కల్యాణ మిత్రలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ భరోసా

వారికిచ్చే ప్రోత్సాహకం పెంచుతామని హామీ

 అమరావతి : గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్‌) ఆధ్వర్యంలో పనిచేస్తున్న కల్యాణ మిత్రలకు అందించే ప్రోత్సాహకం పెంచుతామని ముఖ్యమంత్రి వైఎయ‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.  తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంను కల్యాణ మిత్రలు కలిశారు. ఈ సందర్భంగా కల్యాణ మిత్రల ప్రతినిధులు ఎం.స్వప్న, కె.విజయదుర్గలు తమ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. వైయ‌స్ఆర్‌ పెళ్లి కానుక కార్యక్రమానికి తమనే కల్యాణ మిత్రలుగా ఉంచాలని విన్నవించారు. తమకిచ్చే ప్రోత్సాహకం ఎంతమాత్రం సరిపోవట్లేదని వాపోయారు. అదే సమయంలో కల్యాణ మిత్రలను తొలగిస్తారనే ప్రచారం జరుగుతోందని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిస్తూ.. తాను ముఖ్యమంత్రిగా కొనసాగినంతకాలం మీరే కల్యాణ మిత్రలుగా ఉండి పెళ్లిళ్లు నిర్వహిస్తారంటూ వారికి భరోసానిచ్చారు. పగలు జరిగే పెళ్లికి ఇచ్చే రూ.250 ప్రోత్సాహకం మొత్తాన్ని రూ.500కు, రాత్రి జరిగే పెళ్లికిచ్చే మొత్తాన్ని రూ.500 నుంచి రూ.1000కి, ఫీల్డ్‌ వెరిఫికేషన్‌కు ఇచ్చే మొత్తాన్ని రూ.300 నుంచి రూ.600కి పెంచుతామని హామీ ఇచ్చారు. దీంతో కల్యాణ మిత్ర ప్రతినిధులు సీఎంకు తమ కృతజ్ఞతలు తెలియజేశారు.

మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లకు ఉద్యోగ భద్రత...
మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ సీఎం వైయ‌స్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని మండల మహిళా సమాఖ్య అకౌంటెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు జెలినా, సమతలు శుక్రవారం కలసి 15 ఏళ్లుగా తాము పనిచేస్తున్నామని, కానీ కనీస వేతనం లేదని వాపోయారు. తమకు హెచ్‌ఆర్‌ పాలసీ, ఉద్యోగ భద్రత లేవని తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం.. మహిళా సమాఖ్య అకౌంటెంట్లందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాల్‌ సెంటర్‌ ఇన్సూరెన్స్‌ ఉద్యోగులు కూడా ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను విన్నవించారు.

Back to Top