హోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తేయండి

పోలీస్‌ ఉన్నతాధికారులకు ఏపీ సీఎం ఆదేశం

ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి

సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి

అమరావతి : ప్రత్యేకహోదా ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలీస్‌ ఉన్నతాధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేని పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలేకాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఆ దిశగానే అడుగులు వేస్తున్నామని తెలిపారు. మంగళవారం కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా జిల్లా ఎస్పీలు, పోలీస్‌ ఉన్నతాధికారులనుద్దేశించి ప్రసంగించారు.‘ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కరు గౌరవించాలి. దేశంలోనే ఏపీ పోలీస్‌ వ్యవస్థ ప్రథమ స్థానంలో ఉండాలి. చట్టాలను అమలు చేయడంలో ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలి. మానవీయ కోణంలో పోలీసులు పనిచేయాలి. ప్రజాప్రతినిధులను గౌరవించాలి. తప్పు చేస్తే ఎవరైనా ఎంతటివారైనా సహించవద్దు. పాలనా వ్యవస్థలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ముఖ్యమే. చెడ్డపేరు వచ్చే పని ఎవరూ చేయవద్దు. పర్సనల్‌ ఇగోలు పక్కనపెట్టి పనిచేయండి.

Back to Top