తాడేపల్లి: విజయవాడలోని అంబేడ్కర్ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసే 125 అడుగుల డాక్టర్ బీ.ఆర్. అంబేడ్కర్ విగ్రహం నాణ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు సూచించారు. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతివనానికి సంబంధించి రెండు రకాల ప్లాన్లను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా నాగపూర్‌లో ఉన్న అంబేడ్కర్ దీక్ష భూమి, ముంబైలో ఉన్న చైత్య భూమి, లక్నోలోని అంబేడ్కర్ మెమోరియల్, నోయిడాలోని ప్రేరణాస్థల్‌ను ఉదాహరణగా చూపారు. అదే విధంగా గ్యాలరీ, ఆడిటోరియమ్ ఎలా ఉంటుందన్న అంశంపైనా అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. పనులు ప్రారంభమైన 14 నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. స్మృతివనంలో అంబేడ్కర్ విగ్రహం దీర్ఘకాలం నాణ్యంగా ఉండాలని ఆదేశించారు. స్మృతివనంలో లైబ్రరీ, మ్యూజియం, గ్యాలరీ ఏర్పాటు చేయాలని, అదే విధంగా అంబేడ్కర్ జీవిత విశేషాలు ప్రదర్శించాలని సూచించారు. ల్యాండ్‌స్కేప్‌లో పచ్చదనంతో నిండి ఉండాలన్నారు. అదే విధంగా పార్కు వద్ద రహదారిని విస్తరించి, ఫుట్‌పాత్‌ను కూడా అభివృద్ధి చేసి, రెండింటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు.