అందరికీ మంచి జరగాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం

పేదలు సంతోషంగా ఉంటేనే.. రాష్ట్రానికి, దేశానికి మంచిది

నా పాదయాత్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కష్టాలను చూశా

ఇచ్చిన మాట ప్రకారం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు రెండో విడత సాయం

నాలుగు నెలల ముందుగానే ‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ అమలు చేస్తున్నాం

ఈ ఏడాది 2,62,495 మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చుతున్నాం

గతేడాది కంటే అదనంగా 37,754 మంది లబ్ధిదారులకు రూ.10 వేల చొప్పున ‌సాయం 

అర్హత ఉండి సాయం అందకపోతే గ్రామ సచివాలయంలో, స్పందన యాప్‌లో దరఖాస్తు చేసుకోండి

దయచేసి మద్యం సేవించి వాహనాలు నడపొద్దని విజ్ఞప్తి చేస్తున్నా

ఆటో, ట్యాక్సీ కార్మికులతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌

తాడేపల్లి: ‘‘ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం. అర్హత ఉండి పథకం అందనివారు ఎవరూ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హత ఉన్నవారందరికీ మంచి జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది.’’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కోవిడ్‌ వల్ల ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించి నాలుగు నెలల ముందుగానే ‘వైయస్‌ఆర్‌ వాహన మిత్ర’ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. నా పాదయాత్రలో ఆటో కార్మికుల కష్టాలను కళ్లారా చూశానని, 2018 మే నెలలో ఏలూరు సభలో ఇచ్చి మాట ప్రకారం వాహన మిత్ర పథకాన్ని రెండవ ఏడాది అమలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది 2,62,495 మందికి ఈ పథకం ద్వారా లబ్ధిచేకూర్చుతన్నామని, గతేడాదితో పోల్చితే అదనంగా 37,754 మంది లబ్ధిదారులకు ఈ ఏడాది మేలు జరుగుతుందన్నారు. 

బతకడం కోసం ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్న పరిస్థితుల మధ్య ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లను సొంతంగా కొనుగోలు చేసి బతుకుబండిని ఈడుస్తున్న అన్నదమ్ములకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

సీఎం ఏం మాట్లాడారంటే..
గత సంవత్సరం ఈ కార్యక్రమం అక్టోబర్‌ 4వ తేదీన అమలు చేశాం. ఈ సంవత్సరం అప్పటి వరకు ఆగకుండానే జూన్‌ 4వ తేదీనే ముందుగానే వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నాం. కోవిడ్‌ సమయంలో బతకడానికి కష్టంగా ఉన్న పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆటోలు, ట్యాక్సీలు రోడ్ల మీద తిరగలేని పరిస్థితి వల్ల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని గమనించి వీరికి ఎంత వేగంగా మంచి చేయగలిగితే అంత వేగంగా చేయాలని ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభిస్తున్నాం. 

2018 మే నెలలో ఏలూరులో నా పాదయాత్ర జరుగుతుండగా ఆ రోజు ఏలూరు సభలో ఒక మాట ఇచ్చాను. పాదయాత్ర జరుగుతుండగా ప్రతి జిల్లాలో కూడా ప్రతి వర్గం నా దగ్గరకు వచ్చి వారి సమస్యలను చెప్పుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా మరీ ముఖ్యంగా ఆటో డ్రైవర్లు అయితే అప్పట్లో ఇన్సూరెన్స్‌ కట్టలేక, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ తెచ్చుకోలేక, రిపేర్ల కోసం డబ్బు ఖర్చుబెట్టాలి, రిజిస్ట్రేషన్‌ ట్యాక్స్‌ కూడా కట్టాలి. వీటిలో ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ చాలా పెద్దది.. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కావాలంటే కొద్దోగొప్పో రిపేర్లు చేయించుకోవాలి. ఇవి చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న ఆటో అన్నదమ్ముళ్లు బతకడమే కష్టం అవుతున్న పరిస్థితుల్లో అంతోఇంతో వస్తున్న సొమ్ములోంచి ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తే.. ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ లేకపోతే రోజుకు రూ.50 జరిమానా విధిస్తున్న రోజులవి. 

ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ప్రతి జిల్లాలోనూ నా పాదయాత్రలో నన్ను కలిశారు. బతకడానికి కష్టపడుతున్న తరుణంలో ఒకేసారి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కోసం రూ.10 వేలు ఖర్చు అవుతున్న పరిస్థితుల్లో గత ప్రభుత్వం వీరిపై దయ చూపించాల్సింది పోయి ఏకంగా పెనాల్టీ చొప్పున వసూలు చేసేది. రోజుకు రూ.300 సంపాదించేది గొప్ప.. ఆ డబ్బులో కూడా రూ.50 జరిమానా విధించి వేధిస్తున్న పరిస్థితుల్లో ఆటో అన్నదమ్ములు ఎలా బతకుతారని అనిపించింది. అక్కడి నుంచి ఏలూరు సభలో మాటిచ్చా.. ఆ మాటను అధికారంలోకి వచ్చిన వెంటనే నెరవేరుస్తూ అడుగులు ముందుకు వేశాం. 

రెండవ సంవత్సరం కూడా దేవుడి దయ, మీ అందరి ఆశీర్వాదంతో ఏర్పడిన మనందరి ప్రభుత్వంలో రెండవ ఏడాది మీ తమ్ముడిగా, అన్నగా వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకాన్ని అమలు చేస్తున్నాను. గత ఏడాది అక్టోబర్‌లో 2,36,334 మంది ఆటో, ట్యాక్సీ అన్నదమ్ములకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకే డబ్బు జమ చేశాం. పాత అప్పులకు ఈ డబ్బు జమ చేసుకునే అవకాశం లేని విధంగా బ్యాంకర్లతో మాట్లాడి రూ.10 వేలు సాయం అందించాం. గత సంవత్సరం దాదాపుగా రూ.236 కోట్లు ఖర్చు చేస్తే.. ఈ సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య 2,62,495 మంది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్ల కుటుంబాలకు మేలు చేస్తున్నాం. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 37,754 మంది లబ్ధిదారులు పెరిగారు. దీంట్లో 25,859 కొత్త అప్లికేషన్స్‌ వస్తే.. 11,595 ట్రాన్స్‌ఫర్‌ అప్లికేషన్స్‌. రెండు కలిపితే.. 37,754 మంది కొత్త లబ్ధిదారులు పెరిగారు. 

కోవిడ్‌ సమయంలో ఇబ్బందులు పడుతున్న వర్గాలకు తోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే జూన్‌ మాసంలో రకరకాల వర్గాలకు తోడుగా ఉండేందుకు ఇంతకు ముందే క్యాలెండర్‌ విడుదల చేశాం. ఏ నెలలో ఏ తేదీ ప్రకారం ఏ కార్యక్రమం చేయబోతున్నామని క్యాలెండర్‌ ప్రకటించాం. అందులో జూన్‌ మాసంలో నేడు ఆటోడ్రైవర్లు, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు సాయం అందిస్తున్నాం. జూన్‌ 10వ తేదీన రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్‌ సోదరులకు, జూన్‌ 17వ తేదీన చేనేత సోదరులకు, 24వ తేదీన కాపు సోదరులకు, 29న మళ్లీ ఎంఎస్‌ఎంఈలకు ఊరటను కలిగించే కార్యక్రమానికి తేదీలు ఇవ్వడం జరిగింది. క్యాలెండర్‌లో ప్రకటించిన తేదీల ప్రకారం అందరికీ ఈ నెలలో పథకాలు అమలు చేస్తాం.

అట్టడుగువర్గాలకు తోడుగా ఉంటేనే వ్యవస్థ అనేది బతుకుతుంది. పేదవాడు సంతోషంగా ఉంటేనే.. రాష్ట్రానికి, దేశానికి మంచిది. 2,62,495 మందిలో ఎస్సీలు 61,390 మంది లబ్ధిదారులు, ఎస్టీలు 10,049 లబ్ధిదారులు, బీసీలలో దాదాపుగా 1,17,096 కుటుంబాలు ఉన్నాయని, మైనార్టీలు 28,118 కుటుంబాలు, కాపుల్లో 29,643 కుటుంబాలు, పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న అగ్రవర్ణాల వారు దాదాపు 16 వేల కుటుంబాలు ఉన్నాయని లెక్కలు తేలాయి. వీరందరికీ ప్రభుత్వం తరుఫున చేయగలిగిన మేలుతో వీరికి మంచి జరగాలని వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకానికి శ్రీకారం చుడుతున్నా. 

ఎక్కడైనా ఎవరికైనా పొరపాటున ఎవరికైనా వైయస్‌ఆర్‌ వాహన మిత్ర పథకం అందకపోయి ఉంటే ఎవరూ కంగారుపడొద్దు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేది మన ప్రభుత్వ ఉద్దేశం. అర్హత ఉండి పథకం అందనివారు ఎవరూ ఉండకూడదు అనేది ఈ ప్రభుత్వం గట్టిగా నమ్మిన సిద్ధాంతం. మనకు ఓటు వేయకపోయినా పర్వాలేదు.. అర్హత ఉన్నవారందరికీ మంచి జరగాలని ఈ ప్రభుత్వం కోరుకుంటుంది. 2,62,495 మందికి బటన్‌ నొక్కిన వెంటనే లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతాయి. 

ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే గ్రామ సచివాలయానికి వెళ్లండి.. అక్కడ అర్హతకు సంబంధించిన అంశాలు, లబ్ధిదారుల జాబితా ప్రదర్శించబడి ఉంటుంది.. అర్హత ఉండి ఎవరికైనా సాయం అందకపోయి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి జూలై 4వ తేదీ వరకు వైయస్‌ఆర్‌ వాహన మిత్ర సాయం అందిస్తాం. లేదా.. స్పందన www.spandana.ap.gov.in వెబ్‌ సైట్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నా.. వెరిఫికేషన్‌ చేసి సాయం అందిస్తాం. 

అందరికీ మంచి చేయడమే మన ప్రభుత్వ లక్ష్యం. వివక్ష లేకుండా పారదర్శకంగా, అవినీతి లేకుండా పథకాలు అందాలని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. ఎవరూ కంగారుపడాల్సిన పనిలేదు. మీ అందరికీ మంచి జరగాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో తప్పనిసరిగా ఇన్సూరెన్స్, ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్‌ కచ్చితంగా తీసుకోమని ప్రతి ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ అన్నదమ్ములకు విజ్ఞప్తి చేస్తున్నాను. మిమ్మల్ని నమ్ముకొని ప్రయాణికులు వాహనాలు ఎక్కుతారు. పొరపాటున ఏదైనా జరిగితే.. మీకు, ప్యాసింజర్లకు ఇబ్బందే కాబట్టి ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్‌కు ఈ సొమ్మునువాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. అందరూ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పనిసరిగా పాలించాలని రిక్వస్ట్‌ చేస్తున్నాను. ఆటో, ట్యాక్సీలు మంచి కండీషన్‌లో పెట్టుకోవాలని రిక్వస్ట్‌ చేస్తున్నాను. దయచేసి మద్యం సేవించి వాహనం నడపొద్దు అని ఇంకో రిక్వస్ట్‌ చేస్తున్నాను. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లోని అన్నదమ్ముడిగా మీ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

Back to Top