రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు వెంట‌నే విడుద‌ల చేయాలి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ

కృష్ణాజలాల అంశంపై  సీఎం వైయ‌స్‌ జగన్‌ అభ్యంతరం

పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైనా సీఎం వైయ‌స్ జగన్‌ కేంద్ర హోంమంత్రితో చర్చ‌

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలపై చర్చించారు. పోలవరం ప్రాజెక్ట్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. అలాగే కృష్ణా జలాల అంశంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అమిత్‌షాతో సీఎం  వైయ‌స్ జగన్‌ చర్చించిన అంశాలు ఇలా ఉన్నాయి.. 

కృష్ణాజలాల అంశంపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైయ‌స్‌ జగన్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. తదుపరి చర్యలు తీసుకోకుండా నిలిపేయాలని కోరారు. కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌ ( KWDT-II) నిర్ణయాన్ని సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో 5 ఎస్‌ఎల్‌పీలు ఇప్పటికే పెండింగ్‌లో ఉన్నాయని కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. గతంలో ఇదే అంశంపై రెండు సార్లు 2021 ఆగస్టు 17న, 2022 జూన్‌ 25న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరించారు.

KWDT-IIకి విధివిధానాలు (ToR) జారీకి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల ఏపీ ప్రజల ప్రయోజనాలకు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరం వ్యక్తం చేశారు. విధివిధానాలను బేసిన్‌లోని కర్ణాటక, మహారాష్ట్రలకు కాకుండా కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు పరిమితం చేయడం అశాస్త్రీయమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, తదుపరి చర్యలు తీసుకోకుండా సంబంధిత వ్యక్తులను ఆదేశించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదలపైనా సీఎం వైయ‌స్ జగన్‌ కేంద్ర హోంమంత్రితో చర్చించారు. ప్రాజెక్టు పూర్తి నిర్మాణం వ్యయంపై తాజా అంచనాలకు ఆమోదం తెలపాల్సి ఉందని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించాలని అభ్యర్థించారు. 2017-18 ధరల సూచీ ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం రూ. 55,548.87 కోట్లుగా ఇప్పటికే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు.
 
పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు డబ్బు విడుదలచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పలుమార్లు చేసిన విజ్ఞ‌ప్తి మేరకు రూ.12,911.15 కోట్ల విడుదలకు  ఆమోదం లభించిందని, అయితే దీన్ని పునఃపరిశీలించి తాజాగా అంచనాలను రూపొందించామన్నారు. లైడార్‌ సర్వేప్రకారం అదనంగా 36 ఆవాసాల్లో ముంపు కుటుంబాలను రక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉందని, పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి ఇంకా రూ.17,144.06 కోట్లు అవసరమవుతాయని ఆమేరకు నిధులు విడుదలచేయాలని అభ్యర్థించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంకోసం రాష్ట్ర ప్రభుత్వం తన సొంత నిధుల నుంచి ఖర్చు చేసిన రూ.1,355 కోట్లను రీయింబర్స్‌ చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. 
 

Back to Top