బద్వేల్‌ అభివృద్ధికి ఎంత చేసినా తక్కువే..

బద్వేల్‌ బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

వెనకబాటుకు గురైన నియోజకవర్గాల్లో బద్వేల్‌ ఒకటి

రూ.500 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం వైయస్‌ జగన్‌ శంకుస్థాపన

ప్రజల కోరిక మేరకు బద్వేల్‌లో ఆర్డీఓ కార్యాలయం మంజూరు

బద్వేల్‌: బద్వేల్‌ నియోజకవర్గానికి ఎంత చేసినా తక్కువే, వెనుకబాటుకు గురైన నియోజకవర్గాల్లో బద్వేల్‌ ఒకటని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రూ.500 కోట్లతో బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని సీఎం అన్నారు. ప్రజల కోరిక మేరకు బద్వేల్‌లో ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేస్తున్నానని చెప్పారు. బ్రహ్మంసాగర్‌ నిండుకుండలా కనిపిస్తోందని, ప్రాజెక్టు ఎల్లప్పుడూ అలా జలకళ ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బద్వేల్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం వైయస్‌ జగన్‌ ప్రసంగించారు. 

సీఎం వైయస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

‘2009లో పార్లమెంట్‌ సభ్యుడిగా ఎన్నికైన తరువాత.. చాలా సార్లు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో మాత్రమే ఇదే బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులో 14, 13 టీఎంసీల నీరు నిలిచాయి. నాన్న చనిపోయిన తరువాత అదే ప్రాజెక్టులో ఏ ఒక్కసారి కూడా నీళ్లు 4–5 టీఎంసీలు మించి నిలవని పరిస్థితి ఎందుకువచ్చిందని ఎప్పుడూ అనిపించేది. కారణం.. పాలకుల్లో చిత్తశుద్ధి, మంచి చేయాలనే తపన, తాపత్రయం లేదు. ఈ రెండేళ్లలో బ్రహ్మసాగర్‌ ప్రాజెక్టులో మళ్లీ నిండుకుండలా కనిపిస్తుంది. ఈ ప్రాజెక్టుకు ఉన్న చిన్న చిన్న సమస్యలు, చిక్కుముడులను పూర్తిగా పరిష్కరించే విధంగా అడుగులు వేశాం. అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగోడు నుంచి 0–18 కిలోమీటర్లలో కెనాల్‌ లైనింగ్‌ లేదు. నీళ్లు కిందకి రాని పరిస్థితి ఎక్కువగా ఉంటుంది.. అటువంటి పరిస్థితిని పూర్తిగా మార్చితే తప్ప బ్రహ్మంసాగర్‌కు సెక్యూరిటీ ఉండదని అందరికీ తెలిసిన విషయమే.. అయినా గతంలో ఎవరూ పట్టించుకోలేదు. 

అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.300 కోట్లు కేటాయించాం. ఈ రోజు 0–18 కిలోమీటర్ల లైనింగ్‌ కార్యక్రమం ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తయిపోయింది. దేవుడి ఆశీర్వదిస్తే.. ఈ అక్టోబర్‌ నాటికి ఆ లైనింగ్‌ కూడా కంప్లీట్‌ అవుతుంది.. నీరు నేరుగా ఇక్కడకు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఇదొక్కటే కాకుండా.. బ్రహ్మంసాగర్‌ నిండుకుండలా ఉండాలంటే.. కుంధూ నది మీద లిఫ్ట్‌ పెట్టి నీరు తీసుకొని రాగలిగితే బ్రహ్మంసాగర్‌ నిండుకుండలా ఉంటుందని అధికారంలోకి వచ్చిన వెంటనే కుంధూనదిపై లిఫ్ట్‌కు రూ.600 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేశాం. ఆ ప్రాజెక్టు కూడా మరో రెండు సంవత్సరాల్లో పూర్తయిన తరువాత.. బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు నిండుకుండలా ఎల్లప్పుడూ ఉంటుందని మీ బిడ్డగా సగర్వంగా తెలియజేస్తున్నాను. 

బద్వేల్‌ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి దాదాపుగా రూ.500 కోట్ల పైచిలుకుతో పలు శంకుస్థాపనలు చేస్తున్నాం. ఈ డబ్బుతో బద్వేల్‌ నియోజకవర్గం రూపురేఖలు అన్ని రకాలుగా మారుతాయని ఆశిస్తూ శ్రీకారం చుడుతున్నాం. 

మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ పరిధిలో ఇదే బద్వేల్‌ పరిధిలో రూ.130 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. సుమారు 143 కిలోమీటర్ల పొడవు సీసీ రోడ్లు, 3 పార్కులు, వీటితో పాటు అధునాతన కూరగాయల, చేపల మార్కెట్లు, మూడు వాణిజ్య సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. 6 శ్మశానవాటికల అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నాం. రూ.130 కోట్లతో జరిగే అభివృద్ధి వల్ల బద్వేల్‌ టౌన్‌కు మంచి జరుగుతుందని నమ్ముతున్నాను. 

రూ.80 కోట్లతో లోయర్‌ సగిలేరు ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాల్వను 23 కిలోమీటర్ల మేరకు వెడల్పు చేసే కార్యక్రమానికి శంకుస్థాపన చేస్తున్నాం. దీని ద్వారా బద్వేల్, బీ.కోడూరు మండలాల్లో అక్షరాల 35 చెరువులకు ప్రతి ఏటా నీరు నింపుకునే వెసులుబాటు సులభమవుతుంది. దీని కోసం రూ.80 కోట్ల చిరునవ్వుతో కేటాయిస్తున్నామని తెలియజేస్తున్నా..

బ్రహ్మంసాగర్‌ ఎడమ, కుడి కాల్వలకు సంబంధించి పెండింగ్‌ పనులను పూర్తిచేసేందుకు రూ.54 కోట్లు కేటాయిస్తున్నాం. దీని ద్వారా సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టుకు పూర్తిసామర్థ్యంతో నీరు అందించడం సాధ్యం అవుతుందని తెలియజేస్తున్నాను. మరోవైపున బ్రహ్మంసాగర్‌ ప్రాజెక్టు గట్టుకు ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ డయాఫ్రం కట్‌ఆఫ్‌ వాల్‌ నిర్మాణానికి సంబంధించిన పనులను రూ.45 కోట్లతో చేపడుతున్నాం. ఈ పనులకు ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. లీకేజీలకు మరమ్మతులు చేస్తే 17 టీఎంసీల నీరు ఎప్పుడూ నింపుకోవచ్చు.. ప్రాజెక్టు నిండుకుండలా ఉంటుంది. 

రూ.36 కోట్లతో బ్రహ్మంసాగర్‌ ఎడమ కాల్వలో 3 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నాం. ఈ పనుల వల్ల అక్షరాల 8,268 క్యూబిక్‌ లీటర్ల నీటిని సముద్ర మట్టానికి 278 మీటర్ల ఎత్తున ఉన్న ఇటుకలపాడు, సావిచెట్టిపల్లి, కొండరాజుపల్లి, వరికుంట్ల, గంగనపల్లి చెరువులను పూర్తిగా నీటితో నింపవచ్చు. కాశినాయన మండలంలో దీని వల్ల సుమారుగా 3,500 ఎకరాల ఆయకట్టును సాగుబడిలోకి తీసుకురావొచ్చు. ఈ మంచి కార్యక్రమానికి కూడా శంకుస్థాపన చేస్తున్నాం. 

రూ.10 కోట్లతో ఐదు గ్రామాలకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు సంబంధించి 5 సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నాం. ఇది కూడా వ్యవసాయానికి తోడ్పాటును అందిస్తుంది. నాణ్యమైన కరెంట్‌ ఇవ్వగలిగే పరిస్థితి వస్తుంది. 

పోరుమావిళ్ల పట్టణ పరిధిలో 3.6 కిలోమీటర్ల రెండు లేన్ల రోడ్డును రూ.25 కోట్లతో 4 లేన్ల రోడ్డుగా విస్తరించే పనులకు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నాం. దీనివల్ల పోరుమావిళ్ల టౌన్‌ సుందరంగా తయారవుతుంది. 

రూ.22 కోట్లతో సగలేరు నదిమీద వేమలూరు గ్రామం వద్ద చేపట్టనున్న వంతెన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాం. దీని ద్వారా సుమారు 30 గ్రామాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కలుగుతుందని తెలియజేస్తున్నాను. 

బ్రాహ్మణపల్లి సమీపంలో సగలేరు మీద మరో వంతెన నిర్మిస్తున్నాం. రూ.9.5 కోట్లతో నిర్మిస్తున్న వంతెన వల్ల కలసపాడు మండలంలోని నాలుగు గ్రామాలతో పాటు ప్రకాశం జిల్లాకు కూడా రాకపోకలు మెరుగు అవుతాయని తెలియజేస్తున్నాను. 

బద్వేల్‌ మార్కెట్‌ యార్డులో రైతుల కోసం 2 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో కలిగిన రెండు గోదాములను రూ.7.5 కోట్లతో నిర్మించేందుకు శంకుస్థాపన చేస్తున్నాం. 

బద్వేల్‌లోని శ్రీప్రసన్న వెంకటేశ్వర ఆలయం, శ్రీఆది చెన్నకేశవ ఆలయం, కాశినాయన మండలంలోని మరో 6 దేవాలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశాం. వీటికోసం రూ.4.72 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. 

ఇవే కాకుండా బద్వేల్‌ నియోజకవర్గంలో ఎప్పటినుంచో ఒక డిమాండ్‌ ఉంది. ఆర్డీఓ కార్యాలయం లేని కారణంగా రాజంపేటకు వెళ్లాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా కాశినాయన, కలసపాడు మండలాల నుంచి 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. బద్వేల్‌లో ఆర్డీఓ కార్యాలయం మంజూరు చేస్తున్నానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. బద్వేల్‌లో ఆర్‌అండ్‌బీ బంగ్లాకు రూ.5 కోట్లు, పంచాయతీ రాజ్‌ రోడ్లు, తహసీల్దార్‌ ఆఫీస్, ఎంపీడీఓ, సబ్‌ రిజిస్టర్‌ ఆఫీస్‌ అన్నీ శిథిలావస్థలో ఉన్నాయి.. వీటికి రూ.15 కోట్లు మంజూరు చేయమని గోవిందరెడ్డి కోరారు. వీరబల్లి, కొత్తచెరువు ఎత్తిపోతల పథకం కోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఇండస్ట్రీయల్‌ పార్కు తీసుకువస్తే.. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల కల్పన మెరుగు అవుతుందని గోవిందరెడ్డి చెప్పారు. గోవిందరెడ్డి అడిగిన వాటిని మంజూరు చేస్తున్నానని తెలియజేస్తున్నా’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు. 

 

Back to Top