టీడీపీ గోబెల్స్‌ ప్రచారాన్ని నమ్ముకుంది

బాబు, ఎల్లోమీడియా విషప్రచారానికి జంగారెడ్డిగూడెం ఘటన నిదర్శనం

కనీస కామన్‌సెన్స్‌ లేకుండా చంద్రబాబు స్టేట్‌మెంట్లు

డెత్‌ రేట్‌పై నా మాటలను ఈనాడు వక్రీకరించి రాసింది

55వేల జనాభా ఉన్న చోట సారా కాచడం సాధ్యమా..?

సారా కాచేవారికి తోడుగా ఉండాల్సిన అవసరం మాకేంటీ..?

అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘ఎస్‌ఈబీ’ ప్రత్యేక వ్యవస్థ తీసుకొచ్చాం

సారా తయారు చేసేవారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సంసిద్ధం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

అసెంబ్లీ: ‘‘ఒక అబద్ధాన్ని నిజం చేయాలని.. జరగని ఘటనను జరిగినట్టుగా చూపించే విషప్రచారం రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది మీడియా ఛానళ్లు, వాటి యజమానులు, చంద్రబాబు కలిసి ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేసుకున్నారనేదానికి జంగారెడ్డిగూడెం ఘటన నిదర్శనం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులు సభా సంప్రదాయాలను గౌరవించాలని, బడ్జెట్‌పై చర్చకు సహకరించాలని, గందరగోళం సృష్టించి సభా సమయాన్ని వృథా చేయొద్దని సీఎం వైయస్‌ జగన్‌ కోరారు. సభ సజావుగా జరగకూడదు.. జరిపించకూడదనే ఆలోచనను టీడీపీ సభ్యులు పక్కనబెట్టాలని, తాను చెప్పే రెండు, మూడు విషయాలను కాస్త బుర్ర‌పెట్టి ఆలోచన చేయాలన్నారు. 

అసెంబ్లీలో సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..
55 వేల మంది ప్రజలు నివాసం ఉంటున్న మున్సిపాలిటీలో ఎవరైనా సారా కాస్తారా..? 2011 జనాభా లెక్కల ప్రకారం జంగారెడ్డిగూడెంలో 44 వేల జనాభా ఉంటే.. 10 సంవత్సరాల్లో 12 శాతం జనాభా పెరుగుదల తీసుకున్నా.. 55 వేల జనాభా ఉంటుంది. అలాంటి మున్సిపాలిటీలో పోలీస్‌ స్టేషన్, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసు, కార్పొరేటర్లు అందరూ ఉంటారు. అటువంటి మున్సిపాలిటీలో సారా తయారు చేయడం సాధ్యమేనా..? మారుమూల గ్రామాల్లో సారా కాస్తున్నారంటే కాస్త ఆలోచించొచ్చు. 

సారా తయారు చేయాల్సిన వారికి తోడుగా ఉండాల్సిన అవసరం మాకేంటీ..? సారా తయారు చేసేవారిపై ఉక్కుపాదం మోపడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాతే స్పెషల్‌ ఎన్‌ఫోర్సుమెంట్‌ బ్యూరో అనే వ్యవస్థను క్రియేట్‌ చేశాం. ఇప్పటికే 13 వేల కేసులను నమోదు చేశాం.  

ఒక పక్క ఏపీ లిక్కర్‌ కార్పొరేషన్‌ రూ.25 వేల కోట్లు అప్పు తీసుకువచ్చాం. మరో 25 వేల కోట్ల అప్పుకు సర్వం సన్నద్ధం చేశామని, ప్రజలకు విపరీతంగా తాగించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తుందని చంద్రబాబే తన స్టేట్‌మెంట్‌లో చెప్పాడు. అలాంటి వ్యక్తి ఆ మాట అంటూనే సారా తాగి మనుషులు చనిపోయారంటున్నారు. ఒకవైపు సారా తాగిస్తే.. గవర్నమెంట్‌కు లిక్కర్‌ ఆదాయం తగ్గుతుంది కదా.. చంద్రబాబు ఏం చెబుతున్నాడో ఆయనకే అర్థం కావడం లేదు. కనీస కామన్‌సెన్స్‌ లేకుండా మాట్లాడుతున్నాడు. 

ప్రతి గ్రామంలో సహజ మరణాలు 90 ఉండటం సహజమే అని ముఖ్యమంత్రి అన్నాడని వెటకారంగా ఈనాడులో రాశారు. 2011 జనాభా ప్రకారం 44 వేల జనాభా ఉన్న జంగారెడ్డిగూడెం.. పదేళ్ల తరువాత బర్త్‌ రేట్‌ 12 శాతం ప్రకారం 55 వేల జనాభా అని చెప్పాను. మరణాల రేటు దేశంలో సగటున 2 శాతం ఉంది. ఇది ఎవరో క్రియేట్‌ చేసింది కాదు. సహజంగా దేశంలో మరణాల రేటు 2 శాతం ఉంది. వృద్ధాప్య మరణం, సహజ మరణం, ఆరోగ్య పరంగా మరణించడం ఇలా రకరకాల కారణాల వల్ల 2 శాతం ఉంది. 

అటువంటిది 55 వేల జనాభా ఉన్న ప్రాంతంలో సహజంగా 2 శాతం వర్తింపజేస్తే సంవత్సరానికి 1000 అవుతుంది. నెలకు 90 అవుతుంది. ఏ చిన్నపిల్లాడిని అడిగినా ఈ లెక్కలు చెబుతారు. నా మాటలను వక్రీకరించి రాశారు. జంగారెడ్డిగూడెంలో  మరణాలన్నీ మున్సిపాలిటీలోని అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఒక రోజులో జరిగింది కాదు.. పది పదిహేను రోజుల్లో జరిగిన ఘటనలు. అక్కడ శవాలకు దహన సంస్కారాలు కూడా అయిపోయాయి. ఒక శవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసే కార్యక్రమానికి ప్రభుత్వం ఆదేశించింది. తప్పు ఏదైనా చేసి ఉంటే.. ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తాం. 

టీడీపీ మనస్తత్వం, ఆలోచన ఎలా ఉన్నాయంటే.. ఒక అబద్ధాన్ని తీసుకువచ్చి ఆ అబద్ధానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఢంకా బజాయించాలి.. ప్రభుత్వంపై విషప్రచారం చేయాలి. హిట్లర్‌ సమయంలో గోబెల్‌ అనే వ్యక్తి ఉండేవాడు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే చెబితే.. ప్రజలు నిజమని నమ్ముతారని ఆయన సిద్ధాంతం. దాన్ని గోబెల్స్‌ ప్రచారం అంటారు. గోబెల్స్‌ను అనుసరిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు ఒకే అబద్ధాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నిజంగా జరగని ఘటనను జరిగినట్టుగా చూపించే విషప్రచారం రాష్ట్రంలో జరుగుతుంది. కొంతమంది మీడియా చానళ్లు, యజమానులు, చంద్రబాబు కలిసి ప్రజలకు ఎలాంటి అబద్ధాలను ప్రచారం చేసుకున్నారనేదానికి నిదర్శం జంగారెడ్డిగూడెం ఘటన. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top