అన్నదాతలకు అండగా నిలిచిన ఏకైక ప్ర‌భుత్వం మ‌న‌ది

పంట నష్టపోయిన రైతన్నలకు అదే సీజన్‌లో పరిహారం అందిస్తున్నాం

2021 నవంబర్‌లో వర్షాలు, వరదలతో పంటనష్టపోయిన రైతులకు పరిహారం

5,97,311 మంది రైతుల ఖాతాల్లో ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.542 కోట్లు జమ

1,220 రైతు గ్రూపులకు యంత్రసేవ పథకం ద్వారా రూ.29.51 కోట్ల సబ్సిడీ విడుదల

ఖరీఫ్‌లో ఇన్సూరెన్స్‌ అందని రైతుల ఖాతాల్లోకి రూ.93 కోట్లు బదిలీ

రెండున్నరేళ్లలో పంటనష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు రూ.1,612 కోట్ల సాయం

గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వకుండా ఎగ్గొట్టింది

మనం అధికారంలోకి వచ్చాక రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లోనూ చెరువులు, రిజర్వాయర్లు నీటితో కళకళ

రైతులకు పగటిపూట నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు రూ.23 వేల కోట్లు ఖర్చుచేశాం

రైతు భరోసా సాయం కింద అక్షరాల రూ.19,126 కోట్లు ఇవ్వగలిగాం

రెండున్నరేళ్లలో వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా రూ.3,788 కోట్లు అందిచాం

వివక్ష, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఆర్బీకే స్థాయిలోనే రైతుకు తోడుగా నిలబడ్డాం

గత ప్రభుత్వ పాలనను, మనందరి ప్రభుత్వానికి తేడాను గమనించండి

రాష్ట్ర రైతాంగంతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టపోయిన రైతులకు ఆ సీజన్‌ ముగిసేలోగా పరిహారాన్ని అందిస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీని ఎప్పటికప్పుడు విడుదల చేస్తూ రైతు కుటుంబాలకు తోడుగా నిలబడుతున్న ఏకైక ప్రభుత్వం మనది’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతన్నలకు మూడు నెలల కూడా గడవకముందే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సహాయం అందివ్వడమే కాకుండా.. నేలకోత, ఇసుక మేటల కారణంగా మొత్తం అన్ని రకాలుగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు పరిహారం కింద రూ.542 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా అందిస్తున్నామన్నారు. అంతేకాకుండా 1,220 రైతు గ్రూపులకు యంత్రసేవ పథకం ద్వారా రూ.29.51 కోట్లు సబ్సిడీ కింద ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రెండింటినీ కలిపితే రూ.571 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడంతో పాటు ఖరీఫ్‌లో ఇన్సూరెన్స్‌ విడుదల చేసిన రూ.1,800 కోట్లలో వివిధ కారణాలు టెక్నికల్, వెరిఫికేషన్‌ వల్ల ఇవ్వలేకపోయిన రూ.93 కోట్లను లబ్ధిదారులకు అందిస్తున్నామన్నారు. 

నవంబర్‌లో అధిక వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని తాడేపల్లిలోని సీఎం క్యాంపు నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ విడుదల చేశారు. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అంతకు ముందు రైతన్నలను ఉద్దేశించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న మంచిని, వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు అందిస్తున్న తోడును వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో సైతం గ్రౌండ్‌ వాటర్‌ లెవల్‌ కూడా బాగా పెరిగిన సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా చెరువులు, రిజర్వాయర్లు పుష్కలంగా నీటితో కళకళలాడుతున్నాయి. 

రూ.62కోట్లు ఖర్చు చేసి రైతుకు తోడుగా..
వెలుగు కింద చీకటి ఉన్నట్టుగా జరిగిన మంచితో పాటు అధిక వర్షాల వల్ల కొద్ది మేరకు పంటనష్టం జరిగింది. ఆ రైతులకు కూడా అండగా నిలబడుతున్నాం. రైతన్న కోసం ఎన్నో చేస్తున్న ప్రభుత్వంగా.. ఆరోజు 3 నెలల కిందట అధిక వర్షాల, వరదల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆరోజే ఆదుకుంటూ 80 శాతం సబ్సిడీతో అక్షరాల 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, దాదాపు 1.43 లక్షల మంది రైతుల కోసం రూ.62కోట్లు ఖర్చు చేసి రైతుకు తోడుగా నిలబడ్డాం. పంటనష్టాన్ని ఇన్‌పుట్‌ సబ్సిడీ రూపేన రైతులకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనది అని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 

గతంలో ఎప్పుడూ జరగలేదు..
ఇలా ఏ రాష్ట్రంలో జరగలేదు. మన రాష్ట్రంలోనూ గతంలో ఎప్పుడూ జరగలేదు. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే అదే సీజన్‌ ముగియకమునుపే రైతన్నలకు తోడుగా నిలబడే పరిస్థితి ఎప్పుడూ కూడా జరగని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో కొన్ని సార్లు పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు, మరికొన్ని సార్లు అరకొరగా, ఆలస్యంగా, అది కూడా కొందరికి మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద సాయం అందించిన పరిస్థితులు చూశాం. 

ఒకసారి గత ప్రభుత్వం ఏ రకంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చిందని ఒకసారి గతాన్ని గుర్తుచేసుకుంటే.. 

 • 2014 ఖరీఫ్‌లో సంబవించిన కరువుకు 2015 నవంబర్‌లో కూడా ఇవ్వలేదు.
 • 2015 కరువుకు 2016 నవంబర్‌ కూడా ఇచ్చిన పరిస్థితులు చూడలేదు.
 • 2015 నవంబర్‌–డిసెంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు జరిగిన రూ.263 కోట్ల పంటనష్టానికి గత ప్రభుత్వంలో పూర్తిగా ఎగ్గొట్టేశారు. 
 • 2016లో కరువుకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ 2017 జూన్‌లో ఇచ్చారు.
 • 2017 కరువుకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీ 2018 ఆగస్టులో ఇచ్చారు.
 • అదేరకంగా 2018లో కరువు వల్ల ఖరీఫ్‌లో జరిగిన రూ.1,832 కోట్ల పంట నష్టానికి, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టానికి పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్థితులు గత ప్రభుత్వంలో మనందరం చూశామని గుర్తుచేసుకోండి. 

 తేడాను గమనించండి..
అప్పటి పరిపాలనకు, ఇప్పటి పరిపాలనకు తేడా కూడా గమనించండి. అప్పట్లో కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి ఉండేది కాదు. ఏ నష్టం జరిగినా కౌలు రైతులు ఉన్నారని గత ప్రభుత్వం ఏ రోజూ గుర్తుపెట్టుకోలేదు. అదే ఈరోజు తేడా గమనించండి. మన ప్రభుత్వంలో శాస్తీ్రయంగా అర్హులు ఎవరూ మిగిలిపోకుండా ఈ–క్రాప్‌ డేటాను ఆర్బీకేస్థాయిలోనే అమలు చేస్తూ.. పంట నష్టాలను ఈ–క్రాప్‌ డేటా ద్వారా అంచనా వేసే విధానాన్ని ఆర్బీకే స్థాయిలో ప్రవేశపెట్టడం జరిగింది. 

 • పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితాను కూడా ప్రదర్శించి ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోపు పరిహారాన్ని నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మనది. కౌలు రైతులు సైతం పంట వేసి ఈ–క్రాస్‌లో నమోదై ఉంటే వారికి కూడా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్న మన ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి తేడా గమనించండి. 
 • 2020 మార్చి వరకు కురిసిన భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన 1.56 లక్షల రైతు కుటుంబాలకు రూ.123 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 ఏప్రిల్‌లోనే అందించడం జరిగింది. 
 • 2020 ఏప్రిల్‌ నుంచి 2020 అక్టోబర్‌ వరకు కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 అక్టోబర్‌లోనే అందజేయడం జరిగింది. 
 • 2020 నవంబర్‌లో నివార్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతులకు రూ.646 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా 2020 డిసెంబర్‌లోనే అందించడం జరిగిందని మీ బిడ్డగా సగర్వంగా చెబుతున్నాను. 
 • 2021 సెప్టెంబర్‌లో గులాబ్‌ తుపాన్‌ వల్ల నష్టపోయిన 34,556 మంది రైతులకు రూ.22 కోట్లు 2021 నవంబర్‌లోనే అందించడం జరిగింది. ఇలా ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా గ్రామస్థాయిలోనే ఆర్బీకేల్లో జాబితాను మొత్తం ప్రదర్శించి ఏ ఒక్కరికీ మిస్‌ కాకుండా.. పొరపాటు అందకపోయి ఉంటే రీ అప్లికేషన్‌ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ.. మంచి జరిగే పరిస్థితిని క్రియేట్‌ చేస్తూ పంట నష్టానికి ఇన్‌పుట్‌ సబ్సిడీని కౌలు రైతులతో సహా మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. 

ఏ ఒక్కరూ కూడా మిస్‌ కాకూడదని..
లబ్ధిదారుల జాబితాను సోషల్‌ ఆడిట్‌ కోసం అదే గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శిస్తున్నందున గ్రామస్థాయిలో ఎవరైనా మిస్‌ అయ్యింటే.. వెంటనే నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నాం. ఏ ఒక్కరూ కూడా మిస్‌ కాకూడదని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను..
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన దాదాపు 19.93 లక్షల మంది రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ద్వారా అందించిన మొత్తం రూ.1,612 కోట్లు అని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

మనందరి ప్రభుత్వం రైతన్నలకు ఎన్ని విధాలుగా, ఎంత అండగా నిలిచిందో కొద్ది మాటల్లోనే వివరిస్తా.. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా..
వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ ద్వారా అరకోటి మంది రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తూ ఇప్పటి వరకు అక్షరాల రైతు భరోసా సాయం కింద మాత్రమే అక్షరాల రూ.19,126 కోట్లు ఇవ్వగలిగామని మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమిసాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులు.. అటవీ, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులందరికీ వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం రూ.13,500 చొప్పున అందిస్తున్న దేశంలోనే ఏకైక ప్రభుత్వం మనది. 

వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం..
రైతులకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తూ.. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి సమయానికి రైతన్నలు నగదు చెల్లిస్తే ఆ రైతులకు తోడుగా నిలబడుతూ వడ్డీ చెల్లిస్తున్నాం. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద 65.64 లక్షల మంది రైతులకు మనందరి ప్రభుత్వం రూ.1,218 కోట్ల వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. 

రైతులకు నాణ్యమైన విద్యుత్‌..
రాష్ట్రంలో 18.70 లక్షల మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ ఇచ్చేందుకు సంవత్సరానికి అక్షరాల రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఇప్పటి వరకు రూ.23 వేలు కోట్లు రైతన్నలకు ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఖర్చు చేశాం. నాణ్యమైన కరెంట్‌ పగటిపూట అందేలా చేయాలంటే ఫీడర్ల మార్పునకు రూ.1,700 కోట్లు ఖర్చు చేశాం. 

వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా..
రెండున్నరేళ్ల కాలంలో వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా ద్వారా 31.07 లక్షల మంది రైతన్నలకు రూ.3,788 కోట్లు అందించగలిగాం. ఖరీఫ్‌ నుంచి రూ.10 తీసుకోమని అధికారులకు చెప్పాం. దాని వల్ల రశీదు ఇస్తాం.. నా పంటకు ఇన్సూరెన్స్‌ ఉందనే భరోసా రైతుకు కూడా ఉంటుంది. 

ధాన్యం సేకరణకు రూ.16 వేల కోట్లు..
దాదాపుగా రూ.2 వేలకోట్లతో ప్రకృతి వైపరీత్యాల నిధిని క్రియేట్‌ చేశాం. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. ధాన్యం సేకరణ కోసం ఇప్పటి వరకు అక్షరాల రూ.39 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. గతంలో ధాన్యం సేకరణ అంటే సంవత్సరానికి రూ.7 నుంచి 8 వేల కోట్లు ఖర్చు చేసి సమయానికి డబ్బులు ఇవ్వని పరిస్థితి ఉంటే.. ఈరోజు అక్షరాల సంవత్సరానికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తున్నాను. 21 రోజుల్లోనే రైతులకు నగదు అందిస్తున్నాం. 

పత్తి, ఇతర పంటలకు..
ఇది కాకుండా పత్తిరైతులకు కొనుగోలు కోసం రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోలుకు మరో రూ.6,465 కోట్లు కూడా మార్కెట్‌ ఇంటర్వెన్షన్‌ ద్వారా వెచ్చించాం. 

గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బకాయిలు..
గత ప్రభుత్వం 2018లో ధాన్యం సేకరణ చేసి రూ.960 కోట్ల ఎగ్గొడితే.. ఆ బకాయిలను సైతం మన ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది. గతప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్‌ కోసం రూ.9 వేల కోట్లు కొనుగోలు చేసి బకాయిలుగా పెట్టి వెళ్తే.. ఆ బకాయిలను సైతం మన ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించిందని సగర్వంగా తెలియజేస్తున్నాను. రూ.384 కోట్ల విత్తన బకాయిలను గత ప్రభుత్వం పెట్టిపోతే.. అది కూడా మన ప్రభుత్వమే చెల్లించింది. 

ఆర్బీకేల్లోనే బ్యాకింగ్‌ సేవలు..
రైతులకు మరింత సులభంగా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు మాత్రమే కాకుండా బ్యాంకింగ్‌ సేవలను సులభతరంగా గ్రామస్థాయిలోకి తీసుకురావాలని 10,778 రైతు భరోసా కేంద్రాలను బ్యాంకింగ్‌ సేవలతో అనుసంధానం చేశాం. ఇప్పటికే 9,160 బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఆర్బీకేల్లో పెట్టడం జరిగింది. 

వైయస్‌ఆర్‌ యంత్ర సేవ..
వైయస్‌ఆర్‌ యంత్రసేవ పథకం కింద 1,720 రైతు గ్రూపులకు గతంలో రూ.25.55 కోట్ల సబ్సిడీని వారికి అందించాం. ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌ను తీసుకువచ్చి తద్వారా రైతులకు యంత్రసేవను సరసమైన ధరలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. యంత్ర సేవ కార్యక్రమం ద్వారా ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ గ్రామంలో వేస్తున్న పంటలు ఏవీ.. ఆ పంటలకు ఏరకమైన యంత్రాలు కావాలో తెలుసుకునేందుకు రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేశాం. ఆ రైతులకు సబ్సిడీ ఇచ్చి దాదాపు రూ.2,134 కోట్ల వ్యయంతో రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానంగా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అడుగులు వేగంగా పడుతున్నాయి.. వచ్చే సంవత్సరానికి అన్ని ఆర్బీకే పరిధుల్లో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. 

వ్యవసాయ సలహా మండళ్లు..
రైతు భరోసా కేంద్రాలు వన్‌స్టాప్‌ సెంటర్లు. విత్తనం నుంచి అమ్మకం వరకు అన్నింటిలో రైతులను చెయ్యి పట్టుకొని నడిపించే గొప్ప కార్యక్రమం ఆర్బీకేల ద్వారా జరుగుతుంది. ఆర్బీకే పరిధిలోనే వ్యవసాయ సలహామండళ్లు ఏర్పాటు చేశాం. ఆర్బీకే స్థాయిలో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇలా సలహా మండళ్లు ఏర్పాటు చేశాం. ప్రతి శుక్రవారం నాలుగు అంచల్లో మీటింగ్‌లు జరిగేట్టుగా కార్యక్రమాలు చేశాం. అక్కడి సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించే విధంగా జిల్లా, రాష్ట్ర స్థాయి యంత్రాంగాలకు ఆదేశాలివ్వడం జరిగింది. 

ఆర్బీకేల్లో ఈ–క్రాపింగ్‌..
ఈ–క్రాపింగ్‌లో పంట నమోదు చేసుకోవడం ద్వారా వివక్ష, లంచాలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా ఆర్బీకే స్థాయిలోనే ఈక్రాపింగ్, సోషల్‌ ఆడిట్‌ కోసం పేర్లను ప్రదర్శించడం, ఎవరైనా మిస్‌ అయిపోతే వెంటనే దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలించి జాబితాలో చేర్చడం, ఈ–క్రాపింగ్‌కు రశీదు ఇవ్వడం ఇవన్నీ చేస్తున్నాం. పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల కొనుగోలు, పంట రుణాలు, సున్నావడ్డీ అన్ని సదుపాయాలు పారదర్శకంగా ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి. 

సీఎం యాప్‌ ద్వారా..
ప్రాథమిక సహకార సంఘాల నుంచి ఆక్వాబ్‌ వరకు అన్నింటినీ పూర్తిగా ఆధునీకరిస్తున్నాం. వాటిలో కూడా కంప్యూటరీకరణ చేపట్టాం. సహకార వ్యవస్థలో హెచ్‌ఆర్‌ విధానం తీసుకువచ్చాం. అన్ని రకాలుగా సహకార రంగాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్బీకే స్థాయిలోనే పంటలు నష్టాల్లో ఉంటే కంటిన్యూయస్‌ మానిటరింగ్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రైస్‌ అండ్‌ ప్రొడ్యూస్‌ (సీఎం) యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చాం. కనీస గిట్టుబాటు రాని పరిస్థితి ఉంటే విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ వెంటనే ఆ రైతు సమస్యను సీఎం యాప్‌ ద్వారా సిగ్నల్‌ యాక్టివేట్‌ చేసిన వెంటనే మార్కెటింగ్‌ శాఖ, జాయింట్‌ కలెక్టర్‌ ఇద్దరూ కలిసి రైతుకు తోడుగా నిలబడి కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే గొప్ప వ్యవస్థను ఆర్బీకేస్థాయిలోకి తీసుకువచ్చాం. 

మీ బిడ్డగా..
ఇవేకాకుండా వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా అండగా నిలబడ్డాం. పాడి రైతులకు ఏపీ అమూల్‌ ద్వారా తోడుగా నిలబడ్డాం. ఇవన్నీ దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డ చేయగలుగుతున్నాడు. మీ చల్లని దీవెనలు ఎల్లకాలం ప్రభుత్వానికి ఇంకా మంచిచేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ శ్రీకారం చుడుతున్నాం. 
 

తాజా వీడియోలు

Back to Top