డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో రావులపాలెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఎదురుగా ఉన్న ఫంక్షన్ హాల్‌లో SIR (Special Intensive Revision) కార్యక్రమంపై భారీ అవగాహన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో పార్టీ నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, గ్రామ స్థాయిలో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని పేర్కొన్న ఆయన, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుండి తొలగిపోకుండా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలపై పూర్తి అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ, ప్రజాస్వామ్య పరిరక్షణలోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతి బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.