తాడేపల్లి: సినీ పరిశ్రమకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారని, ఇండస్ట్రీకి సంబంధించి చర్చలకు హాజరైన సినీ ప్రముఖులందరి అభిప్రాయాలు తీసుకొని.. అందరూ సంతృప్తిచెందే సమాధానం సీఎం వైయస్ జగన్ చెప్పారని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఫిబ్రవరి చివరికల్లా అన్నింటికీ రూపం వస్తుందన్నారు. సీఎం క్యాంపు కార్యాలయ ఆవరణలో మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు ప్రాముఖ్యతనిచ్చి షూటింగ్‌లు చేస్తే బాగుంటుందని, స్టూడియోల నిర్మాణంతో పాటు అన్ని సదుపాయాలు కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారన్నారు. ఏపీలో పెద్ద ఎత్తున సినిమా షూటింగ్‌లు జరిగేలా సినీ పెద్దలు సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం కోరారన్నారు. సీఎం మాటతో అందరూ చాలా ఆనందం వ్యక్తం చేశారన్నారు.
సినీ పరిశ్రమ సమస్యలను సీఎం వైయస్ జగన్ దృష్టికి తీసుకువచ్చి, పరిష్కారానికి మార్గం సుగమం అవ్వడానికి అన్నింటికీ కారణమైన చిరంజీవికి మంత్రి పేర్ని నాని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఎదిగే కొద్ది ఒదగాలనడానికి చిరంజీవి నిదర్శనంగా నిలిచారని, ఎవరుపడి వారు ఏది పడితే అది మాట్లాడినా అన్నీ మనసులో పెట్టుకొని ఇండస్ట్రీ కోసం ఆలోచన చేసి.. అన్నింటినీ భరిస్తూ సమస్యలకు పరిష్కారం కోసం కృషిచేసిన చిరంజీవికి ఇండస్ట్రీ తరఫున, ప్రభుత్వం తరఫున అభినందనలు తెలిపారు.
సీఎంతో జరిగిన సమావేశంలో మహేష్, ప్రభాష్, అలీ, రాజమౌళి, పోసాని, ఆర్.నారాయణమూర్తి అందరూ మాట్లాడారని, అందరి అభిప్రాయాలను స్వీకరించి.. అందరూ తృప్తిచెందేలా సమాధానం చెప్పారన్నారు. ఫిబ్రవరి చివరిల్లా అన్నింటికీ రూపం వస్తుందని చెప్పారు. చిన్న సినిమాలకు స్థానం ఉండాలని ఆర్.నారాయణమూర్తి కోరారని, చిన్న సినిమాలకు పండుగల రోజు, పెద్ద రిలీజ్‌ల రోజు కొంత చిన్న సినిమాలకు కూడా ప్లేస్ ఉండేలా చూడాలని సీఎం వైయస్ జగన్ సినీ పెద్దలను రిక్వస్ట్ చేశారని మంత్రి పేర్ని నాని గుర్తుచేశారు. తొందరలోనే కూర్చొని చిన్న సినిమాకు సంబంధించిన అంశాన్ని పరిష్కరిస్తామని చెప్పారన్నారు.