ప్రతి పేదింట్లో చదువుల దీపాలు వెలగాలి

పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి విద్య మాత్రమే

గోపాల్‌ అన్న మాటలను నా జీవితంలో మర్చిపోలేను

విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం

మన పిల్లలు ప్రపంచంతో పోటీపడేలా ఇంగ్లిష్‌మీడియం తీసుకొచ్చాం

96 శాతం మంది తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్నే అంగీకరించారు

‘నాడు–నేడు’తోప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చబోతున్నాం

చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ తెచ్చాం

పిల్లలకు మధ్యాహ్న భోజన మెనూ సీఎం పర్యవేక్షించడం ఇదే ప్రథమం

‘అమ్మఒడి’ ద్వారా రూ.6350 కోట్ల‌తో 43 లక్షల మంది తల్లులకు సాయం

ఆగస్టు 3వ తేదీన ప్రతి విద్యార్థికి ‘జగనన్న విద్యా కానుక’

వైయస్‌ఆర్‌ కంటివెలుగు ద్వారా 70,41,988 మంది పిల్లలకు పరీక్షలు చేయించాం

విద్యాశాఖపై మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ‘‘పిల్లలకు మనం ఇవ్వగలిగే ఏకైక ఆస్తి విద్య మాత్రమే.. నిరుపేద కుటుంబం తలరాతలు మారాలంటే ఆ కుటుంబంలోని ఒక్కరైనా మంచి చదువులు చదవాలి. పిల్లలు ఎంత చదివినా.. మేనమామగా నేను తోడుగా ఉండి చదివిస్తా’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రతి గవర్నమెంట్‌ స్కూల్‌ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే అద్భుతమైన శిక్షణ కేంద్రం కావాలని, అందులోని ప్రతి గురువు తన సొంత పిల్లలకు చదువులు చెబితే.. ఏరకమైన సంతృప్తి పొందుతాడో.. పేదవాడి పిల్లలకు కూడా చదువులు చెప్పి అంతే సంతృప్తి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా'నని సీఎం అన్నారు. నా పాదయాత్రలో గొప్పల్‌ అన్న చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టామన్నారు.   

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ‘మన పాలన – మీ సూచన’ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు విద్యాశాఖపై మేధోమథన సమీక్ష నిర్వహించారు. సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమీక్షా సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు, మేధావులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ ఏడాది కాలంలో విద్యారంగంలో చేపట్టిన గొప్ప సంస్కరణలు, వచ్చే విద్యా సంవత్సరానికి చేపట్టబోయే కార్యక్రమాల గురించి సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు.. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..

14 నెలల పాటు 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. చాలా గ్రామాల ద్వారా పాదయాత్రగా వెళ్తున్నప్పుడు చాలా చోట్ల చిన్న చిన్న పిల్లలు కూడా పాదయాత్రలో అన్నా అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ.. నాతో అడుగులు కూడా వేశారు. చాలా చోట్ల పిల్లలను పుస్తకాలు ఇచ్చారా.. తల్లి అని అడిగా.. అక్టోబర్, నవంబర్‌ మాసంలో కూడా గవర్నమెంట్‌ పాఠశాలల్లో పుస్తకాలు అందని పరిస్థితి. 

చాలా చోట్ల పిల్లలకు అన్నం పెట్టే ఆయాలు వచ్చి కలిశారు. అన్నా.. 8 నెలలు అయిపోయిందన్నా.. సరుకుల బిల్లులు ఇవ్వలేదు. మధ్యాహ్న భోజన పథకం పెట్టాలంటే.. ప్రభుత్వం బిల్లులు ఇవ్వకపోతే పిల్లలకు అన్నం ఎలా పెట్టగలుగుతాం అన్నా.. మాకిచ్చే రూ. 1000 కూడా 8 నెలల నుంచి పెండింగ్‌లో ఉందని చెప్పారు.

ఇంకా అడుగులు ముందుకువేస్తూ స్కూళ్లు కనిపించేవి.. ఆ స్కూళ్లలో బాత్‌రూమ్‌లు లేవు.. ఉన్నా నీళ్లు ఉండవు. బిల్డింగ్‌లు అధ్వాన్నంగా కనిపిస్తున్నా.. వాటికి మరమ్మతులు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి ఉండేవి కావు. 

టీచర్లు మన దగ్గర ఎంత మంది ఉన్నారు.. ఎంతమంది పిల్లలకు ఎంత మంది టీచర్లు ఉండాలి.. టీచర్ల భర్తీ కార్యక్రమం కూడా జరిగేది కాదు. మొత్తంగా పరిస్థితి ఉండేదంటే.. గవర్నమెంట్‌ బడుల్లో మన పిల్లలను చదివించడం దండగ అని మనంతట మనమే భావించి మన పిల్లలను ప్రైవేట్‌ బడుల్లో చేర్పించే పరిస్థితి గతంలో ఉండేది. ప్రైవేట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం ఉంటుంది.. గవర్నమెంట్‌ స్కూళ్లలో తెలుగుమీడియం. 

పిల్లలు చదవాలంటే.. పోటీతత్వం పెరగాలంటే.. ప్రపంచంతో పోటీ పడేలా తయారవ్వాలంటే ఇంగ్లిష్‌ మీడియం తప్పనిసరి. ఈ రోజున పరిస్థితి ఒక్కసారి గమనించినట్లు అయితే.. మన కళ్ల ముందు సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏ బటన్‌ నొక్కినా అన్ని ఇంగ్లిష్‌లోనే కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో డ్రైవర్లు లేని కార్లు వస్తాయని ఈ రోజునే మనం వింటున్నాం. మన కళ్ల ముందు ఇవన్నీ కనిపిస్తున్నా.. మన పిల్లలను మాత్రం తెలుగు మీడియంలోనే.. గవర్నమెంట్‌ బడులల్లోకే పంపించాలంట. 

ఇంగ్లిష్‌ మీడియం వద్దు అనే పెద్ద మనుషులు వాళ్ల పిల్లలను తెలుగుమీడియంలో చదివించడం లేదు. ఇంగ్లిష్‌ మీడియాన్ని వ్యతిరేకించే వారంతా వాళ్ల పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలో చదివిస్తున్నారు. పోటీతత్వంలో పేదవాడు తన కాళ్లమీద తాను బతికే పరిస్థితి రావాలంటే పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి చదువు ఒక్కటే. చాలా మంది నన్ను అమ్మ ఒడికి ఇంత ఖర్చు పెడుతున్నారు.. నాడు – నేడుకు ఇంత ఖర్చు చేస్తున్నారు.. ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఫ్రీ అంటున్నారు.. వసతి దీవెన.. విద్యా దీవెన అంటూ ఇంత ఖర్చుపెడుతున్నారని చాలా మంది అంటున్నారు. కానీ నేను అనేది ఒక్కటే.. నేను ఖర్చుపెట్టేది పెట్టుబడి.. ఎవరిమీద ఖర్చుపెడుతున్నానంటే.. నా రాష్ట్రంలో ఉన్న నా పిల్లల మీద నేను పెట్టుబడి పెడుతున్నా..

రాష్ట్రంలో చదువురాని ఎంతమంది అని చూస్తే.. మన రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 33 శాతం. దేశం యావరేజ్‌ 27 శాతం. అంటే దేశం కంటే మన తక్కువ స్థాయిలో ఉన్నాం. ఇంటర్మీడియట్‌ అయిపోయిన తరువాత మన పిల్లలు ఎంతమంది కాలేజీలకు వెళ్తున్నారు..  మిగిలిన దేశాలలో ఏ మేరకు కాలేజీల్లో జాయిన్‌ అవుతున్నారని చూస్తే.. బ్రిక్స్‌ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్‌ ఆఫ్రికా వీటితో పోల్చుకుంటే.. గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) ప్రకారం రష్యాలో 82 శాతం మంది కాలేజీల్లోకి వెళ్తున్నారు. బ్రెజిల్‌లో 51 శాతం, చైనాలో దాదాపు 51 శాతం పిల్లలు కాలేజీల్లో జాయిన్‌ అవుతున్నారు. మన ఇండియా మాత్రం కేవలం 25.8 శాతం మంది పిల్లలు మాత్రమే పైచదువులకు వెళ్తున్నారు. 74 శాతం మంది చదువు ఇంటర్మీడియట్‌తోనే ఆపేస్తున్నారు. చదువు ఎందుకు ఆపేస్తున్నారని ఆలోచన చేస్తే.. చదవడం ఇష్టం లేక చదివించే సామర్థ్యం తల్లిదండ్రులకు లేక చదువు మధ్యలోనే ఆపేస్తున్నారు. ప్రతి అడుగులోనూ ఇదే కనిపిస్తుంది. నా పాదయాత్రలో నేను చూశా.. 

గోపాల్‌ అన్నను ఎప్పటికీ మర్చిపోలేను..

నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నా పాదయాత్ర జరుగుతుంది. ఒక ఇంటి ముందర ఒకాయన పెద్ద ఫ్లెక్సీ ఒకటి కనిపించింది. ఆ ఇంట్లో నుంచి ఆయన, ఆయన భార్య వచ్చి నన్ను కలిశారు. అతనిపేరు గోపాల్‌.. ఈ పేరు నేను నా జీవితంలో మర్చిపోలేను. చాలా బాధపడ్డాడు. కళ్లలోనుంచి నీళ్లు తిరిగాయి. ఎందుకు బాధపడుతున్నావు అన్నా.. అని అడిగితే.. ఆ ఫ్లెక్సీ నా కొడుకుది.. నా కొడుకు బాగా చదువుతాడు.. ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు వచ్చాయి. నా కొడుకును ఇంజనీరింగ్‌ చదివించడానికి కాలేజీకి తీసుకెళ్లా.. ఫీజు చూస్తే దాదాపు మెస్‌ ఖర్చులతో కలిపి దాదాపు రూ. 1 లక్షా అవుతుంది. ప్రభుత్వం కేవలం ముష్టి వేసినట్లుగా రూ. 35 వేలు ఇస్తుంది. మిగిలిన డబ్బు అప్పోసొప్పో చేస్తే తప్ప నా పిల్లాడిని చదివించలేని పరిస్థితి.. నా కొడుకు నా పరిస్థితిని చూసి ఆ సీటు వచ్చిన తరువాత నాన్న నా చదువు గురించి ఏం చేయాలనుకుంటున్నావ్‌ అని.. నువ్వు చదువు నేను ఏదో ఒకటి చేస్తానని చెప్పి అప్పుతీసుకొచ్చి నా కుమారుడిని కాలేజీలో చేర్పించాను. 

నేను అప్పు తెచ్చాననే సంగతి నా కొడుకుకు అర్థం అయ్యింది. మొదటి ఏడాది పూర్తయింది.. సెలవులకు ఇంటికి వచ్చాడు.. రెండవ ఏడాది ఫీజుల గురించి ఏ చేయబోతున్నావ్‌ నాన్న అని అడిగాడు.. ఏదో ఒకటి చేస్తానులే నాన్న అని చెప్పాను.. ఎలా చేయబోతున్నాననేది నా కుమారుడికి అర్థం అయ్యింది.. కాలేజీకి వెళ్లాడు.. ఆత్మహత్య చేసుకున్నాడు.. తన చదువు కోసం నేను అప్పులపాలు కావడం భరించలేక  నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని గోపాలన్న చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు.

ఇది ఆంధ్రరాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. పిల్లలను చదివించాలనే ఆరాటం ఉన్నా.. చదివించలేని పరిస్థితిలో తల్లిదండ్రులు.. మంచి చదువులు చదువుకోవాలన్నా.. ఆ చదువులు అందని పరిస్థితిలో పేదవాడు ఉన్నాడు. పేదరికం నుంచి ఎప్పుడు బయటకు వస్తారంటే.. ఆ కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి పెద్ద పెద్ద చదువులు చదివినప్పుడు తలరాతలు మారుతాయి. ఆ పిల్లలు బయటకు వెళ్లి పెద్ద ఉద్యోగాలు చేసి ఇంటికి కాస్తోకూస్తో పంపించగలిగితే.. ఆ పిల్లల జీవితాలు కూడా దారిద్య్రరేఖను దాటి మధ్యతరగతి వరకు వస్తారు. అలా చదివించలేకపోతే పేదరికంలో ఉన్నవాళ్లు ఎప్పటికీ అలాగే ఉండిపోతారు. 

పేదరికానికి ఉన్న ఏకైక సొల్యూషన్‌ చదువు. చదువుల్లో మార్పు తీసుకురావాలంటే.. మొదటి స్టేజీ నుంచి మార్పు తీసుకురావాలి. మన రాష్ట్రంలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలన్నీ తెలుగుమీడియం. ఇవన్నీ శిథిలావస్థకు చేరుతున్న పరిస్థితులు. బాత్‌రూమ్‌లు సరిగ్గాలేవు. అన్యాయమైన పరిస్థితుల్లో పాఠశాలలు ఉన్నాయి. 

గవర్నమెంట్‌ స్కూళ్లలో చదవాలంటే తెలుగుమీడియం.. ప్రైవేట్‌ స్కూళ్లలో పిల్లలను చదివించాలని ఉన్నా.. ఫీజులు కట్టేందుకు స్థోమత లేని దుస్థితి. ఇది ఈ రోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఇక్కడి నుంచి మార్పు జరగాలని చెప్పి.. వ్యవస్థలోకి మార్పు తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టాం. 

ప్రతి గవర్నమెంట్‌ స్కూల్‌ను ఇంగ్లిష్‌ మీడియం దిశగా అడుగులు వేయించాలని మొట్టమొదటి నిర్ణయం తీసుకున్నాం. స్కూళ్లలో పేరెంట్‌ కమిటీల ఎన్నిక జరిపించాం. ఆ తరువాత ప్రతి పేరెంట్‌ కమిటీని అడిగాం.. మన పిల్లలకు తెలుగు కంపల్సరీ సబ్జెక్టుగా చేస్తూ.. ఇంగ్లిష్‌మీడియం తీసుకురావడం మంచిదేనా అని అడిగాం.. 94 శాతం పేరెంట్‌ కమిటీలు ఇది మంచి ఆలోచన అని ఏకగ్రీవంగా తీర్మానం చేసి పంపించారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిష్‌ మీడియం తీసుకురాగలిగితే.. మా పిల్లలు ఇంగ్లిష్‌ నేర్చుకోగలుగుతారని 94 శాతం పేరెంట్‌ కమిటీలు అంగీకరించాయి. 

పేదవాడు తన పిల్లల బతుకులు మార్చుకునేందుకు ఆరాటపడుతుంటే.. మన ఖర్మ కొద్ది ఒక చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మనం బతుకుతున్నాం. అటువంటి కార్యక్రమానికి కూడా అడ్డంకులే.. బయటకు ఒక మాట.. అసెంబ్లీలో బిల్లులు అడ్డుకునేటప్పుడు బిల్లులు అడ్డుకుంటున్నారు. ఇంగ్లిష్‌ మీడియం బిల్లును అడ్డుకోవడం జరిగింది. బిల్లును డిలే చేయగలిగారు కానీ, అడ్డులేకపోయారు. మళ్లీ అదే బిల్లును ప్రవేశపెట్టి పాస్‌ వేయించాం. ప్రతి అడుగులోనూ పేదవాడికి జరిగే మంచిని అడ్డుకోవడమే ప్రతిపక్ష పనిగా మారింది. 

చివరకు వీళ్లంతా ఇంగ్లిష్‌ మీడియం తీసుకువస్తే.. తెలుగును అగౌరవ పరిచినట్లుగా కొత్త భాష్యం తీసుకువస్తున్నారు. ఇవన్నీ ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అంతా తెలుగును గౌరవించే పెద్దమనుషులు వారి పిల్లలను, మనవళ్లను ఎక్కడ చదివిస్తున్నారంటే.. అందరూ ఇంగ్లిష్‌ మీడియంలోనే చేర్చారు. కానీ, పేదవాడు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి.. తెలుగును గౌరవించాలంట.. వాళ్లు మాత్రం ఇంగ్లిష్‌ మీడియంలో చదవొచ్చు.. తెలుగును గౌరవించినట్లే.. ఇలాంటి భాష్యాన్ని ఎక్కువగా ఇస్తున్నారు. 

ఇటువంటి పరిస్థితుల్లో మళ్లీ కోర్టులకు వెళ్లి అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నాలు చేయడం.. అయినా కూడా కచ్చితంగా ఇది జరగాలి.. కచ్చితంగా ఇది చేయాలనే ఉక్కు సంకల్పంతో అడుగులు ముందుకు వేశాం. కోర్టులో అడ్డంకులు కలగజేస్తూ.. వాటిని కూడా స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 40 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల దగ్గరకు వలంటీర్లను, ఎడ్యుకేషన్‌ డిపార్టుమెంట్‌ స్టాఫ్‌ను పంపించి ఇంగ్లిష్‌ మీడియంలో తెలుగు సబ్జెక్టు కావాలా.. వద్దా..? లేకపోతే.. తెలుగు మీడియమే కావాలా.. ఇంకో మీడియం కావాలా..? అని ప్రతి ఇంటికి పంపించాం. ఆ తల్లిద్రండుల నుంచి 40 లక్షల అభిప్రాయాలు తీసుకున్నాం. 

పేరెంట్‌ కమిటీల్లో 94 శాతం ఏకగ్రీవంగా తీర్మానాలు వస్తే.. తల్లిదండ్రుల అభిప్రాయం దగ్గరకు వస్తే.. తమ పిల్లలను ఇంగ్లిష్‌ మీడియంలోనూ చదివించాలి.. తెలుగును కంపల్సరీ సబ్జెక్టు చేసే బాగుంటుందని ఏకంగా 96 శాతం అంగీకరించారు. ఈ 96 శాతం అంగీకారాన్ని (ఎస్‌ఈఆర్‌టీ) స్టేట్‌ లెవల్‌ అడ్వయిజరీ బోర్డుకు పంపించాం. వాళ్ల రెకమండేషన్స్‌ కూడా వచ్చాయి. మండలానికి ఒక తెలుగు మీడియం స్కూల్‌ పెట్టండి.. మిగిలినవి ఇంగ్లిష్‌మీడియం చేయండి అని సూచన చేశారు. దాన్ని ఆధారంగా సుప్రీం కోర్టుకు కూడా వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ తలరాతలు మారాలంటే మన పిల్లలకు మంచి చదువులు రావాలి. ఒకటి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెడుతున్నాం.. తరువాత సంవత్సరం 7వ తరగతి.. తరువాత సంవత్సరం 8వ తరగతి.. తరువాత సంవత్సరం 9, తరువాతి సంవత్సరం 10వ తరగతి నాలుగేళ్లకు మన పిల్లలు ఇంగ్లిష్‌ మీడియం సీబీఎస్‌ఈ బోర్డు ఎగ్జామ్స్‌ రాస్తారు. ఆ స్టేజ్‌లోకి నాలుగేళ్లలో తీసుకెళ్తాం. అందులో భాగంగా 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియానికి శ్రీకారం చుడుతున్నాం.

ఒకవైపు ఇంగ్లిష్‌ మీడియం తీసుకువస్తూ.. మరోవైపు స్కూళ్ల రూపురేఖలు మార్చబోతున్నాం. స్కూళ్లు, హాస్టల్స్, జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు అన్ని కలిపితే.. రాష్ట్రంలో దాదాపుగా 47,656 వచ్చాయి. వీటన్నింటి రూపురేఖలు మార్చే కార్యక్రమానికి ‘నాడు – నేడు’తో శ్రీకారం చుట్టాం. మొదటి విడతగా 15,715 స్కూళ్లను తీసుకున్నాం. ఈ జూలై నాటికి ప్రతి స్కూల్‌ రూపురేఖలు మార్చుతున్నాం. ప్రతి స్కూల్‌లో తొమ్మిది రకాల సదుపాయాలు కచ్చితంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాం. మరుగుదొడ్లు, డ్రింకింగ్‌ వాటర్, ట్యూబ్‌లైట్స్, ఫ్యాన్స్, ప్రతి స్కూల్‌లో ఫర్నీచర్, పెయింటింగ్‌ అండ్‌ ఫినిషింగ్స్, కాంపౌండ్‌వాల్, ఇంగ్లిష్‌ మీడియం ల్యాబ్స్‌ కూడా ఉండాలని తొమ్మిదిరకాల సదుపాయాలు కల్పిస్తూ.. నిర్ణయం తీసుకున్నాం. 15715 స్కూళ్లలో జూలై నాటికి ఇవన్నీ సదుపాయాలు ఉంటాయి. తరువాత సంవత్సరం మరో 15 వేల స్కూళ్లు, ఆ తరువాత సంవత్సరం మిగిలిన స్కూళ్లు, జూనియర్, డిగ్రీ కాలేజీల రూపురేఖలు మార్చబోయే కార్యక్రమం చేస్తున్నాం. 

పిల్లలను చదివించాలంటే.. ఆ చదువులు కుటుంబానికి భారం కాకూడదు. చదువులు భారం కాకుండానే.. తల్లులు పిల్లలను బడికి పంపించేందుకు ఉత్సాహం చూపించాలని దేశంలో ఎక్కడా జరగని విధంగా ‘అమ్మఒడి’ అనే కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాం. గత విద్యా సంవత్సరం జనవరి 9వ తేదీన అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టి.. ఒకటి నుంచి ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్న 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగే విధంగా 43 లక్షల మంది తల్లుల అకౌంట్లలోకి రూ.15 వేల చొప్పున రూ.6,350 కోట్లను ఒకేరోజు జమ చేయడం జరిగింది. చేసేటప్పుడు బ్యాంకర్లందరికీ చెప్పాం.. ఈ డబ్బు తల్లులకు ఒక కారణం కోసం ఇస్తున్నాం.. ఆ తల్లులకు పాత అప్పులు ఉంటే.. ఇది జమ చేసుకోకూడదని బ్యాంకులతో ఒప్పందం చేసుకొని డబ్బు జమ చేశాం. 

వచ్చే సంవత్సరం అమ్మ ఒడి పథకం అందాలంటే.. 75 శాతం పిల్లల హాజరుశాతం ఉండాలని ఒకేఒక్క మాట ఆ తల్లులకు చెప్పాను. మొదటిసంవత్సరం ఎలాంటి నిబంధన పెట్టలేదు. వచ్చే విద్యా సంవత్సరంలో జనవరి 9వ తేదీన మళ్లీ అమ్మ ఒడి పథకం అమలు చేస్తాం. 

ఇంగ్లిష్‌మీడియం అనే విప్లవాత్మక మార్పు తీసుకువస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ఎదురవుతాయి. టీచర్లు ఇంగ్లిష్‌ చదువులు చెప్పగలుగుతారా..? పిల్లలు రాణించగలరా..? అనే రకరకాల ప్రశ్నలు తలెత్తాయి. కానీ, పిల్లలు బోర్డు ఎగ్జామ్‌ రాసేందుకు నాలుగేళ్ల సమయం ఉంది. ఈ నాలుగేళ్లలో సమస్యలను అధిగమించగలుగుతాం.. టీచర్లకు ఇంగ్లిష్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం మొదలుపెట్టాం.. యాప్‌ ద్వారా సెల్ఫ్‌ ఎగ్జామినేషన్‌లో పాటిస్పేట్‌ చేస్తున్నారు. 

ఇంగ్లిష్‌ మీడియంలోకి పుస్తకాలు, పిల్లలకు బ్రిడ్జ్‌కోర్సులు తీసుకువచ్చాం. ఇవన్నీ రాబోయే రోజుల్లో జరిగేకొద్ది.. పిల్లలకు న్యాచురల్‌ కోర్సులో ఇంగ్లిష్‌ మీడియం రాగలుగుతుంది. మన దగ్గర పనిచేసే డ్రైవర్‌ మన దగ్గరకు వచ్చి ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగితే.. ఆ డ్రైవర్‌కు మనం ఇచ్చే గౌరవం ఏరకంగా ఉంటుందో.. ఒక్కసారి ఆలోచన చేయండి. 

ఒక డ్రైవర్, ఒక వాచ్‌మన్, ఒక మాలి వీళ్లంతా బీదవారే.. వీళ్లలో ఒకరువచ్చి నాతో ఇంగ్లిష్‌లో మాట్లాడగలిగితే.. నేను ఆ మనిషికి ఇచ్చే గౌరవం ఎలా మారిపోతుందో.. ఇంగ్లిష్‌ అనే సబ్జెక్టుకు ఆ గౌరవం ఉంది. ఆ స్థానంలోకి మన పేదవాడు వెళ్లాలి.. మన పిల్లలు వెళ్లాలి. ఆస్థాయిలోకి వెళ్తేనే భావితరంతో పోటీపడే పరిస్థితి వస్తుంది. 

 కోవిడ్‌ వల్ల ఆగస్టు 3వ తేదీ నుంచి స్కూళ్లు తెరుస్తున్నాం. పిల్లలను చదివించే ఉద్దేశంలో భాగంగానే.. పాదయాత్రలో చూసిన పరిస్థితుల నుంచి మార్పు తీసుకురావాలనే ఆరాటంతోనే.. ఆగస్టు 3వ తేదీన బడులు తెరిచే సమయానికి పిల్లలందరికీ ‘జగనన్న విద్యా కానుక’ ఇస్తున్నాం. ఒక స్కూల్‌ బ్యాగ్‌తో పాటు మూడు జతల యూనిఫాం వస్త్రంతో పాటు కుట్టుకూలి కూడా ఇస్తాం. బెల్టు, బూట్లు, సాక్స్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్‌ అన్నీ మంచి క్వాలిటీతో కూడుకున్నవి స్కూల్‌ బ్యాగ్‌లో పెట్టి ప్రతి పిల్లాడికి ఇస్తాం. 

ఇంతకు ముందు స్కూళ్లు మొదలైన ఆరు నెలలకు కూడా పుస్తకాలు రాలేదు.. యూనిఫాం అసలే ఇవ్వలేదన్న మాటలు నా పాదయాత్రలో విన్నాను. ఆ పరిస్థితిని రూపుమాపుతూ.. స్కూల్‌లోకి వెళ్లిన రోజునే అన్ని అందరికీ ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించాం. దాదాపు రూ.660 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పినా కూడా పర్వాలేదు.. పిల్లల కోసం మనం పెట్టుబడి పెడుతున్నామని చెప్పి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాం. 

పిల్లలను ఇంకా బాగా చదివించాలి.. పిల్లలు వారు చదివే స్కూళ్లను ఓన్‌ చేసుకోవాలి. ఆ పిల్లలు తినే తిండి దగ్గర నుంచి మొదటిగా మానిటర్‌ చేసే కార్యక్రమం జరిగింది. పిల్లలకు అన్నం పెట్టే ఆయాల జీతాలు రూ. వెయ్యి నుంచి రూ. 3 వేలకు పెంచాను. వాళ్లు బాగుంటేనే పిల్లలకు మంచి భోజనం పెడతారు. వారి జీతాలు, సరుకులు అన్నీ గ్రీన్‌ఛానల్‌లో పెట్టాం. జీతాలు, సరుకుల బిల్లులు డిలే లేకుండా చేశాం. 

ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలు ఏం తింటున్నారో అని ఆలోచన చేసి.. పిల్లలు బాగా తినేట్టుగా.. మంచి తిండి పెట్టేట్టుగా ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రిని ఎప్పుడూ చూడలేదు. విద్యాశాఖ కూడా కాస్త ఖంగుతిన్నది.. అందరం కూర్చొని పిల్లలకు మధ్యాహ్న భోజనం ఏం పెట్టాలని మెనూ నిర్ణయించాం. రోజూ ఒకటే పెడితే పిల్లలు తినలేరు.. రోజుకు ఒక మెనూ ఉండాలని, ఏది పౌష్టికాహారం.. ఏమేమి మెనూలో ఉండాలని చెప్పి విద్యార్థుల మధ్యాహ్న భోజనం మీద దాదాపు 20 రోజుల పాటు కుస్తీపట్టాం. పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతి రోజూ ఒక మెనూ తయారు చేశాం. 

ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటేబుల్‌ రైస్, ఒకరోజు కిచిడి, ఒకరోజు బెల్లంపొంగలి, చిక్కీలు, కోడిగుడ్లు, పండ్లు అని రకరకాల మార్పులు చేస్తూ.. పిల్లలకు రోజుకు ఒక మెనూ తయారు చేసి దానికి ‘జగనన్న గోరుముద్ద’ అని పేరు పెట్టి ఈ కార్యక్రమానికి జనవరి 21వ తేదీన ప్రారంభించాం. ఇంతకు ముందు అయ్యేదానికంటే ఇవన్నీ మార్పులు చేసినందుకు ప్రభుత్వానికి అదనపు ఖర్చు రూ.465 కోట్లు అవుతుందని లెక్కలు తేల్చినా.. పర్వాలేదు పిల్లలకు చేయాల్సిందేనని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చాం. 

ప్రతి అడుగు పిల్లలకు ఈరకంగా మేలు చేస్తూ.. పిల్లలను ఇంగ్లిష్‌మీడియంలో చదివించడం. స్కూళ్ల రూపురేఖలు మార్చడం.. మన గ్రామంలో ఇంగ్లిష్‌మీడియం స్కూల్‌ ఉండేట్లు చూడడం.. ఆ స్కూల్‌లో అన్ని రకాల వసతులు ఉండేట్లు చేయడం ఒకెత్తు అయితే.. రెండోఎత్తు పిల్లలను ఇంటర్మీడియట్‌ తరువాత పెద్ద చదువులు చదివించడం.. మనం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని జూనియర్‌ కాలేజీలు ఉన్నాయని లెక్కవేశాం. కనీసం మండలానికి ఒక జూనియర్‌ కాలేజీ కూడా లేని పరిస్థితి కనిపించింది. ప్రతి మండలంలో ఒక హైస్కూల్‌ తీసుకొని దాంట్లోనే శిక్షణ తరగతులు పెంచి.. జూనియర్‌ కాలేజీగా మార్చమని ‘నాడు–నేడు’ కార్యక్రమంలో అది కూడా పెట్టాం. 

ఇంటర్మీడియట్‌ అయిపోయిన తరువాత పెద్ద చదువుల కోసం ఏం చేయాలని ఆలోచన చేశాం. దీంట్లో భాగంగానే ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకం వందశాతం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక్కరూపాయి కూడా ఖర్చు పిల్లల తల్లిదండ్రుల మీద పడకుండా.. మొత్తం ఫీజులు ప్రభుత్వమే భరించే విధంగా చర్యలు తీసుకుంటూ ఫీజురీయింబర్స్‌మెంట్‌కు శ్రీకారం చుట్టాం. 

గత ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇచ్చేదే అరకొర. దాంట్లో పెట్టిన బకాయిలే.. రూ.1880 కోట్లు. ఆ ప్రభుత్వం పెట్టిన బకాయిలే కాకుండా.. ఈ సంవత్సరం మార్చి త్రైమాసికం వరకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌ కట్టాలంటే ఎంత అవుతుందని లెక్క వేస్తే.. రూ.4200 కోట్లు అవుతుంది. ఒకేసారి ఈ మొత్తాన్ని ఇచ్చే కార్యక్రమం చేశాం. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలే కాకుండా.. చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా వంద శాతం ఫీజులు మార్చి 31వ వరకు చెల్లించాం. 

ఫీజురీయింబర్స్‌మెంట్‌ ద్వారా 10 లక్షల మంది బీసీలకు రూ.1800 కోట్లు. 4 లక్షల మంది ఎస్సీలకు రూ.800 కోట్లు, 80 వేల మంది ఎస్టీలకు రూ.130 కోట్లు, 1.45 లక్షల మంది మైనార్టీలకు దాదాపు రూ.300 కోట్ల పైచిలుకు, 3.50 లక్షల మంది ఇతరులు.. వీరికి దాదాపు రూ.1200 కోట్లతో మేలు చేయగలిగాం. బకాయిలతో కలిపి చూస్తే.. 19 లక్షల మంది విద్యార్థులకు రూ.4200 కోట్లతో అండగా నిలిచాం. 

జూన్‌లో కాలేజీలు స్టార్ట్‌ అవుతాయి.. సెప్టెంబర్‌లో త్రైమాసికం పూర్తవుతుంది. అప్పుడు ఫీజురీయింబర్స్‌మెంట్‌ డబ్బు తల్లుల చేతుల్లోనే పెడతాం. ఆ డబ్బు తీసుకొని కాలేజీలకు వెళ్లి.. తమ పిల్లల ఎలా చదువుతున్నారని గమనించడమే కాకుండా.. కాలేజీల్లో వసతులు ఎలా ఉన్నాయి.. పరిస్థితులు ఎలా ఉన్నాయని గమనిస్తారు. సదుపాయాలు సరిగ్గా లేకపోతే ప్రభుత్వానికి టోల్‌ఫ్రీ నంబర్‌ ద్వారా ఫిర్యాదు కూడా చేస్తారు. కాలేజీలకు భయం ఉంటుంది... తల్లే వచ్చి డబ్బు కడుతుంది కాబట్టి ప్రశ్నించే హక్కు ఉంటుంది. వచ్చే త్రైమాసికం నుంచి తల్లుల చేతికే డబ్బు ఇచ్చి.. నాలుగుసార్లు తల్లులతో నేనే మాట్లాడుతా..

కాలేజీలకు కూడా ఇది ఒక ఉపశమనం. బకాయిలు ఉండవు. ప్రతి త్రైమాసికానికి డబ్బులు వస్తాయి. వసతులు కూడా సరిగ్గా లేవనే మాట కాలేజీల నుంచి రాకూడదు. ఇది ‘జగనన్న విద్యా దీవెన’ అని చెప్పి మనం చేసే కార్యక్రమం. 

జగనన్న వసతి దీవెన రెండో కార్యక్రమాన్ని తీసుకువస్తున్నాం. పిల్లలు కాలేజీలకు వెళ్లి చదవాలంటే.. ఆ మెస్‌ చార్జీలు, హాస్టల్‌ చార్జీలకు కనీసం ప్రతి విద్యార్థికి రూ. 20 వేల ఖర్చు అవుతుంది. ఆ డబ్బు ఇవ్వాలంటే తల్లిదండ్రులకు ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ చదువుతున్న పిల్లాడికి ప్రతి సంవత్సరం రెండు దఫాల్లో రూ. 20 వేలు నేరుగా తల్లి చేతికే ఇచ్చే కార్యక్రమం. ఒక దఫా జనవరి, ఫిబ్రవరి మాసంలో.. రెండో దఫా ఆగస్టు, సెప్టెంబర్‌ మాసంలో ఇస్తాం. ఇంజనీరింగ్‌ చదివే పిల్లలకు రూ. 20 వేలు, పాలిటెక్నిక్‌ చదివే పిల్లలకు రూ. 15 వేలు ఇస్తాం. 

ఇవన్నీ ఒకవైపు చేస్తూ.. రెండో వైపున కాలేజీలోని ఎడ్యుకేషన్‌ సిస్టమ్‌పై ధ్యాసపెట్టాం. పిల్లలు ఇంజనీరింగ్‌ పూర్తి చేసుకుని బయటకు వచ్చే సమయానికి కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితిలోకి రావాలి..  అది జరగాలంటే మార్పు తీసుకురావాలి. జాబ్‌ ఓరియంటెడ్‌ కరికుళం కింద మార్పు తీసుకురావాలని హైయ్యర్‌ఎడ్యుకేషన్‌కు ఆదేశాలిచ్చాం. కాలేజీల్లో చదివేటప్పుడే ఎక్కడైనా పనిచేసే అనుభవం కూడా యాడ్‌ కావాలి.. అప్పుడే బయట ప్రపంచంలో పనిచేసేటప్పుడు ఈ కోర్సుతో ఎలాంటి పనులు చేయాల్సివస్తుందనే నాలెడ్జ్‌ కూడా దీంట్లోకి వచ్చేలా ఇంటర్న్‌షిప్‌ కూడా తప్పనిసరి చేస్తున్నాం. 

స్కూళ్లు, కాలేజీల్లో మార్పులు తీసుకురావాలని, కార్పొరేట్‌ సంస్కృతి పోవాలి. ఫీజులు లాగడం తప్ప బాధ్యత లేని సంస్కృతి పోయి.. బాధ్యత తీసుకునే విధంగా మార్పులు తీసుకురావాలని.. ఇద్దరు హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీలకు (కాంతారావు, ఈశ్వరయ్య) బాధ్యతలు అప్పగించాం. ఒకరు పాఠశాల విద్యానియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు, మరొకరు ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్‌కు హెడ్‌గా ఉన్నారు. వీరిద్దరి ఆధ్వర్యంలో ఈ రెండు కమిటీలు కాలేజీలు, స్కూళ్ల మీద క్వాలిటీ కంట్రోల్‌ చేస్తారు. ఫీజులు కట్టలేక, కాలేజీ యాజమాన్యాల వేధింపులు భరించలేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. గత ప్రభుత్వం మానవత్వంతో ఎక్కడా స్పందించన పరిస్థితి నుంచి పూర్తిగా మానవత్వంతో స్పందించడమే కాకుండా.. ఉన్న కాలేజీలు, స్కూళ్లలో క్వాలిటీని తీసుకువచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 

ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ తీసుకువచ్చిన తరువాత కాంతారావు ఆధ్వర్యంలో 2020 ఫిబ్రవరిలో 172 స్కూళ్లను తనిఖీ చేసి 62 స్కూళ్లకు నోటీసులు జారీ చేశారు. హైయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ మానిటరింగ్‌ కమిషన్‌ ద్వారా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో 130 జూనియర్‌ కాలేజీలు తనిఖీ చేసి 40 జూనియర్‌ కాలేజీలపై చర్య కూడా తీసుకున్నారు. విద్యా సంస్థల మానిటరింగ్‌ కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ కూడా రూపకల్పన చేశారు. ఉన్న సదుపాయలు, పాటిస్తున్న ప్రమాణాలపై ఆయా స్కూళ్లు, కాలేజీలు తమకు తాముగా అప్‌లోడ్‌ చేసుకునేలా వెబ్‌సైట్‌ తయారు చేశారు. ఆ వెబ్‌సైట్‌ పబ్లిక్‌ డోమైన్‌లో పెడతారు. ఆ వసతులు, ఆ ప్రమాణాలు లేకపోతే ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. ఎవరు విజిల్‌బ్లో చేసినా నేరుగా కమిషన్‌ వరకు వస్తుంది. వెంటనే కమిషన్‌లు యాక్షన్‌ కూడా తీసుకుంటాయి. 

ఈ సంవత్సరం మనసుకు చాలా సంతోషం కలిగించే కార్యక్రమం ఒకటి చేశాం. వైయస్‌ఆర్‌ కంటి వెలుగు ద్వారా 70,41,988 మంది ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు కంటి పరీక్షలు చేశాం. ఈ కార్యక్రమం అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఇందులో 1.58 లక్షల మందికి కళ్లద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. 1.29 లక్షల మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. కరోనా వల్ల మిగిలిన వారికి ఇవ్వలేకపోయాం.. స్కూళ్లు తెరిచే సమయానికి ఇస్తాం. దాదాపు 46 వేల మంది పిల్లలకు శస్త్ర చికిత్స కూడా అవసరం అని తేలింది. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయించేందుకు సిద్ధమైంది. కోవిడ్‌ వల్ల షెడ్యుల్‌ మారింది.. త్వరలోనే పిల్లలకు శస్త్ర చికిత్స చేయిస్తాం. 

ప్రతి గవర్నమెంట్‌ స్కూల్‌ బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచే అద్భుతమైన శిక్షణ కేంద్రం మన స్కూళ్లు కావాలని, అందులోని ప్రతి గురువు తన సొంత పిల్లలకు చదువులు చెబితే.. ఏరకమైన సంతృప్తి పొందుతాడో.. పేదవాడి పిల్లలకు కూడా చదువులు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి పేదింట్లో చదువుల దీపాలు వెలగాలని, వారి భవిష్యత్తు మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 

Back to Top