రాష్ట్రంలో నైట్ క‌ర్ఫ్యూ తొల‌గింపున‌కు నిర్ణ‌యం

రాష్ట్రంలో 0.82 శాతానికి కోవిడ్‌ యాక్టివిటీ కేసుల రేటు

మాస్క్‌లు క‌చ్చితంగా ధ‌రించేలా మార్గ‌ద‌ర్శ‌కాలు కొన‌సాగింపు 

దుకాణాలు, వ్యాపార స‌ముదాయాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రి

వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలి

గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వైద్యుల‌కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి

వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశం

తాడేప‌ల్లి: కోవిడ్ విస్త‌ర‌ణ గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టిన నేప‌థ్యంలో రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ తొలగించాలని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నిర్ణ‌యించారు. మాస్క్‌లు కచ్చితంగా ధరించేలా మార్గదర్శకాలు కొనసాగాలని ఆదేశించారు. దుకాణాలు, వ్యాపార సముదాయాల్లో కోవిడ్‌ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని, ఫీవర్‌ సర్వే కొనసాగించాలని అధికారుల‌కు సూచించారు. లక్షణాలు ఉన్నవారికి టెస్టుల ప్రక్రియ కొనసాగించాలని, వ్యాక్సినేషన్‌ ముమ్మరంగా కొనసాగాలని ఆదేశించారు. కోవిడ్‌పై ముఖ్య‌మంత్రి వైయస్ జగన్‌ సమీక్ష నిర్వ‌హించారు. 

794లో 746 మందికి ఆరోగ్యశ్రీద్వారా చికిత్స
ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను, వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు అధికారులు వివ‌రించారు. రాష్ట్రంలో కోవిడ్‌ విస్తరణ గణనీయంగా తగ్గిందని, పాజిటివ్‌ కేసులు కూడా త‌గ్గుముఖం ప‌ట్టాయ‌ని తెలిపారు. రాష్ట్రంలో 0.82 శాతానికి కోవిడ్‌ యాక్టివిటీ కేసుల రేటు ప‌డిపోయింద‌న్నారు. గతవారం సమావేశం నాటికి 1,00,622 పాజిటివ్‌ కేసులు ఉండగా, ఇప్పుడు 18,929కి పడిపోయాయని తెలిపారు. ఇందులో ఆస్పత్రిలో చేరిన కేసులు 794 కాగా, ఐసీయూలో ఉన్నవారు కేవలం 130 మంది, వీరిలో కూడా దాదాపుగా కోలుకుంటున్నారని అధికారులు తెలిపారు. 794లో 746 మందికి ఆరోగ్యశ్రీద్వారా చికిత్స అందిస్తున్నామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 

గత సమావేశం నాటికి డైలీ పాజిటివిటీ రేటు 17.07శాతం కాగా, ప్రస్తుతం 3.29 శాతం ఉంద‌ని, 9,581 సచివాలయాల్లో కేసులు లేవని అధికారులు తెలిపారు. అన్నిజిల్లాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గాయ‌ని చెప్పారు. 

వ్యాక్సినేష‌న్‌..
రాష్ట్రంలో 3,90,83,148 మందికి రెండు డోసులు.
39,04,927 మందికి ఒకడోసు మేర కోవిడ్‌ వ్యాక్సిన్లు. 
మొత్తంగా ఉపయోగించిన వ్యాక్సిన్లు 8,32,55,831 డోసులు.
45 ఏళ్ల పైబడ్డ వారిలో 96.7 శాతం మందికి రెండుడోసుల వ్యాక్సిన్లు పూర్తి.
18–44 ఏళ్ల మధ్యవారిలో 90.07 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్లు.
ప్రికాషనరీ డోస్‌ల విషయంలో టార్గెట్‌ 15,02,841 కాగా వీరిలో 11,84,608 మంది వ్యాక్సిన్లు.
15–18 ఏళ్ల వయస్సు మధ్యనున్నవారిలో 24.41 లక్షల మందికి టార్గెట్‌కాగా అందరికీ మొదటి డోసు పూర్తి.
వీరిలో 12.48 లక్షల మందికి రెండో డోసు పూర్తి.

నిపుణులైన వారికి బాధ్య‌త‌లు..
ఈ సందర్భంగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌ను త్వరగా పూర్తిచేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌ను ఆదేశించారు. సిబ్బంది తప్పనిసరిగా ఆస్పత్రుల్లో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆస్పత్రుల్లో పరిపాలనా బాధ్యతలను, చికిత్స బాధ్యతలను వేరు చేయాలని సూచించారు. పరిపాలనా బాధ్యతలను అందులో నిపుణులైన వారికి అప్పగించాలని ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు, వైద్యులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం సూచించారు. స్పెషలిస్టు వైద్యులకు ఇస్తున్న మూలవేతనంలో 50శాతం, వైద్యులకు 30 శాతం మేర ప్రత్యేక ప్రోత్సాహకంగా ఇచ్చేలా మార్గదర్శకాలు తయారు చేశామని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. 

ఈ సమీక్షా సమావేశానికి డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య ఆరోగ్యశాఖముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ మరియు వ్యాక్సినేషన్‌), ఎం. రవిచంద్ర, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్ ఏం. టీ. కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Back to Top