డోన్: నీటి విలువ, రాయలసీమ నీటి కష్టాలు తెలిసిన ప్రభుత్వం కాబట్టే అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీరు, తాగు నీరు అందించే చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలను పట్టించుకోలేదని గుర్తు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని మెట్ల ప్రాంతాలకు సాగు నీరు అందించేందుకు లక్కసాగరం పంప్‌హౌస్ ద్వారా 77 చెరువులకు నీరు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుంచి చెరవులకు నీటి కేటాయింపు జరుగుతుందని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఎన్నికలకు 4 నెలలకు ముందు జీవోలు, శంకుస్థాపనలు చేశారు. ప్రాజెక్ట్ కోసం భూమిని కూడా కొనుగోలు చేయలేదు. కేవలం టెంకాయలు కొట్టడానికి ఏదో నామ మాత్రంగా 8 ఎకరాలు కొనుగోలు చేశారని విమర్శించారు. డోన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. సీఎం వైయస్ జగన్ ఏమన్నారంటే.. ఈ రోజు మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య..ఒక వైపు పండుగ రోజు ..మరో వైపు మీ అందరి ప్రేమానురాగాల మధ్య మరో మంచి కార్యక్రమానికి ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతున్నాను. ప్రతి ఒక్కరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనందరి ప్రభుత్వం నీటి విలువ తెలిసిన ప్రభుత్వంగా, రాయలసీమ నీటికష్టాలు తెలిసిన మీ బిడ్డగా ఈ నాలుగేళ్ల పరిపాలనలో శాశ్వతమైన మార్పు తీసుకురావాలని మంచి ఉద్దేశంతో అడుగులు వేయడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు కర్నూలు, నంద్యాల జిల్లాలకు మంచి జరిగిస్తూ ఇక్కడి నుంచి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వ నుంచి మెట్టప్రాంతాలకు తాగునీరు, సాగునీరు అందించే కార్యక్రమం లక్కసాగరం వద్ద పంప్ హౌస్ ఏర్పాటు చేసి 77 చెరువులు నింపే కార్యక్రమం ఇది. రోజుకు 160 క్యూసెక్కుల చొప్పున 90 రోజుల్లో 1.4 టీఎంసీల నీరు నింపే కార్యక్రమం మొదలవుతుంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే..పక్కనే శ్రీశైలం ఉన్నా కూడా ఈ మెట్ట ప్రాంతాలకు పత్తికొండ, డోన్ నియోజకవర్గాలకు సాగునీరు అందని దుస్థితి. డోన్‌లో మరీ ఒక్క ఎకరా కూడా ఇరిగేషన్ లేని పరిస్థితి. గతంలో ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 2019 మార్చిలో ఎన్నికలు జరిగాయి. 2018 నవంబర్ ..అంటే ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు ఒక జీవో ఇచ్చి టెంకాయ కొట్టాడు. కనీసం భూ సేకరణ కూడా చేయలేదు. అటువంటి దారుణమైన మోసాల మధ్య మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఏర్పడింది. రాయలసీమ బిడ్డగా, నీటి విలువ తెలిసిన బిడ్డగా ఈ ప్రాంతానికి తోడుగా నిలబడేందుకు రూ.250 కోట్లు ఖర్చు చేసే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపాదికన చేపట్టాం. ఈ రోజు ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాజెక్టు అంకితం చేసే కార్యక్రమం ఈ నాలుగేళ్లలోనే వచ్చింది. 10,150 ఎకరాలకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించేందుకు రూ.253 కోట్ల తో పనులు పూర్తి చేశానని చెప్పడానికి సంతోషపడుతున్నాను. ఈ ప్రాజెక్టు వల్ల డోన్, పత్తికొండ నియోజకవర్గాలకు చాలా మంచి జరుగుతోంది. ఆలూరు, పాణ్యం నియోజకవర్గాలకు మంచి జరుగుతోంది. వెల్దుర్తి, కల్లూరు మండలాల్లో దాదాపుగా 22 చెరువులకు నీరు నింపేందుకు పైప్‌లైన్ పనులు పూర్తి అయ్యాయి. ట్రైల్ రన్ కొనసాగుతోంది. కృష్ణగిరి, తుగ్గలి, పత్తికొండ, దేవనకొండ మండలాలకు కూడా పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. ప్యాపిలీ బ్రాంచ్ కింద డోన్ మండలాల్లో 19 చెరువులకు పైప్‌లైన్ పనులు పూర్తి అయి అక్కడ కూడా ట్రైల్ రన్ జరుగుతోంది. జోన్నగిరి బ్రాంచ్ కింద డోన్, తుగ్గలి మండలాల్లో ఏడు చెరువులకు కనెక్టివిటి పూర్తి చేసి ట్రైల్ రన్ చేస్తున్నాం. డోన్ మండలంలో అదనంగా మరో 8 చెరువులకు నీరు ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చాం. కనెక్టివిటి చేస్తున్నారు. మొత్తంగా 77 చెరువులకు సంబం«ధించిన ఈ ప్రాజెక్టు పనులు రూ.250 కోట్లతో పూర్తి చేశాం. ఇదే కాకుండా గాజులదిన్నె ప్రాజెక్టు ఎమ్మిగనూరు నియోజకవర్గం గోనెగండ్ల మండలంలో ఉంది. దీని ద్వారా 23 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు లేవు. వర్షంపైనే ఆధారపడిన ప్రాజెక్టు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పత్తికొండ నియోజకవర్గంలోని 27 గ్రామాలకు, కృష్ణగిరి మండలంలోని 55 గ్రామాలకు, డోన్ మున్సిపాలిటీ, పత్తికొండ ప్రాంతాలకు తాగునీరు అందిస్తోంది. నీటి కొరత సమయంలో కర్నూలు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఉపయోగపడే గాజులదిన్నె ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.5 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు మన ప్రభుత్వం వచ్చాక పెంచింది. హంద్రీనీవా ప్రధాన కాల్వ నుంచి తూము నిర్మించి గ్రావిటీ ద్వారా ఈ ప్రాజెక్టుకు నీళ్లు కేటాయించే పనులు పూర్తి చేశాం. గత ప్రభుత్వాలకు ఈ ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచన చేయలేదు. చెరువులు నింపాలని ఆలోచన చేయలేదు. కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకు వస్తారు. టెంకాయలు గుర్తుకువస్తాయి. జీవోలు గుర్తుకు వస్తాయి. మీ బిడ్డ పాలనలో ఈ నాలుగేళ్లలో మీ కష్టాలు తీర్చే దిశగా అడుగులు వేస్తున్నాను. నా 3648 కిలోమీటర్ల పాదయాత్రలో మీ అందరి కష్టాలు చూశాను, మీ సమస్యలు విన్నాను. నేను విన్నాను..నేను చూశాను..మీకు నేనున్నానని ఈ ప్రాంతంలోనే చెప్పాను. నాలుగేళ్ల కాలంలోనే చెప్పిన మాటను పూర్తి చేసి మీ ముందు నిలబడ్డాను..మీ ఆశీస్సుల కోసం వచ్చాను. రాయలసీమ దుర్భిక్ష్యాన్ని చూస్తే బాధనిపిస్తుంది. గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. హంద్రీనీవా నుంచి తూము పెట్టి 77 చెరువులకు నీరు నింపుతున్నాం. చంద్రబాబు తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి హంద్రీనీవాకు ఖర్చు చేసింది కేవలం రూ.13 కోట్లు అయితే..మహానేత వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రూ.6 వేల కోట్లతో కాల్వను నిర్మించాడు. ఈ రోజు ఆ ప్రధాన కాల్వపై తుములు పెట్టి లిప్టుల ద్వారా నీరు చెరువులకు తీసుకువెళ్తున్నాం. దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులతో ఏర్పడిన మీ బిడ్డ ప్రభుత్వంలోనే నీరు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకునేందుకు అప్పట్లో పోతిరెడ్డిపాడు విస్తిర్ణ పనులు చేపట్టి 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. ఈ రోజు వాతావరణ మార్పులు ఎలా జరుగుతున్నాయో చూస్తున్నాం. పడితే ఒకేసారి కుంభవర్షం కురుస్తుంది. ఆ సమయంలో నీరు స్టోర్ చేసుకోలేకపోతే..వరదలు వచ్చే రోజులు కూడా తక్కువే. ఈ మార్పులను పరిగణలోకి తీసుకొని పోతిరెడ్డిపాడు హె డ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కుల నుంచి 80 వేల క్యూసెక్కులకు తీసుకెళ్తు అడుగులు పడుతున్నాయి. 800 అడుగుల్లోనే రాయలసీమ లిప్ట్ తీసుకువచ్చి పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకువస్తున్నాం. పోతిరెడ్డిపాడు నుంచి నీరు తీసుకోవాలంటే శ్రీశైలం ప్రాజెక్టులో 880 అడుగులు చేరాలి. నీరు రాని పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిలో శ్రీశైలం నిండేది ఎప్పుడు, ఆ నీరు ఎలా తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో ఎవరూ ఆలొచన చేయలేదు. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాయలసీమ లిప్ట్ గురించి ఆలోచన చేశాం. తెలంగాణ ప్రాజెక్టులన్నీ కూడా 800 అడుగుల లోపే ఉన్నాయి. తెలంగాణ రేపు పొద్దున పవర్ ఉత్పత్తి చేసుకుంటున్నారు. 790 అడుగుల్లోనే పవర్ ఉత్పత్తి చేసుకుంటున్నారు. మనకేమో 880 అడుగుల వరకు పెట్టారు. దాన్ని మారుస్తూ రాయలసీమకు తోడుగా ఉండేందుకు 800 అడుగుల్లోనే నీరు తీసుకునేందుకు రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పనులు ఈ రోజు వేగంగా చేపడుతున్నాం. కరువుతో ఉన్న ప్రకాశం జిల్లాను పట్టించుకునే నాథుడు లేడు. మన కళ్లెదుటే ఈ రోజు వెలుగొండ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయి. నాన్నగారి హయాంలో ఒక్కటో టన్నల్ 12 కిలోమీటర్లు పూర్తి అయ్యాయి. 2వ టన్నల్‌లో 8 కిలోమీటర్లు పూర్తి చేశారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదు. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక వేగంగా పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ నెలలో 1వ టన్నల్ పనులు పూర్తి చేసి ప్రారంభిస్తాను. జాతికి అంకితం చేస్తానని చెబుతున్నాను. మీ బిడ్డ అధికారంలోకి రాకముందు..చంద్రబాబు పాలనలో రాయలసీమ ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయండి, చిత్రావతి, పైడిపాలెం, బ్రహ్మంసాగర్, గండికోట ప్రాజెక్టులకు నీరు ఇవ్వలేని పరిస్థితి. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ప్రాజెక్టు కెపాసిటి పెంచాం, ఆర్ అండ్‌ఆర్ ప్యాకేజీ ఇచ్చి పూర్తి స్థాయిలో నీటిని నింపుతున్నాను. గతానికి ఇప్పటికి మధ్య ఉన్న తేడాను గమనించండి. ఇవన్నీ కూడా ఒకవైపు చెబుతూ..మరో వైపు రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ఆలోచన చేయండి. మనం ఎప్పుడైతే ఎన్నికలకు వెళ్తున్నామో మన మనసాక్షిని మనమే అడగాలి. ఈ ప్రభుత్వంలో మనకు మంచి జరిగిందా? లేదా అని ప్రశ్నించుకోవాలి. గతానికి ఇప్పటికి మధ్య తేడాను గమనించండి. గతంలో ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పటి కన్న అప్పుల గ్రోత్ రేట్ తక్కువే. మారిందల్లా కే వలం ముఖ్యమంత్రి మారాడు. ఈ రోజు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి మీ బిడ్డ వచ్చిన తరువాత రూ.2.30 లక్షల కోట్లు నేరుగా జమ చేశాం. ఇదే కార్యక్రమం చంద్రబాబు హయంలో ఎందుకు జరగలేదని ప్రశ్నించండి. మీ బిడ్డ ఎందుకు చేయగలుగుతున్నాడు. చంద్రబాబు ఎందుకు చేయలేదో అడగండి. ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలని చంద్రబాబుకు లేదు. చంద్రబాబు నమ్మకం ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిపై నమ్మకం పెట్టుకున్నాడు. ఆయన ఉద్దేశం రాష్ట్రాన్ని దోచుకోవడం, వీరికి పంచిపెట్టడం. ఎల్లోమీడియా ఆయన అవినీతిని రాయదు, చూపించదు, ప్రశ్నించేవారు ప్రశ్నించరు. అదంతా దుర్మార్గమైన పాలన, దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. ఇది గతంలో జరిగిన దుర్మార్గ పాలన. మీ బిడ్డ పాలనలో ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం వచ్చింది. ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వచ్చాడు. ఈ రోజు గ్రామంలో పరిపాలన మారింది. రాజకీయాలు చూడటం లేదు, పార్టీలు చూడటం లేదు. అర్హత ఉంటే చాలు మా పార్టీకి ఓటు వేశాడా? లేడా చూడటం లేదు. గ్రామంలో సోషల్ ఆడిట్ కోసం జాబితా పెడుతున్నాం. మీకు సంక్షేమ పథకాలు అందకపోతే అడగండి..మీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు వస్తాయి. ఈ రోజు ప్రభుత్వ స్కూళ్లన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు అయ్యాయి. ఐఎఫ్‌బీ ప్యానల్స్ వచ్చాయి. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నారు. నాడు–నేడుతో మార్పులు జరుగుతున్నాయి. గమనించండి. మనం ఎప్పుడు చూడని విధంగా విలేజ్ క్లినిక్స్‌లు, మారిపోయిన పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఆసుపత్రులు కనిపిస్తున్నాయి. 17 కొత్త మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి. 53 వేల మంది డాక్టర్లు, సిబ్బందిని నియమించాం. గతానికి, ఇప్పటికీ తేడా చూడండి. ఆరోగ్య సురక్ష పేరుతో ప్రతి ఇంటికి వస్తున్నారు. ఉచితంగా టెస్టులు చేయించి మందులు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో ఆర్‌బీకేలు మిమ్మల్ని చేయిపట్టుకుని నడిపిస్తున్నారు. ఈ–క్రాప్ నమోదు జరుగుతుంది. పంటల కొనుగోలు జరుగుతుంది. ప్రతి అడుగులోనూ కూడా చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాం. సామాజిక న్యాయంలో మన ప్రభుత్వానికి ఎవరు సాటిలేరు. అబద్ధాలు నమ్మకండి, మోసాలు, అబద్ధాలు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువవుతాయి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దత్తపుత్రుడులేడు. నేను నమ్ముకున్నది..మంచి చేయడం, ఆ మంచి మీ ఇంట్లో జరిగితే మీ బిడ్డకు తోడుగా నిలబడండి అని పిలుపునిస్తున్నాను. దేవుడి దయ వల్ల మీకు ఇంకా మంచి చేసే పరిస్థితులు రావాలని, దేవుడి ఆశీస్సులతో మీకు ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి సెలవు తీసుకున్నారు.