‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకల్లో సీఎం వైయ‌స్‌ జగన్‌

వైయ‌స్ఆర్‌ క్రికెట్‌ స్టేడియంలో క్రికెట్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను వీక్షించిన ముఖ్య‌మంత్రి
 

విశాఖ‌: రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. విశాఖ సాగర తీరంలో ముగింపు వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని ఫైన‌ల్ క్రికెట్ మ్యాచ్‌ను ఆస‌క్తిగా తిల‌కించారు.  

ఇందుకోసం సీఎం వైయ‌స్ జగన్‌ మంగళవారం సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకున్నారు. ముఖ్య‌మంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, పార్టీ నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.  

ఇకపై ఏటా ఆడుదాం.. 
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసి జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిలబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ఆడుదాం ఆంధ్రా’ మెగా టోర్నీని నిర్వహించింది. గ్రామ, వార్డు సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు 50 రోజులపాటు ఈ క్రీడా సంబరాలు కొనసాగాయి. మొత్తం 25,40,972 మంది క్రీడాకారులు తమ ప్రతిభ కనబరిచారు. ఇందులో 17,59,263 మంది పురుషులు, 7,81,709 మంది మహిళా క్రీడాకారులున్నారు. వీరికి దాదాపు రూ.37 కోట్ల విలువైన స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వం అందించింది.

గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో 3.30 లక్షలు, మండల స్థాయిలో 1.24 లక్షలు, నియోజకవర్గ స్థాయిలో 7,346, జిల్లా స్థాయిలో 1,731, రాష్ట్ర స్థాయిలో 260 మ్యాచ్‌లను దిగ్విజయంగా నిర్వహించింది. వివిధ దశల్లో విజే­తలకు రూ.12.21 కోట్ల నగదు బహుమతులిస్తోంది. తొలి ఏడాది పోటీలు విజయవంతం కావడంతో భవి­­ష్యత్‌లో మరింత ఎక్కువ మంది గ్రామీణ క్రీడా­కారులను పరిచయం చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇకపై ప్రతి ఏటా ‘ఆడుదాం ఆంధ్రా’ నిర్వహించేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.  

భారీగా నగదు బహుమతులు  
క్రీడల వారీగా విజేతలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ నగదు బహుమతులను అందజేస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో పోటీల్లో రాష్ట్ర స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లకు రూ.5 లక్షల చొప్పున, రన్నరప్‌లకు రూ.3 లక్షలు, సెకండ్‌ రన్నరప్‌లకు రూ.2 లక్షల చొప్పున నగదు బహుమతి అందించనున్నారు. బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో విజేతలు రూ.2 లక్షలు, రన్నరప్‌ రూ.లక్ష, సెకండ్‌ రన్నరప్‌ రూ.50 వేలు అందుకోనున్నారు.  

ప్రతిభకు ప్రోత్సాహం.. 
ఈ మెగా టోర్నీ ద్వారా ప్రతిభ గల క్రీడాకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. చెన్నై సూపర్‌ సింగ్స్‌(సీఎస్‌కే)తో పాటు ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ సంయుక్తంగా క్రికెట్‌లో టాలెంట్‌ హంట్‌ నిర్వహించింది. ప్రో కబడ్డీ, బ్లాక్‌ హాక్స్‌ వాలీబాల్‌ ఫ్రాంచైజీలతో పాటు ఏపీకి చెందిన ఖోఖో, కబడ్డీ క్రీడా సంఘాలు, అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల బృందాలు కూడా ఈ ఎంపికలో భాగస్వామ్యులయ్యాయి. ఎంపికైన క్రీడాకారులకు శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇచ్చి, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దనుంది.

Back to Top