తాడేపల్లి: కాసేపట్లో వర్చువల్‌గా ఓఎన్జీసీ పైపులైన్ ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి డబ్బు విడుదల చేయనున్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 కుటుంబాలకు రూ.161.86 కోట్లను ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ కాసేపట్లో విడుదలచేయనున్నారు. క్యాంపు కార్యాలయంనుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం ఇవాళ తిరుపతి జిల్లా మాంబట్టు వద్ద మత్స్యకారులకు మేలు చేసే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. తిరుపతిజిల్లా వాకుడు మండలం రాయదరువు వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌కు, పులికాట్ సరస్సు ముఖద్వారం పునరుద్ధరణ పనులసహా మరికొన్ని పనులను సీఎం ప్రారంభించాల్సి ఉంది. అయితే భారీవర్షాల కారణంగా సీఎం తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఇదే కార్యక్రమంలో ఓఎన్‌జీసీ పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు సీఎం డబ్బు విడుదల చేయాల్సిన కార్యక్రమాన్ని, ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలోనే నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పైపులైను ద్వారా జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నెలకు రూ.11,500 చొప్పున 6 నెలలకుగానూ రూ.69,000 చొప్పున మొత్తంగా రూ.161.86 కోట్లను సీఎం బటన్‌నొక్కి వారి ఖాతాల్లో వేయనున్నారు.