తాడేపల్లి: పేదల ఇళ్ల పట్టాల కార్యక్రమానికి సుప్రీం కోర్టులో సానుకూల నిర్ణయం వస్తుందనే నమ్మకంతో ఉన్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంచి ఆలోచనతో పని చేస్తున్నామని.. ఎల్లప్పుడూ ధర్మమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ టీడీపీ నాయకులు ఇళ్ల పట్టాలపై కోర్టులకు వెళ్లారని.. కరోనా వైరస్(కోవిడ్-19) కారణంగా కేసులు పరిష్కారానికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగష్టు 15 నాటికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆ రోజే పేదలకు కూడా స్వాతంత్ర్యం వస్తుందని అనుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. డీ- పట్టాల కింద ఇవ్వాలనుకుంటే ఈ రోజైనా ఇవ్వొచ్చని, అయితే డీ- పట్టాల రూపంలో కాకుండా రిజిస్ట్రేషన్ చేసి అక్కాచెల్లెమ్మలకు ఇవ్వగలిగితే వారికి ఆస్తి ఇచ్చినట్టు అవుతుందని పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్ జగన్ మంగళవారం వీడియో కాన్పరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా ఆశీర్వదిస్తాడు ఏపీలో 20 శాతం మంది జనాభాకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు. 30 లక్షల మందిని ఇళ్ల యజమానులుగా చేస్తున్నాం. మంచి కార్యక్రమాన్ని దేవుడు ఎప్పటికైనా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇళ్ల పట్టాల కింద 62వేల ఎకరాలు సేకరించాం. పేదల ప్రజల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ప్రైవేటు భూముల కొనుగోలుకే సుమారు రూ.7500 కోట్లు ఖర్చుచేశాం. మొత్తంగా దాదాపు రూ.20వేల కోట్ల విలువైన ఆస్తిని 30 లక్షల కుటుంబాలకు ఇవ్వబోతున్నాం. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఇలా జరగలేదని పేర్కొన్నారు. గతానికి ఇప్పటికీ చాలా తేడా.. గత ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో 3.5 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారు. అందులోనూ రూ. 1300 కోట్లు బకాయిలు పెట్టారు. అర్బన్ హౌసింగ్‌లో 7 లక్షల ఇళ్లు కట్టాలనుకున్నారంట. కేవలం 3లక్షల ఇళ్లు మాత్రమే కట్టడం మొదలుపెట్టారు. అవి కూడా సగంలో ఆపేశారు. ఇందుకు సంబంధించిన బకాయిలు రూ.3వేల కోట్ల రూపాయలు. పేదలకు ఇళ్లను కట్టించాల్సిన ప్రభుత్వం.. ఇంత దారుణంగా వ్యవహరించింది. కానీ, ఇవాళ 30లక్షల మందికి రిజిస్ట్రేషన్ చేయించి 15 లక్షల ఇళ్లు కట్టడానికి అన్నిరకాలుగా సిద్ధమవుతున్నాం. ఇవన్నీకూడా ఇళ్లపట్టాలు ఇచ్చిన నెలరోజులకే ప్రారంభిస్తాం. గతానికి ఇప్పటికీ తేడా చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. టైం గ్యాప్‌ను సద్వినియోగంచేసుకోవాలి కలెక్టర్లు ఈ పురోగతిని, కార్యక్రమంలో ముందడుగు వేసే తీరును వదిలిపెట్టవద్దని సీఎం వైయస్ జగన్ సూచించారు. పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడిన నేపథ్యంలో మరింత మెరుగ్గా పని చేయాలని.. ఈ పథకంపై మరింత దృష్టి సారించాలని కలెక్టర్లను కోరుతున్నా. లే అవుట్లలో చెట్లను నాటించే కార్యక్రమాలు చేపట్టాలి. పట్టా డాక్యుమెంట్లలో ఫొటోలు పెట్టడం, ఫ్లాట్ నంబర్ , హద్దులు పేర్కొనడం చేయాలి. ఈ టైం గ్యాప్‌ను సద్వినియోగంచేసుకోవాలి. చాలా సునాయాసంగా రిజిస్ట్రేషన్ చేయించడం దీనివల్ల వీలవుతుందని సీఎం వైయస్ జగన్ పేర్కొన్నారు.