గొల్లపూడి: దిశ యాప్ ద్వారా ఆంధ్రరాష్ట్ర అక్కచెల్లెమ్మలు ఎక్కడకైనా సురక్షితంగా వెళ్లగలిగే పరిస్థితిని కల్పించే గొప్ప కార్యక్రమానికి అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఏడాదిన్నర క్రితం తెలంగాణలో దిశ ఘటన జరిగినప్పుడు చాలా బాధపడ్డానని, అలాంటి ఘటన మన రాష్ట్రంలో జరగకూడదని, మహిళలకు పూర్తి భద్రత కల్పించాలనే ఆలోచనతో దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడంతో పాటు దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించడం జరిగిందన్నారు. అక్కచెల్లెమ్మలకు మరింత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కల్పించాలని తపన, తాపత్రయంతో ‘దిశ యాప్’ను రూపొందించడం జరిగిందన్నారు. గొల్లపూడి వేదికగా అక్కచెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కల్పించేందుకు స్వయంగా తానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ చెప్పారు. గొల్లపూడిలో జరిగిన దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వలంటీర్లు, అక్కచెల్లెమ్మల, మహిళా పోలీసులతో ముఖాముఖి అనంతరం సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.. దిశ యాప్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న అక్కచెల్లెమ్మలు, వలంటీర్లు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అక్కచెల్లెమ్మలు ఎక్కడకు వెళ్లినా సురక్షితంగా వెళ్లగలిగే పరిస్థితిని తీసుకువచ్చామన్నారు. దిశ యాప్‌ను ప్రతి అక్కచెల్లెమ్మ డౌన్‌లోడ్ చేసుకునే విధంగా అవగాహన కార్యక్రమం చేపట్టామన్నారు. ఇంటింటికీ వెళ్లి దిశ యాప్ డౌన్‌లోడ్ చేయించి అక్కచెల్లెమ్మలకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీస్, వలంటీర్లు అందరికీ మరోమారు సూచించారు. యాప్ ఎలా వాడాలో అర్థమయ్యేలా చూపించాలని కోరారు. ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుల్ వరకు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని యాప్ డౌన్‌లోడ్ చేయించి అక్కచెల్లెమ్మలకు సహకరించాలన్నారు. దాదాపు 15 వేల మంది మహిళా పోలీసులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నామని సీఎం వైయస్ జగన్ చెప్పారు.