సలాం కుటుంబాన్ని పరామర్శించిన సీఎం  

దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ

క‌ర్నూలు: నంద్యాలలో ఇటీవల కుటుంబసభ్యులతో సహా ఆటో డ్రైవర్ అబ్దుల్ సలాం ఆత్మహత్య చేసుకున్నారు. బాధిత కుటుంబాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప‌రామ‌ర్శించారు. తుంగ‌భ‌ద్ర‌ పుష్క‌రాలు ప్రారంభించిన అనంత‌రం తిరుగు ప్ర‌యాణంలో ఏపీఎస్పీ గెస్ట్‌ హౌస్‌ వద్ద అబ్దుల్‌ సలాం అత్త మాబున్నీసా, శంషావలీ, సాజీదాలను ముఖ్య‌మంత్రి ప‌రామ‌ర్శించి.. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన దోషులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. అంతేకాకుండా మాబున్నీసా కూతురు సాజీదాకు ఔట్‌సోర్సింగ్‌ కింద ఉద్యోగం, అల్లుడు శంషావలీని అనంతపురం నుంచి నంద్యాల బదిలీకి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు అనంతపురం డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయం నుంచి నంద్యాల వైద్య ఆరోగ్యశాఖకు శంషావలీని బదిలీ చేస్తూ డిప్యూటేషన్‌ ఆర్డర్స్‌ విడుదల చేశారు. సీఎం వైయస్‌ జగన్‌కు మాబున్నీసా ధన్యవాదాలు తెలిపారు. 

సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటాం
అబ్దుల్‌ సలాం కుటుంబానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల ఆర్థికసాయం అందించింది. అంతేకాకుండా ఆ కుటుంబంలో ఒకరికి ఔట్‌సోర్సింగ్‌ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. తమ కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం వైయస్‌ జగన్‌కు రుణపడి ఉంటామని సలాం అత్త మాబున్నీసా తెలిపారు.  
 

Back to Top