వరద ప్రభావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేరిన‌ సీఎం వైయ‌స్ జగన్ 

 తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ప‌ర్య‌టించేందుకు కొద్దిసేప‌టి క్రితం తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాల‌యం నుంచి బ‌య‌లుదేరారు. ఇవాళ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడనున్నారు. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెం సందర్శించనున్నారు. సాయంత్రం రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు. రాత్రికి అక్కడే బసచేయనున్నారు.

మంగళవారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పర్యటించి, వరద ప్రభావిత గ్రామాల ప్రజలతో సీఎం వైయ‌స్‌ జగన్‌ నేరుగా మాట్లాడనున్నారు. వరద సహాయ, పునరావాస చర్యలు అమలు చేసిన తీరుపై స్వయంగా బాధిత కుటుంబాలను అడిగి తెలుసుకోనున్నారు. గోదావరి వరదలతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో ఇటీవల పలు ప్రాంతాలు వరద ముంపునకు గురైన విషయం తెలిసిందే.

సీఎం వైయ‌స్ జగన్‌ షెడ్యూల్‌
సోమవారం ఉదయం 9.30 గంటలకు సీఎం వైయ‌స్‌ జగన్‌ తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి, అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం కోతులగుట్ట చేరుకుంటారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో మాట్లాడతారు. కూనవరం బస్టాండ్‌ సెంటర్‌లో కూనవరం, వీఆర్‌ పురం మండలాల వరద బాధితులతో సమావేశం అవుతారు. అనంతరం ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం గొమ్ముగూడెం చేరుకుంటారు.

అక్కడ వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలిస్తారు. ఆ తర్వాత వరద బాధిత కుటుంబాలతో సమావేశమవుతారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. మంగళవారం ఉదయం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం గురజాపులంక చేరుకుంటారు.

అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తానేలంక రామాలయంపేట గ్రామం వెళతారు. అక్కడ వరద బాధితులతో సమావేశమవుతారు. ఆ తర్వాత అయినవిల్లి మండలం తోటరాముడివారిపేట, కొండుకుదురు చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

తాజా వీడియోలు

Back to Top