కలసికట్టుగా పోరాడాల్సిన సమయమిది

కరోనా కాటుకు కుల, మత, ప్రాంతాలు లేవు

దయచేసి ఒక మతానికో, కొందరు వ్యక్తులకో ఆపాదించొద్దు

ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే ఉండాలి

భౌతికదూరం పాటిస్తూ కరోనాపై పోరాటం చేయాలి

రేపు సాయంత్రం 9 గంటలకు 9 నిమిషాలు దీపాలు వెలిగిద్దాం

మనం ఇచ్చే ఈ సంకేతం గొప్ప ఆదర్శంగా ఉంటుంది

కరోనా నియంత్రణ విధుల్లో ఉన్న వైద్య, ఆరోగ్య, పోలీస్‌, పారిశుద్ధ్య సిబ్బందికి పూర్తి జీతాలు చెల్లింపు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: మనషులంతా ఒక్కటిగా కరోనాపై పోరాడాల్సిన సమయం ఇది. భారతీయులుగా ఈ పోరాటం చేద్దాం. కరోనా కాటుకు కుల, మత, ప్రాంతం, చివరకు దేశం అనే భేదం కూడా లేదని, దయచేసి ఒక మతానికో, కొందరు వ్యక్తులకో దీన్ని ఆపాదించే ప్రయత్నం చేయవద్దని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే ఉంటూ కంటికి కనిపించని ప్రత్యర్థి కరోనా వైరస్‌తో పోరాటం చేద్దామన్నారు. రేపు సాయంత్రం 9 గంటలకు 9 నిమిషాల పాటు అందరం దీపాలు వెలిగిద్దామని, ప్రధాని మోదీ కూడా మనం దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారన్నారు.  

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. "ఢిల్లీలో జరిగిన ఒక సదస్సుకు అనేక ప్రాంతాల నుంచి, కొన్ని దేశాల నుంచి ఆధ్యాత్మిక ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశానికి వచ్చిన ప్రతినిధుల్లో విదేశీ ప్రతినిధుల్లో కొందరికి కరోనా ఉండడం. ఆ మీటింగ్‌కు వెళ్లిన మన రాష్ట్రం వారికి కరోనా సోకడం దురదృష్టకరమైన పరిణామం. ఇదే సంఘటన ఏ మతానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలోనైనా జరగవచ్చు. 

మన దేశంలో అనేక మంది ఆధ్యాత్మిక వేత్తలు ఉన్నారు. విదేశాల్లో కూడా వేలు, లక్షలు భక్తులు ఉన్న అనేక మంది అన్ని మతాల పెద్దలు ఉన్నారు. రవిశంకర్‌ ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌, జగ్గి వాసుదేవ్‌ ఈషా ఫౌండేషన్‌, మాతా అమృతానందమయ సభల్లో, పాల్‌ దినకరణ్‌ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, జాన్‌ వెస్లీ ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎవరైనా పాల్గొనవచ్చు.. ఎవరికైనా ఈ పరిస్థితి రావొచ్చు. కాబట్టి ఇది ఎక్కడైనా జరగవచ్చు. ఎక్కడ జరిగినా  అదొక ఉద్దేశపూర్వక సంఘటనగా కాకుండా.. దురదృష్టకర సంఘటనగానే చూడాలి. ఒక మతానికో.. ఒక కులానికో దాన్ని ఆపాదించి వారు ఏదో తప్పు చేసినట్లుగా, కావాలని చేసినట్లుగా చూపే ప్రయత్నం ఎవరూ చేయకూడదు. అలాంటి ప్రయత్నాలు అత్యంత దురదృష్టకరం. 

కరోనా బాధితులపై మనం ఈ సమయంలో చూపించాల్సింది ఆప్యాయత. మనవాళ్లను మనం వేరుగా చూడకూడదు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటనను పలానా మతం వారి మీద, మన వారి మీద ముద్ర వేయడానికి ఎవరూ వాడుకోవద్దు. ఇది ఎవరికైనా జరిగే అవకాశం ఉన్న సంఘటనగానే భావించాలి. ఈ సమయంలో భారతీయులమంతా ఒక్కటిగానే కనపడాలి. ఒక్కటిగానే ఉండాలి. 

కరోనా కాటుకు కులాలు, మతాలు, ప్రాంతాలు, ధనిక, పేద తేడా లేదు. చివరకు దేశాల భేదం కూడా లేదు. ఈ యుద్ధంలో మన ప్రత్యర్థి మన కంటికి కనిపించని కరోనా అనే ఒక వైరస్‌. దీనికి వ్యతిరేకంగా మనుషులుగా అందరం పోరాటం చేస్తున్నాం. అందరం ఐక్యంగా ప్రపంచానికి, దేశానికి చాటిచెబుదాం. 

దేశ ప్రధాని కూడా 5వ తేదీన రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు మనం వెలిగించే దీపాలు కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాలు అనే సరిహద్దులు లేకుండా అందరం ఒక్కటే అనే సందేశాన్ని ఇస్తూ వెలగాలి. చీకటిని నింపుతున్న దివ్వెలు, దీపాలు, కొవ్వత్తులు, టార్చ్‌లు, సెల్‌ఫోన్‌ లైట్ల వెలుగులు నిజమైన వెలుగుకు నిజమైన అర్థం తేవాలి. ఈ మెసేజ్‌ ఏ పరిస్థితిలో ఇస్తున్నామో అనేది ఏ మీడియా చానల్‌ చూసినా.. సోషల్‌ మీడియాలో జరుగుతున్న పరిస్థితులను గమనించినా అర్థం అవుతుంది. 

కావాల్సింది ప్రతి ఒక్కరూ ఒకరికొకరు తోడుగా ఉండడం. మనలో మనం భేదాలు తీసుకువచ్చి. వైరస్‌ వల్ల విడిపోకుండా ఉండడం. అందరు కూడా ఈ విజ్ఞప్తిని స్వీకరిస్తారని భావిస్తున్నాను. 5వ తేదీ రాత్రి 9 గంటలకు మనం ఇవ్వబోయే మెసేజ్‌ దేశానికే ఆదర్శంగా ఇవ్వగలుగుతామనే సంపూర్ణమైన నమ్మకంతో చెబుతున్నాను. 

కరోనా వైరస్‌పై మొదటి వరుసలో ఉంటూ యుద్ధం చేస్తున్నవారిలో మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్టుమెంట్‌, పోలీస్‌ డిపార్టుమెంట్‌, శానిటేషన్‌ వర్కర్లు ఉన్నారు. మిగతా స్టాఫ్‌లో ఉన్న వారందరికీ జీతాలు వాయిదా పద్ధతిలో చెల్లిస్తామని ఉద్యోగులు అంగీకరించిన తరువాతే నిర్ణయం తీసుకున్నాం. మెడికల్‌ అండ్‌ హెల్త్‌, శానిటేషన్‌, పోలీస్‌ డిపార్టుమెంట్‌ వారికి మోటివేట్‌ చేసే కార్యక్రమంలో భాగంగా కష్టం అయినా కూడా ఈ నెల జీతం పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం" అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వివరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top