త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తా

అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు

లీడర్‌ అనేవాడు చేయాల్సింది డ్రామాలు కాదు

నా పర్యటన కంటే వరద బాధితులకు సాయం అందడం ముఖ్యం

అధికారులను అప్రమత్తం చేసి.. అన్ని విధాలుగా వరద బాధితులను ఆదుకున్నాం

79,590 మంది బాధితులను 319 తాత్కాలిక క్యాంపులకు తరలించాం

నాలుగు జిల్లాల్లో 119 మండలాల్లో వరదల ప్రభావం 

వరద బాధితులకు వారం తిరక్కముందే ఆర్థిక సాయం అందించాం

మృతుల కుటుంబాలకు తక్షణ పరిహారంగా రూ.5 లక్షలు ఇచ్చాం

అసెంబ్లీ: ‘‘నేను గాల్లోనే వచ్చి.. గాల్లోనే పోతానని, ఎక్కడో ఒకచోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని నాపై చంద్రబాబు విమర్శలు చేశారు. తనను వ్యతిరేకించిన వైయస్‌ఆర్‌ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడాడు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీనియర్‌ అధికారుల సూచన మేరకే వరద ప్రభావిత ప్రాంతాల్లో నా పర్యటన నాలుగురోజులు ఆలస్యమైనా పర్వాలేదని ఆగిపోయాను. సీఎం పర్యటన ఆగితే నష్టమా.. లేదా సహాయక చర్యలు ఆగితే నష్టమా అని ఆలోచన చేయాలి. 

లీడర్‌ అనేవాడు చేయాల్సింది డ్రామాలు కాదు.. సహాయం కరెక్ట్‌గా, సంతృప్తస్థాయిలో జరిగేలా చూడటం లీడర్‌ చేయాల్సిన పని అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాలపై నిత్యం సమీక్షలు, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ, సహాయక కార్యక్రమాలు ముమ్మరంగా జరిగే విధంగా చేశామని, వారం తిరక్క ముందే వరద బాధితులకు ఆర్థికసాయంతో పాటు మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కూడా అందించామన్నారు. 

భారీ వర్షాలు, వరదలు, ప్రభుత్వం చేపట్టిన సహాయక కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో వివరించారు. సభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేశారు. 

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాయలసీమలోని మూడు జిల్లాలు, నెల్లూరు జిల్లా దెబ్బతిన్నాయి. గడిచిన వంద సంవత్సరాల్లో కనివినీ ఎరుగని విధంగా రాయలసీమలోని కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాలు, నెల్లూరు జిల్లాలో నవంబర్‌ 16, 17 తేదీల్లో ఊహించని విధంగా వర్షాలు కురిశాయి. ఈనెల రెండవ వారం తరువాత ప్రారంభమైన వర్షాలు.. ఈ రోజుకీ పడుతూనే ఉన్నాయి. 16, 17 తేదీల నుంచి కుండపోత ప్రారంభమైంది. అతిభారీ వర్షాలు రాయలసీమను ముంచెత్తడం కనివినీ ఎరుగని పరిస్థితి తిరుమల మాడ వీధులు, తిరుపతి పట్టణంలో కూడా  కనివినీ ఎరుగని వానపడి వాహనాలు కొట్టుకుపోవడం మనమంతా చూశాం. నీరు లేక అలమటించే రాయలసీమలో అనూహ్యమైన వరదలు చూడటం జరిగింది. 

గత గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత నవంబర్‌ 19 శుక్రవారం తెల్లవారుజామున 3 నుంచి 6.30 గంటల సమయంలో పించా, అన్నమయ్య చిన్న రిజర్వాయర్ల కట్టలు తెగిపోయాయి. ఫలితంగా చెయ్యేరు నది పరివాహక ప్రాంతంలోని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గుండ్లూరు శివాలయం ప్రాంతంలో, మందపల్లి, నందనూరులో బస్సులు వరదలో చిక్కుకుపోవడం వల్ల ప్రాణనష్టం కూడా సంభవించింది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూనే ఉన్నాం. 

అనూహ్య వరద వల్ల కలిగిన ఆస్తినష్టం, ప్రాణనష్టం ఎక్కడా దాచిపెట్టే ప్రయత్నం చేయలేదు. కష్టంలో ఉన్నవారికి సాయం అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయలేదు. నాలుగు జిల్లాల్లో వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని, ప్రభుత్వం తీసుకున్న చర్యలను సభ ముందు ఉంచుతున్నాను. 

భారీగా నష్టం కడప జిల్లాలో పించా, అన్నమయ్య రిజర్వాయర్ల దిగువ భాగంలో సంభవించింది. ఇందులో పించా రిజర్వాయర్‌ నిల్వ సామర్థ్యం 0.327 టీఎంసీలు. రిజర్వాయర్‌ నిర్మాణ సమయంలో అంచనా వేయనంతగా వరద వచ్చింది. ఒక్కసారిగా ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టు వర్షం కురవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. పించాలోని మూడు స్పిల్‌వే గేట్లు, రెండు అత్యవసర పూడిక గేట్లు ఎత్తినా.. వరద ప్రవాహం గేట్ల నుంచి బయటకు వెళ్లే సామర్థ్యం కంటే మూడు రెట్లు ఎక్కువ వరద వచ్చింది. ఇదే విషయం.. ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అఫీషియల్‌ పేపర్‌ ఈనాడు దినపత్రికలో కూడా ఇదే విషయాన్ని రాశారు. 

పించా రిజర్వాయర్‌ విడుదల చేయగలిగేది కేవలం 58 వేల క్యూసెక్కులు, వచ్చిన వరద ఏకంగా 1.38లక్షల క్యూసెక్కులు వచ్చింది. డిజైన్, డిశ్చార్జ్, కెపాసిటీ కంటే మూడు రెట్లు వరద వచ్చింది. పించా జలాశయం నుంచి వచ్చి చేరిన నీరు.. నిల్వ ఉన్న నీరు అంతా కట్టలు తెంచుకొని కింద ఉన్న అన్నమయ్య జలాశయం మీద విరుచుకుపడింది. ఇదంతా కేవలం రెండు, మూడు గంటల వ్యవధిలోనే జరిగింది. అన్నమయ్య జలాశయం నిల్వ సామర్థ్యం 2.23 టీఎంసీలు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత శుక్రవారం తెల్లవారుజామున పించా, బహుదా, మండవ్య, ఇతర వాగులు, వంకలు కలుపుకొని 3.2లక్షల క్యూసెక్కుల నీరు కేవలం రెండు, మూడు గంటల వ్యవధిలోనే చెయ్యేరు నుంచి బయటకు వచ్చి విరుచుకుపడిందని తెలుగుదేశం పార్టీ అఫీషియల్‌ పత్రిక ఈనాడులోనే రాశారు. 

నవంబర్‌ 18వ తేదీ గురువారం ఉదయం 8.30 గంటలకు పించా ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమే. కానీ అదే రోజు సాయంత్రం 6 నుంచి 8.30 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు చేరింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు కడప జిల్లాలోని మొత్తం 51 మండలాల్లో సగటున 10.7 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు తిరుపతి సహా, చిత్తూరు  జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున కురిసిన భారీ వర్షాలు, వరద నీరు అంతా చెయ్యేరు పరివాహక ప్రాంతానికి చేరుకుంది. మరోవైపు పీలేరు, రాయచోటిలో అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలోనే జరిగింది. 

జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటకు భారీగా నీరు వచ్చి చేరింది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది అనూహ్యమైన వర్షం, వరద. మామూలుగా ఏడాది మొత్తం కురిసిన వర్షాలకు కూడా పూర్తిగా నిండని జలాశయాలు.. అలాంటిచోట ఒకటి రెండ్రోజుల కుంభవృష్టితో ఈ ప్రాజెక్టు డిజైన్‌ చేసినవారే ఊహించని విధంగా వచ్చిన వరద బయటకు పోవడానికి గేట్లు కూడా సరిపోనంతగా రావడం వల్ల పించా, అన్నమయ్య ప్రాజెక్టుల కట్టలు తెగిపోయాయి. 

అదేరోజు రాత్రి 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షల క్యూసెక్కులకు చేరింది. నవంబర్‌ 19 శుక్రవారం ఉదయం 5.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో 3.2లక్షల క్యూసెక్కులు దాటింది. పించా తెగిపోయి మొత్తం నీరంతా అన్నమయ్యకు రావడంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు. 19వ తేదీన తెల్లవారుజామున 3.2 లక్షల క్యూసెక్కులు దాటింది. అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన తరువాత, గత 50 సంవత్సరాల చరిత్రలో ఇంత నీరు ఎప్పుడూ రాలేదు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఏమాత్రం ఊహించని పరిస్థితుల్లో జరిగిన పరిణామం సమయంలో అర్ధరాత్రిలోనూ జిల్లా యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ఈ విషయాన్ని టీడీపీ పాంప్లేట్‌ పేపర్‌ ఈనాడు రాసింది. 

అధికారులు ముందస్తుగానే 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. వలంటీర్లు, వీఆర్‌ఓల నుంచి అందరినీ అప్రమత్తం చేశారు. అన్నమయ్య కింద కుడివైపున ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు, హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించారు. వీఆర్‌ఓలు, సర్పంచ్‌ల ద్వారా అందరినీ అప్రమత్తం చేశారు. సుమారు 1250 కుటుంబాలను అప్రమత్తం చేయడమే కాకుండా లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 400 కుటుంబాలను ఎల్తైన ప్రాంతాలకు తరలించారు. 900 మందిని రిలీఫ్‌ క్యాంపులకు తరలించారు. 

ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. వరదలపై రాజకీయం చేస్తున్నారు. అర్ధరాత్రులు అధికారులు ఇవన్నీ చేస్తున్నా కూడా దాన్ని వక్రీకరిస్తున్నారు. 19వ తేదీన ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య డ్యామ్‌ తెగిపోయింది. 18వ తేదీసాయంత్రం నుంచి అధికారులు, యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి వేల మంది ప్రాణాలను కాపాడారు అనే సంగతి మర్చిపోయి.. రాజకీయాల కోసం బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. నందలూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న నాలుగు బస్సులు ముంపునకు గురయ్యాయి. వీటిలో ఒక బస్సు 20 మీటర్ల కిందపడింది. 10 మంది దురదృష్టవశాత్తు మృత్యువాతపడ్డారు. బస్సులో మిగిలిన 45 మందిని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ టీమ్‌ కాపాడగలిగింది. అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామంలో నదీ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న శివాలయంలో కొంతమంది కార్తీక పౌర్ణమి పూజలు చేస్తుండగా ప్రమాదానికి గురయ్యారు. ఈరెండు ఘటనలలో సుమారు 20 మంది వరకు మరణించడం, గల్లంతుకావడం జరిగింది.

అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం మధ్యాహ్నానికి హెలికాప్టర్లను చేర్చగలిగాం. శుక్రవారం ఉదయం నుంచే ముంపు గ్రామాలకు తాగునీరు, ఆహారం అందించాం. శుక్రవారం జరిగిన నష్టాన్ని ఆరోజే సమీక్షించడంతో పాటు హెలికాప్టర్లతో సహా సహాయక చర్యలకు ఆదేశాలివ్వడమే కాకుండా.. శనివారం ఏరియాల్‌ సర్వే ద్వారా ముంపు ప్రాంతాలకు వెళ్లడం, చూడటం జరిగింది. ప్రతిరోజూ ప్రధానంగా నాలుగు జిల్లాల్లో, మొత్తం రాష్ట్రమంతా జరిగిన నష్టాన్ని కలెక్టర్లతో కాన్ఫరెన్స్‌ ద్వారా, సమీక్షల ద్వారా నిరంతరాయంగా అంచనా వేస్తూ, సహాయక చర్యలను పురమాయిస్తూ ముమ్మరంగా ఫాలోఅప్‌ జరుగుతుండేది. 

నేను గాల్లోనే వచ్చి.. గాల్లోనే పోతానని, ఎక్కడో ఒకచోట శాశ్వతంగా కనుమరుగు అవుతానని నాపై చంద్రబాబు విమర్శలు చేశారు. తనను వ్యతిరేకించిన వైయస్‌ఆర్‌ గారు కూడా కాలగర్భంలో కలిసిపోయాడని ప్రతిపక్ష నాయకుడు ఈ మాటలు మాట్లాడాడు. చంద్రబాబు సంస్కారానికి నా నమస్కారాలు. 

కడప నా సొంతజిల్లా, ఈ రాష్ట్రంలోని ప్రతి పల్లె, ప్రతి మనిషి మీద మమకారం ఉండే మనిషిని నేను. అలాంటిది నా సొంత జిల్లా మీద మరికొంత ప్రేమ ఉంటుంది కానీ, తక్కువ మాత్రం ఉండదు. ఈ ప్రేమను నేను ఏరోజూ దాచుకోలేదు. ఎప్పుడూ బాహటంగానే చూపిస్తాను. నేను ప్రత్యక్షంగా కడపలో పర్యటన చేస్తానని చెబితే.. ఏం జరుగుతుందో సీనియర్‌ అధికారులు నాకు చెప్పారు. 

ఇప్పుడు సాయం అందించడం, పునరావాస చర్యలు ముఖ్యం. జిల్లా యంత్రాంగాలు అందులో నిమగ్నమై ఉన్నాయి కాబట్టి సూపర్‌ విజన్‌ కొరకు ప్రత్యేక అధికారులను, ఆ ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేలను అక్కడకే పంపించాం కాబట్టి.. సభకు హాజరుకావాల్సిన పనిలేదు.. అక్కడే ఉండమని చెప్పాం కాబట్టి.. ఈ సమయంలో ముఖ్యమంత్రి అక్కడకు వెళ్తే జరిగేది ఏమిటీ..? అని నా కళ్లకు కనిపించేలా చెప్పారు. ముఖ్యమంత్రి వస్తున్నారని అందుకు ఏర్పాట్లు చేయడంలో జిల్లా యంత్రాంగం బిజీ అయిపోతుంది. వరద బాధితులకు అండగా ఉండే పనులు వదిలేసి.. నా పర్యటన  మీద ఫోకస్‌ పెడుతుంది. దీని వల్ల సహాయక చర్యలు, సహాయక కార్యక్రమాలు ఆగిపోయి.. సీఎం చుట్టూ యంత్రాంగం, సీఎం చుట్టూ మీడియా, సీఎం చుట్టూ హడావుడి తప్ప పనులు జరగవు అని అనుభవ పూర్వకంగా అధికారులు చెప్పారు. 

ఇది నిజం అనిపించే నా పర్యటన నాలుగురోజులు ఆలస్యమైనా పర్వాలేదని ఆగిపోయాను. సీఎం పర్యటన ఆగితే నష్టమా.. లేదా సహాయక చర్యలు ఆగితే నష్టమా అని ఆలోచన చేయాలి. 

హుద్‌హుద్‌ వచ్చినప్పుడు నేనే వెళ్లి ఆపాను.. తిత్లీ వచ్చినప్పుడు నేనే వెళ్లి దారిమళ్లించాను అని అప్పట్లో టీవీల్లో, పత్రికల్లో రోజూ కనిపించే పెద్ద మనిషి చంద్రబాబు. ఆయన చేసిందేమిటీ.. ప్రకటించిన అరకొర సాయం కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. హడావుడి, డ్రామాలతో ముంపు ప్రాంతాలకు వెళ్లింది గత ముఖ్యమంత్రి. 

పక్కన ఒడిశాలో ప్రతి సంవత్సరం తుపాన్లు, వరదలు వస్తుంటాయి. ఎప్పుడైనా ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ వరద ప్రాంతాల్లో కనిపించాడా అనే ఆలోచన చేయాలి. ఎందుకు వెళ్లరంటే.. సహాయక చర్యల మీద ధ్యాస కోల్పోయి.. సీఎం పర్యటన మీద ధ్యాస పెడతారు.. సీఎం చుట్టూ మీడియా, అధికారులు ఉండటం వల్ల సాయం వెనకడుగు వేస్తుందనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలకు వెళ్లరు. 

పనులు జరుగుతున్నాయా లేదా అనేది పర్యవేక్షించడం జరగాలి. పనులు జరిగేదాని కోసం ఏమేమి చేయాలో.. ఏయే ఆదేశాలివ్వాలో అవన్నీ ఇస్తూ.. మరోవైపు రివ్యూ తీసుకుంటూ.. పర్యవేక్షించేందుకు సీనియర్‌ అధికారులను జిల్లాకు ఒకరిని పంపించడం, జిల్లాకు సంబంధించిన మంత్రులను అక్కడే ఉండమని, స్థానిక ఎమ్మెల్యేను కూడా అక్కడే ఉండమని చెప్పడం.. అందరూ సూపర్‌ విజన్‌లో నిమగ్నమవుతారు. ఇలా ప్రతి కార్యక్రమంపై ఫీడ్‌బ్యాక్‌ తెప్పించుకొని ఆదేశాలిస్తూ.. కరెక్ట్‌గా చేయగలిగితే రిజల్ట్‌ బెటర్‌గా ఉంటుందని ఆలోచన. 

కడప జిల్లాకు కచ్చితంగా వెళ్తాను. సహాయక చర్యలకు అంతరాయం కలిగించేలా కాదు.. సహాయక చర్యలు పూర్తయిన తరువాత కచ్చితంగా వెళ్లి.. అధికారులు బాగా చేశారా లేదా అని తెలుసుకుంటా. ఇంకా సరిదిద్దాల్సింది ఉంటే కచ్చితంగా సరిదిద్దుతా. 

ప్రత్యక్షంగా అక్కడకు వెళ్లకపోయినా.. పించా, అన్నమయ్య వరదల ప్రాంతాల్లో, ఎక్కువగా దెబ్బతిన్న నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ యంత్రాంగం ఇంతవరకు ఏం చేసిందో సభ ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తున్నాను. 

నాలుగు జిల్లాల్లో 119 మండలాల్లో వరదల ప్రభావం ఉంది. చిత్తూరులో 66, అనంతపురంలో 62, కడపలో 48, నెల్లూరు 23 మండలాలు ప్రభావితమయ్యాయి. మొత్తంగా 1990 గ్రామాల మీద వరదల ప్రభావం ఉంది. ఇందులో 211 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వరద వల్ల మొత్తం 44 మంది దురదృష్టవశాత్తు మరణించారు. మరో 16 మంది గల్లంతయ్యాయి. పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు 1,169 కాగా, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు 5,434, గుడిసెలు 604. 

ఇటువంటి పరిస్థితుల్లో.. సహాయక పునరావాస కార్యక్రమంలో ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌కు చెందిన 25 టీమ్‌లు, రెండు హెలికాప్టర్లు, 22 బోట్లు, 560 మంది సిబ్బంది పూర్తిగా పాల్గొనేట్లుగా చూశాం. 79,590 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాం. 319 తాత్కాలిక క్యాంపులను ఏర్పాటు చేశాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సిందంతా వెంటనే చేశాం. డబ్బుల కొరత ఎక్కడా ఉండకూడదని తక్షణ సాయం కింద కలెక్టర్ల అకౌంట్లలోకి రూ.84 కోట్లు విడుదల చేశాం. నాలుగు జిల్లాల్లో కరెంట్‌ సరఫరా నిన్నటికే వందశాతం పునరుద్ధరించాం. పర్యవేక్షణ బాధ్యతను సూపర్‌వైజ్‌ చేసేందుకు జిల్లాకు ఒక స్పెషల్‌ ఐఏఎస్‌ అధికారిని, జిల్లా మంత్రులను, స్థానిక ఎమ్మెల్యేలను కలెక్టర్లతో అనుసంధానమై పూర్తిగా రంగంలోకి దించాం. 

ఒక కంట్రోల్‌ రూమ్‌ వెంటనే ఏర్పాటు చేసే దిశగా, ఆ కంట్రోల్‌ రూమ్‌ నంబర్‌ తెలియడంలో ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశంతో జిల్లా యంత్రాంగం ఇచ్చిన నంబర్‌ కాకుండా.. అందరికీ తెలిసిన 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు చేసే విధంగా 24 గంటలు అందుబాటులో ఉంచాం. 95,949 వరద బాధిత కుటుంబాలకు నిత్యావసరాలు అందించే కార్యక్రమం శరవేగంగా పూర్తిచేశాం. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల అదనపు సాయం వెంటనే అందించాం. 

చంద్రబాబు తన హయాంలో ఏ ఒక్క సందర్భంలోనైనా ఇంత మానవత్వం చూపారా అని ఆలోచన చేయాలి. 25 కేజీల రేషన్‌ బియ్యం ఇస్తేనే గొప్ప సంగతి అని ఫీల్‌ అయిపోయే వ్యక్తి చంద్రబాబు. అలాంటిది.. బియ్యం, ఆయిల్, నిత్యావసరాలు ఇవ్వడమే కాకుండా.. ప్రతి ఇంటికి రూ.2 వేల ఆర్థికసాయం అందించాం. 

సహాయక శిబిరాల్లో ఉన్నవారంతా తిరిగి తమ ఇళ్లకు చేరుకున్నారు. శిబిరాల్లో ఉన్నవారికి ఆహారం, నీరు వంటి సదుపాయాల్లో కూడా క్వాలిటీ మానిటర్‌ చేయడం కోసం ప్రత్యేకమైన ఆదేశాలిచ్చాం. వరదల్లో మునిగిపోయిన బాధితులకు తోడుగా ఉండేందుకు వారి చేతుల్లో రూ.2 వేలు పెట్టి చిరునవ్వుతో ఇంటికి పంపించే కార్యక్రమం చేశాం. 

అగ్నిమాపక సిబ్బంది వరద బాధితులకు అండగా నిలిచేలా చర్యలు తీసుకున్నాం. అన్ని తాగునీటి పథకాలను పునరుద్ధరిస్తున్నాం. మంచినీటికి, ఇతర అవసరాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. డ్రింకింగ్‌ వాటర్‌ సమస్య రాకుండా చూసుకోవడం కోసం ప్రత్యేకమైన ధ్యాసపెట్టాం. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నాం. రాజంపేటలో 36 బోర్లను గుర్తించి అందుబాటులోకి తీసుకువచ్చి నీటి పంపిణీ చేపట్టాం. 

వరదల కారణంగా దురదృష్టవశాత్తు మరణించిన వారికి రూ.5 లక్షల శరవేగంగా అందించడం జరిగింది. ఇంత వేగంగా చనిపోయిన వారికి పరిహారం ఇవ్వడం ఎప్పుడూ లేవు. గల్లంతై ఆచూకీ లభ్యంకాని వారి విషయంలో కూడా ఎఫ్‌ఐఆర్, స్థానిక విచారణ తొందరగా జరిపించి.. వారికి కూడా పరిహారం రూ.5 లక్షలు వందశాతం ఇచ్చాం. 

గతంలో ఇదే కార్యక్రమానికి కనీసం ఒక నెల సమయమైనా పట్టేది. గల్లంతయిన వారికి మాత్రం ఒక్క రూపాయి డబ్బు కూడా వచ్చేది కాదు. లభ్యమైన మృతదేహాలను వెంటనే గుర్తించడంతో పాటు ఆ దేహాలను వారి కుటుంబాలకు అందించే కార్యక్రమం కూడా జరుగుతుంది. వరదల్లో చిక్కుకుపోయిన ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య శాఖను పూర్తిగా సన్నద్ధం చేశాం. అక్షరాల 653 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశాం.

చనిపోయిన దాదాపు 5,286 పశువులకు కూడా పరిహారం అందించడం ఈరోజు సాయంత్రానికి పూర్తవుతుంది. పశువులకు పరిహారం గతంలో 6 నెలలు పట్టేది. అలాంటిది వారం తిరక్కముందే పశువుల యజమానులకు పరిహారం అందజేస్తున్నాం. పశువులు బతకాలనే ఉద్దేశంలో 42,165 పశువులకు ఇప్పటికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. మిగిలిన పశువులకు శరవేగంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమం జరుగుతుంది. 544 మెట్రిక్‌ టన్నుల దాణాను పంపిణీ చేశాం. మిగిలిన పశువులకు కూడా దాణా పంపిణీ చేస్తాం. 

అక్షరాల వెటర్నరీ హెల్త్‌ క్యాంపులు 232 ఏర్పాటు చేశాం. పూర్తిగా దెబ్బతిన్న, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం ఇప్పటికే పూర్తిచేశాం. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లు 5,434, పూర్తిగా దెబ్బతిన్న ఇళ్లు 1,169. తాత్కాలిక ఇల్లు అయితే రూ.3200, పక్కా ఇల్లు అయితే రూ.5,200, పూర్తిగా ఇల్లు దెబ్బతింటే రూ.95,100 పరిహారం అందరికీ ఇచ్చేశాం. ఇల్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి నష్టపరిహారంతో పాటు రూ.1.80 లక్షలతో కొత్త ఇల్లు మంజూరు పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. 

ఇదే కార్యక్రమం గతంలో చంద్రబాబు హయాంలో కనీసం 3, 4 నెలలు పట్టేది. ఈరోజు వారం తిరక్కముందే పరిహారం ఇవ్వడమే కాకుండా ఇల్లు మంజూరు పత్రాలను అందించడం జరిగింది. పంటనష్ట పరిహారానికి సంబంధించి అంచనాలు వేగంగా పూర్తిచేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం. ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఏ సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌ ముగిసేలోగా పరిహారం ఇవ్వడానికి మన ప్రభుత్వం ఒక విధానం తెచ్చింది. అదే దిశగా అంచనా పూర్తయిన తరువాత సోషల్‌ ఆడిట్‌లో పెట్టి.. అర్హుల పేర్లు పొందుపరిచే వెసులుబాటు కల్పించి.. వేగవంతంగా వారికి రావాల్సిన పరిహారం వెంటనే వచ్చేలా చర్యలు తీసుకుంటాం. 

రోడ్ల పునరుద్ధరణకు సంబంధించిన నివేదికలు వెంటనే ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించాం. నివేదికలు అందిన వెంటనే అంచనాలు వేసి ప్రాధాన్యత పనులుగా నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం. నెలరోజుల్లోగా శాశ్వత మరమ్మతు పనులు మంజూరు అయ్యేలా కార్యాచరణ చేయాలని ఆదేశాలిచ్చాం. ఇది జరిగేలోగా రవాణాకు ఇబ్బంది లేకుండా తాత్కాలిక పనులు చేయాల్సిన కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

చెరువులు, గట్టులకు సంబంధించిన పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాం. 882 చోట్ల ధ్వంసం అయితే  ఇప్పటికే 267 పూర్తయ్యాయి. మిగిలిన చోట్ల యుద్ధప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. ఇలాంటి ప్రమాదాలను, ఘటనలను శాశ్వతంగా తక్కువ చేయడానికి, గేట్లు ఉన్న చిన్నా, పెద్ద రిజర్వాయర్‌ కూడా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేలా ఆలోచన చేస్తున్నాం. ప్రతి చిన్న, పెద్ద రిజర్వాయర్లకు రియల్‌టైమ్‌లో ఉన్న నీటిని, ప్రవాహాన్ని మానిటర్‌ చేసేట్లుగా ఆటోమేషన్, వాటర్‌ గేజేస్‌ రిజర్వాయర్లలో పెట్టి.. రియల్‌టైమ్‌ ఆన్‌లైన్‌ ఆటోమెటిక్‌ డేటా వచ్చేలా కంట్రోల్‌ రూమ్‌ ఈఎన్‌సీ కార్యాలయంలో ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేయాలని ఆదేశాలిచ్చాం. రిపోర్టులను అ«ధ్యయనం చేసి.. కాంక్రీట్‌ మెజర్స్‌ తీసుకునే దిశగా సీఎస్‌ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. 

నెల్లూరు జిల్లా, గంగపట్నం గ్రామం, ఇందుకూరుపేట మండలం పాత్ర మణెమ్మ, భర్త శ్రీనయ్య కుటుంబానికి 24–11–2021న రూ.2 వేలు ఇచ్చాం. 25–11–2021న ఎసెన్షియల్‌ కమాడిటీస్‌ ఇవ్వడం జరిగింది. 26–11–2021న రూ. 4,200 డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు ఆల్రెడీ ఉంది కాబట్టి పట్టా ఇవ్వలేదు. ఈనాడులో చూపించింది చంద్రబాబు ఫొటో దిగింది ఇంటి ముందు ఉన్న పాకలో.. 
ప్రభుత్వం నుంచి సాయం అందిందని ఈనాడు పత్రికలో రాయలేదు కానీ, డ్యామేజీ జరిగిందని ప్రభుత్వం మీద బురదజల్లాలని ఈనాడు పత్రికలో పతాక శీర్షికలో రాస్తారు. 

లీడర్‌ అనేవాడు చేయాల్సింది డ్రామాలు కాదు.. సహాయం కరెక్ట్‌గా, ఏ ఒక్కరినీ మిస్‌ చేయకుండా, సాచురేషన్‌ పద్ధతిలో మంచి జరిగేలా చేయడం లీడర్‌ చేయాల్సిన పని. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top