అవనిగడ్డ: ‘‘వేలాది రైతులకు ఇబ్బందిగా మారిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే గొప్ప కార్యక్రమానికి అవనిగడ్డ నుంచి శ్రీకారం చుడుతున్నాం. గత ప్రభుత్వ దుర్మార్గపు జీవోలతో భూములు కోల్పోయిన రైతన్నలు ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 22 ఏ (1) కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తున్నాం. ఆ రైతులకు ఆ భూమి మీద శాశ్వత హక్కు కల్పిస్తూ పట్టాలు అందిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం వల్ల అవనిగడ్డ నియోజకవర్గంలో అక్షరాల 10,019 మంది రైతన్నలకు, 15,791 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. 100 ఏళ్ల తరువాత రాష్ట్రంలో భూముల రీసర్వేను మహాయజ్ఞంగా నిర్వహిస్తున్నాం. ఈ భూముల రీసర్వే కోసం ఏకంగా 15 వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం. కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. వచ్చేఏడాది చివరి నాటికి వివాదాలు లేని భూహక్కు పత్రాలు యజమానులకు అందిస్తామని, తద్వారా గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని సీఎం వైయస్ జగన్ చెప్పారు.
అవనిగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రసంగం..
‘దేవుడి దయతో అవనిగడ్డలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచిపోయినా భూములకు సంబంధించి పక్కాగా సరిహద్దులు, కచ్చితమైన రికార్డులు లేకపోవడంతో ఎటువంటి కష్టాలను చూస్తున్నామో మనందరికీ తెలుసు. భూ యాజమాన్య హక్కుల విషయంలో స్పష్టత లేకపోవడంతో అనేక రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాం. రికార్డుల్లో కూడా ఆ వివరాలు పక్కాగా లేకపోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మనమంతా చూస్తున్నాం. అలాంటి ఘటన, దానికి సంబంధించి బాధితులమై మనమంతా. ఈ వివాదాల వల్ల ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ ధర్నాలు, నిరాహార దీక్షలు సైతం చేస్తూ.. సమస్యలు కొలిక్కి రాకపోవడం వల్ల అనేక రకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు ఆ మానసిక వేధన, ఆర్థికంగా కలుగుతున్న నష్టం మన కళ్ల ఎదుటనే కనిపిస్తున్నా కూడా గతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి సమస్యలు రైతులకు ఉండకూడదు. ఏ ఒక్కరికీ రాకూడదు. అందరికీ మంచి జరగాలి.. వారికి సంబంధించి భూములు అమ్ముకోలేని పరిస్థితి ఏ ఒక్కరికీ రాకూడదు. అటువంటి ఇబ్బందులు ఉండకూడదని ఇంతకుముందు ఆలోచన చేసిన పరిస్థితులు గత పాలనలో, పాలకులలో లేవు.
ఈరోజు వంద సంవత్సరాల తరువాత రాష్ట్రంలో భూముల రీసర్వేను మహాయజ్ఞంగా రాష్ట్రంలో నిర్వహిస్తున్నాం. ఈ భూముల రీసర్వే కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 15 వేల మంది సర్వేయర్లను రిక్రూట్ చేశాం. కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక పరికరాలను కొనుగోలు చేశాం. ఆధునిక టెక్నాలజీ కోర్స్ (కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరన్స్ సిస్టమ్) బేస్ సిస్టమ్స్‌ను తీసుకొచ్చి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను సైతం సర్వేలో ఉపయోగిస్తున్నాం. రోవర్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నాం. పరిజ్ఞానానికి సంబంధించిన పరికరాలన్నీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేశాం. వేల సంఖ్యలో సర్వేయర్లను నియమించాం. పూర్వం వందేళ్ల క్రితం జరిగిన సర్వేను మళ్లీ రీసర్వే చేయించి.. హద్దులను మళ్లీ పూర్తిగా మార్క్ చేసి, రికార్డులను పూర్తిగా అప్‌డేట్ చేసి, సబ్ డివిజన్స్, మ్యూటేషన్స్ అన్నీ కరెక్ట్‌గా చేస్తున్నాం.
షరతుల గల పట్టా పేరుతో రైతులకు జరుగుతున్న ఇటువంటి భూములే కాకుండా చుక్కల భూములు, అనాధీనం భూములు, నిషేధిత జాబితాలో ఉన్న ఇటువంటి అనేక భూములకు ఒక్క పరిష్కారం చూపాలని మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అడుగులు వేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఒక దీక్షగా చేస్తున్నాం. గ్రామాలతో పాటు, పట్టణాల్లో కూడా రీసర్వే చేసి, భూములు స్థిరాస్తుల యజమానులకు స్పష్టంగా కూడా సరిహద్దులు చూపడంతో పాటు హక్కు పత్రాలు కూడా మహాయజ్ఞంలో భాగంగా ఇవ్వబోతున్నాం.
17 వేల గ్రామాల్లోని 1500 గ్రామాల్లో సర్వేలన్నీ పూర్తిచేసి హద్దులు డీమార్క్ చేసి, సమస్యలన్నీ పరిష్కరించి అందరికీ భూహక్కు–భూరక్ష పత్రాలను ఇచ్చి గొప్ప కార్యక్రమాన్ని వచ్చే నెల నవంబర్‌లో మొదలుపెడుతున్నాం. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం కూడా మనం గ్రామంలోనే ఉండేలా అడుగులు వేస్తున్నాం. సబ్ రిజిస్ట్రర్ కార్యాలయం ఎందుకు గ్రామాల్లో ఉండటానికి కారణం.. మన గ్రామంలో సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్ ఉంటే మన భూములు వేరేవాడు.. వాళ్ల పేరుమీద మార్చుకునే తిక్కతిక్క చేష్టలు చేస్తే వెంటనే మనకు తెలిసిపోతుంది. అటువంటి వాటిని అడ్డుకోగలుగుతాం, అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకూడదని గొప్ప యజ్ఞంగా నవంబర్ మాసం నుంచి ఏకంగా 15 వందల గ్రామాల్లో మొదలుపెట్టే ఈ కార్యక్రమం ప్రతీ నెలా కొన్ని వందల గ్రామాలను యాడ్ చేసుకుంటూ వెళ్లి ఈ కార్యక్రమం అంతా వచ్చే ఏడాది చివరి నాటికి మొత్తం 17వేల పైచిలుకు రెవెన్యూ గ్రామాల్లో పూర్తవుతుంది. భూముల రీసర్వే కోసం రాష్ట్రంలో జరుగుతున్న ఒక పెద్ద యజ్ఞం వచ్చే ఏడాది చివరి నాటికి సత్ఫలితాలు ఇస్తుంది.
ఈ దిశలో మరో అడుగే ఈరోజు నుంచి అమలు చేస్తూ తీసుకుంటున్న నిర్ణయం. షరతులు గల పట్టా పేరిట నిషేధిత జాబితాలో (22 ఏ (1)) ఉన్న భూముల సమస్యను పరిష్కరిస్తూ రైతులకు క్లియరెన్స్ పత్రాలను జారీ చేస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 355 గ్రామాల్లో 22 ఏ నిషేధిత జాబితాలో ఉన్న 18,889 సర్వే నంబర్లకు సంబంధించి మొత్తం 35,669 ఎకరాల భూముల సమస్యకు పరిష్కారం చూపినట్టు అవుతుంది. దీని వల్ల ఆయా భూముల్లో సాగుచేసుకుంటున్న అక్షరాల 22,042 మంది రైతులకు వారి భూమి మీద హక్కు కల్పించే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతున్నాం. గొప్ప శుభవార్త నా రైతన్నలకు తెలియజేస్తున్నాను.
వేలాది రైతులకు ఇబ్బందిగా మారిన ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇలాంటివారంతా ఇక రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు, కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా 22 ఏ (1) కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారం చూపించడం, వాటిని డీనోటిఫై చేసే గొప్ప నిర్ణయం ఈరోజు జరుగుతుంది. షరతులు గల పట్టా భూములన్నింటినీ కూడా నిషేధిత జాబితా నుంచి డీనోటిఫై చేస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చే కార్యక్రమం ఇంతకుముందే జరిగింది. ఈ నిర్ణయం వల్ల అవనిగడ్డ నియోజకవర్గంలో అక్షరాల 10,019 మంది రైతన్నలకు 15,791 ఎకరాలకు ప్రయోజనం కలుగుతుంది. దాదాపుగా 16 వేల ఎకరాలు రైతులకు యాజమాన్య హక్కులు అందుతున్నాయి.
మనం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇన్నాళ్లూ ఆ భూములు సాగు చేసుకుంటున్న ఈ రైతన్నలకు వాటిపై సర్వహక్కులు లభిస్తాయి. ఇకపై ఆ రైతులు వారి భూములు వారు అమ్ముకోవచ్చు. ఎవరైనా భూములు కొనుక్కోవచ్చు. లేదా ఆ రైతన్నలు వారి పిల్లలకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు. అన్ని రకాల హక్కులు ఆ రైతన్నలకు ఈరోజు నుంచి అందుబాటులోకి వస్తాయి. ఈ భూహక్కు–భూరక్ష కార్యక్రమంలో భాగంగానే వారికి పక్కాగా హక్కు పత్రాలను కూడా ఇచ్చే కార్యక్రమం మొదలవుతుంది.
దేశంలో భూముల అమ్మకాలు, కొనుగోలు ప్రక్రియ అంతా గమనిస్తే.. 1908 రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారమే ఇవన్నీ జరుగుతున్నాయి. నాటి బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో 1930 వరకు షరతు గల భూముల పట్టాల పేరుతో వివిధ వర్గాలకు భూ కేటాయింపులు జరిగాయి. వాటిని, ఇంకా రకరకాల కేటగిరిల భూములు మెట్టా, తరి, సాగులో ఉన్న మెట్టభూములు, డొంగ, వంక, వాగు, గ్రామకంఠం, ప్రభుత్వ భూములు అని ఇలా రకరకాల అనేక కేటగిరీస్‌లో వీటన్నింటినీ 1932–34 సంవత్సరాల్లో రికార్డులన్నీ రీసెటిల్‌మెంట్ బుక్స్‌లో చేర్చారు. ఆ మేరకు భూములు పొందిన పట్టాదారుల వివరాలను, సర్వే నంబర్ల వారీగా పక్కాగా నమోదు చేశారు. అటువంటి భూములను 1932–34 నంచి రైతన్నలు, వారి పిల్లలు, మనవళ్ల తరాలు అనుభవించుకుంటున్నారు. ఆ భూములను ఎటువంటి ఇబ్బంది పడకుండా అమ్ముకోగలిగే ఈ భూములను మన కర్మ 2014లో రైతు వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. 2016 వరకు రిజిస్ట్రేషన్, టైటిల్ డీడ్స్ అన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వడం ద్వారా వారికి పంట రుణాలతో పాటు ఇతర రుణాలు కూడా గతంలో అన్నీ అందేవీ. 2016లో గత ప్రభుత్వం జిల్లాల వారీగా ఆ భూములన్నింటినీ నిషేధిత జాబితా (22 ఏ)లో చేర్చుతూ మే నెలలో రకరకాల జీవోలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ రైతన్నలకు ఇబ్బందులు మొదలయ్యాయి. అందుకే ఆ భూములన్నింటినీ డీనోటిఫై చేసి, ఆ రైతన్నలకు మంచిచేసే గొప్ప కార్యక్రమం జరుగుతుంది.
2016 మే మాసం కంటే ముందు హక్కులను మళ్లీ ఆ రైతులకు పునరుద్ధరించి, 80 సంవత్సరాలకు పైగా వారికి ఉన్న హక్కులను కాలరాస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేస్తూ రైతులకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం. 22,042 కుటుంబాలకు మంచిచేస్తూ, 35,669 ఎకరాలను సాగు చేసుకుంటున్న రైతులకు ఈరోజు నుంచి మంచి రోజులు మొదలయ్యాయని సగర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను.
రాష్ట్రవ్యాప్తంగా భూ యాజమాన్య హక్కుల విషయంలో ఉన్న వివాదాలన్నింటికీ ముగింపు పలుకుతున్నాం. అనాధీనం, చుక్కల భూములు, సర్వీస్ ఇనామీ భూములు ఇలాంటివన్నీ నిషేధిత జాబితాలో చాలా ఉన్నాయి. సమస్యలకు పరిష్కారం చూపిస్తూ, వివాదాలకు ముగింపు పలుకుతూ.. నిజమైన హక్కుదారులకు మేలు చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్, ల్యాండ్ రికార్డుల నిర్వహణ దేశానికి ఒక మోడల్‌గా చూపించే దిశగా, వంద సంవత్సరాల క్రితం జరిగిన సర్వే కార్యక్రమాన్ని మళ్లీ రీసర్వే చేయించి వివాదాలకు తావులేకుండా గ్రామ స్థాయిలోనే ప్రజలకు మంచి చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
మన రాష్ట్రంలోని ప్రతీ గ్రామంలోనూ భూలావాదేవీలు భూతద్దంతో వెతికినా ఒక్క పొరపాటు కూడా లేకుండా ఉండేలా, సవ్యంగా, చట్టబద్ధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేసేందుకు అడుగులు ముందుకేస్తున్నాం. గొప్ప కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతున్నాయి.
మన పరిపాలనలో జరుగుతున్న మంచి ఏమిటి..? గత ప్రభుత్వ పాలనలో జరిగిన చెడు ఏమిటి..? ఒక్కసారి ఆలోచన చేయండి. ఆరోజు అయినా, ఈరోజు అయినా గిరిజనులకు సైతం ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాలను ఇచ్చింది గతంలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే.. ఇప్పుడు మళ్లీ ఇచ్చింది మీ జగనన్న ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం ఇస్తుందని తెలియజేస్తున్నాను.
అసైన్డ్, ఆర్వోఎఫ్‌ఆర్, ఆలయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా రైతు భరోసా ఇస్తున్నది మన ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం. అసైన్డ్ భూముల రైతులను గత ప్రభుత్వం వంచిస్తే.. వారికి మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. రైతుల దగ్గర నుంచి భూములను ఎలా దోచుకోవాలని గత ప్రభుత్వం ఆలోచన చేస్తే.. ఆ పేదవాడికి, ఆ రైతన్నకు మంచిచేస్తూ ఆ భూములు తిరిగి వారికి ఎలా ఇప్పించాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మన ప్రభుత్వం, మీ జగనన్న ప్రభుత్వం.
మన ప్రభుత్వం రైతు మనసు తెలిసిన ప్రభుత్వం, పేదవాడి గుండె చప్పుడుగా, ప్రతి అడుగులోనూ పేదవాడి బాగోగులను మనుసులో పెట్టుకొని అడుగులు వేస్తున్న ప్రభుత్వం మనది. ఇంటింటికీ సంక్షేమం, అభివృద్ధి ఫలాలను వివక్ష, అవినీతి లేకుండా అందించాలని తపన పడుతున్న ప్రభుత్వం, ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ఏకంగా మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను ఏకంగా 98 శాతం మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలోనే నెరవేర్చిన ప్రభుత్వం మనది. మీ అన్న ప్రభుత్వం.
గ్రామంలో రూపురేఖలను మారుస్తున్న ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. మీ కళ్ల ఎదుటే కనిపిస్తున్న మార్పును గమనించాలని కోరుతున్నాను. మన గ్రామంలో నాలుగు అడుగులు ముందకేస్తే గ్రామ సచివాలయాలు కనిపిస్తాయి. అందులో 10–12 మంది పిల్లలు మనకు సేవలు అందించేందుకు ఉత్సాహంగా, చిరునవ్వుతో కనిపిస్తారు. ప్రతీ 50 ఇళ్లకు ఒక వలంటీర్ కనిపిస్తారు. ప్రతీ అడుగులోనూ మనకు మంచిచేస్తూ చేదోడు వాదోడుగా ఉన్నాడు. లంచాలు అడగడు, వివక్ష చూపడు 1వ తేదీన సూర్యోదయం కంటే ముందే అది ఆదివారమైనా, సెలవురోజైనా, పండుగరోజైనా సరే లెక్కచేయడు. తెల్లవారుజామునే ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి పెన్షన్ డబ్బును చేతిలో పెట్టివెళ్తాడు. గొప్ప వ్యవస్థ రాష్ట్రంలో మన కళ్ల ఎదుట, మన గ్రామంలో కనిపిస్తుంది.
అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు వేస్తే చాలు.. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ప్రతీ అడుగులోనూ రైతును చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకే అనే గొప్ప వ్యవస్థ కనిపిస్తుంది. మన కళ్ల ఎదుటనే పారదర్శకంగా ఈ–క్రాపింగ్ జరుగుతుంది. విత్తనాల దగ్గర నుంచి పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ వరకు కల్తీ లేకుండా గ్రామంలో మన గడప వద్దకే అందిస్తున్నారు. గొప్ప ఆర్బీకే వ్యవస్థ మన గ్రామంలో కనిపిస్తుంది. పంట కొనుగోలు విషయంలో రైతన్నకు అన్ని రకాలుగా అండదండలు అందిస్తుంది.
అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే.. విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ క్లినిక్‌లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, మిడ్ లెవల్ ప్రాక్టీషనర్ (బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్సు) అక్కడే ఉంటూ 24 గంటలు అందుబాటులో ఉంటారు. 67 రకాల మందులు ఇస్తూ, 14 రకాల డయాగ్నస్టిక్ టెస్టులు చేస్తూ ఆరోగ్యశ్రీకి రెఫరల్ పాయింట్ ఉంటూ విలేజ్ క్లినిక్ అనే కాన్సెప్టుకు నాంది పలుకుతున్నాం. ఈ నెలలోనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్టును కూడా తీసుకొస్తున్నాం.
అదే గ్రామంలో మరో నాలుగు అడుగులు ముందుకేస్తే చాలు.. ఇంగ్లిష మీడియం స్కూళ్లు, నాడు–నేడుతో రూపురేఖలు మారిపోయిన స్కూళ్లు కనిపిస్తాయి. మరో నాలుగు అడుగులు ముందుకేస్తే..డిజిటల్ లైబ్రరీలను నిర్మించబోతున్నాం. అన్‌లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో మన గ్రామాల్లో మన పిల్లలకు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్టును కూడా అందుబాటులోకి తీసుకొస్తూ డిజిటల్ లైబ్రరీలను మన గ్రామాల్లో నిర్మించబోతున్నాం. మన కళ్ల ఎదుటనే మన గ్రామాల రూపురేఖలు అన్నీ కూడా ఈరోజు మీ బిడ్డ ప్రభుత్వంలో, మీ అన్న ప్రభుత్వంలో, మన ప్రభుత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయి. గతానికి, ఇప్పటికి మధ్య తేడాను గమనించాలని కోరుతున్నాను.