`శుభ‌కృత్‌`లో అన్నీ శుభాలే..

సీఎం క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా ఉగాది వేడుక‌లు

పంచాంగ శ్ర‌వ‌ణంలో పాల్గొన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు

ఆక‌ట్టుకున్న న‌వ‌ర‌త్నాల కూచిపూడి నృత్యాలు

వేద‌పండితులు, నృత్య క‌ళాకారుల‌ను స‌త్క‌రించిన సీఎం

తాడేపల్లి: శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుక‌ల‌ను ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఘ‌నంగా నిర్వ‌హించారు. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా చిన్నారులు, ప్రతీ ఒక్కరినీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆప్యాయంగా పలకరించారు. వినాయ‌కునికి ప్ర‌త్యేక పూజ‌లు చేసిన అనంత‌రం జ్యోతి ప్రజ్వలన చేసి ఉగాది వేడుక‌ల‌ను సీఎం ప్రారంభించారు. సీఎం దంప‌తులు పంచాంగాన్ని ఆవిష్క‌రించి వేద‌పండితుల‌కు అంద‌జేశారు. స‌తీస‌మేతంగా ఉగాది వేడుకల్లో, పంచాంగ శ్రవణంలో సీఎం పాల్గొన్నారు. దేవాదాయ శాఖ ఆస్థాన సిద్ధాంతి కప్పగంతు సుబ్బరామ సోమయాజి పంచాంగ పఠనం చేశారు. శుభకృత్‌ నామ సంవత్సరం.. పేరుకు తగ్గట్లుగానే ఈ సంవత్సరం అన్నీ శుభాలే జరుగతాయని సిద్ధాంతి చెప్పారు. ప్రభువుల చల్లని పాలనకు తగ్గట్లే ప్రజలూ హాయిగా ఉంటారని, చాలా మంచి పథకాలతో ప్రజలకు దగ్గరయ్యే అవకాశం ఈ ప్రభుత్వానికి దొరుకుతుంది తెలిపారు.  ఓర్పుగా అవాంతరాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తూ.. శుభకృత్‌కు తగ్గట్లే పాలన అందిస్తారని సీఎం వైయ‌స్‌ జగన్‌ను సిద్ధాంతి ఆశీర్వదించారు.  

అనంతరం పంచాంగకర్తను సీఎం వైఎస్‌ జగన్‌ సన్మానించారు. శారదాపీఠం తరఫున సీఎం వైయ‌స్‌ జగన్‌కు సిద్ధాంతి వస్త్రాలు అందజేశారు. అనంత‌రం నిర్వ‌హించిన సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ దంప‌తులు తిల‌కించారు. న‌వ‌ర‌త్నాల‌కు సంబంధించి కూచిపూడి నృత్యాలు చేసిన చిన్నారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌త్క‌రించారు. అదేవిధంగా వివిధ దేవాల‌యాల నుంచి వ‌చ్చి ఆగ‌మ పండితుల‌ను ప్ర‌భుత్వం త‌ర‌ఫున స‌త్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు పాల్గొన్నారు. 

Back to Top