సీఐడీ విచారణకు చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

ప్రజా తీర్పును సహించలేక టీడీపీ తప్పుడు ఆరోపణలు

టీడీపీ పోటీలో నిలవలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తోంది

ప్రజలకు విజ్ఞత, విచక్షణ ఉండబట్టే మున్సిపల్‌ ఎన్నికల్లో ఈ తీర్పు ఇచ్చారు

బాబు అహంకారంతో వ్యవహరించినా కూడా ..వైయస్‌ జగన్‌  విజ్ఞత కోల్పోలేదు

నారా లోకేష్‌కు ద‌మ్ముంటే జెడ్పీటీసీగా పోటీ చేయాలి

చంద్రబాబు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రాజకీయం చేస్తున్నారు

సీఎం వైయస్‌ జగన్‌ అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు

తాడేపల్లి: సీఐడీ విచారణ అంటే ప్రతిపక్ష చంద్రబాబు ఎందకు భయపడుతున్నారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఎలాంటి తప్పు చేయకపోతే కోర్టు విచారణను ఎదుర్కోవాలన్నారు.  ప్రజా తీర్పును సహించలేక చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ వ్యవహరించిన తీరుకు ప్రజలు విసుకు చెందారని, సుపరిపాలన అందిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టం కట్టారని చెప్పారు. చంద్రబాబు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రాజకీయం చేస్తారని, వైయస్‌ జగన్‌కు అన్ని ప్రాంతాలు ఒక్కటేనని వెల్లడించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. 

ఎన్నికల్లో గెలవలేక మాపై నిందలా?
మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని పరిస్థితిలో టీడీపీ మాపై నిందలు వేస్తోంది. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన చంద్రగిరి, కుప్పంలో పంచాయతీ, మున్పిపల్‌ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు మున్సిపల్‌ ఎన్నికల్లో కనీసం ఒక్క చోట కూడా గెలవలేకపోయింది. ఎక్కడా కూడా ప్రతిపక్ష స్థాయి కూడా దక్కలేదంటే..టీడీపీ స్థాయి ఏంటో అర్థం చేసుకోవాలి.

గుంటూరులో ప్రచారానికి వెళ్లిన చంద్రబాబు ప్రజలను నిందించేలా మాట్లాడారు. ప్రజలకు విజ్ఞత, విచక్షణ∙ఉంది కాబట్టే ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేశారు. సింబల్‌తో జరిగిన ఎన్నికల్లో ఓటమి ఖాయమని చంద్రబాబు, లోకేష్‌ హైదరాబాద్‌కు పారిపోయారు. ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. 

అర్హులందరికీ అమ్మ ఒడి, రైతు భరోసా, వైయస్‌ఆర్‌ చేయూత వంటి పథకాలు అందాయి కాబట్టే వైయస్‌ జగన్‌ ప్రభుత్వానికి ఓట్లు వేశారు.మాకు సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లు. రెండింటిని బ్రహ్మాండంగా అమలు చేస్తూ సీఎం వైయస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. ఎక్కడా కూడా పబ్లిసిటీ లేకుండా పథకాలు అమలు చేస్తున్నారు. 

గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు దోచుకోవడం, అహంకారంతో పబ్లిసిటి పిచ్చితో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారో వాటిని తూచా తప్పకుండా వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. చెప్పనివి కూడా అమలు చేస్తూ ప్రజలకు తోడుగా నిలిచారు. అందుకే ఈ రోజు ప్రజల్లో వైయస్‌ జగన్‌పై విశ్వాసం పెరిగింది.  

తండ్రి కొడుకులు మాట్లాడిన మాటలు ఒక్కసారి పునఃసమీక్షించాలి. ఎక్కడా కూడా వైయస్‌ జగన్‌ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు. మీరు రెచ్చగొట్టినా కూడా మా నాయకుడికి ప్రజలపై నమ్మకం ఉండబట్టే విచక్షణతో వ్యవహరించారు. ప్రభుత్వంపై టీడీపీ దుష్ప్రచారం చేసింది. మంచి పనులకు అడ్డంకులు సృష్టించారు. 74 మున్సిపాలిటీల్లో వైయస్‌ఆర్‌సీపీకి పోటీ పడలేకపోయారు. 11 కార్పొరేషన్లు వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకుంది.

ఎల్లోమీడియాతో, మీ పార్టీ నేతలతో ఇష్టం వచ్చినట్లు వైయస్‌ జగన్‌ గురించి మాట్లాడించారు. ఇలాగే మాట్లాడితే ఇంతకంటే ఘోరమైన ఓటమి చవిచూడాల్సి వస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో తప్పుడు లెక్కలతో పండగ చేసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో తప్పుడు లెక్కలు చెప్పే ఆస్కారం ఉండదు కదా?.

ఎన్నికల కమిషనర్‌పై వ్యక్తిగతంగా మాకు ఎలాంటి విభేదాలు లేవు. కోర్టు సూచనల మేరకు ప్రశాంత ఎన్నికలకు ప్రభుత్వం సహకరించింది. లోకల్‌ బాడీ ఎన్నికల్లో టీడీపీ వ్యవహరించిన తీరు ఆక్షేపణీయం. చంద్రబాబుకు అమరావతి భూ కుంభకోణంపై ఇవాళ సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆయనకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోర్టుకు వెళ్లకుండా, స్టే తెచ్చుకోకుండా విచారణను ఎదుర్కోవాలి. గతంలో సీబీఐని రాష్ట్రానికి రానివ్వను అని చంద్రబాబు హుకుం జారీ చేశారు. 

లోకేష్‌ ఏం మాట్లాడుతారో ఆయనకే అర్థం కాదు. మిటమిన్స్‌ తక్కువగా ఉన్నవారికి ఇంజక్షన్లు, మందుల ద్వారా వాటిని పెంచే అవకాశం ఉంటుంది. కానీ లోకేష్‌ జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. జ్ఞానానికి ఇంజక్షన్లు ఉండవు కదా?. తండ్రీ కొడుకులు, బావమరిది ఎన్నికల ప్రచారంలో వ్యవహరించిన తీరుపై ప్రజలు విసుకు చెందారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కోర్టు నుంచి విచారణకు సిద్ధపడాలి. ఎందుకు భయపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే వారి కళ్లముందే సంక్షేమ కార్యక్రమాలు, అబివృద్ధి కనిపిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు మీ  హయాంలో చేశారా? ఒక్క పని అయినా మీ పాలనలో చేశారా? చెత్తతో సంపద సృష్టించవచ్చు, దోమలపై దండయాత్ర అంటూ పబ్లిసిటీ చేసింది మీరు కాదా?.

ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టే సమయంలో జవాబుదారీతనం ఉండాలి. అలాంటి ఆలోచన చంద్రబాబు చేయలేదు. ఆయన హయాంలో దోచుకోవడం, బెదిరించడమే జరిగింది. వైయస్‌ జగన్‌ పారదర్శకంగా పాలన సాగిస్తున్నారు. అందుకే ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి కాబట్టే ప్రజలంతా వైయస్‌ జగన్‌ను ఆదరించారు. చంద్రబాబు ఆయన కుమారుడు ఎందుకు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారో అర్థం కావడం లేదు. ప్రస్టేషన్‌తో బహిరంగ సభల్లో కులాలను, మతాలను రెచ్చగొట్టేలా మాట్లాడటం సరైనదేనా? . ఈవీఎంలను దొంగలించిన చరిత్ర టీడీపీకి ఉంది. 

వైయస్‌ జగన్‌ అమరావతిని తగ్గించి మాట్లాడలేదు. కానీ చంద్రబాబు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి ఒత్తాసు పలికారు. కానీ వైయస్‌ జగన్‌  అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు. మూడు రాజధానులు ఉంటాయని వైయస్‌ జగన్‌ పేర్కొన్నారు. అమరావతిని శాసన రాజధానిగా అభివృద్ధి చేస్తామంటే ప్రతిపక్షం ఎందుకు రాజకీయం చేస్తుంది. హుందాతనం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. అమరావతి ఎండ వేడిమి తగ్గిస్తామని గతంలో చంద్రబాబు అనలేదా? ఇది సాధ్యమవుతుందా? ఏసీలు పెడుతావా? ఇలాంటి మభ్యపెట్టే మాటలు చంద్రబాబు మానుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా చేయగలింది చేస్తే ప్రజలు గుర్తిస్తారు.

వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆరున్నర ఏళ్లు మాత్రమే పరిపాలన చేశారు. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ గుర్తుకు వస్తాయి. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు చెప్పుకోదగ్గ ఒక్క పథకమైనా ఉందా?. ఇప్పటికైనా చంద్రబాబులో మార్పు రాకపోతే ప్రజలు కొద్దో గొప్పో ఆదరిస్తారు. ఈ తీర్పు వచ్చిన తరువాత మా బాధ్యత పెరిగింది. సంక్షేమం, అభివృద్ధిని సమానంగా చేస్తాం. ఒక్క ప్రణాళికతో పరిశ్రమలు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటూ, ఏపీని మంచి రాష్ట్రంగా సీఎం వైయస్‌ జగన్‌ తీర్చిదిద్దే దిశగా పాలన సాగిస్తున్నారు. సుపరిపాలన అందించే విధంగా వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం కొనసాగుతుందని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
 

Back to Top