కరోనా సోకితే అంటరానివారిగా చూడడం సరికాదు

అలాంటి వారిపై సానుభూతి, ఆప్యాయత చూపండి

కర్నూలు జిల్లా ఘటన అమానవీయం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: కరోనా వచ్చిన వారిని అంటరానివారిగా చూడడం సరికాదని, కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చని, సరైన చికిత్స, మందులు తీసుకుంటే నయం అవుతుందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కరోనా బారినపడి మరణించిన వారి అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదన్నారు. అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ను సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సీఎం వైయస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ హాజరయ్యారు.

కర్నూలు జిల్లాలో కరోనా సోకిన వ్యక్తి అంత్యక్రియలను అడ్డుకోవడాన్ని సమీక్షలో సీఎం వైయస్‌ జగన్‌ చర్చించారు. "కరోనా అన్నది ఎవరికైనా సోకవచ్చు. అడ్డుకున్న వారికైనా ఇలాంటి పరిస్థితి రావొచ్చు. కరోనా సోకిన వారిని అంటరానివారుగా చూడడం కరెక్టు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారిపై ఆప్యాయత, సానుభూతి చూపించాలి. వివక్ష చూపడం కరెక్టు కాదు. కరోనా సోకిన వ్యక్తి అంతిమ సంస్కారాలు జరక్కుండా అడ్డుకోవడం కరెక్టు కాదు. మనకే ఇలాంటివి జరిగితే ఎలా స్పందిస్తామో.. అలాగే స్పందించాలి. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలి. కరోనా వస్తే చికిత్స, మందులు తీసుకుంటే వ్యాధి నయమవుతుంది. కరోనా వచ్చిన వారిని అంటరానివారిగా చూడడం సరికాదు.

కేంద్ర మార్గదర్శకాల ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. అడ్డుకున్న వారిపై కేసులు కూడా పెట్టవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా ఎంతోమంది కరోనా బాధితులు డిశ్చార్జ్‌ అవుతున్నారు. కరోనా నయం అయితేనే కదా.. డిశ్చార్జ్‌ అయ్యేది. తప్పుడు ప్రచారాలు చేసి అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దు. దేశ వ్యాప్తంగా మోర్టాలిటీ రేటు 3.26 శాతం అంటే.. మిగతావారు డిశ్చార్జ్‌ అవుతున్నట్లే కదా.. దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్నవారిపైనే వైరస్‌ ప్రభావం చూపుతోంది. దయచేసి కరోనా సోకిన వారిపట్ల సానుభూతి చూపండి." అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ కోరారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top