వీర జవాన్‌ ప్రాణ త్యాగం వెలకట్టలేనిది

ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు సీఎం వైయ‌స్‌ జగన్ లేఖ‌

ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి రూ. 50 లక్షలు

తాడేప‌ల్లి: వీర జవాన్‌ ప్రాణ త్యాగం వెలకట్టలేనిదని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అన్నారు. ఆయన త్యాగానికి దేశం మొత్తం గర్విస్తోందని పేర్కొన్నారు. వీర జవాన్‌ మరణం ఆ కుటుంబానికి తీరని లోటని, అందువల్ల ఆ కుటుంబానికి కొంతైనా ఆసరాగా ఉండేలా సీఎం సహాయ నిధి నుంచి రూ.50 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి భార్య రజితకు ముఖ్యమంత్రి లేఖ రాశారు.

జమ్మూ కశ్మీర్‌ కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంట ఎదురు కాల్పులలో వీర మరణం పొందిన హవాల్దార్‌ సీహెచ్‌ ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో పని చేస్తున్నారు. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లోని మాచిల్‌ సెక్టార్, నియంత్రణ రేఖ వద్ద విధులు నిర్వర్తిస్తుండగా,  ఉగ్రవాదులు కాల్పులకు తెగపడడంతో ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వీర మరణం పొందారు. 

 
మంత్రుల ప‌రామ‌ర్శ‌.
  ప్రవీణ్‌ కుమార్‌ రెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి వర్గం సందర్శించి పరామర్శించింది. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి , మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, ఎంపి రెడ్డెప్ప స్థానిక ఎమ్మెల్యే ఎం ఎస్ బాబు లు రెడ్డివారిపల్లి కి వెళ్లి ప్రవీణ్ కుటుంబీకును పరామర్శించారు. ప్రభుత్వం తరపున మంత్రి పెద్దిరెడ్డి ప్రవీణ్ కుటుంబీకులకు 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు. సీఎం ఆదేశాల మేరకు మేము వచ్చామన్నారు.  

Back to Top