అనంతపురం : తెలుగుదేశం, జనసేన పార్టీలు పొత్తుతో వెళ్తాయని పవన్ కళ్యాణ్ చెప్పడంలో ఆశ్చర్యమేమీ లేదని.. చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడన్న భావన ప్రజల్లో ఉందని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. ఎవరు ఏకమైనా రానున్న ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని, తమ పొత్తు ప్రజలతోనే ఉంటుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాపులకు రాజ్యాధికారం అంటూ జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణ్.. చివరకు కాపు సామాజిక వర్గ ఆత్మగౌరవాన్ని తెలుగుదేశం పార్టీ కాళ్ల వద్ద తాకట్టుపెట్టారని విమర్శించారు. పవన్ వ్యవహారశైలిపై కాపు సామాజిక వర్గం ఆలోచించాలని కోరారు. 2014లో టీడీపీ, జనసేన పార్టీలకు పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు. 2019 ఎన్నికల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేక ఓట్లతో వైయస్ఆర్ సీపీకి లబ్ధి కలగకూడదన్న లక్ష్యంతో పొత్తు లేకుండా పోటీ చేశారని తెలిపారు. ఈ రోజు కూడా కేవలం వైయస్ఆర్ సీపీని ఓడించాలన్న ఆలోచనతోనే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటున్నాయని అన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు దోపిడీ పాలన చేశారని మండిపడ్డారు. స్కిల్ స్కాంలోనే కాకుండా రాజధాని, ఇన్నర్ రింగ్ రోడ్డు, సచివాలయ నిర్మాణాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలిపారు. సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి చదరపు అడుగుకు రూ.2 వేలు వెచ్చించాల్సిన చోట ఏకంగా రూ.9500 ఖర్చు చేశారని తెలిపారు. అనేక కేసుల్లో స్టేలు తెచ్చుకున్న చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. ఇప్పుడు స్కిల్ స్కాంలో చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. వ్యక్తిగతంగా చంద్రబాబు, టీడీపీ పట్ల తమకు ఎలాంటి ద్వేషం లేదని స్పష్టం చేశారు. అలాగని చంద్రబాబు చేసిన అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్న ఘనత సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిదని అన్నారు. 2014, 2019 ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేశామని, 2024 ఎన్నికల్లోనూ ఒంటరిగానే వస్తామని తెలిపారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. ప్రజలకు ఎవరు మంచి చేస్తున్నారన్న విషయం తెలుసని, తప్పకుండా రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్నారు.