ప్రజా వినతుల పరిష్కారమే ‘జగనన్నకు చెబుదాం’ లక్ష్యం

కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌

వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ‘జగనన్నకు చెబుదాం’ మంచి వేదిక 

సమస్య చెప్పిన వెంటనే యువర్‌ సర్వీస్‌ రిఫరెన్స్‌ (వైయస్‌ఆర్‌) ఐడీ నంబర్‌ ఇస్తాం

నంబర్‌కు కూడా అంత గౌరవం ఇస్తూ నాన్న పేరు పెట్టాను

న్యాయం మీవైపు ఉండి సమస్య పరిష్కారం కాకపోతే 1902కు ఫోన్‌ కొట్టండి

అర్హ‌త ఉండి సంక్షేమ సాయం అంద‌క‌పోయినా మీ జ‌గ‌న‌న్న‌కే ఫోన్ కొట్టండి

నేరుగా మీ జగనన్న కార్యాలయమే మీ సమస్యను వింటుంది

పరిష్కారం ఏ దశలో ఉందో ఐవీఆర్‌ఎస్, ఎస్‌ఎంఎస్‌ ద్వారా స‌మాచారం.. లేదా ట్రాక్‌ చేసి చూడొచ్చు

మండల స్థాయి నుంచి సీఎంవో వరకు మానిటరింగ్‌ యూనిట్ల‌ను ఏర్పాటు చేశాం

గవర్నెన్స్‌లో ఎప్పుడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం

ప్రజలకు సేవ అందించేందుకే నేను ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా..

ప్రతి అధికారి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామి కావాలి.. చిత్తశుద్ధితో పనిచేయాలి

తాడేపల్లి: ‘‘ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కోసం  ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం అయినా, అది ఏ ప్లాట్‌ఫాం అయినా సరే ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. అయినా మనవైపున న్యాయం ఉండి.. మనకు న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా.. అప్పుడు 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు డయల్‌ చేసి నేరుగా జగనన్నకే ఫోన్‌ కొట్టండి’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా వినతుల పరిష్కారమే జగనన్నకు చెబుదాం కార్యక్రమ లక్ష్యమన్నారు. సమస్యల పరిష్కారం చూపుతూ ఎప్పటికప్పుడు అర్జీదారులకు సమాచారం అందిస్తామన్నారు. స్పందన కార్యక్రమం వల్ల ఇటువంటి సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపించాం. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ ఈరోజు జగనన్నకు చెబుదాం అని ముఖ్యమంత్రి పేరు కూడా జత చేస్తూ ఈ కార్యక్రమం మెరుగ్గా చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేశామని సీఎం వైయస్‌ జగన్‌ అన్నారు. 

సంతృప్తస్థాయిలో వినతుల పరిష్కారమే లక్ష్యంగా, ప్రజలకు నిర్ణిత గడువులోగా నాణ్యమైన ప్రభుత్వ సేవలందించే ఉద్దేశంతో రూపొందించిన ‘‘జగనన్నకు చెబుదాం’’ కార్యక్రమాన్ని తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. 

అంతకుముందు సీఎం ఏం మాట్లాడారంటే..
‘ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి అధికార కేంద్రం నుంచి వీక్షిస్తున్నారు. కలెక్టర్‌ కార్యాలయాల దగ్గర నుంచి గ్రామాల్లోంచి వీక్షిస్తున్న సర్పంచ్‌లు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సచివాలయ వ్యవస్థ, వలంటీర్లు. అందరూ ఈ రోజు జరుగుతున్న కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. 

ప్రతి సమస్యకు పరిష్కారం చూపాలని నాలుగు సంవత్సరాల మన పరిపాలన సాగిన తీరును చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. ఇవన్నీ 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో ప్రతి జిల్లా, ప్రతి గ్రామంలో, నడిచిన ప్రతి బాటలో నాకు కనిపించిన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ మన పరిపాలన అంతా సాగింది. నా పాదయాత్ర సమయంలో అనుకునేవాడిని.. దాదాపు 95 శాతం సమస్యలు అన్నీ మ్యాన్‌మేడ్‌ సమస్యలు. ప్రభుత్వం ఆదుకోవాల్సిన సమయంలో ఆదుకుంటే, ప్రభుత్వం న్యాయంగా, ధర్మంగా ఉంటే ఇటువంటి సమస్యలకు పరిష్కారం ఉంటుంది.. 95 శాతం సమస్యలు ఈ మాదిరిగా ప్రభుత్వం లేకపోవడం వల్లే వచ్చాయని ప్రస్పుటంగా కనిపించాయి. గ్రామాల్లోకి వెళ్లినప్పుడు వృద్ధులు కనిపించి పెన్షన్లు రాలేదు నాయనా అని చెప్పేవారు. బాధ, ఆశ్చర్యం అనిపించేది. చూస్తే అన్నీ అర్హతలు ఉండి, వృద్ధాప్యంలో తినడానికి ఇబ్బందులు పడే పరిస్థితులు. కానీ పెన్షన్‌ రావడం లేదు. 

కారణం జన్మభూమి కమిటీలు, వారుచెబితేగానీ పెన్షన్‌ ఇవ్వరట. వారు అడిగే మొట్టమొదటి ప్రశ్న.. మీరు ఏ పార్టీకి సంబంధించిన వారు అని. ఈ వ్యవస్థతో ప్రతి మంచిపనికి కూడా నాకు ఎంత అని అడిగే గుణం. పెన్షన్‌ దగ్గర నుంచి మొదలుపెడితే ఇళ్ల కేటాయింపుల వరకు.. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. ప్రతి అడుగులోనూ వివక్ష కనిపించేది, లంచాలు కనిపించేవి. ఏ ప్రభుత్వ పథకం తీసుకున్నా.. గ్రామంలో కొంతమందికే ఇస్తాం.. మిగిలినవారికి ఇచ్చే పరిస్థితి లేదు.. వీరిలో ఎవరైనా చనిపోతే మిగిలినవారికి వచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. నా పాదయాత్రలో ఇవన్నీ చూశాను. 

ఏదైనా ఒక వ్యవస్థలోకి అర్హత ఎంతమందికి ఉంటే అంతమందికి ఇచ్చే పరిస్థితి రావాలి. మన, తన పార్టీ అని తేడా లేకుండా చూడటం, లంచాలు, వివక్ష లేకుండా ఇవ్వగలగడం, ఇవన్నీ వ్యవస్థలోకి మార్పులు తీసుకువచ్చే పరిస్థితులకు దోహదపడతాయి. దాదాపు 90 నుంచి 95 శాతం సమస్యలు ఏ రకమైన వివక్ష, లంచాలు లేకుండా సంతృప్తస్థాయిలో ఇవ్వగలిగితే గ్రామస్థాయిలో ఇవ్వాలనే తపన, తాపత్రయం చూపించగలిగితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, గవర్నెన్స్‌లో ఎప్పుడూ జరగని విధంగా మార్పులు తీసుకువచ్చాం. 

ఈ 4 సంవత్సరాల మన పరిపాలనలో ఆ రకమైన అడుగులే కనిపిస్తాయి. గ్రామ, వార్డు సచివాలయం. ప్రతి 2000 జనాభాకు ఒక సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ వ్యవస్థ, ఎవరికీ ఏ సమస్య వచ్చినా చెయ్యి పట్టుకొని నడిపించే పరిస్థితి. ఏకంగా లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం సచివాలయాల్లో ప్రదర్శించడం, లంచాలకు లేకుండా, వివక్షకు తావులేకుండా ఇవ్వగలిగే గొప్ప వ్యవస్థను గ్రామస్థాయికి తీసుకువచ్చాం. 

ఇవే కాకుండా రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్టు, ఆస్పత్రుల్లో వైద్య సేవలు, పిల్లలు చదువుతున్న బడులు, రెవెన్యూ డివిజన్లలో రోజూ కనిపించే సమస్యలు, రాజధానుల వరకు ఇలా ఏది తీసుకున్నా.. పరిపాలనలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ.. ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా గొప్ప అడుగులు నాలుగు సంవత్సరాల మన పరిపాలనలో ప్రతి ఒక్కరికీ కనిపించేలా పడ్డాయి. ఈ మాదిరిగా వ్యవస్థలకు మార్పు తీసుకురావాలని దేశంలో ఎక్కడా జరగని విధంగా, మన రాష్ట్రంలో ఎప్పుడూ చూడని విధంగా విప్లవాత్మక అడుగులు వేస్తూ వచ్చాం. 

అందులో భాగంగానే స్పందన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. స్పందన ద్వారా గ్రామ సచివాలయం నుంచి కలెక్టర్‌ వరకు ఏ ఒక్కరికీ ఏ సమస్య ఉన్న వినతి తీసుకొని ఆ సమస్యను పరిష్కరించే ఒక మెకానిజంను కూడా అందుబాటులోకి తెచ్చాం. ప్రజలకు ప్రభుత్వం నుంచి హక్కుగా అందాల్సిన ఏ సేవ అయినా కూడా, ఎక్కడైనా, ఎవరికైనా అందకపోతే వారు ఎలాంటి బాధ అనుభవిస్తారో తెలిసిన ప్రభుత్వంగా ఆ సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నాం. 

స్పందన కార్యక్రమం వల్ల ఇటువంటి సమస్యలకు మెరుగైన పరిష్కారం చూపించాం. దానికి ఇంకా మెరుగులు దిద్దుతూ ఈరోజు ‘‘జగనన్నకు చెబుదాం’’ అని ముఖ్యమంత్రి పేరు కూడా జత చేస్తూ ఈ కార్యక్రమం మెరుగ్గా చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు ముందుకువేశాం. 

అర్హత ఉన్నా కూడా ఎక్కడైనా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందకపోతే, న్యాయం మీ వైపున ఉన్నా కూడా ఆ న్యాయం మీకు జరగని పరిస్థితులు కనిపించినా, ఇంతకుముందు మీరు ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సత్ఫలితం ఇవ్వని పరిస్థితులు ఉన్నా కూడా ఇలాంటి వ్యక్తిగత సమస్యలకు మరింత మెరుగైన పరిష్కారం చూపాలనే తపన, తాపత్రయంతో పుట్టుకొచ్చిన మరో మంచి ఆలోచన నేరుగా జగనన్నకే చెబుదాం. నేరుగా మీ ముఖ్యమంత్రికే చెబుదాం. అనే గొప్ప ఆలోచన, గొప్ప కార్యక్రమం తీసుకువస్తున్నాం. 

మారుమూల గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అంతటా కూడా కలెక్టర్ల నుంచి మున్సిపల్‌ కమిషనర్లు, మున్సిపల్‌ కమిషనర్ల నుంచి గ్రామ సచివాలయాల వరకు అన్ని స్థాయిల్లో అందరినీ భాగస్వామ్యులను చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. జగనన్నకు చెబుదాం అనే ఈ కార్యక్రమంలో మనం తీసుకువచ్చిన మెరుగులు ఏంటంటే.. 

ఎక్కడైనా, ఏ సమస్య అయినా, ప్రయత్నం చేసినా పని జరగని పరిస్థితులకు ప్రభుత్వం చూపించిన పరిష్కారం ద్వారా ఆ మనిషికి సంతోషాన్ని కలిగించి, ముఖంలో చిరునవ్వు చూడాలనే తపన, తాపత్రయంతో ఈ కార్యక్రమానికి మెరుగులు దిద్దాం. క్వాలిటీ ఆఫ్‌ రిడ్రసెల్‌.. ఇంకా మెరుగుపరిచాం. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి ఒక మంచి వేదిక ఇది అవుతుంది. మౌలిక వసతులు, కమ్యూనిటీ సమస్యలు ఎన్‌ఆర్‌ఐజీఎస్, జీజీఎంపీ, వివిధ డిపార్టుమెంట్లకు సంబంధించి రకరకాల వేదికలు అందుబాటులో ఉన్నాయి. కానీ, వ్యక్తిగత సమస్యలకు సంబంధించి ఇంకా మెరుగైన ప్లాట్‌ఫాం తీసుకురావాలనే తపనతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చాం. 

ఎక్కడైనా మనకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం అవుతుందేమోనని ఒక్కసారి గట్టిగా ప్రయత్నం చేయండి. సచివాలయాల్లో దరఖాస్తు చేయడం మొదలుపెడితే.. అది ఏ ప్లాట్‌ఫాం అయినా సరే ఒకసారి గట్టిగా ప్రయత్నం చేద్దాం. చేసిన తరువాత కూడా మనవైపున న్యాయం ఉండి.. మనకు న్యాయం జరగని పరిస్థితులు కనిపించినా, అర్హత ఉండి కూడా సంక్షేమ పథకాలు అందని పరిస్థితులు కనిపించినా, ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితులు కనిపించినా.. అప్పుడు జగనన్నకు చెబుదాం ఈ కార్యక్రమం ఉపయోగపడే విధంగా నేరుగా జగనన్నకే ఫోన్‌ కొట్టండి. 

ఎటువంటి సమస్యలైనా కానివ్వండి.. అర్హత ఉన్నా కూడా సంక్షేమ పథకాలు రాని పరిస్థితి ఉన్నా.. వైయస్‌ఆర్‌ పెన్షన్‌కానుక, రేషన్‌ కార్డు, రైతులు, అక్కచెల్లెమ్మలు లేదా సామాజిక వర్గాలకు అందాల్సిన పథకాలు, ఆరోగ్యశ్రీ వంటి సేవలు, భూముల రికార్డులకు సంబంధించిన సమస్యలు, ఇతరత్రా ప్రభుత్వం నుంచి అందాల్సిన సేవల్లో ప్రయత్నం చేసినా సత్ఫలితాలు రాని పరిస్థితి ఉంటే నేరుగా మీ జగన్‌కే, మీ అన్నకే, మీ తమ్ముడికే, మీ ఇంట్లో మీ బిడ్డకే, నేరుగా మీ జగన్‌కే 1902కు ఫోన్‌ కొడితే సీఎంవోకే డైరెక్ట్‌గా ఫోన్‌ ల్యాండ్‌ అవుతుంది. పరిష్కారం ఈ స్థాయిలో చూపించే ఆలోచనలతో అడుగులు వేస్తున్నాం. 

1902 నంబర్‌కు ఫోన్‌ కొడితే ప్రయత్నం చేసినా పరిష్కారం కాని సమస్యలు నేరుగా నా దృష్టికే వస్తాయి. ఫోన్‌ చేసిన తరువాత సమస్య చెప్పండి. సమస్య చెప్పిన తరువాత మీ అందరికీ ఒక యూనిక్‌ ఐడీ నంబర్‌ (యువర్‌ సర్వీస్‌ రిఫరెన్స్‌ ఐడీ నంబర్‌) ఇవ్వడం జరుగుతుంది. నంబర్‌కు కూడా అంత గౌరవం ఇస్తూ వైయస్‌ఆర్‌ పేరు పెట్టాను. ఆ నంబర్‌ మీకు ఇచ్చిన తరువాత మీ సమస్యను నా సమస్యగా భావించి దాన్ని ట్రాక్‌ చేసే కార్యక్రమం చేస్తాం. ఆ సమస్య ఎక్కడుంది.. ఎవరి దగ్గర ఆఫైల్‌ ఆగి ఉంది.. అక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలనే దగ్గర నుంచి అన్నీ కూడా నేరుగా సీఎంవో ట్రాక్‌ చేస్తుంది. ప్రతి అడుగులోనూ మీకు కూడా ఎస్‌ఎంఎస్‌ ద్వారా, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా సమస్య ట్రాక్‌ చేస్తూ ఇన్ఫర్మేషన్‌ ఇవ్వడం జరుగుతుంది. మీరైనా సమస్యను ట్రాక్‌ చేసి చూడొచ్చు. 

మండల కేంద్రంలో ఒక ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ అని, జిల్లా కేంద్రంలో ఒక ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ను పెట్టాం. సచివాలయాల్లో హెచ్‌ఓడీల వద్ద ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ను పెట్టాం. సీఎంవోలో ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌ను పెట్టాం. సీఎంవో, చీఫ్‌ సెక్రటరీ, డీజీపీ.. ముగ్గురూ కూడా కేంద్రీకృతమై వీటి మీద రివ్యూలు తీసుకుంటూ డ్రైవ్‌ చేసే బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్లు ఎక్కడైతే ఉన్నాయో.. అన్నీ కూడా ప్రతి చోటా మీ సమస్యను మానిటర్‌ చేస్తూ మీకు మెరుగైన సొల్యూషన్‌ ఇచ్చేందుకు, మీ ముఖంలో చిరునవ్వు చూసేందుకు, సమస్యకు మెరుగైన పరిష్కారం ఇచ్చేందుకు వీరంతా అడుగులు వేస్తారు. మీ సమస్య ఏ దశలో ఉందో వివరిస్తూ సమస్య పరిష్కరించేలా దిశగా తీసుకెళ్తారు. మళ్లీ ఫోన్‌ చేసి మీ ఫీడ్‌ బ్యాక్‌ కూడా తీసుకుంటారు. ఇవన్నీ జగనన్నకు చెబుదాం అనే కార్యక్రమంలో భాగంగా జరుగుతూ వస్తాయి.

ప్రజలకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ.. ప్రజలకు మంచి చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం. అందులో భాగంగా ఈ కార్యక్రమం ద్వారా ఇంకో మెరుగైన అడుగు పడుతుంది. దీని ద్వారా అందరికీ మంచి చేయాలని మనసారా కోరుకుంటూ, మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. 

ఈ కార్యక్రమంలో నేను ఒక్కడితే కాదు, ప్రభుత్వంలో ఉన్న ప్రతి అధికారి కూడా ప్రజలకు దగ్గరవుతూ చేస్తున్న కార్యక్రమం. ముఖ్యమంత్రిగా అధికారం చెలాయించడం కోసం కాదు నేను ఉన్నది.. ముఖ్యమంత్రిగా ప్రజలకు సేవచేయడానికి ఉన్నానని నా దగ్గర నుంచి మొదలవుతే.. ఐఏఎస్‌ల దగ్గర నుంచి మొదలుపెడితే సచివాలయంలోని చిన్న అధికారి నుంచి వాలంటీర్‌ వరకు మేమంతా ప్రజలకు సేవకులం.. మీకు మంచి చేయడం కోసం, మీ ముఖంలో చిరునవ్వు చూడటం కోసం, మీకు ఇంకా మంచి చేయాలనే తపన, తాపత్రయంతో అడుగులు వేస్తుంది మీ ప్రభుత్వం అని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కలిసికట్టుగా చేస్తున్న కార్యక్రమం అని అధికారులు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వుతో చేస్తున్నామని ప్రతి అధికారి గుర్తుపెట్టాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 
 

Back to Top