దిశ యాప్‌ ఉంటే అన్నయ్య తోడు ఉన్నట్లే

దిశ యాప్ వినియోగంపై అవగాహన కార్య‌క్ర‌మంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

 సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ ఫోన్‌లో ఈ యాప్‌ ఉండాలి 

యాప్‌ డౌన్‌లోడ్‌ పై ఇంటింటికీ  వెళ్లి చెప్పాలి

మహిళా పోలీసులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది దిశయాప్‌కు రాయబారులు

 అక్కచెల్లెమ్మల రక్షణ కోసం 900 మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు

ఆపదలో ఫోన్‌ ఊపితే చాలు కంట్రోల్‌ రూంకు మెసేజ్‌ వెళ్తుంది

ఏపీ మహిళ– దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: 

అమరావతి :  మీ మొబైల్‌లో దిశ యాప్ ఉంటే అన్న‌య్య మీకు తోడుగా ఉన్న‌ట్లే అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు.  దిశ యాప్ వినియోగంపై మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ రూర‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలోని   గొల్లపూడిలో జరిగిన కార్యక్రమానికి  సీఎం శ్రీ వైయస్‌.జగన్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మహిళలు, యువతులు, విద్యార్ధినులతో వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖిగా మాట్లాడారు. 

ప్రతి ఇంటికి మహిళా పోలీసులు, వలంటీర్లు,  మహిళామిత్రలు కలిసికట్టుగా వెళ్లి, ప్రతి ఇంట్లోనూ  దిశ యాప్‌పై అవగాహన కలిగించాలి. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్‌ చేసుకోవాలో స్వయంగా వివరించాలి. దీనివల్ల జరిగే మంచిని వారికి తెలియజేయాలి. దీంతోపాటు పాటు యాప్‌ను ఎలా వినియోగించాలో కూడా తెలియజేయాలి. ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టాలి. దీంతో పాటు సెల్‌ఫోన్‌ ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మ వాళ్ల ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసే కార్యక్రమం చేయాలి. 

ఇంటింటికి వెళ్లి చెప్పాలి
ఈ యాప్‌ ఎనేది ఎంత ఔషధమో, ఎంత ప్రాముఖ్యమో అన్నది మహిళా పోలీసులకు, వలంటీర్లుగా ఉన్నవారికి బాగా తెలుస్తుంది. ముఖ్యమైన అంశమేమిటంటే.. ఈ యాప్‌ వల్ల జరిగే మంచి గురించి మనం(మహిళా పోలీసు, వలంటీర్లు, సచివాలయ సిబ్బంది) రాయబారులగా ప్రతి ఇంటికీ వెళ్లి  చెప్పాల్సిన అవసరం ఉంది. 

మొన్న ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక సంఘటన జరిగింది. మనసుని చాలా కలచివేసింది.  ఒక అమ్మాయి ఏ టైంలోనైనా బయటకి వెళ్లినప్పుడు అనుకోకుండా ఏదైనా సంభవించవచ్చు. జనసందోహం లేనప్పుడు వాళ్ల పరిస్ధితి ఏమిటనేదానికి నిదర్శనం ఆ ఘటన. అటువంటి పరిస్ధితుల్లో మనం దీన్ని ఆపగలగడం ఎలా అన్న అలోచనలోంచి.. దిశా యాప్‌ను అభివృద్ధి చేశాం. అలా అభివృద్ధి చేసిన ఈ దిశా యాప్‌ను ఎంత ఎక్కువమంది అక్కచెల్లెమ్మలతో డౌన్లోడ్‌ చేయించగలిగితే అంత ఎక్కువగా అక్కచెల్లెమ్మలకు సహాయం చేయగలుగుతాం. తోడుగా నిలబడే పరిస్ధితి వస్తుంది. 

దిశ యాప్‌ – అవార్డులు
దేశ వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తయారు చేసిన ఈ యాప్‌ నాలుగు అవార్డులను సొంతం చేసుకుంది. ఈ యాప్‌ 17 లక్షలకు పైగా డౌన్లోడ్‌లు జరిగాయి. 

యాప్‌ ఉంటే అన్నయ్య తోడు ఉన్నట్లే... 
ఆంధ్రరాష్ట్రంలో స్మార్ట్‌ ఫోన్‌ వాడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ వాళ్లందరి ఫోన్లో ఈ యాప్‌ డౌన్లోడ్‌ కావాలి. దాదాపుపుగా కోటి పైన అక్కచెల్లెమ్మల సెల్‌ఫోన్లలో ఈ యాప్‌ ఉండాలి. దీన్నొక డ్రైవ్‌ కింద తీసుకుంటున్నాం. దిశ యాప్‌ వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.  ఈ యాప్‌ను డౌన్లోడ్‌ చేసిన వెంటనే ఒక అన్నయ్య మీకు తోడుగా ఉన్నట్టు భావించవచ్చు. అనుకోని విధంగా ఏదైనా జరిగినప్పుడు ఒక ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కిన వెంటనే పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు. ముందు మీకు ఫోన్‌ చేస్తారు. మీరు ఫోన్‌ ఎత్తకపోతే మీరు ఇబ్బందుల్లో ఉన్నారని అర్ధం. మీరు ఫోన్‌ ఎత్తి అంతా బాగానే ఉంది, పొరపాటున బటన్‌ నొక్కాను అంటే మరి రారు. ఫోన్‌ ఎత్తకపోతే నిమిషాల్లో మీ దగ్గరకి వచ్చి మీకు తోడుగా నిలబడతారు. ఈ యాప్‌ ద్వారా మీ లొకేషన్‌ ఎక్కడిది, మీరు ఎక్కడ ఉన్నారనే సమాచారం నేరుగా కంట్రోల్‌ రూమ్‌కి పోతుంది. అక్కడ నుంచి పోలీస్‌ స్టేషన్‌కు పోతుంది. ఆ విధంగా పోలీస్‌ స్టేషన్‌ నుంచి నేరుగా మీ దగ్గరకి వచ్చే పటిష్టమైన కార్యచరణ, వ్యవస్ధను ఏర్పాటు చేశాం. 

తొమ్మిది వందల మొబైల్‌ పెట్రోలింగ్‌ వాహనాలు
దాదాపు తొమ్మిది వందలు మొబైల్‌ పెట్రోలింగ్‌ ద్విచక్ర వాహనాలను కూడా ఈ మధ్యే ప్రారంభించాం. పెట్రోలింగ్‌ను ఇంకా పెంచేందుకు  ఈ వారంలో ఇంకా పెట్రోలింగ్‌ వాహనాలను తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. 

ఆపదలో ఫోన్‌ ఊపితే చాలు.... 
ఎవరికి ఏ ఆపదవచ్చినా బటన్‌ నొక్కితే చాలు పనిచేస్తుంది. అంత టైం లేకపోతే ఫోన్‌ను అటూ ఇటూ ఊపితే చాలు. కంట్రోల్‌ రూంకు మెసేజ్‌ పోతుంది. అక్కడ నుంచి మీకు ఫోన్‌ వస్తుంది. ఫోన్‌కు మీరు స్పందించలేదంటే.. .మీరు ఆపదలో ఉన్నారని అర్ధం. వెంటనే పోలీసులు మీ దగ్గరకు వస్తారు. ఈ రకంగా మనం ఎక్కడికి పోయినా, ఏ పరిస్ధితుల్లో ఉన్నా ఫోన్‌ మనదగ్గర ఉంటే, అది మన ప్రాణానికి, మన మీద ఎలాంటి తప్పు జరగకుండా ఒక అన్నలా ఈ ఫోన్‌  ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్లోడ్‌ చేయిస్తే అంత మంచి జరుగుతుంది. అది ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్పించాలి. ఇదొక పెద్ద కార్యక్రమం. దీన్ని వలంటీర్లు, మహిళా పోలీసు, మహిళా మిత్రలు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి డౌన్లోడ్‌ చేయించాలి. అందరూ బాగా చేస్తారని భావిస్తున్నాను.

గొల్లపూడి గ్రామంలో... 
 గొల్లపూడి గ్రామంలో దాదాపు 2800 ఇళ్లకు గాను ఇప్పటికే 15 వందల ఇళ్లకు డౌన్లోడ్‌ చేశారు.  మిగిలిన 1300 ఇళ్లు ఉన్నాయి. త్వరలోనే వాటిని పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. మన ప్రభుత్వంలో ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు మేలు చేసే విషయంలో ఎక్కడా కూడా వెనుకడుగు వేసే ప్రసక్తి ఉండదు. 

అట్టడుగు వర్గాల్లో విశ్వాసం
 ఈ రాష్ట్ర హోంమంత్రి, దళితురాలు, నా చెల్లి,  ఒక మహిళ. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. అట్టడుగు వర్గాల్లో కూడా పూర్తి నాయం జరుగుతుంది, పోలీసులు దగ్గరికి పోవడానికి భయపడాల్సిన పనిలేదు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అనే మెసేజ్‌ పోవడానికి ఉపయోగపడుతుంది. ఈ యాప్‌ అభివృద్ధి చేసే విషయంలో సుచరితమ్మ కూడా కీలక పాత్ర పోషించారు. దిశాకు సంబందించిన ఇద్దరు మహిళా అధికారులు, ఐపీఎస్‌ అధికారి దీపికా పాటిల్, ఐఏఎస్‌ అధికారి కృతికా శుక్లా వీరిద్దరినీ నియమించాం. ప్రత్యేకంగా దిశాకు సంబంధించి కార్యక్రమాల మీదే వీరు పనిచేస్తున్నారు. అక్కచెల్లెమ్మలకు భద్రతకు సంబంధించి అధిక ప్రాధాన్యతనిచ్చే విషయంలో ఎక్కడా కూడా జాప్యం లేకుండా అడుగులు ముందుకు వేస్తున్నాం. 

దిశా యాప్‌ –అడిషనల్‌ ఫీచర్‌
ఈ యాప్‌లో ఉన్న మరోక అంశం కూడా ఉంది. మనం  ఎక్కడకైనా ఆటో, టాక్సీ లేదా తెలియని వాళ్ల వాహనం మీద ప్రయాణం చేస్తాం. అప్పుడు వాళ్ల మీద మనకు కొద్దిగా అనుమానం వచ్చినా..  ఈ యాప్‌ ద్వారా మనం పోవాలనుకునే లొకేషన్‌ పేరు టైప్‌ చేసి,  ట్రాక్‌ మై ట్రావెల్‌ అనే బటన్‌ నొక్కితే చాలు. మీరు పోవాల్సిన రూట్‌ కూడా చెప్తుంది. ఆ మార్గంలో సదరు వాహనం పోకపోతే...  మీరు అలెర్ట్‌ చేసిన వెంటనే పోలీసులు వస్తారు. ఆ రకమైన ఫీచర్‌ కూడా యాప్‌లో అందుబాటులో ఉంది. యాప్‌ గురించి అవగాహన కల్పించినప్పుడు ఈ అంశాన్ని కూడా వివరించండి. 

దిశ పోలీస్‌ స్టేషన్లు
దిశ పోలీస్‌ స్టేషన్లకు సంబంధించి సుమారు 18 స్టేషన్లు ఏర్పాటు చేశాం. దాదాపుగా ప్రతి జిల్లాకు ఒకటి ఉండేలా చూడ్డంతో పాటు,  అందులో పనిచేసేవాళ్లందరినీ మహిళలనే నియమించాం. ఎవరికైనా సైబర్‌ క్రాం కానీ, ఎటువంటి సమస్య ఉన్నా అక్కడి వెళితే సిబ్బంది అంతా మహిళలే కాబట్టి, మనస్ఫూర్తిగా మీతో మాట్లాడుతూ మీ సమస్యలు వింటారు. మీ ఫిర్యాదు తీసుకుంటారు.

ప్రత్యేక కోర్టులు
దిశా చట్టాన్ని కూడా మెరుగ్గా చేసేందుకు, మరింత ఉపయోగకరంగాఉండేటట్టు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు మంజూరు వారి చేతిలో ఉంటుంది కాబట్టి, ఇంకా చట్టం కింద పూర్తిగా తీసుకుని రాలేకపోయాం. ఈలోగా మనం చేయాల్సిన ప్రతి అడుగు ముందుకువేస్తున్నాం. దిశా పోలీస్‌ స్టేషన్లు,  ప్రత్యేకంగా ఈ కేసులను మాత్రమే చూడ్డానికి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ప్రతి జిల్లాలో నియమించాం. దిశ కోసం ప్రత్యేకమైన కోర్టులను కూడా తీసుకొచ్చేందుకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వారితో మాట్లాడుతున్నాం.  

ఏపీ మహిళ– దేశానికే ఆదర్శం 
మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. దానికోసం అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నాం. చివరకు మనం అనుకున్నవన్నీ పూర్తైతే మన రాష్ట్రంలో  మహిళ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కచ్చితంగా చెపుతున్నాను.  మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను అని సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ యువతులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో ముఖాముఖిలో తన సందేశాన్ని వినిపించారు. 

అనంతరం సీఎం శ్రీ వైయస్‌.జగన్‌  మహిళలు, యవతులతో  గూగుల్‌ ప్లే స్టోర్స్‌లోను, యాపిల్‌ స్టోర్స్‌లోనూ దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయించారు. 
ఈ సందర్భంగా అధికారులు యాప్‌ పనితీరును, పోలీసుల స్పందనను స్వయంగా డెమో చేసి చూపించారు.  

ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమశాఖ) పాముల పుష్పశ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), రవాణా,ఐ అండ్‌ పిఆర్‌ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), మహిళాశిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత, ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

మహిళా పోలీస్, వలంటీర్లు ఏమన్నారంటే...

కనకదుర్గ, మహిళా పోలీస్, గొల్లపూడి సచివాలయం

సార్‌ మా సచివాలయంలో 32 మంది వలంటీర్లకు గాను 26 మంది మహిళా వలంటీర్లు ఉన్నారు. వాళ్ళందరికీ దిశ యాప్‌ గురించి వివరించి డౌన్‌లోడ్‌ చేయించాను సార్‌. గత రెండు రోజుల్లో వాళ్ళు 1515 మందికి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించారు. మేం దిశ యాప్‌లో ఉన్న ఫీచర్స్‌ అన్నీ కూడా వలంటీర్లకు వివరించాను, వాళ్ళు ప్రతీ ఇంటికి వెళ్ళి యాప్‌ ఉపయోగం గురించి చెప్పి డౌన్‌లోడ్‌ చేయిస్తున్నారు సార్‌. 

సోమి, వలంటీర్‌

మిమ్మల్ని చూసిన ఆనందం ఎప్పటికీ మర్చిపోలేను సార్‌. నా పరిధిలో 82 కుటుంబాలు ఉన్నాయి, అందులో స్మార్ట్‌ఫోన్స్‌ ఉన్న వారందరికీ యాప్‌ ఉపయోగం చెప్పాను. ఎలాంటి ఆపద కలిగినా వెంటనే ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కితే మీ సమాచారం కంట్రోల్‌రూమ్‌కు చేరుతుందని వివరించి చెప్పాను. ఈ టెక్నాలజీ వల్ల మహిళలకు భద్రత, గౌరవం ఉంటాయి. నేను చదువుకునే రోజుల్లో ర్యాగింగ్‌ ఉండేది కానీ ఇప్పుడు దిశ యాప్‌ వల్ల అందరూ ధైర్యంగా బతుకుతున్నాం, మా కుటుంబాలను మేమే పోషించుకుని మా కాళ్ళ మీద మేం నిలబడే ధైర్యం మీరు మాకిచ్చారు సార్‌. మీరు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేం సార్‌.

వెంకట పద్మావతి, వలంటీర్‌

సార్‌ నా పరిధిలో 71 కుటుంబాలు ఉన్నాయి, అందులో 30 మందికి స్మార్ట్‌ఫోన్స్‌ ఉన్నాయి, నేను 16 మందికి డౌన్‌లోడ్‌ చేశాను అది కూడా నేను నా పర్సనల్‌ ఎక్సిపీరియన్స్‌ చెప్పి చేయించాను. నేను దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఒకసారి రాత్రి పూట జరిగిన పెళ్ళికి హాజరయ్యాను. ట్రాక్‌ మై ట్రావెల్‌ ఆప్షన్‌ ఆన్‌ చేసి వెళ్ళాను, అదే టైంలో పెద్ద వర్షం పడడంతో నా ఫోన్‌ వెహికిల్‌లో పెట్టేసి పెళ్ళికి వెళ్ళాను, నా ఫోన్‌ ఎత్తకపోవడంతో నా ఎమర్జెన్సీ కాంటాక్ట్‌లో ఉన్న వారికి అందరికీ ఫోన్స్‌ వెళ్ళాయి, వారంతా కూడా నాకు ఫోన్‌ చేశారు, నాకు కాల్స్‌ వచ్చాయి, చివరికి కంట్రోల్‌ రూమ్‌ నుంచి మళ్ళీ కాల్‌ వచ్చింది, మీరు ఎలా ఉన్నారు, సేఫ్‌గా ఉన్నారా అని అడిగారు, నేను ఇంటికి వెళ్ళే వరకూ వారు ఫాలోఅప్‌ చేశారు. ఇదే విషయాన్ని అందరికీ చెప్పి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాను. మాకు ఇంత పెద్ద ఆయుధాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్, మీకు జీవితాంతం రుణపడి ఉంటాం. ఇంద్రుడికి వజ్రాయుధం ఎలాగో మా మహిళలకు మీరు వజ్రాయుధంగా భద్రతని ఇచ్చారు. మా మహిళలకు భద్రత చాలా ముఖ్యం, అది మీరు ఇచ్చారు. థాంక్యూ అన్నయ్యా...

కృష్ణవేణి, వలంటీర్‌

సార్‌ నా క్లస్టర్‌ పరిధిలో 74 కుటుంబాలు ఉన్నాయి, అందులో 30 మందికి స్మార్ట్‌ఫోన్స్‌ ఉన్నాయి, అందులో 10 మందికి దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేశాను. వారికి అర్ధమయ్యేరీతిలో వివరంగా చెప్పి యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించాను. మీరు మహిళల విషయంలో ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేశారు, దిశ పోలీస్‌ స్టేషన్లు, హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటుచేశారు. సైబర్‌క్రైమ్‌లో కూడా పేరు మెన్షన్‌ చేయకుండా కేసు పెట్టే వీలు కల్పించారు. మహిళలు ఎక్కడైతే పూజింపబడుతారో అక్కడే దేవతలు ఉంటారు. మీ ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రతీ మహిళా సంతోషంగా ఉంటుంది. మీరు అమ్మా అని ఆప్యాయంగా పిలుస్తారు, సొంత రక్తసంబంధీకులు కూడా అలా పిలవరు కానీ మీరు పిలుస్తారు, ఇలాంటి ముఖ్యమంత్రిని నేను ఎప్పుడూ చూడలేదు. నేను వలంటీర్‌గా నా సేవలు అందిస్తున్నాను. మీరు ఇచ్చే డబ్బుతో చాలా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి. మా నాన్న కూలీ, నేను పేదరికంలో పెరిగాను, నాకు డిగ్రీ పూర్తవగానే పెళ్ళి చేశారు, మీరు వచ్చిన తర్వాతే నేను ఇలా బయటికొచ్చి మాట్లాడగలుగుతున్నాను. ఆస్తులు పంచుకుంటారు కానీ ఆశయాలు పంచుకోవడం నూటికో కోటికో ఒక్కరుంటారు, కానీ మీరు తండ్రి గారి ఆశయాలు నెరవేరుస్తున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు, మీరు ఎన్నో పధకాలు అమలుచేస్తున్నారు. మహిళల క్షేమం కోసం మీరు దిశ యాప్‌ ఏర్పాటుచేయడం సంతోషం, మీలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు, మీకు ధన్యవాదాలు సార్‌

మణి, వలంటీర్‌

సార్‌ మీరు మా గ్రామానికి, మా సచివాలయానికి రావడం సంతోషంగా ఉంది. మేం దిశ యాప్‌ను క్యాంప్‌యిన్‌లా డౌన్‌లోడ్‌ చేయిస్తున్నాం, నేను బీటెక్‌ చదివాను, జాబ్‌ కోసం చూస్తుంటే నాకు వలంటీర్‌ జాబ్‌ వచ్చింది, నేను బీటెక్‌ చదివి వలంటీర్‌గా చేస్తున్నా నాకు జాబ్‌ శాటిశ్‌ఫ్యాక్షన్‌ ఉంది. సచివాలయాల ద్వారా మేం చాలా సేవ చేస్తున్నాం, ఎవరికి ఏది అవసరం అయినా వెంటనే ఇస్తున్నాం, మాకు చాలా గర్వంగా ఉంది. నేను బీటెక్‌ పూర్తిచేయడానికి ఫీజ్‌ రీఇంబర్స్‌మెంట్‌ ఉపయోగపడింది. స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి గారి వల్లే నేను డిగ్రీ పట్టా పొందాను. ఆయన రుణం ఎప్పటికైనా తీర్చుకోవాలి అనుకున్నాను, ఇప్పుడు ఈ ఉద్యోగం ద్వారా ఆ రుణం తీర్చుకుంటున్నాను. చాలా ధాంక్యూ సార్‌.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top