రైతన్నకు ఏ కష్టం రానివ్వం

వైయస్‌ఆర్‌ రైతు భరోసా కింద మూడో ఏడాది తొలి విడత సాయం

52.38 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.3,928.88 కోట్లు జమ

కోవిడ్‌ కష్టకాలంలోనూ రైతన్నకు పెట్టుబడిసాయం అందిస్తున్నాం

23 నెలల పాలనలో రూ.89 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశాం

కేవలం రైతు సంక్షేమం కోసం రూ.68 వేల కోట్లు ఖర్చుచేశాం

‘వైయస్‌ఆర్‌ రైతు భరోసా’ ద్వారా రూ.17,029 కోట్లు అందించాం

వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ కోసం రూ.17,430 కోట్లు వెచ్చించాం 

‘ఉచిత పంటల బీమా’ కింద 38 లక్షల మంది రైతన్నలకు మరో రూ.2 వేల కోట్లు 

23 నెలల కాలంలో మేనిఫెస్టోలోని హామీల్లో 95 శాతం పైగా నెరవేర్చాం

మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తున్నాం

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు, వారు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928.88 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని వరుసగా మూడో ఏడాది తొలి విడత సాయాన్ని రైతన్నలకు అందజేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన 23 నెలల పరిపాలనలో కేవలం రైతన్నల కోసం ఏకంగా రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. ఒక్క వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం కింద రూ.17,029 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. 

వైయస్‌ఆర్‌ రైతు భరోసా –పీఎం కిసాన్‌ పథకంలో భాగంగా ఖరీఫ్‌ సాగు సమీపిస్తున్న తరుణంలో 52.38 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికీ రూ.7,500 చొప్పున జమ చేశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి రైతుల ఖాతాల్లో మొత్తంగా రూ.3,928.88 కోట్లను వైయస్‌ జగన్‌ జమ చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతాంగాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు. 

ఈ మేరకు సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నందుకు సంతోషంగా ఉంది. కోవిడ్‌ కష్టకాలంలో ఉన్నప్పటికీ ఆర్థికంగా వనరులు అనుకున్న స్థాయిలో లేకపోయినా ఎక్కడా ప్రభుత్వానికి ఉన్న కష్టం కంటే రైతులకు, పేదవాడికి ఉన్న కష్టాలు ఎక్కవని, వారికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని దృక్పథంతో అడుగులు ముందుకువేస్తూ వచ్చాం. అందులో భాగంగానే 52.38 లక్షల మంది రైతన్నలకు మూడో ఏడాదికి సంబంధించి మొదటి విడత కింద రూ.3,928.88 కోట్లు జమ చేస్తున్నాం. 

దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో 23 నెలల పరిపాలన చూసినట్టయితే.. దాదాపుగా రూ.89 వేల కోట్ల రూపాయలు.. వినడానికే ఆశ్చర్యం కలిగే విధంగా నేరుగా బటన్‌ నొక్కగానే లబ్ధిదారుల అకౌంట్లలోకి అయ్యే విధంగా చేశాం. ఎక్కడా లంచాలు, వివక్ష లేవు, సోషల్‌ ఆడిట్‌లో జాబితా ప్రదర్శించి.. అర్హత ఉన్నవారందరినీ చేర్చి ప్రతి పేదవాడికి కూడా సహాయం అందించే విధంగా దేవుడి దయ, మీ అందరి దీవెనలతో అడుగులు ముందుకు వేశాం. 

అరకోటికి పైగా రైతన్నలకు రూ.3,928 కోట్లు వారి ఖాతాల్లోకి వరుసగా మూడవ సంవత్సరం సాయం అందిస్తున్నాం. 2019–20 నుంచి ఇప్పటి వరకు వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ద్వారా రూ.13,101 కోట్లు రైతుల ఖాతాల్లో వేయగలిగామని రైతు బిడ్డగా, మీ బిడ్డగా గర్వంగా తెలియజేస్తున్నాను. ఈ రోజు  అందిస్తున్న రూ.3,928 కోట్లు కలుపుకుంటే.. రైతు భరోసా సాయం కింద రూ.17,029 కోట్లు దేవుడి దయతో ఇవ్వగలుగుతున్నాం. 

23 నెలల పరిపాలనను గమనిస్తే.. రైతన్నలకు నేరుగా రూ.68 వేల కోట్లకు పైగా సాయం అందించామని గర్వంగా చెబుతున్నాను. రైతు భరోసా పథకం కింద 52.38 లక్షల మంది రైతులకు రూ.17,029 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ సున్నావడ్డీ కింద పంట రుణాలు గత ప్రభుత్వ బకాయిలతో కలుపుకుంటే.. అక్షరాల 67.50 లక్షల మంది రైతన్నలకు రూ.1,261 కోట్లు ఇవ్వగలిగాం. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా కింద 15.67 లక్షల మంది రైతన్నలకు ఇప్పటి వరకు రూ.1,968 కోట్లు ఇవ్వగలిగాం. ప్రకృతి విపత్తు వల్ల నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 13.56 లక్షల మంది రైతులకు రూ.1,038 కోట్లు ఇవ్వగలిగాం. ధాన్యం కొనుగోలు కోసం అక్షరాల రూ.18,343 కోట్లు ఖర్చు చేశాం. ఇతర పంటలు కూడా కొనుగోలు చేసి రైతన్నలకు తోడుగా నిలబడేందుకు 23 నెలల కాలంలో అక్షరాల రూ.4,761 కోట్లు ఖర్చు చేయగలిగాం అని గర్వంగా చెబుతున్నా..

ఉచితంగా వ్యవసాయ విద్యుత్‌ సబ్సిడీకి రూ.17,430 కోట్లు ఖర్చు చేయగలిగాం. పగటి పూట నాణ్యమైన ఉచిత విద్యుత్‌ రైతన్నలకు అందాలి.. ఎటువంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వడం కోసం ఫీడర్లలో నాణ్యత పెంచడం కోసం రూ.1,700 కోట్లు కూడా మీ బిడ్డ చిరునవ్వుతో ఇవ్వగలిగాడని గర్వంగా తెలియజేస్తున్నాను. 

గత ప్రభుత్వం ధాన్యానికి పెట్టిన బకాయిలు రూ.960 కోట్లు చిరునవ్వుతో మీ బిడ్డ తీర్చాడు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన విత్తన బకాయిలుగా పెట్టిపోతే.. రైతన్నలకు నష్టం జరగకూడదని ఆ బకాయిలను సైతం తీర్చడానికి రూ. 384 కోట్లు వెచ్చించామని గర్వంగా చెబుతున్నా. అధికారంలోకి రాగానే శనగ రైతులకు బోనస్‌ ఇవ్వడం కోసం దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేశాం. 

సూక్ష్మ సేద్యం, పండ్ల తోటల అభివృద్ధి కోసం 13.58 లక్షల ఎకరాల్లో రూ.1224 కోట్లు ఖర్చు చేశాం. ఆక్వా రైతులను ఆదుకునేందుకు రూపాయిన్నరకే విద్యుత్‌ ఇస్తున్నాం. సంవత్సరానికి రూ.760 కోట్ల భారం పడుతున్నా.. ఆ భారాన్ని భరిస్తూ రెండు సంవత్సరాల్లో అక్షరాల రూ.1560 కోట్లు దానికి కూడా వెచ్చించాం. 23 నెలల కాలంలో రైతన్నల కోసం.. అక్షరాల రూ.68 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇది రైతు పక్షపాత ప్రభుత్వమని సగర్వంగా, మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 

దేశంలో ఎక్కడా లేని విధంగా సొంత భూమి సాగుచేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కౌలు రైతులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ అటవీ భూములు ఉన్న రైతన్నలకు, దేవాదాయ భూములు సేద్యం చేసుకుంటున్న రైతన్నలకు సైతం రైతు భరోసా కింద ప్రతి ఏటా రూ. 13,500 అందజేస్తున్నాం. రాష్ట్రంలోని దాదాపు 50 శాతం రైతాంగం అర హెక్టార్‌ (1.25 ఎకరాల) లోపు ఉన్నవారే. ఒక హెక్టార్‌ వరకు తీసుకుంటే రాష్ట్రంలో దాదాపు 70 శాతం మంది రైతులున్నారు. వీరందరికీ పెట్టుబడి సాయంగా ఇస్తున్న రూ.13,500తో దాదాపుగా పెట్టుబడి ఖర్చులో 80 శాతం కలిసొచ్చే పరిస్థితి. 

మేనిఫెస్టోలో రూ.12500 ఇస్తామని, నాలుగు సంవత్సరాల పాటు రూ.వేలు ఇచ్చేలా చేస్తామని చెప్పాం. అధికారంలోకి వచ్చిన తరువాత రైతన్నల కష్టాలు చూసి.. వారిని వెంటనే ఆదుకునేందుకు అడుగులు ముందుకువేశాం. చెప్పినదానికంటే ఎక్కువగా, నాలుగేళ్ల సాయాన్ని ఐదేళ్లు ఇచ్చే దిశగా అడుగులు వేశాం. రూ.50 వేలు ఇస్తామని చెబితే.. అక్షరాల రూ.67,500 ఇచ్చే కార్యక్రమం చేసి.. రూ.17,500 అదనంగా ఇవ్వగలుగుతున్నామని ప్రతి రైతన్నకు మీ బిడ్డగా తెలియజేస్తున్నాను. 

ఖరీఫ్‌ సమీపిస్తుంది. మే మాసంలో ఉన్నాం. జూన్‌లో పంటలు వేసే పరిస్థితి. రైతన్నలకు పెట్టుబడి కోసం ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ రోజు మొదటి విడత రైతు భరోసా కింద రూ.7,500 ఇవ్వడమే కాకుండా.. వైయస్‌ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం కింద ఈ నెల 25 తేదీన దాదాపుగా 38 లక్షల మంది రైతన్నలకు మరో రూ.2 వేల కోట్లు అందించబోతున్నాం. దాదాపు 5 కోట్లకు పైగా జనాభా ఉన్న మన రాష్ట్రంలో రైతులు, మహిళలు, పిల్లలు, మరీ ముఖ్యంగా పేదవర్గాల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరినీ ఆదుకునే దిశగా 23 నెలల పరిపాలన సాగింది. 

మామూలుగా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు 600 పేజీల పుస్తకం తయారు చేసి.. ఎన్నికలు అయిపోయిన తరువాత ఆ పుస్తకాలను చెత్తబుట్టలో పడేయడం మనమంతా చూశాం. కానీ, అలాంటి పరిస్థితి లేకుండా.. ఎన్నికలప్పుడు కేవలం రెండు పేజీల మేనిఫెస్టో ఇచ్చి.. ఇదే భగవద్గీత, బైబిల్, ఖురాన్‌ అని చెప్పి.. దీన్ని తూచా తప్పకుండా అమలు చేసే ప్రతి అడుగు ముందుకు వేస్తామని చెప్పాం. 23 నెలల కాలంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో 95 శాతం పైగానే పూర్తి చేయగలిగామని సగర్వంగా మీ బిడ్డలా, దేవుడి దయతో చేయగలిగాం అని తెలియజేస్తున్నాను. 

కోవిడ్‌ను సమూలంగా రూపుమాపాలంటే వ్యాక్సినేషన్‌తోనే సాధ్యమని అందరికీ తెలిసిన విషయమే. కానీ, మన దేశంలో పరిస్థితి ఏమిటీ అనేది అందరికీ తెలుసు. దేశంలో 45 ఏళ్లు పైబడిన వారు 26 కోట్ల మంది ఉన్నారని కేంద్ర ప్రభుత్వమే లెక్కలు తేల్చింది. ఒక్కొక్కరికి రెండు డోసులు చొప్పున 26 కోట్ల మందికి ఇవ్వాలంటే అక్షరాల 52 కోట్ల డోసులు కావాలి. అదే మాదిరిగా 45 ఏళ్ల దిగువన, 18 ఏళ్ల పైబడిన వారి జనాభా 60 కోట్లు ఉన్నారు. వారికి రెండు డోసుల కింద లెక్కేస్తే అక్షరాల 120 కోట్ల డోసులు కావాలి. రెండూ కలిపితే దేశానికి 172 కోట్ల డోసులు కావాలి. ఇంత వరకు దేశంలో వ్యాక్సిన్ల పరిస్థితి.. కేవలం 18 కోట్ల మందికి మాత్రమే. 10, 11 శాతం కూడా దేశ జనాభాలో వ్యాక్సిన్లు ఇవ్వలేకపోయాం. 

రాష్ట్రంలో 45 సంవత్సరాలు పైబడిన వారు, ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ కలిపి అక్షరాల 1.48 కోట్ల మంది ఉన్నారు. వారికి రెండు డోసులు ఇవ్వాలంటే అక్షరాల 2.96 కోట్ల డోసులు కావాలి. 45 సంవత్సరాల దిగువన, 18 సంవత్సరాల పైబడి ఉన్న జనాభా చూస్తే అక్షరాల 2 కోట్ల జనాభా, వారికి రెండు డోసులు చొప్పున 4 కోట్ల డోసులు అవసరం. రెండూ కలిపితే రాష్ట్రంలో 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటే.. అక్షరాల వ్యాక్సిన్‌ కంపెనీలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేస్తూ మన రాష్ట్రానికి సప్లయ్‌ చేసింది కేవలం 73 లక్షలు మాత్రమే. 10, 11 శాతం మించని పరిస్థితి. 

రాష్ట్రం పరిస్థితి, దేశం పరిస్థితి ఈ మాదిరిగా ఎందుకు ఉందంటే.. దేశంలో రెండే కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేస్తున్నాయి. భారత్‌ బయోటెక్‌ కంపెనీ నెలకు కోటి వ్యాక్సిన్లు మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం. సీరం ఇనిస్టిట్యూట్‌ అనే మరో కంపెనీ.. నెలకు 6 కోట్ల వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యం. రెండూ కలిపితే.. కేవలం నెలకు 7 కోట్లు మాత్రమే మ్యానిఫ్యాక్చర్‌ చేసే సామర్థ్యం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో మనకున్న మార్గాలు గమనిస్తే.. కోవిడ్‌తో సహజీవనం చేయని పరిస్థితి. ఒకవైపు జాగ్రత్తలు తీసుకుంటూ.. యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఉందని ప్రతి రైతన్నకు, ప్రతి ఒక్కరికీ తెలియజేస్తున్నాను.

మనకున్న పరిస్థితుల్లో చేయాల్సిన పనులు చేసుకుంటూ వెళ్తూనే తగు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. మాస్కులు వేసుకోవడం దగ్గర్నుంచి, భౌతిక దూరం, చేతులు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ రెగ్యులర్‌గా మన జీవితంలో ఒక భాగం కింద అలవాటు చేసుకొని కోవిడ్‌పై మన యుద్ధం జరగాలని అందరూ గుర్తుంచుకోవాలని కోరుతున్నాను. 

రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు, ఇబ్బందులున్నా రైతులకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం జరగకూడదు.. ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ ఖాతాల్లోకి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని గర్వంగా చెబుతున్నాను. ఈ కార్యక్రమం ద్వారా రైతన్నలకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి దయతో మీ బిడ్డ ఇంక ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top