కాకినాడ: చంద్రబాబు అరెస్టు రాజకీయ కక్ష కాదు..ఆ అవసరం ప్రభుత్వానికి ఏ మాత్రం లేదని మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. కాకినాడలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన కోసం.. ఆయనపై కాదు: అమరావతిలో రెండు కంపెనీలకు మాత్రమే పనులు అప్పగించి, వాటి నుంచి పొందిన లెక్క చెప్పని రూ. 118 కోట్ల అక్రమ వ్యవహారం ఇటీవలే బయట పడింది. దానిపై చంద్రబాబుకు ఐటీ నోటీసులు కూడా జారీ చేసింది. ఆ కేసులో ఉన్న వారే, ఇక్కడా స్కిల్ డెవలప్‌మెంట్ అక్రమ వ్యవహారంలో ఉన్నారు. ఇవాళ హఠాత్తుగా చంద్రబాబును అరెస్టు చేయలేదు. ఆయన కోసం, ఆయనపై దర్యాప్తు జరగలేదు. దీనిపై చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 2017లో కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన ఈడీ, జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు చేశాయి. ఆ తర్వాత సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేసింది. దీంతో మొత్తం అక్రమ వ్యవహారం తేటతెల్లమైంది. ఇకనైనా వైఖరి మార్చుకొండి: అందుకే ఇకనైనా దొంగ ఏడుపులు మానాలి. రాజకీయ కక్ష అన్న ఆరోపణలు వీడాలి. ప్రతి అంశంలోనూ చంద్రబాబుది అంతులేని అవినీతి. అందుకే ప్రజలు ఆయనకు 2019లో గట్టిగా బుద్ధి చెప్పారు. అనుకూల సొంత మీడియా ఉంది కాబట్టి, ఏదైనా ప్రచారం చేసుకోవచ్చన్న ధైర్యంతో ఇన్ని అక్రమాలు చేశారు. ఇది ఏ విధంగా కూడా రాజకీయ కక్ష కాదు. ప్రభుత్వానికి ఆ అవసరం ఏ మాత్రం లేదు. ఆనాడు అన్నీ తుంగలో తొక్కి ..: 2014లో అధికారంలోకి రాగానే, స్కిల్ స్కామ్‌కు వ్యూహరచన చేశారు. దాదాపు రూ. 3700 కోట్ల విలువైన ప్రాజెక్టులో 90 వాతం సీమెన్స్ సంస్థ సమకూరిస్తే, మిగిలిన 10 శాతం ఇస్తుందని చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ కోసం ఏదైనా ఒక సంస్థ ముందుకొస్తే, అసలు ఆ సంస్థకు ఆ సామర్థ్యం ఉందా? వనరులు ఉన్నాయా? అనేది చూడాలి. అదే విధంగా మరే సంస్థ అయినా ముందుకు వస్తే, వారి ప్రతిపాదన కూడా చూడాలి. ఆ తర్వాం రెండింటినీ చూపి, ఓపెన్ ఆఫర్ చెప్పాలి. ఇక్కడ అవేవీ చేయకుండానే, సీమెన్స్ కంపెనీ చెప్పిన మొత్తాన్ని యథావిథిగా ఒప్పుకున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి క్యాబినెట్ ముందుపెట్టిన ప్రతిపాదన ఒకటైతే, ఆ ఒప్పందం పూర్తిగా మరో విధంగా జరిగింది. సీమెన్స్ సంస్థ పెట్టాల్సిన 90 శాతాన్ని ఏ విధంగా, ఏ రూపంలో, ఎలా ఇస్తారనేది చూడాలి. కానీ అవేవీ చూడకుండానే, వారిచ్చిన డీపీఆర్‌ను యథాతథంగా ఒప్పుకుని, ప్రభుత్వ వాటాను నేరుగా ముందే రూ. 371 కోట్లు విడుదల చేశారు. సీమెన్స్ సంస్థతో సంబంధం లేని షెల్ కంపెనీలకు 5 దఫాల్లో ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. అన్నీ అక్రమాలే: 2015–16 మధ్య ఆ నిధులు విడుదల చేయాలని గంటా సుబ్బారావు ప్రభుత్వంపై ఒత్తిడి చేశాడు. ఆయన చంద్రబాబుకు చాలా సన్నిహితుడు. ఇక్కడ సీమెన్స్ సంస్థ ప్రతినిధి అయిన సోమాద్రి శేఖర్‌బోస్ అనే వ్యక్తి, ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంలో తన పేరుతో కాకుండా, సుమన్‌బోస్ పేరుతో సంతకం పెట్టాడు. అంటే సుమన్‌బోస్ అన్న పేరుతో మొత్తం వ్యవహారం నడిపించారు. అలా ఒక వ్యక్తి వేరే పేరుతో సంతకం చేసినా, ప్రభుత్వం పట్టించుకోలేదంటే, ముందే అక్రమ వ్యవహారానికి తెర లేపారన్న మాట. ప్రభుత్వం విడుదల చేసిన నిధులను, రకరకాల కంపెనీలు క్రియేట్ చేసి, నేరుగా వాటికి నిధులు ఇచ్చారు. జీఎస్టీ తిరిగి ఇవ్వాలని కోరడంతో..: అత్యాశ మనిషికి ప్రమాదకరమైన జబ్బు. అలా నిధులు పొందిన రెండు కంపెనీలు.. తాము జీఎస్టీ చెల్లించామని, ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వాలంటూ జీఎస్టీ అధికారులను కోరడంతో, వెంటనే జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్ రంగంలోకి దిగి, వెంటనే ఆ కంపెనీల చిరునామాలు ఆరా తీసి, మొత్తం కూపీ లాగారు. అవన్నీ సూట్‌కేస్ కంపెనీలని, పని చేయడం లేదని కూడా తేలింది. ఇవన్నీ బయట పడడంతో, వేగంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం సీమెన్స్ కంపెనీకి విషయం చెప్పడంతో.. వారు ఇక్కడికి వచ్చి, మొత్తం ఆరా తీయగా.. ఇక్కడి స్కిల్ డెవలప్‌మెంట్‌తో తమకు సంబంధం లేదని తేల్చారు. అప్పుడు సుమన్‌బోస్ అక్రమ వ్యవహారం బయటపడడంతో, ఆయన కంపెనీ వదిలి బయటకు వచ్చాడు. అయినా పట్టించుకోలేదు: ఇలా మొత్తం అక్రమ వ్యవహారం అంతా బయటపడి.. ఈడీ, జీఎస్టీ ఎన్‌ఫోర్స్‌మెంట్, చివరకు సీమెన్స్ కూడా చెప్పినా, ప్రభుత్వం స్పందించలేదు. కనీసం థర్డ్ పార్టీ ఎంక్వైరీ కూడా చేయించలేదు. ఆ తర్వాత మొక్కుబడిగా సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ)కి ఇచ్చారు. వారు మొత్తం ఎంక్వైరీ చేసి, ఏ స్థాయిలో అక్రమాలు చేశారనేది చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ అసలు స్కిల్ డెవలప్‌మెంట్ జరగకపోయినా, ఏ విధంగా నిధులు కైంకర్యం చేశారనేది వాళ్లు నేరుగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. చర్య తీసుకోవడం తప్పా?: చంద్రబాబు హయాంలో ఈ స్థాయిలో అవినీతి వ్యవహారం జరిగితే.. ఆయన ఒక సత్యహరిశ్చంద్రుడి మాదిరిగా, ఆయన ఒక నీతివంతుడిగా, ఆయనను అరెస్టు చేయడం దారుణమని.. ఎల్లో మీడియా, చంద్రబాబు వంధిమాగదులు అంటున్నారు. ఇటీవల కేంద్ర దర్యాప్తు సంస్థ ఇందులో పాత్రధారులను అరెస్టు చేసింది. మరి సూత్రధారులపై చర్య తీసుకోవడం తప్పా? ఇది రాజకీయ కక్ష సాధింపు అని ఒకరంటే.. మరొకరు చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. బాధ పడుతున్నారు. జనసేన అధినేత పవన్‌కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా బాధపడుతూ స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. చంద్రబాబు మూలాలు అలా ఉన్నాయి. ఇన్ని ఆధారాలు ఉంటే, అన్నీ బయటపడినా చంద్రబాబు ఏ తప్పు చేయలేదంటున్నారు. బాబుకూ అర్థమైంది: తన నేరం బయటపడిందన్న విషయం చంద్రబాబుకు స్పష్టంగా అర్ధమైంది కాబట్టే, నాలుగు రోజుల నుంచి తనను అరెస్టు చేస్తారని చెబుతున్నాడు. అంటే ఆయనకు ముందే ఉప్పంది ఉంటుంది. లేదా తాను పూర్తిగా ఆధారాలతో దొరికిపోయాయని చంద్రబాబుకు స్పష్టంగా అర్ధమై ఉంటుంది. అయినా చంద్రబాబు అనుకూల మీడియా, ఆయనను సమర్థించే పార్టీలు.. ఏదో ఘోరం జరిగిపోయినట్లు వాపోతున్నారు. అంతే తప్ప, ప్రభుత్వ ఖజానాను యథేచ్ఛగా దోపిడి చేయడాన్ని తప్పు పట్టడం లేదు. ఇంతకాలం బ్యాక్‌డోర్‌లో వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, కోర్టుల నుంచి స్టేలు తెచ్చుకుంటూ, ఏ కేసులోనూ దర్యాప్తు జరగకుండా చూసుకుంటున్న చంద్రబాబు, ఇప్పుడు అడ్డంగా దొరికిపోవడంతో, తనను అక్రమంగా అరెస్టు చేశారంటే గగ్గోలు పెడుతున్నాడు.