తాడేపల్లి: కోవిడ్ కారణంగా వృథా అయిన కాలాన్ని కవర్ చేసే ఉద్దేశంతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురావొద్దు.. చదువులు ఆనందంగా సాగాలి.. ఒత్తిళ్ల నడుమ కాదని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం, యూజీసీ మార్గదర్శకాలను కూడా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వసతి దీవెన, విద్యాదీవెన పథకాల అమలుకు ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
ఉన్నత విద్యపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఉన్నత విద్యపై చేపట్టిన సంస్కరణలను ముఖ్యమంత్రి వైయస్ జగన్‌కు అధికారులు వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో క్లాసులు ప్రారంభం, తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. కోవిడ్ సమయంలో ఎనీటైం, ఎనీవేర్ లెర్నింగ్ పద్ధతిలో 5 లక్షల ఆన్లైన్ క్లాసులు నిర్వహించామని తెలిపారు. దీనిని ఇంటర్నెట్తో అనుసంధానం చేసి మరింత మందికి అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేయాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు.
ప్రైవేట్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు, ఉండాల్సిన సిబ్బంది లేకపోతే గట్టి చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ యూనివర్సిటీల్లో ప్రమాణాలపై చర్చించారు. లైసెన్సింగ్ విధానం, రెగ్యులేషన్ పట్టిష్టంగా ఉండటంపై సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ సంస్థల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు, ప్రమాణాలు ఉన్నాయా..? లేదా? అన్నది పరిశీలన చేయాలని సూచించారు. 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా, మిగిలిన 50 శాతం కాలేజీ కోటా కింద ఉండాలని సీఎం నిర్ణయించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల ప్రకారం కన్వీనర్ కోటాలో పేద పిల్లలకు సీట్లు వస్తాయని, వారికి ప్రభుత్వమే ఫీజురీయింబర్స్‌మెంట్ కింద ఫీజులు చెల్లిస్తుందని చెప్పారు. ప్రైవేట్ యూనివరసిటీలకు నిర్వహిస్తున్న కోర్సుల ప్రకారం ఎన్బీఏ, ఎన్ఏసీ గుర్తింపు కూడా
ఐఐటీ తిరుపతి, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, ఐఐఎం విశాఖ, ఎన్ఐటీ తాడేపల్లి గూడెంలో పనుల ప్రగతిని అధికారులు సీఎం వైయస్ జగన్‌కు వివరించారు. ఆయా సంస్థలకు వెళ్లే రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ కనెక్షన్ వంటి వాటిలో సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. అనంతపురం సెంట్రల్ వర్శిటీ పనుల తీరును సీఎంకు అధికారులు వివరించారు. పనులు ముందుగా సాగేలా చర్యలు తీసుకోవాలని, ట్రైౖ బల్ యూనివర్శిటీపై దృష్టి సారించాలని ఆదేశించారు.
పాలిటెక్నిక్ కోర్సుల్లో కొత్త కోర్సులను తీసుకురావాలని, ప్రస్తుతం డిమాండ్ ఉన్న కోర్సులపై దృష్టిసారించాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. కోర్సుల ఇంటిగ్రేషన్ ఉండాలని, ఇంజినీరింగ్ కోర్సులతోపాటు వెటర్నరీ, అగ్రికల్చర్ కోర్సులను అవసరాలకు అనుగుణంగా ఇంటిగ్రేషన్ చేసేలా మార్గదర్శక ప్రణాళిక తయారు చేయాలన్నారు. ఉద్యోగాల కల్పనా కేంద్రాలుగా పాలిటెక్నిక్ కాలేజీలను తీర్చిదిద్దాలని సూచించారు. దేశంలో, ప్రపంచంలో వస్తున్న కొత్త కోర్సులను స్థానిక అవసరాలకు అనుగుణంగా మార్చి వాటిని ఈ కాలేజీల్లో ప్రవేశపెట్టాలని ఆదేశించారు.
నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని సీఎం వివరించారు. ఇదివరకే పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ లాంటి కోర్సులు పూర్తి చేసిన వాళ్ల ప్రతిభకు అక్కడ మరింత మెరుగులు పెడతారన్నారు. అలాగే చిన్న చిన్న పనులు నేర్పించడానికి కూడా కోర్సులు ప్రవేశపెడతారని వివరించారు.
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌ను తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. టీచర్లు మొదలు సచివాలయాల ఉద్యోగుల నైపుణ్యాలను పెంచేలా అవి ఉపయోగపడతాయన్నారు. కెపాసిటీ బిల్డింగ్ కాంప్లెక్స్‌లు శిక్షణ కేంద్రాలుగా కూడా పని చేస్తాయన్నారు. జిల్లాల్లో మంచి సదుపాయాలున్న కాలేజీలను, ఇతర ప్రభుత్వ శిక్షణా కేంద్రాలను ఈ కెపాసిటీ బిల్డింగ్ కోసం వాడుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు.