అసమాన్యుల వెలకట్టలేని ప్రతిభకు సలాం

తెలుగుజాతి మాణిక్యాలను సత్కరించడం దేవుడు నాకిచ్చిన అదృష్టం

నిండైన తెలుగుదనానికి నిలువెత్తు నిదర్శనం మహానేత వైయస్‌ఆర్‌

భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన మహామనిషి

గొప్ప నాయకుడి పేరుమీద రాష్ట్రస్థాయి అత్యుత్తమ పౌర పురస్కారాల ప్రదానం

వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్, ఎచీవ్‌మెంట్‌ అవార్డులతో సత్కారం

వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలకు రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం

వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు గ్రహీతలకు రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం

ప్రతిభకు పెద్దపీట వేసి.. అత్యంత పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపట్టాం

ప్రతి ఏటా నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అవార్డుల ప్రదానం

అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

విజయవాడ: ‘‘భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. నాన్న పంచెకట్టులో నిండైన తెలుగుదనం, వ్యవసాయం మీద మమకారం, పల్లె, పేదల మీద గుండె నిండా అభిమానం, ప్రతి ఒక్కరినీ పెద్దచదువులు చదివించాలనే తపన, ప్రతి ప్రాణాన్ని నిలబెట్టాలనే ఆరాటం.. వీటన్నింటికీ నిలువెత్తు నిదర్శనం వైయస్‌ఆర్‌’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నాన్న అంతటి గొప్పవారు.. మహానుభావులు కాబట్టే ఆయన పేరుమీద రాష్ట్రస్థాయి అత్యున్నత పౌర పురస్కారాలు వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానం చేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చెప్పారు. తెలుగుజాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావులను సత్కరించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. 

విజయవాడలోని ఏ–కన్వెన్షన్‌ సెంటర్‌లో నిర్వహించిన  వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు, వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు ప్రదానోత్సవానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి సతీమణి, వైయస్‌ఆర్‌ సీపీ గౌరవ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మాతృమూర్తి వైయస్‌ విజయమ్మ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను, అవార్డుల గ్రహీతలను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

‘‘ఎందరో మహానుభావుల మధ్య సామాన్యులుగా ఉన్న అసమాన్యుల మధ్య నా సమయం గడపుతుందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందరో మహానుభావులు.. అందరికీ నా తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలుగు జాతి తరఫున వందనాలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాల్లో గొప్ప వారిని, మంచివారిని అత్యున్నత పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న వంటి అవార్డులనిచ్చి సత్కరిస్తుంది. మనందరి ప్రభుత్వం కూడా రాష్ట్ర అవార్డులు ఇస్తే బాగుంటుందని పలు సూచనలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు వైయస్‌ఆర్‌ అవార్డులను నెలకొల్పడం జరుగుతుంది. భూమి మీద ఉంటూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీద అవార్డులను ప్రదానం చేస్తున్నాం. 

వైయస్‌ఆర్‌ లైవ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.10 లక్షల నగదు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతాపత్రం ఇవ్వడం జరుగుతుంది. వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షల నగదు, కాంస్య విగ్రహం, యోగ్యతాపత్రం ఇవ్వడం జరుగుతుంది. మన ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఏ కార్యక్రమం చూసుకున్నా అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నాం. గ్రామ సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం మొదలుపెడితే.. చివరకు ప్రతి సంక్షేమ పథకం కూడా ప్రతి పేదవాడికి అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్థను తీసుకువచ్చాం. 

వైయస్‌ఆర్‌ లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్, వైయస్‌ఆర్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం, చివరకు వారి రాజకీయ పార్టీలు, భావాలను కూడా చూడలేదని సగర్వంగా తెలియజేస్తున్నాను. మనిషిని.. మనిషిగా చూశాం. విభేదించే భావాలున్న మనుషుల్లో మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలో డీమోస్ట్‌ ఇంపార్షల్‌ అవార్డులను అందిస్తున్నాం. ఇవి మన తెలుగుకు, మన సంస్కృతికి, మన కళలకు, మనలో ఉన్న మానవతా మూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగానే భావిస్తున్నాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. 

సామాన్యులుగా కనిపించే అసమాన్యులకు వందనం చేస్తూ.. వారి వెలకట్టలేని ప్రతిభకు సలాం చేస్తూ.. ఈ అవార్డులను ప్రకటించాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్‌ అంబాసిడర్లు అయిన కళలకు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మల ఆటకు, ఒక పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, ధింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర పెయింటింగ్స్‌కు, వీధి నాటకానికి, హరికథ, బు్రరకథకు, వెంకటగిరి జాందానీ చీరకు, మనదైన కళంకారికి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికి, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి. 

వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్‌ఎన్‌ చారిటీస్‌ వారికి, సీపీ బ్రౌన్‌ లైబ్రరీకి, వేటపాలెం గ్రంథాలయానికి, ఆర్‌సీడీ సంస్థకి, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌కి.. ఇటువంటి గొప్ప సంస్థలకు, వారి సేవలకు ఇస్తున్న అవార్డులివి. పండించే రైతన్నకు, మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులివి. 

కలం యోధులైన కవులకు, స్తీ్రవాద ఉద్యమానికి, ఛాందసత్వం మీద భావాల దాడులకు, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న అవార్డులివి. 

కోవిడ్‌ సమయంలో అయినవారే తమవద్దకు రాకూడదని, రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై.. తామే కుటుంబమై.. వారాలు, నెలల పాటు తమ కుటుంబాలకు దూరమై.. ప్రాణాలకు తెగించి అసమానమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. 

ఈ అవార్డులన్నీ ప్రతి ఏటా నవంబర్‌ 1వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు ప్రదానం చేస్తాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీ వాడిగా తెలుగుజాతిలో మాణిక్యాలను, మకుటాలను, మహానుభావులను సత్కరించడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.
 

Back to Top