపల్లె యూజీడీ పనులు అక్టోబర్‌ –2023 నాటికి పూర్తవుతాయి. 
– పులివెందుల టౌన్‌లో సమగ్ర నీటి సరఫరా పథకం, దీనికి సంబంధించి జూన్‌–2023 నాటికి ప్రజలందరికీ పథకం పూర్తిగా అందుబాటులోకి వస్తుంది. ప్రతి ఇంటికి కుళాయి నీరు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. 
– వేంపల్లెలో ప్రధాన రహదారుల విస్తరణకు సంబంధించి భూసేకరణ ఇప్పటికే పూర్తయింది. రోడ్ల విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రారంభించి డిసెంబర్‌ –2023 నాటికి ఇది కూడా ప్రారంభం అవుతుంది. 
– పులివెందులలో క్రీడా సముదాయాలకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్, ఇది మార్చి –2023 నాటికి అందుబాటులోకి వస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. 
– పులివెందులలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వేంపల్లెలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల. వీటిలో ఈ విద్యా సంవత్సరం నుంచే పులివెందుల మహిళా డిగ్రీ కళాశాల ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. రూ.20 కోట్లతో వేంపల్లె డిగ్రీ కళాశాల పనులు కూడా డిసెంబర్‌ –2023 నాటికి పూర్తవుతాయి. 
– నైపుణ్య అభివృద్ధి కేంద్రం.. పనులు శరవేంగంగా జరుగుతున్నాయి. మార్చి –2023 నాటికి పూర్తవుతుంది. 
– పులివెందులలో ఒక మాల్‌ కట్టే కార్యక్రమం రూ.87 కోట్లతో జరుగుతుంది. డిసెంబర్‌ –2023 నాటికి అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. 
– రాణితోపు సంబంధించి నగరవనం అభివృద్ధి కార్యక్రమం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మార్చి –2023 నాటికి అవి కూడా అందుబాటులోకి వస్తాయి. 
– ఇడుపులపాయలో వైయస్‌ఆర్‌ మెమోరియల్‌ గార్డెన్‌ అభివృద్ధి పనులు.. జూన్‌ –2023 నాటికి పూర్తవుతాయి. 
– పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు ఉరిమెల్ల సరస్సు అభివృద్ధి జూన్‌–2023 నాటికి పూర్తవుతుంది. 
– గండి ఆంజనేయస్వామి దేవస్థానం పునర్‌ నిర్మాణం జూన్‌ –2023 నాటికి పూర్తవుతుంది. 
– ఇక నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి శంకుస్థాపనలు కాదు.. ప్రారంభోత్సవాలు జరుగుతాయి. 
– కేంద్రాన్ని కూడా ఒప్పించి మంచిరోడ్లను తీసుకొచ్చే కార్యక్రమం వేగంగా జరుగుతుంది. పులివెందుల నుంచి బెంగళూరుకు ప్రయాణం సులభతరం చేసేందుకు ఏకంగా రూ.1080 కోట్లతో ముద్దనూరు నుంచి బీ కొత్తపల్లి వరకు, రూ.840 కోట్లతో బీ కొత్తపల్లి నుంచి గోరంట్ల వరకు నాలుగు లైన్ల రహదారుల పనులకు సంబంధించి భూసేకరణ చివరి దశకు వచ్చింది. టెండర్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. 
– ఆరు లైన్‌ల ఎక్స్‌ప్రెస్‌ హైవే.. బెంగళూరు నుంచి విజయవాడ వయా పులివెందుల.. ఈ పనులు రూ.13 వేల కోట్లతో ఎక్స్‌ప్రెస్‌ పనులకు సంబంధించి భూసేకరణ చివరి దశకు వచ్చింది. 14 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు పిలిచే కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 10 ప్యాకేజీల టెండర్లు పిలవడం అయిపోయింది. 

రాబోయే రోజుల్లో విపరీతంగా తేడాలు కనిపించేలా ఉంటాయి. పులివెందులను మంచి సిటీ మాదిరిగా తీర్చిదిద్దుతాం. మంచి ఆదర్శ నియోజకవర్గంగా పులివెందుల అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మీ బిడ్డకు ఇదే మాదిరిగా ఉండాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. 

Back to Top