రైతన్న‌ బాగు కోరే ప్రభుత్వం మనది

ఆళ్లగడ్డ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

మూడున్నరేళ్లలో రైతులకు మంచిచేసే దిశగా అడుగులు వేశాం

50.92 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో నేడు రూ.2,096 కోట్లు జమచేస్తున్నాం

రైతు భరోసా పథకం ద్వారా అక్షరాల రూ.25,971 కోట్లు రైతన్నలకు అందించాం

ఆళ్లగడ్డ నుంచి రైతు భరోసా సాయం విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది

రైతుల కోసం మన మూడున్నరేళ్ల పాలనలో రూ.1,33,527 కోట్లు ఖర్చు చేశాం

దేవుడి దయతో మన పాలనలో ఒక్క కరువు మండలాన్ని కూడా ప్రకటించలేదు

చంద్రబాబు హయాంలో వందల కొద్దీ కరువు మండలాలు.. బాబు, కరువు కవల పిల్లలు

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ప్రతీఏటా సగటున 13.29 లక్షల టన్నుల అదనపు దిగుబడి

మూడున్నరేళ్లలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

మంచి పనులు ఎల్లోమీడియాకు కనిపించవు, వారిలో గర్వం పెరిగింది

లంచాలు, వివక్షకు తావులేకుండా సంక్షేమ క్యాలెండర్‌ ప్రకారం పథకాలు అమలు చేస్తున్నాం

గత పాలనకు, మన పాలనకు తేడాను ప్రజలే గమనించాలి

ప్రాంతాల మధ్య చిచ్చులుపెట్టే పార్టీలు, మీడియా కూలిపోవాలి, మంచి నిలబడాలి

నంద్యాల: ‘‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మి మూడు సంవత్సరాల నాలుగు నెల‌ల‌ పరిపాలనలో రైతులకు మంచి చేసే దిశగానే అడుగులు వేస్తూ వచ్చాం. మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, దేశంలోని మిగిలిన 27 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా నిలిచాం. ప్రతీ అడుగులోనూ రైతుకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడా లేదు. ఇలా చెప్పడానికి మీ బిడ్డగా, రైతు బిడ్డగా గర్వపడుతున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌ ద్వారా 1.25 ఎకరాలలోపు ఉన్న 70 శాతం రైతులకు పూర్తి పంట పెట్టుబడి సాయం అందించగలుగుతున్నామన్నారు. ఏడాదికి మూడు విడతలుగా రైతు భరోసా సాయం అందిస్తున్నాం.ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో రైతు భరోసా కింద దాదాపుగా 50 లక్షల పైచిలుకు రైతులకు రూ.25,971 కోట్లు అందించామన్నారు. 

వరుసగా నాల్గవ ఏడాది రెండో విడత రైతు భరోసా సాయం ఆళ్లగడ్డనుంచి విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,096 కోట్లు జమ చేయనున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వివరించారు. ఇప్పటి వరకు రైతుల కోసం రూ.1.33 ల‌క్ష‌ల‌ కోట్లను ఖర్చు చేశామని చెప్పారు. ఆళ్లగడ్డ నుంచి వైయస్‌ఆర్‌ రైతు భరోసా రెండో విడత సాయాన్ని సీఎం వైయస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో జమ చేశారు. అంతకుముందు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.

సీఎం వైయస్‌ జగన్‌ పూర్తి ప్రసంగం..
ప్రతీ పథకం కూడా క్రమం తప్పకుండా క్యాలెండర్‌ ఇచ్చి ఆ క్యాలెండర్‌లో ఆ నెల వచ్చిన వెంటనే క్రమం తప్పకుండా ప్రతీ కుటుంబానికి అండగా ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ప్రతీ అడుగూ వేశామని సగర్వంగా తెలియజేస్తున్నాను. నేడు వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ రెండో విడత కార్యక్రమాన్ని ఆళ్లగడ్డ నుంచి అమలు చేస్తున్నందుకు గర్వపడుతున్నాను. 

రాష్ట్రంలో రైతుల పరిస్థితుల ఏవిధంగా ఉందో ఒక్కసారి గమనిస్తే.. కేవలం అర హెక్టార్‌ 1.25 ఎకరాలలోపు ఉన్న రైతులు.. మన రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో లెక్కతీస్తే.. దాదాపుగా 70 శాతం మంది రైతులు కేవలం అరహెక్టార్‌ ఉన్న రైతులే. మరి ఈ సంఖ్య ఒక హెక్టార్‌ వరకు తీసుకుంటే రెండున్నర ఎకరాల వరకు ఉన్న రైతులు 82 శాతం రైతులు ఈ కోవలోకే వస్తారు. ఇలాంటి రైతులకు సంవత్సరానికి రూ.13,500 మనం ఇచ్చే పెట్టుబడి సొమ్ము రైతులకు ఎంతగా ఉపయోగపడుతుందంటే.. 1.25 ఎకరాల లోపు ఉన్న 70 శాతం మంది రైతులకు 80 శాతం పంటల పెట్టుబడికి మనం ఇచ్చే సాయం సరిపోతుంది. 

ప్రతీ రైతు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు. పంట వేసే సమయానికి తనకు పెట్టుబడిసొమ్ము చేతికి అందాలి.. ఆ రైతన్న అప్పులపాలు కాకుండా తన పొలంలో పంట వేసుకొని తన కాళ్ల మీద తాను నిలబడగలుగుతాడనే గొప్ప ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రతీ సంవత్సరం అక్షరాల రూ.13,500 రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్నాం. మీ బిడ్డ బటన్‌ నొక్కగానే మీ బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంది. ఎక్కడా లంచాలు లేవు.. ఎక్కడా వివక్ష లేదు. ప్రతీ రైతు కుటుంబానికి నేరుగా ఈ సొమ్ము బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతుంది. మూడు విడతల్లో ఈ డబ్బును ఇస్తున్నాం. ప్రతీ సంవత్సరం ఖరీఫ్‌ సీజన్‌ మొదలయ్యేలోపు (పంటలు మొదలయ్యేలోపు) రూ.7500 ప్రతీ రైతు చేతుల్లో పెడుతున్నాం. ఆ తరువాత పంట కోతకొచ్చే సమయానికి అక్టోబర్‌లో రూ.4000 రైతన్నలకు పంట కోతల ఖర్చుల కోసమని వారి చేతుల్లో పెడుతున్నాం. ఆ తరువాత జనవరి మాసంలో సంక్రాంతి పండుగ వచ్చేసరికి మరో రూ.2 వేలు ఇచ్చి.. సంవత్సరానికి మూడు విడతల్లో ప్రతీ రైతన్నకు రైతు భరోసా కింద రూ.13,500 సొమ్ము అందజేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా–పీఎం కిసాన్‌లో భాగంగా ఈఏడాదికి సంబంధించి గత మే నెలలో రూ.7500 ఇచ్చాం. ఈరోజు రెండో విడతకు సంబంధించి రూ.4000 అక్షరాల 50.92 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.2,096 కోట్లు బటన్‌ నొక్కి నేరుగా జమ చేయనున్నాం. ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఇప్పటి వరకు ఒక్క వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కిందనే దాదాపుగా 50 లక్షల మంది రైతన్నల ఖాతాల్లోకి నేరుగా రూ.25,971 కోట్లు మీ బిడ్డ ఇవ్వగలిగాడని సగర్వంగా తెలియజేస్తున్నాను. అంటే ప్రతీ ఏడాది రూ.7 వేల కోట్లు వైయస్‌ఆర్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌ కింద రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నాం. 

ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ప్రతీ రైతన్నకు రూ.13,500 మూడేళ్లు వరుసగా ఇచ్చాం. నాల్గవ ఏడాదికి సంబంధించి మొన్న మే నెలలో రూ.7500 జమ చేశాం. ఈరోజు మరో రూ.4000 ప్రతీ రైతన్న ఖాతాల్లో జమ అవుతుంది. ఈ మూడేళ్ల నాలుగు నెలల కాలంలో అక్షరాల నా రైతన్నలకు.. ఒక్కో కుటుంబానికి రూ.51 వేలు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేయగలిగాం అని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

పట్టాలున్న రైతులకే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులకు కూడా, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకూ, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల ద్వారా భూములు సాగుచేసుకుంటున్న రైతులకు కూడా వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా ప్రతీ సంవత్సరం రూ.13,500 ఇచ్చి మంచి చేయగలుగుతున్నాం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వ్యవసాయానికి సాయంగా, రైతులకు అన్ని విధాలుగా అండదండలుగా మనందరి ప్రభుత్వం కేవలం ఈ మూడున్నరేళ్ల కాలంలోనే అక్షరాల రూ.1.33 లక్షల కోట్లు అని సగర్వంగా తెలియజేస్తున్నాను. 

దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనల వల్ల రాష్ట్రంలో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం దేవుడి దయతో రాలేదని సగర్వంగా తెలియజేస్తున్నాను. అదే చంద్రబాబు హయాంలో ఒక్కసారి గమనిస్తే.. 2014లో 238 కరువు మండలాలు, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీఫ్‌లో 347 కరువు మండలాలు, 2018 రబీలో మరో 257 కరువు మండలాలు. ఇలా ప్రతీ సంవత్సరం కూడా చంద్రబాబు హయాంలో.. కరువు మండలాలుగా ప్రకటించారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అనేట్టుగా ఆయన పరిపాలన సాగింది. 

ఈ రోజు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి పుష్కలంగా దేవుడి ఆశీర్వాదంతో మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్‌ 12 వరకు సాధారణ వర్షపాతం 668 మిల్లీమీటర్లు అయితే ఈ సీజన్‌లో ఇప్పటికే 695 మిల్లీ మీటర్లు నమోదు చేసుకొని సాదారణం కంటే 4 శాతం అధిక వర్షపాతంతో రాష్ట్రం కళకళలాడుతోంది. ఇప్పటికే 21 జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంటే.. 5 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ నమోదైంది. నిజంగా దేవుడి దయ ఎంత గొప్పది అంటే మన మీటింగ్‌ జరుగుతుంటే బయట చల్లని వాతావరణం ఉంది. 

ఈ మూడున్నర సంవత్సరాల్లో గతంలో ఉన్న 13 జిల్లాలు తీసుకున్నా, ఇప్పుడున్న 26 జిల్లాలు తీసుకున్నా.. ఏ ఒక్క సంవత్సరం కూడా ఒక్క కరువు మండలం కూడా ప్రకటించాల్సిన అవసరం రాకుండా రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తున్నాయి. 

ఆహార ధాన్యాల ఉత్పత్తి ఐదు సంవత్సరాల చంద్రబాబు, మన పాలన గమనిస్తే.. 
ఆహార ధాన్యాల ఉత్పత్తి సగటున అప్పట్లో 154 లక్షల టన్నుల ఉత్పత్తి అయితే.. ఈరోజు సగటున మన ప్రభుత్వ హయాంలో 167.24 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతుంది. ప్రతీ ఏటా సగటున 13.29 లక్షల టన్నుల ఉత్పత్తి దేవుడి దయతో పెరిగింది. ప్రతీ గ్రామంలో రైతన్నలు సంతోషంగా ఉన్నారు. వారికి మంచి దిగుబడి రావడంతో పాటు వ్యవసాయ మీద ఆధారపడిన ప్రతీ రైతు కార్మికుడికి మంచి జరిగిందని లెక్కలు చెబుతున్నాయి. 

అదేవిధంగా ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో ప్రతీ రిజర్వాయర్‌లోనూ సకాలంలో నీరు పుష్కలంగా నిండి ఉన్నాయి. అనంతపురం, సత్యసాయి వంటి జిల్లాలతో సహా అన్ని చోట్ల భూగర్భ జలాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. రాష్ట్ర ప్రజలు అంతకుముందు ఐదేళ్లు చంద్రబాబు పాలన చూశారు. ఇప్పుడు మూడున్నరేళ్ల మన పాలన చూస్తున్నారు. ఒక్కసారి గమనించాలని కోరుతున్నాను. 

చంద్రబాబు హయాంలో రుణాలు మాఫీ చేస్తానని మోసం చేయడం వల్ల రైతులు బ్యాంక్‌ గడప ఎక్కలేని పరిస్థితిలోకి వచ్చారు. మన ప్రభుత్వంలో రైతులు కోలుకొని వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా బ్యాంకుల నుంచి మళ్లీ రుణాలు తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఒక్కసారి గమనిస్తే.. వడ్డీలేని పంట రుణాలకు సంబంధించి చంద్రబాబు హయాంలో సున్నావడ్డీ కింద చెల్లించింది కేవలం రూ.685 కోట్లు మాత్రమే అయితే.. అక్టోబర్‌ 2016 నుంచి పూర్తిగా ఆ పథకాన్ని రద్దు చేశారు. ఈరోజు మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తరువాత సున్నావడ్డీ పథకాన్ని మళ్లీ తీసుకురావడమే కాకుండా ప్రతీ రైతన్నకు అందేలా చేస్తూ ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో సున్నావడ్డీ పథకం కింద రూ.1282 కోట్లు చెల్లించడం జరిగింది. 

చంద్రబాబు 5 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రుణాలు కేవలం రూ.3,64,624 కోట్లు మాత్రమే అందితే.. ఈ మూడున్నరేళ్ల కాలంలో మనందరి ప్రభుత్వం ఇచ్చిన వ్యవసాయ రుణాలు ఏకంగా రూ.5,48,518 కోట్లు బ్యాంకుల ద్వారా ఇప్పించగలిగాం. తేడా గమనించాలని ఒక్కసారి కోరుతున్నాను. 

అదే చంద్రబాబు హయాంలో పంటల బీమా సొమ్ములో రైతుల వాటాలు రైతులే కట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమే కట్టాలి. ఈ రెండూ సరిగ్గా జరక్కపోవడం వల్ల రైతుల ఆరోజు ఇన్సూరెన్స్‌పరంగా ఎంత నష్టం జరిగిందో మనందరికీ తెలిసిందే. చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాలు కలిపి 30.85 లక్షల మంది రైతులకు కేవలం రూ.3,411 కోట్లు మాత్రమే పంట బీమా పరిహారంగా దక్కితే.. మన మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో 44.28 లక్షల మంది రైతులకు అక్షరాల రూ.6,684 కోట్లు బీమా సొమ్ము నేరుగా రైతుల ఖాతాల్లో జమ అయ్యింది. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు తేడా గమనించమని అడుగుతున్నా. రైతన్నల నుంచి బీమా సొమ్ము ఒక్క రూపాయి కూడాతీసుకోవడం లేదు. మొత్తం సొమ్ము రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. ప్రతీ గ్రామంలోనూ ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్‌ చేయిస్తున్నాం. ఏ రైతు నష్టపోకుండా తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం జరిపిస్తున్నాం. 

చంద్రబాబు హయాంలో విత్తనాల కల్తీ, ఫర్టిలైజర్స్‌ కల్తీ, పెస్టిసైడ్స్‌ కల్తీ. ఈ కల్తీ ఉన్నవి వేసుకొని రైతులు నష్టపోతున్న పరిస్థితులు కనిపించేవి. చంద్రబాబు హయాంలో రాష్ట్రం మొత్తం మీద కల్తీని అరికట్టేందుకు ఎన్ని ల్యాబ్‌లు ఉన్నాయని చూస్తే.. కేవలం 12 ల్యాబ్‌లు మాత్రమే ఉంటే.. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అక్షరాల నియోజకవర్గానికి ఒకటి చొప్పున 147 ల్యాబ్‌లు ప్రతీ నియోజకవర్గ స్థాయిలో కనిపిస్తున్నాయి. ఇందులో 70 ల్యాబ్‌లు పూర్తయి రైతన్నలకు సేవలు అందిస్తున్నాయి. మరో 77 ల్యాబ్‌ల నిర్మాణం వేగంగా జరుగుతుంది. జిల్లా స్థాయిలో రెండు ల్యాబ్‌లు, ప్రాంతీయ స్థాయిలో నాలుగు కోడింగ్‌ సెంటర్లు అందుబాటులోకి వస్తున్నాయి. 

ప్రకృతి  వైపరీత్యాల వల్ల పంటనష్టం జరిగితే అప్పట్లో ఆ పంటను పట్టించుకున్నవారు లేరు. ఇన్‌పుట్‌ సబ్సిడీ అని పేరుకు మాత్రమే చెప్పేవారు. కానీ అది ఎప్పుడొస్తుందో, ఎవరికి వస్తుందో ఇవన్నీ ప్రశ్నలుగానే ఉండేవి. చివరకు చంద్రబాబు హయాంలో 2017–18, 2018–19 కాలానికి సంబంధించిన అక్షరాల రూ.2,558 కోట్ల ఇన్‌ఫుట్‌ సబ్సిడీ పూర్తిగా ఎగ్గొట్టారు. 

కానీ, మన మూడు సంవత్సరాల 4 నెలల కాలంలో అక్షరాల 20.85లక్షల మంది రైతులకు ఇప్పటికే రూ.1800 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద ఇవ్వడం జరిగింది. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే ఆ సీజన్‌ ముగిసేలోపు రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రతీ ఆర్బకే పరిధిలోనూ ఆ రైతుల పేర్లతో సహా, వారి ఈ–క్రాప్‌ డేటా సహా సోషల్‌ ఆడిట్‌ కోసం పెట్టి.. ప్రతీ రైతన్నకు తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం మన పాలనలో జరుగుతుంది. ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌ సబ్సిడీ ప్రతీ రైతన్నకు క్రమం తప్పకుండా అందే గొప్ప మార్పు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. 

ప్రతీ గ్రామంలో ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. అక్షరాల 10,778 ఆర్బీకేలు ప్రతీ గ్రామంలో రైతులను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాయి. విత్తనం మొదలు పంట అమ్మకం వరకు అడుగడుగునా రైతన్నకు తోడుగా, అండగా ఉంటూ ఆర్బీకేలు పనిచేస్తున్నాయి. ఈ–క్రాపింగ్‌ ప్రతీ గ్రామంలో నమోదవుతున్నాయి. ఈ–క్రాపింగ్‌ డేటా ఆధారంగా ప్రతీ రైతన్నకు ప్రతీ పథకం ఎటువంటి వివక్ష, లంచాలకు తావులేకుండా ప్రతీ పథకం రైతన్నకు నేరుగా అందే కార్యక్రమం జరుగుతుంది. 

రైతన్న దురదృష్టవశాత్తు ఆత్మహత్య చేసుకుంటే గతంలో సానుభూతి కూడా ఉండేది కాదు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి రైతే కాదు అనే మాటలు వినిపించేవి. కానీ, ఈరోజు పట్టాదారు పాసుపుస్తకం ఉండి.. ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకుంటే వెంటనే ఆర్బీకేలు స్పందిస్తున్నాయి, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది.. ఈరోజు రాష్ట్రంలో పట్టాదారు పాసుపుస్తకం ఉండి దురదృష్టవశాత్తు ఏ రైతు అయినా ఆత్మహత్య చేసుకుంటే పరిహారం అందని కుటుంబం ఒక్కటి కూడా లేదు. ఒక్క రైతులే కాదు.. సీసీఆర్‌సీ కౌలు రైతు కార్డు ఉన్న ప్రతీ రైతన్నకు ఇదే మాదిరిగా దురదృష్టవశాత్తు పొరపాటు జరిగితే ఆ రైతు కుటుంబం తల్లడిల్లిపోకుండా ఆ కుటుంబానికి తోడుగా ఉండే గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. 

పగటిపూటే 9 గంటలు ఉచితంగా కరెంట్‌ ఇవ్వడం, కనీస మద్దతు ధర ఇచ్చి పంటలు కొనుగోలు చేయడం, చివరకు ఆక్వా రైతులను ఆదుకోవడం, రైతులను భాగస్వామ్యం చేస్తూ ఆర్బీకే స్థాయిలో సలహా మండళ్ల ఏర్పాటు, ఆర్బీకే స్థాయిలో పనిమూట్లు అన్నీ రైతులకు అందుబాటులో ఉండేలా కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు ఇవ్వడం, పాడి రైతులకు సైతం గిట్టుబాటు ధర వచ్చేలా అమూల్‌ సంస్థను తీసుకురావడం.. ఈ రాష్ట్రంలో ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయి. 

మన కర్మ ఏంటంటే.. ఇంత గొప్ప మార్పులు రాష్ట్రంలో జరుగుతున్నా.. పండ్లు పండించే చెట్టుమీదనే రాళ్లుపడతాయనేలా మన రాష్ట్రంలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. ఇటువంటి మంచి విషయాలు ఎల్లో మీడియాలో రావు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, చంద్రబాబు వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడు. వీరంతా రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ప్రజలందరికీ తెలిసిందే. వీరి చేతుల్లో మీడియా ఉంది. వీరు చెప్పిందే రాతలు, వీళ్లు ఏది చూపిస్తే అదే జరుగుతుందని భ్రమ కల్పించొచ్చు అని గర్వం వీరిలో విపరీతంగా పెరిగిన పరిస్థితులు చూస్తున్నాం. మీడియా అనేది న్యాయంగా, ధర్మంగా లేదు. వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రిగా లేడు కాబట్టి ఆ వ్యక్తిని ముఖ్యమంత్రి స్థానంలోకి ఎలా తీసుకురావాలని కుతంత్రాలు పన్నుతున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. 

గత పాలనకు, మన పాలనకు తేడాను గమనించాలని కోరుతున్నాను. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి.. గతం కంటే మన బతుకులు బాగున్నాయా లేదా అనేది ఈనాడు చెబితేనో, ఆంధ్రజ్యోతి చెబితేనో, టీవీ5 చెబితేనో, దత్తపుత్రుడు చెబితేనో నమ్మొద్దు. మీ జీవితాల్లో ఆరోజుకు, ఈ రోజుకు తేడా ఉందా లేదా అనేది మీ గుండెల మీద మీరు చేతులు వేసుకొని ఆలోచన చేయాలని కోరుతున్నాను. 

కేవలం రైతుల కోసం ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో మీ బిడ్డ అక్షరాల రూ.1,33,527 కోట్లు నేరుగా రైతుల కోసం ఖర్చు చేయగలిగాడు. మీ ప్రభుత్వంలో మీ బిడ్డ నేరుగా బటన్‌ నొక్కి ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల కాలంలో అక్షరాల రూ.1,74,931 కోట్లు నేరుగా మీ బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశాడు. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. నేరుగా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు, నేరుగా మీ బ్యాంక్‌ ఖాతాల్లో డబ్బు జమ అవుతుంది. మరి అప్పట్లో కూడా ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పుల గ్రోత్‌ రేట్‌ అప్పటి కంటే ఇప్పుడు తక్కువే. అలాంటప్పుడు మీ బిడ్డ ఈరోజు ఎలా చేయగలుగుతున్నాడు.. అప్పట్లో చంద్రబాబు హయాంలో ఇవన్నీ ఎందుకు జరగలేదని ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతున్నాను. అప్పట్లో ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు వీళ్లు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో.. డీపీటీ అనే పథకం ఆరోజున అమలయ్యేది. 
ఈరోజు మీ బిడ్డ హయాంలో డీబీటీ (డైరెక్ట్‌ బెనిఫిట్‌ట్రాన్స్‌ఫర్‌) మీ అకౌంట్లోకి నేరుగా సంక్షేమ సాయం జమ అవుతుంది. 
ఆరోజుల్లో ఆ నలుగురు మాత్రమే దోచుకో, పంచుకో, తినుకో అనే వ్యవస్థ నడిపితే..  అప్పట్లో ఎవ్వడూ రాయడు, అప్పట్లో ఎవ్వడూ టీవీల్లో చూపించరు. అప్పట్లో ఎవ్వడూ ప్రశ్నించడు. కారణం వీరంతా గజదొంగల ముఠా కాబట్టి. ఈరోజు మీ బిడ్డ హయాంలో నేరుగా బటన్‌ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్‌లోకి నగదు జమ అవుతున్న మార్పును గమనించాలని కోరుతున్నాను. 
దేవుడి దయతో మీ అందరికీ ఇంకా మంచిచేసే పరిస్థితులు రావాలని, ఇలాంటి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీలు, చిచ్చుపెట్టే మనస్తత్వం ఉన్న మీడియా సామ్రాజ్యాలు కూలిపోవాలని దేవుడి దయతో మంచి నిలబడాలని, ప్రజలందరికీ, అన్ని ప్రాంతాలకూ మంచి జరిగే పరిస్థితులు, రోజులు ఇంకా రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాను. 

ఆళ్లగడ్డ కోసం.. 
– 50 పడకల ఆస్పత్రికి ఇప్పటికే అన్ని రకాల పనులు జరుగుతున్నాయి. ఇంకా మెరుగ్గా చేయడం కోసం రూ.8 కోట్లు కావాలని కోరాడు.. ఆ నిధులను మంజూరు చేస్తున్నాను. 
– ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో కొన్ని గ్రామాలకు నిధులు సరిపోవడం లేదని చెప్పాడు. ఆళ్లగడ్డ మున్సిపాలిటీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఫుట్‌పాత్‌ ఇలా వీటన్నింటికీ రూ.56 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– 220 కేవీ సబ్‌స్టేషన్‌ కూడా మంజూరు చేస్తున్నాను. 
– డిగ్రీ కాలేజీకి మరో రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– సిరివెల్ల నుంచి రుద్రవరం రోడ్డుకు హైలెవల్‌ బ్రిడ్జి కోసం రూ.8 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
– రుద్రవరం నుంచి ఎ్రరగుడిదిన్నె వరకు మరో రూ.8 కోట్లతో హైలెవల్‌ బ్రిడ్జి మంజూరు చేస్తున్నాను. 
– స్టేడియం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది.. ఆ స్టేడియం పూర్తి కోసం రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. 
అన్ని పనులకు సంబంధించి అక్షరాల రూ.95 కోట్లు ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంతోషంగా మంజూరు చేస్తున్నాను. 
 

తాజా వీడియోలు

Back to Top