మహిళల కోసం చట్టాలు చేసిన తొలి ప్రభుత్వం మనదే

మహిళా దినోత్సవ సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 

34 నెలల కాలంలో మహిళల చేతికి రూ.లక్షా 18 వేల కోట్లు అందించాం

దేశంలో ఎక్కడా లేని విధంగా దిశా యాప్‌ను రూపొందించాం

గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌ ఏర్పాటు విప్లవాత్మక మార్పు
 

మహిళలకు 50 శాతం పదవులు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం మనది

31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా..?

విజ‌య‌వాడ‌: మహిళల కోసం చట్టాలు చేసిన తొలి ప్రభుత్వం మనదేనని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. మ‌నం పోటీ ప‌డుతున్న‌ది రాష్ట్రాల‌తో కాదు..దేశంతోనే  అన్నారు. దేశ చరిత్రలోనే ఇంత మంది మహిళ‌ల‌ను  ప్రజాప్రతినిధులను చేసింది మ‌న ప్ర‌భుత్వ‌మేన‌ని తెలిపారు.  విజ‌య‌వాడలోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో  ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా  ప్రతీ అక్క, ప్రతీ చెల్లెమ్మకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్య‌మంత్రి ఏమ‌న్నారంటే..వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌ల్లోనే.. 

ఈ రోజు ఇక్కడ మహిళా ప్రపంచాన్ని చూస్తుంటే మహిళా సాధికారతకు అర్థం చెబుతూ ఇక్కడికి వచ్చిన నా అక్కా చెల్లెమ్మలందరికీ, ఇక్కడికి రాలేక ప్రతి ఇంటా ఉన్న ప్రతి అక్కా చెల్లెమ్మకు మీ అన్నా..మీ తమ్ముడిగా హ్యాపీ ఉమెన్స్‌ డే..మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
ఆధునిక ఆంధ్రప్రదేశ్‌లో మన సామాజంలో, మన ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవానికి ఈ రోజు ఇక్కడ ఉన్న నా అక్కచెల్లెమ్మలే ప్రతినిధులు, ఏ సభలో చూసినా నాయకులు స్టేజీ మీదా ఉంటే..ప్రజలు వారి ప్రసంగాన్ని  వినడానికి చుట్టూ ఉంటారు. కానీ ఈ రోజుప్రత్యేకత ఏంటంటే..ఈ స్టేజీ మీదా, వేదిక ముందు చుట్టూ మహిళలే. ప్రజా ప్రతినిధులే. ప్రతి ఒక్కరూ కూడా సాధికారత సాధించిన మహిళే. ప్రతి ఒక్కరూ కూడా సాధికారతకు ప్రతినిధులుగా నిలుస్తున్న మహిళలే. మీలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని చూస్తుంటే..ఐన్‌రాండ్‌ అనే మహిళ చెప్పే మాటలు గుర్తుకు వస్తున్నాయి. నేను ఒక స్తీ్రని కాబట్టి..నన్ను ఎవరు ఎదగనిస్తారు అన్న ప్రశ్న కాదు. ఆత్మ విశ్వాసం గల నన్ను ఎవరూ ఆపగలుగుతారన్నదే ప్రశ్న. నిజంగా ఆవిడ చెప్పిన మాటలు. ఆ అర్థం ఈ రోజు ఇక్కడ చూస్తే కనిపిస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతున్న ప్రతి ఆడబిడ్డలోనూ రాష్ట్రాలు, దేశాలు, అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న మహిళలు మన రాష్ట్రమే నిదర్శంగా కనిపిస్తుంది. దాదాపు 99 శాతం మంది ఇక్కడ వార్డు మెంబర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్స్, చైర్‌ పర్సన్లుగా, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లుగా, మేయర్లుగా ఇలా ఏదో ఒక కార్పొరేషన్‌కు చైర్‌పర్సన్‌గానో, డైరెక్టర్‌గా ఇక్కడికి వచ్చారు. నాతో పాటు మంత్రి వర్గ సహచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్, సభ్యులు, దేశ చరిత్రలోనే ఇంత మంది ప్రజాప్రతినిధులతో ఇటువంటి సమావేశం ఎప్పుడూ, ఎక్కడ జరిగి ఉండదని సగర్వంగా తలెత్తుకొని చెబుతున్నాను. మన ఆధ్వర్యంలో ఇలాంటి సభ జరుగుతుందని గర్వంగా చెబుతున్నాను. ఇదంతా కూడా దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనే.
ఈ రెండున్నరేళ్ల పాలన ఎలా సాగిందో చెబుతున్నాను. ఈ సందేశాన్ని గ్రామ గ్రామాన, ప్రతి నగరంలో, ప్రతి ఇంటా తెలియజేయాలని మిమ్మల్ని సవినయంగా చెబుతున్నాను.

రాజకీయ సాధికారత:
రాజకీయంగా మనం ఏం చేశామంటే..మహిళలకు చట్టసభల్లో 33 శాతం సీట్లు కేటాయించాలని 1993 నుంచి పార్లమెంట్‌లో బిల్లులు పెడుతూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఏ డిమాండ్లు, ఏ ఉద్యమాలు లేకున్నా..ఎవరు అడగకపోయినా..నామినేషన్‌ పోస్టులు, కాంట్రాక్టులు ఏకంగా 50 శాతం చట్టం చేసి మహిళలకే కేటాయించాం. ఏకైక ప్రభుత్వం దేశ చరిత్రలో మనదే. నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్లు 51 శాతం పదవులు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా మనదే. 1154 డైరెక్టర్‌ పదవులు ఇస్తే..అందులో నా అక్క చెల్లెమ్మలకు 586 పదవులు ఇచ్చాం. 202 మార్కెట్‌ యార్డు కమిటీ చైర్మన్‌ పదవుల్లో 102 మహిళలకే కేటాయించాం. 1356 రాజకీయ నియామకాల్లో 688 పదవులు అంటే 51 శాతం అక్కచెల్లెమ్మలకే కేటాయించాం. మనం ఇచ్చిన పదవులు అన్ని కూడా గమనిస్తే..శాసన మండలిలో తొలి మహిళా వైస్‌ చైర్మన్‌గా నా సోదరి జకియాఖానామ్‌ను నియమించాం. ఉప ముఖ్యమంత్రిగా మరో సోదరి, ఎస్టీ మహిళా శ్రీమతి పుష్పశ్రీవాణిని నియమించాం. రాష్ట్ర తొలి దళిత హోం మంత్రిగా సుచరితను నియమించాం. రాష్ట్ర ప్రభుత్వ తొలి మహిళా చీఫ్‌ సెక్రటరీగా, ఎన్నికల అధికారిణిగా నీలం సాహ్నిని నియమించాం. వీరంతా మన మహిళా అభ్యుదయభావజాలానికి నిదర్శనం.
జిల్లా పరిషత్‌ చైర్మన్ల ఎన్నికలు చూస్తే..13 జిల్లా పరిషత్‌ చైర్మన్లలో ఏడుగురు నా అక్కాచెల్లెమ్మలే..అక్షరాల 54 శాతం జెడ్పీ చైర్‌పర్సన్లుగా ఉన్నారు. వైస్‌ చైర్మన్లుగా 15 మంది మహిళలే. మొత్తంగా 12 మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ పోస్టులు, డిప్యూటీ మేయర్లు 36 పదవులు ఉంటే..ఇందులో 18 పదవుల్లో నా అక్కచెల్లెమ్మలనే కూర్చోబెట్టాం. వార్డు మెంబర్లు 671 మంది అయితే..వీరిలో 361 మంది నా అక్కచెల్లెమ్మలే. 
75 మున్సిపల్‌ ఎన్నికల్లో 73 చోట్ల మన పార్టీ జెండా ఎగురవేసింది. ఇందులో చైర్‌పర్సన్లుగా మహిళలు 45 మందిని కూర్చోబెట్టాం. 2123 మహిళా వార్డు మెంబర్లలలో 1161 మంది నా అక్కచెల్లెమ్మలకే దక్కాయి. 
సర్పంచ్‌ పదవుల్లో 57 శాతం నా అక్కచెల్లెమ్మలే. ఎంపీటీసీల్లో 54 శాతం, మండల అద్యక్షుల స్థానంలో 53 శాతం, జెడ్పీటీసీల్లో 53 శాతం నా అక్కచెల్లెమ్మలకే దక్కాయి. 
మనం అధికారంలోకి వచ్చిన తరువాత వాలంటీర్‌ ఉద్యోగాలు 2.60 లక్షల మంది ఉన్నారు. వీరిలో 53 శాతం నా చెల్లెల్లే ఉన్నారు. చిరునవ్వుతో గుడ్‌మార్నింగ్‌ చెబుతూ గ్రామాల్లో సేవలందిస్తున్నారు. మన గ్రామాల్లోనే సచివాలయాల్లో మన పిల్లలే ఉన్నారు. వీరిలో 51 శాతం నా చెల్లెమ్మలే పని చేస్తున్నారు. దేశ చరిత్రలో 28 రాష్ట్రాల చరిత్రలో మనకు సరిసమానంగా , ఆడపడుచులను బలపరిచిన ప్రభుత్వం మరెక్కడైనా ఉందా అని మీరే నిర్ణయించాలి.

ఈ ప్రశ్నలకు మీరే సమాధానం చెప్పాలి:
– దేశంలోని ఏ  ఒక్క రాష్ట్రంలోనైనా పిల్లలను 1 నుంచి 12వ తరగతి వరకు చదివిస్తున్న తల్లులకు ఏటా రూ.15 వేలు ఇచ్చే అమ్మ ఒడి పథకం ఉందా?
–44.50 లక్షల మంది నా అక్కచెల్లమ్మలకు అమ్మ ఒడి కింద రూ.13.22 కోట్లు రెండేళ్లలో ఇచ్చాం.
– దేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలోనైనా అక్క చెల్లమ్మలను ఆదుకునేందుకు పొదుపు సంఘాల గత రుణాలు తిరిగి ఇచ్చే వైయస్‌ఆర్‌ ఆసరా అనే పథకం ఎక్కడైనా ఉందా?. మన రాష్ట్రంలో ఏకంగా 80 లక్షల మంది పొదుపు సంఘాల ద్వారా ఈ ఒక్క పథకం ద్వారా రూ.12,758 కోట్లు చెల్లించాం. నాలుగు విడతల్లో నా అక్కచెల్లెమ్మలకు అక్షరాల రూ.25,512 కోట్లు ఇవ్వనున్న ప్రభుత్వం మనది. ఈ డబ్బులు పెట్టుబడిగా మార్చుకొని  వ్యాపారం చేయలనుకున్న వారికి బ్యాంకులతో మాట్లాడి. అక్కచెల్లెమ్మలను వ్యాపార వేత్తలుగా మాట్లాడేందుకు ప్రతి ఏటా కనీసంగా రూ.20 వేల కోట్లు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పిస్తున్నాం. 
– పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు క్రమం తప్పకుండా సున్నా వడ్డీ చెల్లిస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? . వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం ద్వారా ఇప్పటికే కోటి మంది అక్కచెల్లెమ్మలకు అక్షరాల రూ. 2,354 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసిన ప్రభుత్వం మనది. మీ అన్న ప్రభుత్వం.
– 45 –60 సంవత్సరాల వయసు  బాధ్యతల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రతి ఏటా ఆర్థికసాయంగా వైయస్‌ఆర్‌ చేయూత పథకం ద్వారా రూ.18,750 ఇస్తున్నాం. ఇలాంటి పథకం ఎక్కడైనా ఉందా? అక్షరాల 24.90 లక్షల మందికి ..రెండు విడతలుగా ఇప్పటి వరకు రూ.9,180 కోట్లు ఇచ్చాం. బ్యాంకులతో మాట్లాడాం. వివిధ కార్పొరేట్‌ సంస్థలతో మాట్లాడాం. వారి ఆదాయ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నాం. రిలయన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ వంటి సంస్థలు మహిళల ఆర్థికాభివృద్ధికి  సహకరిస్తున్నాయి. ఇలాంటి ప్రభుత్వందేశంలో ఎక్కడైనా ఉందా?
– దేశంలోనే అత్యధికంగా 2500 పింఛన్‌ రూపంలో ఇవ్వడమే కాకుండా వికలాంగులు, అవ్వతాతలకు  ఇంత సొమ్ము ఇవ్వడమే కాదు. గడప వద్దకే వెళ్లి గుడ్‌ మార్నింగ్‌ చెప్పి పింఛన్‌ ఇస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?. వైయస్‌ఆర్‌ పింఛన్‌ కానుకగా 61.74 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. వీరిలో 36 లక్షల మంది నా అక్కచెల్లెమ్మలే ఉన్నారు. వీరికి మాత్రమే రూ.28,885 కోట్లు నేరుగా ఇస్తున్నాం.
– ఇల్లు లేని ప్రతి నిరుపేదకు అది కూడా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా అందులో ఇళ్లు నిర్మించేందుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లు చేయించిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?. ఈ ఒక్క పథకమే ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలో రూ.10 లక్షల సొమ్ము ఉన్నట్లుగా ఉంటుంది. దేశంలోనే ఎక్కడా జరగడం లేదు. 
– పెద్ద చదువుల కోసం అప్పులపాలు అయ్యే పరిస్థితి లేకుండా పిల్లల చదువులకు మా అన్న, తమ్ముడు భరోసా ఉందని చెప్పే ప్రభుత్వం ఎక్కడైనా ఉందా? వంద శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? అక్షరాల జగనన్న విద్యా దీవెన ద్వారా 21.55 లక్షల మంది తల్లులలకు రూ.6,260 కోట్లు నేరుగా ఇచ్చాం. గత ప్రభుత్వం బకాయిలుగా పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను మన  ప్రభుత్వమే చెల్లించింది. జగనన్న వసతి దీవెన కింద మరో రూ.2530 కోట్లు ఇచ్చాం.
– వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ ద్వారా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించేందుకు, ఆరు ఏళ్ల లోపు ఉన్న పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. గిరిజన ప్రాంతాల్లో సంపూర్ణ పోషన్‌ ప్లస్‌ పథకాన్ని అమలు చేస్తున్నాం. ఇందుకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?
– వైయస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా 3.80 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటూ రూ.75 వేలు ఇస్తున్నాం. ఇప్పటికే 980 కోట్లు ఇస్తూ మేలు చేశాం. ఇటువంటి పథకం గత ప్రభుత్వం ఏనాడైనా, ఎప్పుడైనా అమలు చేసిందా?
–వైయస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం ద్వారా దేశంలోనే తొలిసారిగా పేద అగ్రవర్ణ మహిళలకు ఆర్థికసాయం అందిస్తున్నాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల ఓసీ మహిళలకు మూడేళ్ల పాటు తోడుగా ఉంటూ ఈ పథకానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే రూ.590 కోట్లు వారి ఖాతాల్లోనే జమ చేశాం. దేశంలోనే ఎక్కడా కూడా ఇలాంటి పథకం లేదు.
– ఇలా 34 నెలల కాలంలో నేరుగా డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మలకు రూ.83,509 కోట్లు అందించాం. 
పరోక్షంగా లబ్ధి మరో రూ.34850 కోట్లు ఇచ్చాం. మహిళలకు మాత్రమే అందించిన సొమ్ము రూ.1.18 లక్షల కోట్లు అందించామని సగర్వంగా తెలియజేస్తున్నాం. జగనన్న గోరుముద్దు, జగనన్న విద్యా కానుక, స్వేచ్ఛ, నాడు–నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చేలా ఒక నిశ్శబ్ధ విప్లవానికి దోహాదపడుతున్నాయి.

మహిళల రక్షణ:
మన రాష్ట్రంలో దిశ బిల్లును రూపకల్పన చేశాం. చట్టసభలో ఆమోదం తెలిపాం. సాక్ష్యాధారలు ఉన్న కేసుల్లో 7 రోజుల్లోనే విచారణ చేసి 21 రోజుల్లోనే తీర్పు ఇవ్వాలని చట్టం చేశాం. ఆ బిల్లు కేంద్రంతో ముడిపడిన అంశం. కేంద్రం ఆమోదం పొందిన వెంటనే అమలు చేసేదిశగా అడుగులు వేస్తున్నాం.
బాలికలు, మహిళల రక్షణ కోసం దిశా యాప్‌ తీసుకువచ్చాం. ఇప్పటి వరకు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుంది 1.13 కోట్లు మంది డౌన్‌ లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్‌ ఫోన్‌లో ఉంటే..వారికి అన్న తోడుగా ఉన్నట్లే. ఆపదలో ఉంటే కేవలం ఎస్‌వోఎస్‌ బటన్‌ నొక్కినా. లేదా ఐదుసార్లు ఫోన్‌ ఊపితే చాలు పది నిమిషాల్లో పోలీసులు మీ వద్దకు వచ్చి తోడుగా ఉంటారు. గొప్ప వ్యవస్థను రాష్ట్రంలో పని చేస్తుంది. యాప్‌ ద్వారా ఇప్పటికే 900 మందిని ఆపదలో నుంచి రక్షించాం. 
కేవలం అక్కచెల్లెమ్మల కాల్స్‌ను అటెండ్‌ చేయడమే కాకుండా నేరానికి సంబంధించిన దర్యాప్తు, చార్జ్‌షిట్‌ చేయడానికి గతంలో 169 రోజులు పట్టేది. మన ప్రభుత్వంలో 61 రోజులకు తగ్గించాం. ఇది పెద్ద అచ్‌వ్‌మెంట్‌. కేవలం 7 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షిట్‌లు చేసిన కేసులు 1132 అని సగర్వంగా చెబుతున్నాం. మహిళల నేరాలకు సంబంధించి ఇలాంటి కేసుల దర్యాప్తు వేగంగా జరుగుతున్నది మన రాష్ట్రమే. నేరాలకు పాల్పడిన వారి మీద హిస్టరీ షీట్స్, సైబర్‌ బుల్లింగ్‌ షిట్స్‌ తెరుస్తున్నాం. సెక్స్‌వల్‌ అపెండర్స్‌పై జీయో ట్యాంగింగ్‌ చేసి వారిని వెంబడిస్తున్నాం. అక్కచెల్లెమ్మలకు ఏరకమైన ఇబ్బంది జరిగినా చర్యలు తీసుకుంటున్నాం. అన్నింటికి మించి దిశ యాప్‌ బ్రహ్మస్త్రం అయితే ఈ రోజు ప్రతి వార్డు, గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీసును నియమించాం. ఇది ఒక పెద్ద విప్లవాత్మక మార్పు. పాపైనా, బాబు అయినా ఇద్దరిని సమానంగా చూడాలి. ఆడవారిపై వేధించడాన్ని, చులక చేయడాన్ని మనమందరం కలిసికట్టుగా వ్యతిరేకించాలి. కించపరచడం, వేధించడం వంటి రక్షస గుణాలు ఎవరూ కూడా చేయకూడదు. మరుతున్న సమాజంతో మనిషి కూడా ఎదగాలి. గతంలో కోడలు మగబిడ్డ కంటానంటే అత్త వద్దంటుందా అన్నారు. ఈ రోజు నేను చెబుతున్నా..నాకు ఉన్నది ఇద్దరు ఆడబిడ్డలే. మహిళాభివృద్ధికి కట్టుబడి అడుగులు వేస్తున్న మీ అన్న ప్రభుత్వానికి తోడుగా ఉండాలని,మరోక్కసారి మీ అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సెలవు తీసుకున్నారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top