ఆ న‌మ్మ‌కంలోంచి పుట్టిన అద్భుత వ్య‌వ‌స్థ‌లివి

గ్రామ సచివాలయ, వలంటీర్ల వ్యవస్థa పనితీరు ప్ర‌శంస‌నీయం

ఏడాది పాలనలోనే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం

నా పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశాను.. 

మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం నెరవేర్చాం

గ్రామ సచివాలయాల్లో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉద్యోగులు

అవినీతి లేని పారదర్శకమైన పాలన అందిస్తున్నాం

ఏడాదిలో 3,57,51,614 మందికి లబ్ధి.. ఇందుకు రూ.40,139 కోట్లు ఖర్చు చేశాం

దేవుడి దయ, ప్రజలందరి దీవెనలతో గొప్పగా మంచి చేయగలుగుతున్నా

మేధోమథన సమీక్షలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: ఏడాది పాలనలోనే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగామని, అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేశాం. సంక్షేమం, వ్యవస్థలోకి మార్పులు తీసుకువచ్చే గవర్నెన్స్‌ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గొప్పగా చేయగలుగుతున్నామని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మనసా.. వాచా.. కర్మనా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకురావడానికి అన్ని రకాలుగా ఏం చేయాలనే ఆలోచనల నుంచి పుట్టినవే గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ అని సీఎం అన్నారు. 

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అధ్యక్షతన ‘మన పాలన – మీ సూచన’ అంశంపై మేధోమథన సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. సదస్సులో సీఎం వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే.. 

గడచిన సంవత్సరకాలంలో మన ప్రభుత్వం ఎలా అడుగులు ముందుకు వేసింది. అడుగులు బాగానే వేశామా.. ఇంకా ఎక్కడైనా రిపేర్లు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడైనా ఉందా అని తెలుసుకునేందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఐదు రోజుల పాటు ఒక్కొక్క ఏరియా టచ్‌ చేసే కార్యక్రమం చేస్తున్నాం. 

ఈ రోజు సదస్సు గవర్నెన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ రెండు సబ్జెక్ట్స్‌ మీద ‘మనందరి పాలన – మీ సూచనలు’ అనే అంశంతో మీ సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. దాదాపుగా ఎన్నికలకంటే ముందే 3648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. 14 నెలల పాటు ఈ పాదయాత్ర సాగింది. బహుశా తిరిగని జిల్లా లేదు.. తిరగని నియోజకవర్గం కూడా లేదేమో.. 14 నెలల పాటు పొద్దున లేస్తే.. పడుకునే వరకు ప్రజలతోనే మమేకమై.. వారు పడుతున్న ఇబ్బందులను అర్థం చేసుకోవాలని, వాటికి పరిష్కారమార్గం చూపాలని, చూపాలంటే ఏం చేయాలనే తలంపుతోనే పాదయాత్ర సాగింది. 

వ్యవస్థలోకి మార్పు తీసుకువస్తే తప్ప ప్రజలను మనం ఆదుకోలేము.. ప్రజలకు మనం తోడుగా ఉండలేమనేది పాదయాత్ర నుంచి పుట్టుకొచ్చింది. ఒక వ్యవస్థ క్రియేట్‌ చేయాలని, ఆ వ్యవస్థలో వివక్ష ఉండకూడదు.. నిజాయితీగా ఆ వ్యవస్థ ఉండాలి. ఈ రెండింటిని తీసుకొనిరాగలిగితేనే పారదర్శకంగా ఏ పథకానైనా అమలు చేయగలిగితేనే మనం పేదలకు, ప్రజలకు తోడుగా నిలబడగలుగుతామని గట్టిగా నమ్మాను. ఆ నమ్మకం నుంచి పుట్టిన ఆలోచనలే గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్‌ వ్యవస్థ. 

వలంటీర్ల నియామకం, సచివాలయాలకు సంబంధించి నేను పలు సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు నా మొదటి మాట.. గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే వారికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలని మాట్లాడాను. మనసా.. వాచా.. కర్మనా ఒక వ్యవస్థలోకి మార్పులు తీసుకురావడానికి అన్ని రకాలుగా ఏం చేయాలో ఆలోచనల నుంచి పుట్టిన తలంపులు. 

బహుశా ఎప్పుడూ జరగని విధంగా లబ్ధిదారుల జాబితా మొత్తం.. ప్రతి ఒక్క పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఏ లబ్ధిదారుడికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో అదే గ్రామ సచివాలయాల్లో పథకాలకు సంబంధించిన అర్హతలు ఏమిటీ..? లబ్ధిదారుల జాబితాలో అర్హత ఉండి పేరు కనిపించకపోతే పథకానికి ఎలా నమోదు చేసుకోవాలో కూడా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నాం. ఆ లిస్టును సోషల్‌ ఆడిట్‌ కోసం పూర్తిగా పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఒక వ్యక్తి వల్ల తప్పు జరగకూడదు.. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందాలని సోషల్‌ ఆడిట్‌ అనే విప్లవానికి శ్రీకారం చుట్టాం. 

ఈ ఏడాది కాలంలో మనం చేసిన పురోగతి ఏమిటంటే.. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి నుంచి సేవలు నేరుగా ఇంటి గడప ముందుకువచ్చి తలుపుకొట్టే విధంగా గడప స్థాయిలోకి సేవలు తీసుకురాగలిగాం. 

ఆగస్టు 15వ తేదీన గ్రామ వలంటీర్ల వ్యవస్థను స్థాపించాం. అక్టోబర్‌ 2వ తేదీన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించాం. ప్రతి 2 వేల జనాభాను ఒక గ్రామంగా తీసుకొని దాదాపు 11,162 గ్రామ సచివాలయాలు,. ప్రతి గ్రామంలో పది నుంచి 12 ఉద్యోగాలు క్రియేట్‌ చేశాం. దాదాపుగా 1.35 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగలేదేమో.. దేశ చరిత్రలో కూడా ఒక రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు నాకు తెలియదు కానీ, అధికారం చేపట్టిన నాలుగు నెలల్లోపే 1.35 లక్షల ఉద్యోగాలు కల్పించాం. అందులో కూడా ఆశ్చర్యం ఏమిటంటే ఈ ఉద్యోగాల్లో 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు. ఉద్యోగాలు ఎవరికి అయితే అవసరమో.. దేవుడే చేసినట్లుగా 82.5 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండడం కూడా యాదృశ్చికంగా దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగింది. 

గ్రామ వలంటీర్ల విషయంలో కూడా దాదాపు 2.65 లక్షల మందిని నియమించాం. 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. 4 లక్షల పైచిలుకు ఉద్యోగాలు సంవత్సరకాలం కూడా తిరగకమునుపే ఇవ్వగలిగాం. ప్రజలు సంతృప్తి చెందే విధంగా పనులు కూడా చేయించగలిగాం అంటే దేవుడి దయ వల్లే.

గ్రామ సచివాలయాల్లో గ్రామ సెక్రటరీ, రెవెన్యూ ఆఫీసర్, సర్వేయర్, ఏఎన్‌ఎం, వెటర్నరీ అసిస్టెంట్, ఉద్యానవన అసిస్టెంట్, ఆక్వా అసిస్టెంట్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్, మహిళా పోలీస్, శిశు సంక్షేమ శాఖ అసిస్టెంట్, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్, ఎనర్జీ అసిస్టెంట్, డిజిటల్‌ అసిస్టెంట్, సంక్షేమం, విద్యా అసిస్టెంట్‌ ఇలా ప్రతి శాఖకు గ్రామాల్లో ఏదైతే అవసరమో.. ఆ ప్రతి అవసరం తీర్చేందుకు దాదాపు పది నుంచి 12 మందిని ప్రతి గ్రామ సచివాలయంలో నియమించాం. 

గ్రామ సచివాలయం, వలంటీర్ల వ్యవస్థ రెండింటి వల్ల అర్హులైన వారికి అందరికీ కూడా సంతృప్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సేవలు పూర్తిగా హ్యాండ్‌ హోల్డ్‌ చేసి గడప దాకా తీసుకెళ్లి అందించాం. అవినీతి లేని పారదర్శకత ఉన్న గొప్ప వ్యవస్థను క్రియేట్‌ చేయగలిగాం. సంవత్సరకాలంలో ఇదొక పెద్ద తృప్తిని ఇచ్చింది. గ్రామ సచివాలయం, గ్రామ వలంటీర్‌ వ్యవస్థలో పనిచేస్తున్నవారు గొప్ప తృప్తిని ఇచ్చారు. కులం, మతం, ప్రాంతం, పార్టీ, రాజకీయాలు చూడడం లేదు. ప్రతి ఒక్కరికి అర్హత ఉంటే చాలు.. మేమున్నాం.. మీకు తోడుగా అంటూ ప్రతి గ్రామ వలంటీర్, సచివాలయాల్లో పనిచేసే ప్రతి యువకుడు, ప్రతి యువతి తోడుగా, నీడగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నారు. గ్రామ వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు మన ఊర్లో.. మన మంచి కోరే.. మనవారు అని గర్వంగా చెప్పగలుగుతున్నా..

రేషన్‌ బియ్యాన్ని ప్రతి గడపకు అందించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టాం. బియ్యం కూడా నేరుగా గడప గడపకూ చేరుస్తున్నారు. గతంలో పెన్షన్‌ రాని పరిస్థితి ఉండేది.. పెన్షన్‌ కోసం లంచాలు ఇవ్వాలి.. పడిగాపులు కాయాలి.. లీడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిని రూపుమాపగలిగాం. ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున ప్రతి అవ్వా,తాత ఇంటి దగ్గరకు వెళ్లి.. సూర్యోదయం కంటే ముందే ఇంటిదగ్గరకు వెళ్లి పెన్షన్‌ అందిస్తున్నారు. 

సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించడం కీలకం. అర్హులను గుర్తించకుండా పొరపాట్లు జరిగితే పథకం నీరుగారిపోతుంది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరినీ గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్‌ వ్యవస్థ గుర్తిస్తున్నాయి. అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చి 43 లక్షల మంది తల్లులను గుర్తించాం.. 82 లక్షల మంది పిల్లలకు తద్వారా మేలు జరిగించే కార్యక్రమం చేశాం. ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలనే ఆరాటంతో అక్షరాలా దాదాపు 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించడం. వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మంది అన్నదాతలను గుర్తించడం.. వారికి తోడుగా ఉండే కార్యక్రమం చేయడం. చివరకు మత్స్యకార భరోసా పథకం ద్వారా వేట నిషేధ సమయంలో రూ.10 వేలు అందించేందుకు మత్స్యకారులను గుర్తించడం.. వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం ద్వారా స్వంతంగా ఆటోలు, ట్యాక్సీలు ఉన్నవారిని గుర్తించడం.. వారికి తోడుగా నిలబడే కార్యక్రమం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, వైయస్‌ఆర్‌ బీమా పథకం దగ్గర నుంచి మొదలుపెడితే.. ప్రతి అడుగులోనూ గ్రామ వలంటీర్, గ్రామ సెక్రటేరియట్‌ వ్యవస్థ నాలుగు అడుగులు ముందునిల్చింది.

చివరకు కరోనా సమయంలో కూడా గ్రామ వలంటీర్లు ముందున్నారు. కోవిడ్‌–19ను ఈ మేరకు ఎదుర్కోగలిగామంటే గ్రామ వలంటీర్ల వ్యవస్థ, ఆశా వర్కర్ల వ్యవస్థ చేసిన కృషి చాలా ఎక్కువ అని గర్వంగా చెప్పగలను. ఇప్పటికే మూడుసార్లు ఇంటింటి సర్వే చేశారు. నాలుగవ సారి కూడా మొదలవుతుంది. ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే టెస్టింగ్, ట్రీట్‌మెంట్‌ వరకు ప్రతి అడుగులో తోడుగా ఉన్నారు. ఇంటింటికి వచ్చి ఇంతగా సర్వే చేసి.. ఇంట్లోకి కొత్తవారు ఎవరైనా వచ్చారా అని అడిగి వారికి కూడా మందులిచ్చే కార్యక్రమానికి ఆరాటపడే వారిని ఇప్పటి వరకు చూడలేదన్నా అని గొప్పగా చెబుతున్నారు. 

దాదాపు గవర్నెన్స్‌ అనే అంశంలో గొప్పగా చెప్పే విప్లవాత్మక మార్పు ఏంటంటే.. నా పాదయాత్రలో నేను గమనించింది. ప్రతి గ్రామంలో ఒకటి కాదు.. రెండు కాదు.. కనీసం పది బెల్టుషాపులు కనిపించేవి. ప్రతి వీధి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన బెల్టుషాపులు ఉండేవి. ఎలా మనుషులను తాగించాలి.. ఎలా సేల్స్‌ పెంచాలనే ఆరాటంతో మద్యం అమ్మకాలు జరిగేవి. దాదాపు 43 వేల బెల్టుషాపులు ఉండేవి. ఈ సంవత్సరకాలంలో మద్యం షాపులు ప్రైవేట్‌ వ్యక్తులు నడిపితే.. బెల్టుషాపులను అరికట్టేందుకు వీలుండదని, ఏకంగా మద్యం షాపులను ప్రైవేట్‌ నుంచి తీసేసి.. గవర్నమెంటే మద్యం దుకాణాలు నడిపే బాధ్యత తీసుకోవడం.. తద్వారా 43 వేల బెల్టుషాపులు గ్రామాల్లోంచి తొలగించాం. 

4380 మద్యం దుకాణాలకు అనుసంధానంగా గతంలో పర్మిట్‌ రూమ్‌లు ఉండేవి. ఆ పర్మిట్‌ రూమ్‌లలో 20 – 30 మంది కూర్చొని తాగడం. ఆ చుట్టుపక్కల ఆడవారు ప్రయాణం చేయాలంటే ఎంత ఇబ్బందిగా ఉండేదో నా కళ్లతో నేను చూశా. అధికారంలోకి వచ్చిన వెంటనే 4380 పర్మిట్‌ రూమ్‌లను రద్దు చేశాం. అంతేకాకుండా ఇంతకు ముందు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అఫీషియల్‌గా.. 12 గంటల వరకు మద్యం దుకాణాలు నడిపే పరిస్థితి గతంలో ఉండేది. ఈ రోజు 11 నుంచి 8 గంటలకు మాత్రమే అనుమతి.. టెన్షన్‌గా 8 గంటలకు షాపులు మూసివేస్తున్నాం. 

మద్యం రేట్లు షాక్‌ కొట్టే విధంగా చేశాం. ఇంతకు ముందు వారానికి 5 సార్లు తాగేవారు ఇప్పుడు వారానికి రెండు సార్లు.. ఇంతకు ముందు వారానికి 5 బాటిళ్లు తాగేవారు.. ఇప్పుడు వారానికి 2 బాటిళ్లు తాగే పరిస్థితికి తీసుకువచ్చాం. వ్యవస్థలోకి మార్పులు ఏ స్థాయిలోకి తీసుకువచ్చామంటే.. ఇండియన్‌ మేడ్‌ ఫౌండ్‌ లిక్కర్‌ (ఐఎంఎఫ్‌ఎల్‌) లిక్కర్‌ సేల్స్‌ కొద్దిరోజుల క్రితం రేట్లు పెంచక మునుపే 24 శాతం తగ్గిపోయాయి. బీర్‌ సేల్స్‌ 55 శాతం తగ్గాయి. 23 లక్షల కేసులు.. 11 లక్షల కేసులకు తేగలిగాం. 

రేట్లు పెంచాం.. ఇంతకు ముందు 20, ఇప్పుడు 13 శాతం మొత్తం 33 శాతం షాపులు తగ్గించాం. పరిస్థితి ఏమిటని అడిగితే.. 23 లక్షల కేసులు కాస్త 10 లక్షలకు తగ్గిపోతున్నాయని అధికారులు చెప్పారు. బీర్‌ సేల్స్‌ కూడా దాదాపు 20 శాతం మళ్లీ తగ్గాయని చెప్పారు. వ్యవస్థలోకి మార్పులు తీసుకురావాలంటే ఏమేమి చేయాలనే అంశం మీద.. వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 

2 వేల జనాభా ఉన్న గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే గ్రామ సెక్రటేరియట్, గ్రామ వలంటీర్‌ వ్యవస్థ కనిపిస్తుంది. ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌ తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. నాడు –నేడు కార్యక్రమంతో స్కూళ్లలో పరిస్థితులు పూర్తిగా మార్చేస్తున్నాం. ఫర్నిచర్, బాత్‌రూమ్‌లు, బ్లాక్‌బోర్డులు, నీరు, ఆఖరికి పిల్లలు తినే భోజనం కూడా మెనూతో సహా పెడుతున్నాం. అదే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ రాబోతుంది. ఈ మార్చి కల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్క విలేజ్‌ క్లినిక్‌ ఏర్పాటు చేయబోతున్నాం. 54 రకాల మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఏఎన్‌ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఆశ వర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వైయస్‌ఆర్‌ విలేజ్‌ క్లినిక్‌ ఆరోగ్యశ్రీకి రెఫరల్‌ పాయింట్‌ అవుతుంది. 

ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం. రైతులకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చే స్నేహితుడిగా ఆర్‌బీకే అక్కడే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంటాయి. క్వాలిటీ నిర్ధారణ చేసిన తరువాతే గవర్నమెంట్‌ నేరుగా ఆర్‌బీకే ద్వారా విక్రయిస్తుంది. రైతుకు ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. రైతు ఏ పంట వేయాలో.. ఆ పంటకు సంబంధించిన సూచనలు, సలహాలు ఆర్బీకే ఇస్తుంది. రైతు పంట వేసిన తరువాత ఈక్రాపింగ్‌ ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్‌ రిజిస్ట్రేషన్‌ చేయించడం, కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఉంటే.. ప్రతి రోజు మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్, దాని కోసం ఆర్బీకేలో అగ్రికల్చర్‌ అసిస్టెంట్, జాయింట్‌ కలెక్టర్‌ జిల్లాస్థాయిలో బాధ్యత వహిస్తాడు. మార్కెటింగ్‌ డిపార్టుమెంట్‌ బాధ్యత వహిస్తుంది. కనీస గిట్టుబాటు ధర అందకపోతే ఆర్‌బీకే కలగజేసుకొని ఆ రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తుంది. 

ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. జనతా బజార్‌. వచ్చే సంవత్సరం చివరికల్లా జనతా బజార్‌ ఏర్పాటు చేస్తాం. రైతు పండించే ప్రతి పంట.. చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు, పాలతో సహా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే ఏకంగా 30 శాతం కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ జనతా బజార్లు తీసుకువస్తున్నాం. 

గ్రామం రూపురేఖలు ఎలా మారబోతుందో.. ఆలోచన చేసుకోండి. లంచాలు లేని, వివక్ష లేని సేవలు అందిస్తున్నాం. గ్రామ వలంటీర్‌ నేరుగా ఇంటికి వద్దకు వచ్చి తలుపుకొట్టి సేవలు అందించే కార్యక్రమం. ఇంతగొప్పగా ఈ వ్యవస్థలో గవర్నెన్స్‌ అనేది తీసుకువచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. 

మేనిఫెస్టో అనేది బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తానని ఇంతకు ముందే చెప్పా. ప్రతి గవర్నమెంట్‌ సెక్రటరీ దగ్గర, మంత్రుల దగ్గర, చివరకు నా చాంబర్‌లో గోడలకు మేనిఫెస్టో కనిపిస్తుంది. మొదటి సంవత్సరంలోనే 90 శాతం మేనిఫెస్టోలోని అంశాలు పూర్తి చేశాం. ఈ సంవత్సరానికి 99 శాతానికి వెళ్లిపోతాం. ఈ సంవత్సరం ఏం చేశామనేది గమనిస్తే.. 

08–07–2019 పెన్షన్‌ కానుక మొదలుపెట్టాం. పెన్షన్‌లు గత ప్రభుత్వ హయాంలో ఎన్ని ఇచ్చారని చూస్తే.. 2018 అక్టోబర్‌ దాకా.. అంటే ఎన్నికలకు ముందు వరకు 44 లక్షల మందికి మాత్రమే పెన్షన్‌లు ఇచ్చేవారు. ఈ రోజు 58.61 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వం పెన్షన్‌లు ఫిబ్రవరి 2019 వరకు అంటే ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు వరకు కేవలం రూ.1000 ఇచ్చేవారు. ఈ రోజున మనం రూ.2250 ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వానికి నెలకు వచ్చే బిల్లు కేవలం రూ.490 కోట్లు.. ఈ రోజున నెలకు రూ.1421 కోట్లు మనకు పెన్షన్ల బిల్లు. పెన్షన్ల కోసం పడిగాపులు కాసే పరిస్థితి నుంచి అవ్వాతాతలకు పెన్షన్‌ డోర్‌డెలవరీ చేస్తున్నాం. 

  • 08–07–2019 పెన్షన్‌ కానుక మొదలుపెట్టాం. 
  • 15–08–2019న వలంటీర్ల వ్యవస్థకు నాందిపలికాం.
  • 02–10–2019న గ్రామ సచివాలయ వ్యవస్థకు నాంది పలికాం.
  • 04–10–2019న వైయస్‌ఆర్‌ వాహన మిత్ర కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం. 
  • 10–10–2019న వైయస్‌ఆర్‌ కంటి వెలుగుతో 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించాం. ట్రీట్‌మెంట్‌ ఇప్పించే కార్యక్రమం.
  • 15–10–2019 వైయస్‌ఆర్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనం చెప్పింది రూ.12,500.. ఇస్తామన్నది మేనిఫెస్టోలో నాలుగు సంవత్సరాలు.. కానీ, రైతుకు ఇస్తుంది రూ.13500..  అమలు చేస్తుంది ఐదు సంవత్సరాలు. అందులో రైతు భరోసా రెండో దఫాకు శ్రీకారం చుట్టాం. దాదాపు 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది. 
  • 17–10–2019న వైయస్‌ఆర్‌ నవోదయంతో ఎంఎస్‌ఎంఈ యూనిట్లకు లోన్స్‌ రీస్ట్రక్చరింగ్‌ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాం. 
  • 08–11–2019లో అగ్రిగోల్డ్‌ బాధితులకు దాదాపుగా రూ.264 కోట్లు ఇచ్చాం. పదివేల రూపాయలలోపు ఉన్నవారందరికీ రూ.264 కోట్లు ఇవ్వడం జరిగింది. 
  • 14–11–2019లో మన బడి నాడు– నేడుకు శ్రీకారం చుట్టాం. ఈరోజున పనులు జరుగుతున్నాయి. 45 వేల స్కూళ్లకు గానూ 15700 స్కూళ్లలో జూలై నాటికి రూపురేఖలు మారబోతున్నాయి. ప్రతి స్కూల్‌లో ఫర్నిచర్, బ్లాక్‌బోర్డు, బాత్‌రూమ్‌లు, పెయింటింగ్, కాంపౌండ్‌ వాల్‌ వస్తుంది. ప్రతి స్కూల్‌ ఇంగ్లిష్‌ మీడియంగా రూపురేఖలు మార్చుకోనుంది. 
  • 20–11–2019న వైయస్‌ఆర్‌ నవశకం సర్వేకు శ్రీకారం చుట్టాం. అర్హతను పెంచాం. ఇంతకు ముందు బియ్యం కార్డు కావాలంటే.. రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6 వేలు నెలకు అర్హత ఉండేది. ఇవాళ రూ.10 వేలు గ్రామాల్లో, రూ.12 వేలు పట్టణాల్లో చేశాం. పూర్తిగా బియ్యం కార్డులు, పెన్షన్‌ కార్డులు, హౌసింగ్, ఆరోగ్యశ్రీ అన్నింటికి నవశకం ద్వారా గ్రామ వలంటీర్లతో సర్వే చేయించాం. 
  • 21–11–2019న మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం. 
  • 1–12–2019న ఆరోగ్యశ్రీ రూపురేఖలు మార్చేశాం. గత ప్రభుత్వంలో రూ.680 కోట్ల బకాయిలు పెట్టి నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్తే ప్రభుత్వం అయితే ముట్టుకోం.. మాకు ఇవ్వాల్సిన బకాయిలు 8 నెలలు పెండింగ్‌లో ఉన్నాయని ప్రజలను వెనక్కి పంపించే పరిస్థితి ఉండేది. ఆరోగ్యశ్రీలో మే 18వ తేదీ వరకు ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లించాం. 
  • ఆరోగ్యశ్రీలో  వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా అనే ఇంకో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాం.  ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు.. ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ. 5000 ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 1.06 లక్షల మంది వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధిపొందారు. 
  • 03–12–2019న వైయస్‌ఆర్‌ లా నేస్తం.
  • 16–12–2019లో మహిళా భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చాం. ఏకంగా రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌ స్టేషన్‌లు ఏర్పాటు చేశాం. ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను నియమించాం. వారిద్దరూ గొప్పగా చేస్తున్నారు.
  • 21–12–2019న నా పుట్టిన రోజు నాడు వైయస్‌ఆర్‌ నేతన్న నేస్తం అని ప్రతి చేనేతకు తోడుగా ఉన్నాం. ఇంతకు ముందు మామూలుగా రూ.200 కోట్లు ఐదేళ్లకు అందే పరిస్థితి లేదు. కానీ, ఇవాళ సంవత్సరానికి రూ.200 కోట్లు అందజేస్తున్నాం. ఏకంగా 81 లక్షల మంది చేనేతలకు రూ.24 వేలు చేతుల్లో పెడుతున్నాం
  • 03–01–2020న పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్‌ ప్రాజెక్టు మొదలుపెట్టాం. 2000 రోగాలతో పైలెట్‌ ప్రాజెక్టు చేపట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఒక్కొక్క జిల్లా పెంచుకుంటూ పోవాలి.. కానీ కోవిడ్‌ వచ్చింది కాబట్టి ఆగాం. ప్రతి జిల్లాలో 2000 రోగాలతో ఆరోగ్యశ్రీ అమలుకు తేదీలు ఇవ్వాలని హెల్త్‌ సెక్రటరీ జవహర్‌రెడ్డిని అడిగాను. 
  • 09–1–2020న అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులు.. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగింది. పిల్లలను బడికి పంపిస్తే చాలు.. బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడని ప్రతి పిల్లాడికి భరోసా ఇస్తూ.. రూ.15 వేలు తల్లుల చేతికి ఇవ్వడం జరిగింది
  • 18–02–2020న వైయస్‌ఆర్‌ కంటి వెలుగు అవ్వాతాతలకు మొదలుపెట్టాం. ఇంకా జరుగుతుంది. కోవిడ్‌ సమయంలో నిలిపివేశాం. మళ్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. 
  • 24–2–2020న పిల్లలను పైచదువులు చదివించేందుకు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అని దాదాపు 15 లక్షల మంది పిల్లల తల్లులకు తల్లికి మొదటి దఫా రూ.10 వేలు ఇచ్చాం. ఇంజనీరింగ్‌ చదివే వారికి రూ.20 వేలు దాంట్లో రూ.10 వేలు ఇచ్చాం. పాలిటెక్నిక్‌ చదువుతున్నవారికి రూ.15 వేలు దాంట్లో రూ.7500 ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది. 
  • 2020–21 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‌ విడుదల చేశాం. ఏ నెల ఏ పథకం అమలు చేయబోతున్నాం. ఏ నెల ఎవరికి మేలు జరగబోతుందని ప్రజలకు తోడుగా ఉండేందుకు క్యాలెండర్‌ విడుదల చేశాం.
  • 20–04–2020న పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.14 వందల కోట్లు ఇవ్వగలిగాం.
  • 28–04–2020న విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు విడుదల చేశాం. ఇంజనీరింగ్,  డిగ్రీ చదువుకునే పిల్లాడికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ ఇవ్వకుండా గత ప్రభుత్వం పెండింగ్‌ పెడితే.. రూ.1880 కోట్ల బకాయిలు తీర్చుతూ.. మొత్తం మీద రూ.4300 కోట్లు నేరుగా వైయస్‌ఆర్‌ విద్యా దీవెన కింద మొదట సారిగా ఫీజురీయింబర్స్‌మెంట్‌ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదేమో.. మార్చి వరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా చెల్లించాం. వచ్చే త్రైమాసికం నుంచి తల్లుల చేతులకే డబ్బులు ఇచ్చి వారి చేతనే ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. 
  • 06–05–2020న మత్స్యకార భరోసా రెండో దఫా కంప్లీట్‌ చేశాం. 
  • 15–05–2020న రైతు భరోసా రెండో దఫా కూడా మొదలుపెట్టాం. రైతులకు రూ.7500 ఇచ్చే కార్యక్రమం అయిపోయింది. 
  • 22–05–2020న ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్‌ అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వ బకాయిలు రూ.968 కోట్లు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ బకాయిలు మన ప్రభుత్వం ఇస్తుంది. మేలో రూ.450 కోట్లతో మొదటి దఫా చెల్లించాం. ఎంఎస్‌ఎంఈ రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా కంపెనీలకు మేలు జరిగేలా మూడు నెలల పాటు ఫిక్స్‌డ్‌ చార్జీలను రద్దు చేశాం. 
  • మే 26న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‌లకు రూ. 5 వేల చొప్పున సాయం.
  • మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం. 
  • జూన్‌ 4వ తేదీన వైయస్‌ఆర్‌ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, క్యాబ్‌ ఉన్నవారికి వాహన మిత్ర ద్వారా రూ.10 వేల సాయం.
  • జూన్‌ 10వ తేదీన షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు రూ. 10 వేల సాయం.
  • జూన్‌ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైయస్‌ఆర్‌ నేతన్న హస్తం. ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వ బకాయిలను, మాస్క్‌ల తయారీకి మనం తీసుకున్న క్లాత్‌కు సంబంధించిన బకాయిలు కూడా జూన్‌ 17నే చెల్లిస్తాం.
  • జూన్‌ 24న వైయస్‌ఆర్‌ కాపు నేస్తం.
  • జూన్‌ 29న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.
  • జూలై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్‌లు ప్రారంభం.
  • జూలై 8న నాన్న పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 28 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.
  • జూలై 29న రైతులకు వడ్డీలేని రుణాలు.
  • ఆగస్టు 3న వైయస్‌ఆర్‌ విద్యా కానుక. పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్, బెల్టు, షూ, సాక్స్‌లు ఇస్తాం.
  • ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల పంపిణీ.
  • ఆగస్టు 12న వైయస్‌ఆర్‌ చేయూత.
  • ఆగస్టు 19న వైయస్‌ఆర్‌ వసతి దీవెన.
  • ఆగస్టు 26న 15 లక్షల వైయస్‌ఆర్‌ హౌసింగ్‌ ఇళ్ల నిర్మాణం ప్రారంభం.
  • సెప్టెంబర్‌ 11న వైయస్‌ఆర్‌ ఆసరా.. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కా.. ప్రతి చెల్లెమ్మకు మేలు చేయడం కోసం.. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నాలుగు దఫాల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాం. 
  • సెప్టెంబర్‌ 25న వైయస్‌ఆర్‌ విద్యా దీవెన.
  • అక్టోబర్‌లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు.
  • అదే అక్టోబర్‌లో జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. తోపుడుబండ్లు, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునేవారికి గుర్తింపు కార్డు ఇచ్చి ప్రతి చిరు వ్యాపారికి సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం. 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేయనున్నాం.
  • నవంబర్‌లో మళ్లీ విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టనున్నాం.
  • డిసెంబర్‌లో అగ్రిగోల్డ్‌ బాధితులకు సాయం.
  • 2021 జనవరి 9న రెండో విడత అమ్మ ఒడి ప్రారంభం.
  • 2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా, రూ. 2 వేలు.
  • 2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన.
  • 2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు. 
  • ఇంత పద్ధతిగా నెలల వారీగా తేదీలతో సహా ఏ కార్యక్రమం ఎప్పుడు చేయబోతున్నామని ఇంతగా ఆలోచన చేసి.. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చుకోవాలని ఒక ప్రభుత్వం తాపత్రయపడిన పరిస్థితి బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండకపోవచ్చు. 
  • మే 30వ తేదీన ప్రమాణస్వీకారం చేశా. 2019 జూన్‌ నుంచి 2020 మే 20 వరకు చూసుకుంటే.. ఎంతమందికి లబ్ధి జరిగిందని చూస్తే.. ఏకంగా 3,57,51,614 మంది లబ్ధిదారులు.. వీరి కోసం మనం ఖర్చు చేసింది రూ.40 వేల 139 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. బహుశా ఇంత మొత్తంలో ఎప్పుడూ జరిగి ఉండదేమో.. 
  • ఇందులో బీసీలు 1కోటి 78 లక్షలా 42 వేల 48 మంది.. వీరి కోసం రూ.19 వేల 298 కోట్లు ఖర్చు చేశాం.
  • ఎస్సీలు 61 లక్షలా 26 వేల 203 ఎస్సీలు ఉంటే వీరి కోసం మనం ఖర్చు చేసింది రూ.6,332 కోట్లు ఖర్చు చేశాం. 
  • ఎస్టీలు అయితే 18లక్షలా 39 వేల 451 మంది అయితే వీరి కోసం రూ.2,108 కోట్లు అని గర్వంగా చెప్పగలుగుతున్నా.
  • మైనార్టీలు 18 లక్షలా 61 వేల 863 మంది అయితే వీరి కోసం రూ.1701 కోట్లు ఖర్చు చేయగలిగాం.
  • మిగతా వారందరినీ లెక్కవేసుకుంటే 77 లక్షలా 47 వేల 889 మంది వీరి కోసం ఖర్చు చేసింది.. రూ.10,462 కోట్లు. 
  • మొత్తం మీద 3 కోట్లా 57 లక్షలా 51 వేల 614 మంది లబ్ధిదారులు.. 40 వేల 139 కోట్లు ఖర్చు చేశామంటే.. నిజంగా సంక్షేమంలో ఇంత విప్లవాత్మకంగా అడుగులు వేసిన పరిస్థితులు ఎక్కడా ఉండవేమో.. 
  • ఈసారి 30వ తేదీ వచ్చే సరికి మేనిఫెస్టో ప్రతి ఇంటికి పంపించి ప్రభుత్వం ఏమేమి చేసిందో ప్రజలనే టిక్కులు పెట్టమని చెబుతాం. 
  • సంక్షేమం, వ్యవస్థలోకి మార్పులు తీసుకువచ్చే గవర్నెన్స్‌ దేవుడి దయ, మీ అ ందరి చల్లని దీవెనలతో గొప్పగా చేయగలుగుతున్నాం. వీటిలో కూడా ఇంకా ఏమైనా మార్పులు, గొప్పగా చేయాలని అనుకుంటే సూచనలు, సలహాలు ఇస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాను. నోట్‌ చేసుకుంటాను’ అని సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.
     
Back to Top