తాడేపల్లి: రాష్ట్రంలో మూడేళ్లుగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు.. చేసిన అభివృద్ధి.. అందిస్తున్న సుపరిపాలనను ప్రజలకు చాటిచెప్పడానికి సర్కార్ చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. గత నెల 11వ తేదీన ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా.. ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్‌లకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి వెళ్లినప్పుడు వస్తున్న స్పందన.. అక్కడికక్కడే సమస్యల పరిష్కారం తదితరాలను సమీక్షించి.. మరింత సమర్థవంతంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం వైయస్ జగన్ వర్క్‌షాపు నిర్వహిస్తున్నారు. అధికారం చేపట్టిన మూడేళ్లలోనే ఎన్నికల్లో ఇచ్చిన 95 శాతం హామీలను సీఎం జగన్ అమలు చేశారు. అర్హతే ప్రమాణికంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తున్నారు. మూడేళ్లలోనే సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.43 లక్షల కోట్లను జమ చేశారు. నాడు–నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను ఆధునికీకరించి.. నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తున్నారు. గత సర్కార్ పాపం వల్ల శిథిలమైన రహదారులను బాగు చేస్తున్నారు. జిల్లాకో వైద్య కళాశాలను నిర్మిస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్‌ల నిర్మాణాన్ని చేపట్టారు. ప్రజల సౌకర్యార్థం.. పరిపాలన సౌలభ్యం కోసం పునర్ వ్యవస్థీకరణ ద్వారా 26 జిల్లాలను ఏర్పాటు చేశారు. విప్లవాత్మక సంస్కరణల ద్వారా సుపరిపాలన అందిస్తున్నారు. మూడేళ్లుగా చేస్తున్న ఈ కార్యక్రమాలను వివరించి.. రానున్న రెండేళ్లలోనూ ఇదే రీతిలో మంచి చేస్తామని భరోసా ఇచ్చి.. ఆశీర్వదించాలని ప్రజలను కోరేందుకే గత నెల 11న గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సర్కార్ చేపట్టింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ వెళ్తున్న ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు అక్కడికక్కడే పరిష్కరిస్తుండడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.