నేను ఇచ్చే గ్యారంటీ నిజాయితీ, నిబద్ధత

గత ప్రభుత్వం మాదిరి అబద్ధాలు చెప్పలేను

చేయగలిగేది చెబుతా.. కచ్చితంగా చేసి చూపిస్తా

ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ పేరుతో గత ప్రభుత్వం గారడి చేసింది

ఎప్పటికైనా ప్రత్యేక హోదా సాధించి తీరుతాం

పరిశ్రమల రాకను మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం.. సదుపాయాలు కల్పిస్తాం

గత ప్రభుత్వం పెట్టిన ఇండస్ట్రీయల్‌ రాయితీ బకాయిలు చెల్లిస్తున్నాం.

రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎయిర్‌పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు, గ్రీన్‌ఫీల్డ్‌పోర్టుల నిర్మాణం

‘వైయస్‌ఆర్‌ నవోదయం’తో ఎంఎస్‌ఎంఈలకు పునర్జీవం పోశాం

రాష్ట్రంలో 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం

పొల్యూషన్‌ కంట్రోల్‌ యాక్ట్‌లో మార్పు తెస్తున్నాం

విశాఖ దుర్ఘటన బాధితులకు 10 రోజుల్లోనే సాయం అందించాం

పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన స‌మీక్ష‌లో సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘పారిశ్రామికవేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ నిబద్ధత, నిజాయితీ. ఇవి మాలో ఉన్నాయి. ఏదైతే చెబుతామో.. వాటిని కచ్చితంగా చేసి తీరుతాం.’’ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మన ఆర్థికరథం నడవాలంటే వ్యవసాయం అనేది ఒక చక్రం అయితే.. పారిశ్రామిక, సేవా రంగాలు రెండు చక్రాలు.. ఈ మూడు రంగాల్లో అభివృద్ధి చూపించగలిగితేనే రథం పరుగెత్తగలుగుతుందని సీఎం అన్నారు. 

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన– మీ సూచన’ౖ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు పరిశ్రమలు, పెట్టుబడులపై మేధోమథన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఉన్నతాధికారులు, పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏడాది పాలనలో పరిశ్రమల కోసం చేసిన సంస్కరణలు, ఎంఎస్‌ఎంఈలకు చేసిన ప్రయోజనాల గురించి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వివరించారు. రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరించారు. 

సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..

రాష్ట్రం విడిపోయిన తరువాత మనకు నష్టం జరిగిందని చెప్పకతప్పదు. రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు స్పెషల్‌ స్టేషన్‌ ఇస్తామని మాటిచ్చి దాని తరువాత ఇవ్వకుండా పోయిన పరిస్థితి కళ్ల ముందే కనిపించాయి. 

ప్రత్యేక హోదా వచ్చి ఉంటే ఇండస్ట్రీ ఇన్సెన్టివ్స్‌ ఇంకా ఎక్కువగా అందుబాటులోకి వచ్చిఉండేవి. కేంద్ర ప్రభుత్వం భారాన్ని పంచుకునేది. అప్పుడు ఇన్‌కంట్యాక్స్, జీఎస్‌టీ మినహాయింపులు ఇటువంటివి అనేకం వచ్చి ఉండేవి. వాటివళ్ల ఇంకా పరిశ్రమలకు ప్రోత్సాహం ఎక్కువ ఉండేది. దురదృష్టవశాత్తు 2014–19 వరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కాపురం చేసినా కూడా ప్రత్యేక హోదాను రాష్ట్రం తెచ్చుకోలేకపోయింది. దాని తరువాత ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మన పార్టీ ఘన విజయాన్ని సాధించింది. 25కు 22 పార్లమెంట్‌ సీట్లు, 175 అ సెంబ్లీ సీట్లకు 151 సీట్లను స్వీప్‌ చేయగలిగాం. 

ఇటువంటి మెజార్టీ వచ్చినప్పుడు కేంద్రంలో వారికి సంపూర్ణమైన మెజార్టీ రాకపోయి ఉండి ఉంటే రాష్ట్రానికి బెనిఫిట్స్‌ వచ్చేవి. మనం ఎవరికి సపోర్టు చేయాల్సి వచ్చినా ప్రత్యేక హోదా డిమాండ్‌ను వారి ముందు పెట్టేవాళ్లం. దురదృష్టవశాత్తు అది జరగలేదు. కేంద్రంలో ఎన్డీయే సంపూర్ణ మెజార్టీ సాధించింది. కాబట్టి మనతో వారికి అవసరం.. పని కూడా లేకుండా పోయింది. ప్రత్యేక హోదా మళ్లీ మనకు కాస్త దూరంగా కనిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. కానీ, హోదా అడగడం మానేస్తే అది ఏ రోజూ మనకు రాదు అనే సంగతి పూర్తిగా తెలిసిన వ్యక్తిని నేను. ఈ రోజుకు కాకపోతే రేపయినా వస్తుంది. ఈరోజు కాకపోయినా కేంద్రం మనపై ఆధారపడే రోజు ఎప్పుడైనా వస్తుంది. వచ్చిన ఆ రోజున ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే సంపూర్ణ మద్దతు ఇస్తామనే మన ఆలోచన ముందుకు తీసుకువస్తాం. ప్రత్యేక హోదా సాధించి తీరుతాం.

అవి లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోకి తీసుకువచ్చేందుకు మనం ఏం చేయగలమో అవన్నీ చేసుకుంటూ పోతున్నాం.. ఇవి మాట్లాడేటప్పుడు నేను గట్టిగా నమ్మేది.. మనం ఏదైనా చెబితే ఆ మాటల్లో నిజాయితీ, నిబద్ధత ఉండాలి. నేను కూడా గత ప్రభుత్వం మాదిరిగానే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు సాధించామని ఆ మాటలే నేను మాట్లాడితే విలువ ఉండదు. గత ప్రభుత్వం మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే.. రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు, 40 లక్షల ఉద్యోగాలు అంటూ ఒక రోజు.. నెలకో విదేశీ పర్యటనల హడావిడి.. రూ.50 వేల కోట్లతో సెమీకండక్టర్‌ పార్కును నెక్ట్‌ హార్బిట్‌ ఏర్పాటు చేస్తుందని ఒక రోజు.. ఎయిర్‌బస్‌ వచ్చేస్తుందని ఒకరోజు.. మైక్రోసాఫ్ట్‌ వచ్చేస్తుందని ఒక రోజు.. బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చేస్తుందని మరో రోజు.. హైపర్‌లూప్‌ వచ్చేస్తుందని మరోరోజు.. ఇవి సరిపోవు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో దివాళా తీసిన బీ.ఆర్‌.శెట్టి.. ఈ పక్కనే 1500 పడకల ఆస్పత్రి కోసం రూ. 6 వేల కోట్లతో దిగుతున్నాడని ఇలాంటి అబద్ధాలు, గ్రాఫిక్స్‌ చెప్పారు.. చూపించారు.

ఇలాంటి మాటలు నేను కూడా చెప్పడం మొదలుపెడితే ఎక్కడా న్యాయం అనేది ఉండదు. గతంలో ఆశ్చర్యం కలిగించే మాటలు.. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి గొప్పగా చెప్పుకునేవారు... టాప్‌ 1, 2, 3 స్థానంలో మన రాష్ట్రం ఉందని గొప్పగా చెప్పుకునేవారు. ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటే ఏంటో నిజంగా నాకు అర్థం కాలేదు. 

గత ప్రభుత్వం 2014–19 వరకు ఇండస్ట్రీయల్‌ రాయితీలు ఇస్తామని చెప్పిందో.. ఆ మాట మీద పారిశ్రామిక వేత్తలు పరిశ్రమలు పెడితే.. వాళ్లకు ఇవ్వాల్సిన రాయితీలు 2014 నుంచి 19వరకు ఎన్ని ఉన్నాయని లెక్క తీస్తే దాదాపు రూ.4 వేల కోట్ల పెండింగ్‌ బకాయిలు. దీంట్లో రూ.968 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు సంబంధించినవి. రాయితీలు ఇస్తామని చెప్పి.. పారిశ్రామిక వేత్తలతో పరిశ్రమలు పెట్టించి ఆ రాయితీలు ఇవ్వకుండా.. మన రాష్ట్రంలో చాలా బాగుందని ఎలా చెప్పగలం. 

ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే.. డిస్కమ్‌లకు ఎంత అప్పులు ఉన్నాయని చూస్తే.. పవర్‌ ప్రొడ్యుసర్స్‌ దగ్గర నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌కు రూ.20 వేల కోట్ల బకాయిలు పెట్టింది. డిస్కమ్‌లకు సప్లయ్‌ చేసిన కరెంట్‌కు బిల్స్‌ పే చేయడం మానేసింది. గత ప్రభుత్వం మీడియాను అడ్డంపెట్టుకొని గొప్పలు చెప్పుకుంది. అందరూ ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అంటారు.. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా దావోస్‌కు.. ప్రతి రెండు నెలలకు విదేశీ పర్యటనలకు వెళ్లి అబద్ధాలు చెప్పినవే చెప్పి.. వాళ్లకు అనుకూలంగా ఉన్న మీడియాతో ప్రచారం చేయించుకున్నారు. 

ఇలాంటివన్నీ నేను చెప్పలేను.. నేను ఏం చేస్తున్నాను.. ఈ ఏడాదిలో ఏం చేయగలిగానని నిజాయితీగా చెప్పగలను. పారిశ్రామిక వేత్తలకు నేను ఇచ్చే ఒకే ఒక్క గ్యారెంటీ ఏంటంటే.. నిబద్ధత, నిజాయితీ. ఇవి మాలో ఉన్నాయి. ఏదైతే చెబుతామో.. వాటిని కచ్చితంగా చేసి తీరుతాం. 

పారిశ్రామికంగా, మౌలిక సదుపాయల పరంగా ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సిన వనరులు ఉన్నాయి. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కనివిని ఎరుగని సుస్థిర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రంలో ఉంది. 86 శాతం అసెంబ్లీ సీట్లు గెలుచుకొని సుస్థిర ప్రభుత్వం ఏపీలో ఉంది. ఏపీలోనే కాకుండా దేశంలోనే  22 ఎంపీలతో నాల్గవ అతిపెద్ద పార్టీగా నిలిచాం. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి 972 కిలోమీటర్ల సముద్రతీరం కలిగి ఉంది. విస్తారమైన రైలు మార్గం ఉంది. రోడ్డు కనెక్టివిటీ ఉంది. నాలుగు పోర్టులు ఉన్నాయి. ఆరు ఎయిర్‌పోర్ట్స్‌ ఉన్నాయి.

గతంలో ఇండస్ట్రీయిల్‌ రాయితీలు ఇవ్వాలంటే గత ప్రభుత్వ పెద్దలకు అంతో ఇంతో ముట్టజెబితే తప్ప ఇండస్ట్రీయల్‌ రాయితీలు రానిపరిస్థితి. కానీ, మా పాలనలో గర్వంగా చెప్పాల్సిన మాట ఒకటుంది.. అవినీతికి తావులేకుండా పారదర్శకమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఎవరూ లంచాలు అడగరు. పరిశ్రమలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.. వచ్చేవాటిని స్వాగతిస్తున్నాం. 

వ్యవస్థలోకి పూర్తిగా మార్పు తీసుకువచ్చేందుకు దేశంలోనే ఎక్కడా లేని విధంగా జ్యుడీషియల్‌ ప్రివ్యూ కమిషన్‌ను ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో టెండర్లు జరిగే ముందు  అవి న్యాయమూర్తి ముందు పెడుతున్నాం. ఆ తరువాతే టెండర్ల ప్రక్రియకు వెళ్తున్నాం. దేశంలో ఎక్కడాలేని విధంగా రివర్స్‌టెండరింగ్‌ విధానాన్ని తీసుకువచ్చాం. ఎవరైనా టెండర్లలో పాల్గొన్న తరువాత ఎల్‌1 ఎవరికైనా వస్తే.. ఆ ఎల్‌1 కన్నా ఇంకా తక్కువ రేట్‌కు వేయడానికి టెండర్‌ వేయడానికి ఎవరికైనా ఆసక్తి ఉంటే రివర్స్‌టెండరింగ్‌ చేపడుతున్నాం. 

లా అండ్‌ ఆర్డర్‌ పరంగా దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్‌ వ్యవస్థ ఆంధ్రరాష్ట్రంలో ఉంది. గ్రామ సచివాలయంలో కూడా మహిళా కానిస్టేబుల్‌ను నియమించాం. గ్రామస్థాయి వరకు అత్యంతబలమైన పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఇప్పటికే దాదాపు ఒక లక్ష కోట్ల రూపాయల మేరకు ఫార్మా, చేపలు, రొయ్యలు, వ్యవసాయ ఉత్పత్తులు, పొగాకు, కాఫీ గింజలు అన్నీ కలిపి రూ. లక్ష కోట్ల ఎగుమతులు చేసే పరిస్థితిలో ఏపీ ఉంది. 

ఏపీలో విద్యుత్‌ కొరత లేదు. విస్తృతమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ ఉంది. బలమైన బ్యాంకింగ్‌ వ్యవస్థ గ్రామ స్ధాయి వరకు ఉంది. అవసరాలకు తగినట్టుగా పారిశ్రామిక వేత్తలకు భూమి ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వనరులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాగునీటి అవసరాల కోసం వాటర్‌ గ్రిడ్‌ దగ్గర నుంచి సాగునీటికి కెనాల్‌ సిస్టమ్‌ నుంచి పారిశ్రామిక అవసరాల కోసం నీటిని ఇచ్చే విధంగా యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నాం.

ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లిష్‌ మీడియం అలవాటు చేయడం ద్వారా రానున్న పదేళ్లలో సేవారంగానికి అద్భుతమైన మానవ వనరులను అందించే స్థాయికి మన రాష్ట్రం వెళ్తుంది దీని వల్ల అని గొప్పగా చెప్పగలను. గ్రాస్‌ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) పెంచేందుకు కృషిచేస్తున్నాం. బ్రిక్స్‌ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా వీటితో పోల్చుకుంటే.. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) ప్రకారం రష్యాలో 82 శాతం మంది కాలేజీల్లోకి వెళ్తున్నారు. బ్రెజిల్‌లో 51 శాతం, చైనాలో దాదాపు 51 శాతం పిల్లలు కాలేజీల్లో జాయిన్‌ అవుతున్నారు. మన ఇండియా మాత్రం కేవలం 25.8 శాతం మంది పిల్లలు మాత్రమే పైచదువులకు వెళ్తున్నారు. 

జీఈఆర్‌ రేషియోను మార్చేందుకు అడుగులు వేస్తున్నాం. ఇందుకోసం వందశాతం ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని తీసుకువచ్చాం. స్కిల్డ్‌ మ్యాన్‌పవర్‌ను తీసుకువచ్చేందుకు విద్యారంగంలో విప్లవాత్మక మార్పుల దిశగా అడుగులు వేస్తున్నాం. అదే విధంగా పరిశ్రమల్లో 75 శాతం స్థానికులకే అవకాశాలు కల్పించాలని చట్టం కూడా చేశాం. ఇండస్ట్రీ పాజిటివ్‌ ఇన్వాయర్‌మెంట్‌ తీసుకువచ్చేందుకు 75 శాతం లోకల్‌ రిజర్వేషన్‌ చాలా పెద్ద పాత్ర పోషిస్తోంది. 

ఇంజనీరింగ్, డిగ్రీ కోర్సుల్లో ప్రొఫెషనల్‌ కోర్సుల్లో అందుబాటులో ఉన్నాయి. కరికులంలో మార్పులు తీసుకువస్తున్నాం. జాబ్‌ఓరియంటెడ్‌ కరికులం తీసుకువచ్చేలా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నాం. ఇంటర్న్‌షిప్‌ కూడా తప్పనిసరి చేస్తున్నాం. లాస్ట్‌ సెమిస్టర్‌లో, వేసవి సెలవుల్లో ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేస్తున్నాం. జాబ్‌ ఓరియంటెడ్‌ కోర్సులు తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. దీంతో కాలేజీల్లో చదివేటప్పుడే పిల్లలకు పనిచేసే అనుభవం, నాలెడ్జ్‌ కూడా పెరుగుతుంది. 

ఈ సంవత్సరకాలంలో మనం ఏం చేయగలిగామని చూస్తే.. నేను అధికారంలోకి వచ్చిన రెండున్నర నెలలు కాకముందే డిప్లమాటిక్‌ అవుట్‌రీచ్‌ ప్రోగ్రాంను చేపట్టాం. దాదాపు 34 దేశాల ప్రతినిధులతోఆహ్వానించి చర్చించాం. కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందిగా ఆహ్వానం పలికాం. మన రాష్ట్రంలో పెట్టుబడులు ఏయే రంగాల్లో అవసరం ఉన్నాయో వివరించడం జరిగింది. పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నాం.. కాబట్టే మనపై అసూయతో గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు, ఒక వర్గానికి చెందిన మీడియా.. కియా పరిశ్రమ వెళ్లిపోతుందని దుష్ప్రచారం చేశారు. వెంటనే కియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ కిమ్‌ వెంటనే ట్వీట్‌ చేశారు. పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం మాకు సపోర్టుగా ఉంది. కియా కంపెనీ ఎక్కడకు వెళ్లడం లేదని కిమ్‌ స్పష్టంగా చెప్పారు. 

ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు ఎల్లో మీడియా, చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అబద్ధాలు చెప్పడంలో వీరు దిట్ట. పరిశ్రమలకు సానుకూల పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ప్రభుత్వం కూడా నూతన పరిశ్రమల స్థాపనకు సపోర్టివ్‌గా ఉంది కాబట్టే.. ఈ ఏడాది కాలంలో రూ.34,322 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ.. రాష్ట్రంలో 39 భారీ, మధ్య తరహా పరిశ్రమల ఏడాదిలో ఉత్పత్తికి ప్రారంభించడం జరిగింది. ప్రభుత్వం పపోర్టీవ్‌గా లేకపోతే ఎందుకు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకువస్తారు. 

ఏడాది కాలంలో 13,122 కొత్త ఎంఎస్‌ఎంఈ యూనిట్లు కూడా వచ్చాయి. వీటి ద్వారా రూ.2,503 కోట్ల పెట్టుబడులు రాగా.. 63,897 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ మధ్య కరోనా విపత్తు వల్ల పరిశ్రమలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు.. రాబోయే రోజుల్లో ఇవన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తే ఉద్యోగాలు కూడా రెట్టింపు అయ్యే అవకాశం ఉందన్నారు. 

మరో రూ.11,548 కోట్లతో పరిశ్రమలు పెట్టేందుకు 1466 కంపెనీలు సన్నద్ధంగా ఉన్నాయి. ఏపీఐఐసీ ద్వారా వివిధ పరిశ్రమలకు 1613 ఎకరాల భూమి కేటాయింపు కూడా జరిగింది. మరో ప్రముఖ సంస్థలు కూడా ఏపీలో పరిశ్రమలు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. వాటిని ఆదుకునేందుకు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ కూడా చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 98 వేల యూనిట్లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు 10 లక్షల మందికిపైగా పనిచేస్తున్నారు. వీటిని నిలబెట్టుకోగలిగితేనే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం కాకుండా మరో ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం అని చెప్పి.. ఈ ఎంఎస్‌ఎంఈలు బ్యాంకుల్లో లోన్‌లు కూడా కట్టలేని ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయని వెంటనే ‘వైయస్‌ఆర్‌ నవోదయం’ పేరిట కొత్త పథకాన్ని తీసుకువచ్చి దాదాపు 81 వేల మంది ఎంఎస్‌ఎంఈలకు రూ.2300 కోట్లతో ప్రయోజనం చేకూర్చే విధంగా వాటి పునరుద్ధరణకు బ్యాంకులతో మాట్లాడి ప్యాకేజీలు కూడా తయారు చేసి వారికి తోడుగా నిలబడ్డాం. 

ఇదికాకుండా పారిశ్రామికరంగాన్ని ఆదుకోవడం కోసం మనసుపెట్టి ఆలోచన చేశాం కాబట్టే కోవిడ్‌ సమయంలో మూతపడే స్థితికి వచ్చిన చిన్న చిన్న ఎంఎస్‌ఎంఈలను గాడిలో పెట్టేందుకు రూ.968 కోట్లతో 2014 నుంచి 2019 వరకు పెండింగ్‌లో పెట్టిన ఇండస్ట్రీయల్‌ రాయితీ బకాయిలు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. కోవిడ్‌ సమయంలో మన ఆర్థిక ఇబ్బందులు మనకు ఉన్నా.. కూడా మొదటి దఫాగా రూ.450 కోట్లు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చాం. జూన్‌ 29న మిగిలిన బ్యాలెన్స్‌ రూ.500 కోట్లు చెల్లిస్తాం. 

గత ప్రభుత్వం ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ అని పరిశ్రమల రాయితీలు ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి.. మేము నిజమైన ఈజ్‌ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు చేయూతను అందించాం. ఇవేకాకుండా ఏప్రిల్, మే, జూన్‌కు సంబంధించి రూ.188 కోట్ల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ చార్జీలను రద్దు చేశాం. ఇవేకాకుండా కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహంతో ఎంఎస్‌ఎంఈలను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరుఫు నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.12 వందల కోట్లతో ఆర్థిక ప్యాకేజీని అందించాం. 

అనుకున్నస్థాయిలో భారీ పరిశ్రమలు తీసుకువచ్చేందుకు మీ నుంచి సలహాలు, సూచనలు కోరుతున్నాను. మీరు చెప్పే సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు అడుగులు వేస్తాం. రాష్ట్రానికి సంబంధించి మూడేళ్లలో చేయబోయే ప్రాజెక్టులను గుర్తించాం. కచ్చితంగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులేంటని ఆలోచన చేస్తే.. రామయపట్నం, మచిలీపట్నం, బావనపాడులో గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టులు ఏర్పాటు చేయనున్నాం. ఇవి ఉన్నవాటికి అదనంగా యాడ్‌ అవుతాయి. బోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం.. విశాఖ పరిపాలన రాజధానిగా మారనుంది. అక్కడ మెట్రో రైల్, అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి టెండర్లు ప్రక్రియ పూర్తయింది. జీఎంఆర్‌కు రీకాంట్రాక్టు ఇవ్వడం జరిగింది. 

ఇవేకాకుండా స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఎనిమిది ఫిషింగ్‌ హార్బర్లు నిర్మించనున్నాం. కడపలో రూ.15 వేల కోట్లతో రెండున్నర మిలియన్‌ టన్నుల ఉత్పత్తితో కూడిన స్టీల్‌ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా పారిశ్రామిక వేత్త ఆసక్తి చూపితే ప్రభుత్వం భాగస్వామ్య ఒప్పందంతో నిర్మాణం చేపట్టేందుకైనా.. లేక వారికి నిర్మాణ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నాం. రా మెటీరియల్‌కు సంబంధించి ఎన్‌ఎండీసీతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాం. డీఆర్‌డీఓ సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇనిస్టిట్యూషన్‌తో స్టీల్‌ సప్లయ్‌ చేసే పరిస్థితిలోకి ఒప్పందం చేసుకుంటున్నాం. 

పరిశ్రమలు పెట్టే వారికి భూమి పరంగా, నీరు పరంగా, విద్యుత్‌ పరంగా, అతిముఖ్యమైన స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ను అందించగలం. స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ తీసుకువచ్చేందుకు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకువస్తున్నాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఒక స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ఏర్పాటు చేయడమే కాకుండా మరో ఐదు కాలేజీలు అదనంగా మొత్తం 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు తీసుకువస్తున్నాం. ఇక్కడ కూడా ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన కంపెనీలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చూస్తున్నాం. ఈ కాలేజీలు ఇంజనీరింగ్, డిప్లమా చేసిన పిల్లలకు అత్యున్నతస్థాయి నాలెడ్జ్‌ను అందించేందుకు ఉపయోగపడతాయి. ఇవేకాకుండా ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్, మెషిన్‌ లెర్నింగ్, ఇటువంటి కోర్సులు అందించేలా విశాఖలో హై అండ్‌ స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి పట్టణాలతో పోటీ పడాలన్నా.. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రావాలన్నా.. విశాఖపట్నం అనువైన స్థలం. 

విశాఖలో ఈ మధ్య జరిగిన గ్యాస్‌ లీకేజీ దుర్ఘటన అందరికీ తెలిసిన విషయమే. ఎల్‌జీ పాలిమర్స్‌ మల్టీనేషనల్‌ కంపెనీ.. ఎవరూ ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిందని వెంటనే అరెస్టులు చేయడం, దురుసుగా ప్రవర్తించడం మంచిది కాదు. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి.. ఎలా జరిగిందని విచారణ చేయాలి.. ఇవన్నీ చేయకుండా దురుసుగా ప్రవర్తిస్తే.. ఇండస్ట్రీ కమ్యూనిటీ పాడవుతుంది. ఏపీలో ర్యాష్‌గా నిర్ణయాలు తీసుకుంటారు.. అక్కడ పెట్టుబడులు పెట్టడం ఎందుకని ఆలోచన వస్తుంది. ఇదే సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోతే ప్రజలు చనిపోతారు.. గవర్నమెంట్‌ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని దుష్ప్రచారం మొదలవుతుంది. 

ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి తండ్రిగా ఉన్నప్పుడు ఒకవైపు అభివృద్ధి, మరోవైపు ఆ అభివృద్ధి వల్ల మన ప్రజలకు మంచి జరగాలి.. ఇంకోవైపు ఆ అభివృద్ధి వల్ల ప్రజలకు నష్టం జరగకూడదు. దేశ చరిత్రలో ఎక్కడా, ఎప్పుడూ లేని విధంగా విశాఖ ఘటనపై స్పందించాం. కంపెనీ హెల్ప్‌ తీసుకున్న తరువాతే మన ప్రజలకు మంచి చేయాలని ఆలస్యం చేయలేదు. మనం ఏం చేయగలమో.. ఆలోచించి వెంటనే ముందుకు అడుగులు వేశాం. రూ. 50 కోట్లు విడుదల చేసి బాధితులను పది రోజుల్లోనే ఇచ్చాం. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం పదిరోజుల్లో అందజేశాం. బాధితులకు అండగా నిలిచే కార్యక్రమాలన్నీ చేశాం. ప్రమాదం ఉదయం 3:30 గంటలకు జరిగిందని సమాచారం రాగానే 4:30 గంటలకు పోలీసులు, కలెక్టర్, అంబులెన్స్‌లు అన్నీ చేరుకునేలా చేశాం. అందరినీ ఆస్పత్రుల్లో చేర్చి మెరుగైన వైద్యం అందించాం. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందనే గట్టి నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాం. ప్రమాదం జరిగిన కంపెనీపై కమిటీలు వేశాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కమిటీలను కూడా లేఖ రాసి పిలిపించాం. అన్నీ కమిటీలు ఘటనపై విచారణ చేస్తున్నాయి. ప్రమాదం జరిగినప్పుడు అలారం ఎందుకు మోగలేదని ఈ కమిటీలన్నీ ఆరా తీస్తున్నాయి. 

మనం కమిటీలు వేసి కనుక్కోవడం కాకుండా ప్రజల దగ్గర నుంచి కూడా ఆ కంపెనీపై ఉన్న ప్రశ్నలు, సందేహాలు అన్నీ తీసుకుంటున్నాం. కమిటీల దర్యాప్తు పూర్తయింది. కంపెనీని అడగాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసి పెట్టుకున్నాం. వీటికి కంపెనీ ఇచ్చే సమాధానం చూసిన తరువాత ఎలాంటి యాక్షన్‌ తీసుకోవాలో.. తీసుకుంటాం. స్టైరీన్‌ మొత్తం అక్కడి నుంచి తరలించాం. రాబోయే రోజుల్లో దాన్ని గ్రీన్‌ప్లాంట్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటాం. 

ఆరెంజ్‌ అండ్‌ రెడ్‌ కేటగిరికి చెందిన ఇండస్ట్రీలు జనాభా ఎక్కువ ఉన్న చోట స్థాపించకూడదు. పొల్యూషన్‌ కంట్రోల్‌ యాక్టును పూర్తిగా మార్పు చేస్తున్నాం. దీనిపై సమీక్షలు జరుపుతున్నాం. అందరినీ కలుపుకొని పోయే విధంగా రూపొందిస్తాం. 
 

Back to Top